రాంగోపాల్ యాదవ్ (ఎస్.పి) రాయని డైరీ
నా ముద్దుల సీయెం అఖిలేశ్ బాబు మళ్లీ సీయెం అయినంత సంబరంగా ఉంది నాకు! రాజ్యసభలో మోదీని కొత్త నోట్లపై నాలుగు దులిపి, గెస్ట్ హౌస్‌కి చేరుకున్నాక లక్నో నుంచి కబురు! అన్నయ్య ములాయం నన్ను మళ్లీ పార్టీలోకి తీసుకున్నారని!! నెలన్నా కాకముందే నాపై విధించిన ఆరేళ్ల బహిష్కరణ పూర్తయిందంటే.. అఖిలేశ్ బాబు అన్నం తినడం మాని, పట్టుబట్టి ఉంటాడు నాకోసం. అంకుల్‌ని తిరిగి పార్టీలోకి తీసుకుంటే తప్ప నేను అసెంబ్లీ హాల్‌కి గానీ, డైనింగ్ హాల్‌కి గానీ వెళ్లను అని బాగా మారాం చేసి ఉంటాడు.
‘‘బాబాయ్.. నీ పోస్టులు నీకు వచ్చేసినట్టే కదా’’ అన్నాడు అఖిలేశ్ బాబు యూపీ నుంచి ఫోన్ చేసి. ‘‘నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది బాబాయ్. రాజ్యసభలో పార్టీ లీడర్‌గా నీ పోస్టు నీదే. రాజ్యసభ బయట పార్టీ అధికార ప్రతినిధిగా నీ పోస్టు నీదే. పార్టీ జాతీయ కార్యదర్శిగా నీ పోస్టు నీదే. పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా నీ పోస్టు నీదే..’’ అంటున్నాడు అఖిలేశ్ బాబు.
‘‘ఆ పోస్టులదేముంది అఖిలేశ్ బాబూ.. నీ హృదయంలో నాకున్న పోస్టు కన్నా అవేం పెద్దవి కాదు కదా’’ అన్నాను.
‘‘బాబాయ్.. నీ పక్కన ఎవరైనా ఉన్నారా’’ అని అడిగాడు అఖిలేష్ బాబు.. ఫోన్‌లో గొంతు తగ్గించి! ‘‘లేరు అఖిలేష్ బాబూ.. ఇక్కడ నేనొక్కణ్ణే ఉన్నాను. చెప్పండి’’ అన్నాను, నేనూ గొంతు తగ్గించి.
‘‘మీ పక్కన ఎవరూ లేనప్పుడు మీరెందుకు బాబాయ్ గొంతు తగ్గించడం?’’ అన్నాడు అఖిలేశ్ బాబు. నిజమే! నాకు తట్టనే లేదు. ‘‘చెప్పండి అఖిలేశ్ బాబూ’’ అన్నాను ఈసారి కాస్త గొంతు పెంచి.
‘‘పెంచకండి, తగ్గించకండి. చెప్పేది వినండి. మీరక్కడ గొంతు పెంచితే ఇక్కడ చిన్నబాబాయ్‌కి వినిపిస్తుంది. గొంతు తగ్గిస్తే నాకు వినిపించదు. అదీ ప్రాబ్లం’’ అన్నాడు.
శివపాల్.. అఖిలేశ్ బాబు పక్కనే ఉన్నాడన్నమాట! ములాయంకి శివపాల్ సొంత తమ్ముడు. అఖిలేశ్ బాబుకి శివపాల్ సొంత బాబాయి. నాలా డిస్టెంట్ రిలేషన్ కాదు. నా కోసం సొంత బాబాయ్‌ని కూడా పక్కన పెట్టేస్తున్నాడు అఖిలేశ్ బాబు. నా కళ్లు చెమ్మగిల్లాయి.
‘‘కామ్‌గా అయిపోయావేంటి బాబాయ్! శివపాల్ బాబాయ్ నాకు పేరుకే బాబాయ్. నువ్వు నాకు దేవుడిచ్చిన బాబాయ్’’ అన్నాడు అఖిలేశ్ బాబు. ‘‘కానీ అఖిలేశ్ బాబూ.. మీ అందరిదీ బ్లడ్ రిలేషన్ కదా’’ అన్నాను.
‘‘అలా అనకు బాబాయ్.. నువ్వు ‘ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్ వే’ లాంటి వాడివి. దూరాలను దగ్గర చేస్తావ్. మమ్మల్నందర్నీ కలుపుతావ్’’ అన్నాడు అఖిలేష్ బాబు.
‘‘ఎల్లుండి నాన్న బర్త్‌డే. కేక్ కటింగ్‌కి నువ్వు ఉండాలి బాబాయ్. అదే రోజు ఎక్స్‌ప్రెస్ వే రిబ్బన్ కటింగ్. ఆ కటింగ్‌కీ నువ్వుండాలి బాబాయ్’’ అంటున్నాడు అఖిలేశ్ బాబు.
నా కళ్లు మళ్లీ చెమ్మగిల్లాయి.
-మాధవ్ శింగరాజు