మేడమ్ సోనియాజీ స్క్రీన్ మీదకు వచ్చాక వీడియో కాన్ఫరెన్సింగ్ మొదలైంది. మేడమ్ రాగానే మాలో కొందరం లేచి, కూర్చున్నాం. మాలోనే మరికొందరు లేచే లోపే, కూర్చోమన్నట్లుగా మేడమ్ వారించడంతో వాళ్లెవరూ లేచి కూర్చోలేకపోయారు.
ఆంటోనీ, వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్, ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, మాణిక్యం టాగోర్, మనీశ్ తివారీ, నేను.. మొత్తం పది మందితో మేడమ్ ఏర్పాటు చేసిన ప్రీ–బడ్జెట్ మీటింగ్ అది.
మేడమ్ స్క్రీన్ మీదకు రావడంతోనే.. ‘‘జయ్! మీరేం చెప్పబోతున్నారు?’’ అన్నారు.. నా వైపు చూస్తూ!
ఆ మాటకు ఆంటోనీ నవ్వారు.
సాధారణంగా మా ప్రీ–బడ్జెట్ మీటింగ్‌ని.. ‘వెల్‌కమ్ టు స్ట్రాటెజీ గ్రూప్’ అనే మాటతో మొదలుపెడతారు మేడమ్. కానీ ఈసారి అలా జరగలేదు. మీటింగ్‌ని నాతో స్టార్ట్ చేశారు!
‘‘ఎంత ఎకానమిస్ట్ అయితే మాత్రం బడ్జెట్ గురించి జైరామ్‌జీ కొత్తగా ఏమైనా చెప్పబోవ డానికి నిర్మలా సీతారామన్ అవకాశం ఇవ్వబోతారంటారా!’’ అన్నారు ఆంటోనీ.
లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎలాగైతే ఉండాల్సిన విధంగా లేదో, ఈ ఇయర్ కూడా అలానే ఉంటుందని నేను చెప్పగలను..’’ అన్నారు ఆనంద్ శర్మ.
‘‘మనం మాత్రం అలా ఉండకూడదు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ సెషన్స్‌లో ఎంత గట్టిగా డిబేట్ చేయబోయామో అంతకన్నా గట్టిగానే చెయ్యాలి..’’ అన్నారు మల్లికార్జున్ ఖర్గే.
‘‘ఇష్యూస్ అవే కనుక.. సేమ్ రిలీఫ్ ప్యాకేజ్, సేమ్ డిజిన్వెస్ట్‌మెంట్, సేమ్ ఇన్‌ఫ్లేషన్, సేమ్ చైనా బోర్డర్, సేమ్ ఫార్మర్స్.. మనం కొత్తగా స్ట్రాటెజీ మార్చే పని కూడా లేదు’’ అన్నారు మనీశ్ తివారీ.
‘‘స్ట్రాటెజీలో ఒకటైతే యాడ్ చేయొచ్చు. ప్రతిపక్షంలోని వాళ్లకు ‘పద్మ’ అవార్డులిచ్చి అంతర్గత విభేదాలు సృష్టించాలని చూసే పాలకపక్ష కుట్రల్ని, కుయుక్తుల్ని బట్టబయలు చెయ్యొచ్చు’’ అన్నారు మాణిక్యం.
అవునన్నట్లు మాణిక్యం వైపు చూసి, నా వైపు తిరిగారు మేడమ్.
‘‘జయ్! మీ ట్వీట్ చూశాను. సెవన్టీ త్రీలో ప్రభుత్వం పద్మవిభూషణ్‌ని ఆఫర్ చేస్తే అప్పటి పి.ఎం. ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎన్.హస్కర్ ఎంత మర్యాదపూర్వకంగా నిరాకరించిందీ మీరు ట్వీట్‌లో పోస్ట్ చేసిన పుస్తక భాగాన్ని చదివాను. అంతగా విలువల్ని పాటించే మనిషిని ఈకాలంలో అరుదుగా మాత్రమే చూస్తాం..’’ అన్నారు.
‘‘అవును మేడమ్‌జీ! అవార్డుల్ని నిరాకరించేందుకు ఆత్మబలం, ఆత్మనిగ్రహం కావాలి’’ అన్నాను.
‘‘కానీ జైరామ్‌జీ, మీరు పెట్టిన మరొక ట్వీట్‌లో మీ ఉద్దేశాన్ని మన సీనియర్ సహచరులు కరణ్‌సింగ్ సరిగా అర్థం చేసుకోలేకపోవడాన్ని నేనెంతో ఆవేదనతో గమనించాను. మోదీజీ ఇచ్చిన ‘పద్మభూషణ్’ని తిరస్కరించినందుకు మీరు బుద్ధదేవ్ భట్టాచార్యజీని ప్రశంసించారు. కానీ ఆ ప్రశంసను కరణ్‌సింగ్.. పద్మభూషణ్‌ని నిరాక రించని గులామ్ నబీ ఆజాద్‌పై ఎత్తిపొడుపుగా తీసుకున్నారు’’ అన్నారు అధీర్ రంజన్.
‘‘కరణ్‌సింగ్ అలా ఎప్పుడు ట్వీట్ చేశారు?!’’ అన్నారు గొగోయ్.
‘‘ట్వీట్ చేయలేదు. స్టేట్‌మెంట్ విడుదల చేశారు’’ అన్నారు సోనియాజీ!
ఆజాద్ తన ‘పద్మ’ అవార్డును నిరాకరించని పర్యవసాన పరిణామాలను మేడమ్ ఆసక్తిగా గమనిస్తున్నట్లున్నారు!
మేడమ్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్ అయ్యాక మా పది మందిలో ఒకరితో నేను వేరుగా కనెక్ట్ అయ్యాను.
‘‘ఆత్మబలం కాదు, ఆత్మ నిగ్రహం కాదు. అవార్డును నిరాకరించడానికి ఆత్మప్రబోధానుసారం వెళ్లగలిగి ఉండాలి. దురదృష్టవశాత్తూ మన పార్టీలోని సీనియర్లు తమ ఆత్మ ఢిల్లీలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించేందుకు నిరంతరం పెనుగు లాడుతూనే ఉంటారు..’’ అన్నారాయన.
-మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment