ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చినట్లుగా రెండు లేదా మూడేళ్ల వ్యవధిలో భారతీయ రైతుల ఆదాయాన్ని రెండురెట్లకు పెంచడం అసాధ్యమని కేంద్రమంత్రే పార్లమెంటులో ప్రకటించి సమస్యనుంచి పక్కకు తప్పుకున్నారు. వచ్చే అయిదేళ్లకాలానికి వ్యవసాయరంగంలో వాస్తవ ఆదాయాలు సంవత్సరానికి అర్థశాతం కంటే తక్కువ మాత్రమే పెరుగుతాయని నీతిఅయోగ్ అంచనా వేసింది. మన పాలకులు, విధాన నిర్ణేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యపర్చడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయ వృద్ధిపై వ్యర్థ చర్చలు మాని, కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తిని కల్పించడమే పాలకుల తక్షణకర్తవ్యం కావాలి. వ్యవసాయరంగంలో పెట్టుబడుల పెంపుదల ఆర్థికవ్యవస్థనే సంక్షోభం నుంచి బయటబడేస్తుంది. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ సాగవలసిన మార్గం ఇదేమరి.
ఎట్టకేలకు కేంద్రప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుంది. తాజా పార్లమెంటు సమావేశాల సందర్భంగా, 2022 నాటికి వ్యవసాయరంగ ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని కేంద్రం పార్లమెంటులో అంగీకరించింది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభలో సంధించిన ప్రశ్నకు వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా స్పష్టంగా సమాధానమిచ్చారు. ‘రామ్ గోపాల్‌జీ ప్రశ్నతో మేము ఏకీభవిస్తున్నాం. వ్యవసాయ రంగంలో ప్రస్తుత వృద్థి రేటు ప్రకారం రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదు.’’
ఏటా వ్యవసాయరంగం 4 కంటే తక్కువ శాతం వృద్ధిరేటు కనబరుస్తుండటంతో, వచ్చే మూడేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని మంత్రి స్పష్టంచేశారు. 2016 ఏప్రిల్‌లో ఏర్పడిన దళవాయి కమిటీ (డిఎఫ్‌ఐ) రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే సంవత్సరానికి రైతుల ఆదాయ వృద్ధి రేటు 10.4 శాతానికి పెరగాల్సి ఉందని అంచనా వేశారు. ఇది సాధ్యపడాలంటే దేశం అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించాల్సి ఉందని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో పేరాశే అవుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటూనే, రైతురాబడి వృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడం అంత సులభం కాదని కేంద్రమంత్రి స్వయంగా అంగీకరించినందుకు ధన్యవాదాలు.
సాక్షాత్తూ కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన తర్వాత అయినా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఎలా అనే అంశంపై దేశంలోని యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, కాలేజీలు, పౌరసమాజ సంస్థలు రెండేళ్లుగా సాగించిన అంతులేని సెమినార్లు, కాన్ఫరెన్సులు, వర్క్‌షాపుల తతంగానికి ముగింపు పలకాల్సిన అవసరముంది. వ్యవసాయరంగ ఆదాయంలో నిజమైన వృద్ధి గత రెండేళ్లలో సున్నకు సమీపంలో కొనసాగుతున్న సమయంలో వచ్చే అయిదేళ్లకాలానికి వ్యవసాయరంగంలో నిజ ఆదాయం సంవత్సరానికి అర్థశాతం కంటే తక్కువ మాత్రమే పెరుగు తుందని నీతిఅయోగ్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగానికి తప్పనిసరైన మౌలిక వ్యవస్థాపనా పరివర్తన గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేల సంరక్షణ కార్డులు, వేపకలిపిన యూరియా, ఫసల్ బీమా యోజన, జాతీయ వ్యవసాయ మార్కెట్లు, మరిన్ని పంట నిల్వ వసతులు వంటి పథకాలేవీ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని హామీ ఇవ్వలేరు. ఇప్పుడు తక్షణం కావలసింది ప్రత్యక్ష ఆదాయ మద్దతు. రైతు ఆదాయాన్ని క్రమబద్ధం చేయటానికి ఇదే ఉత్తమమార్గం.
కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌లో రైతు ఆదాయ పెంపు కమిటీ (డీఎఫ్‌ఐ) సమర్పించిన నివేదిక చేసిన సిఫార్సుల అమలు, పర్యవేక్షణకోసం ఒక సాధికారక కమిటీని ఏర్పర్చినప్పటికీ వచ్చే రెండేళ్లలోపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యపడకపోవచ్చు అని అర్థమవుతూనే ఉంది. అందుకే వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలను ప్రారంభించడంలో ఇది తప్పక తోడ్పడుతుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఈ దీర్ఘకాలిక సంస్కరణల్లో మొట్టమొదటిది ఏమిటంటే వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ మదుపును బాగా ప్రోత్సహించడమే. 2011–12, 2016–17 మధ్యకాలంలో వ్యవసాయంలో ప్రభుత్వరంగ మదుపు మొత్తం జీడీపీలో 0.4 శాతం వద్దే సాగిలపడిపోయిందని అర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి.
దేశ జనాభాలో దాదాపు సగంమంది నేటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని గ్రహించినట్లయితే, మన పాలకులు, విధాన నిర్ణేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యపరుస్తూ వస్తున్నారని బోధపడుతుంది. తగినంత పెట్టుబడి తరలిరాకుండా దేశీయ వ్యవసాయరంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని ఏ ఆర్థిక వేత్త అయినా ప్రకటిస్తారని నేనయితే భావించడం లేదు. జీడీపీలో అరశాతం కూడా వ్యవసాయరంగంలో మదుపు చేయలేదన్నది స్పష్టమే. దీనిక్కారణం.. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక కార్యాచరణగా మనదేశంలోని ఆర్థిక చింతనాపరులు గుర్తించకపోవడమే. దీనితో వ్యవసాయాన్ని లాభదాయకమైన, నిలకడకలిగిన పరిశ్రమగా చేయడంపై దృష్టి పెట్టడానికి బదులుగా విధాన నిర్ణేతలు రైతులను, అనుబంధ వృత్తి జీవులను మరింతగా వ్యవసాయ రంగం నుండి బయటకు నెట్టివేయడంపైనే కేంద్రీకరించారు. ఇలాంటి ధోరణి ఇకనైనా మారాలి.
ఈ మార్పునకు సంబంధించిన సంకేతాన్ని మనం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చూడవచ్చు. దేశీయ వ్యవసాయ రంగంలో 25 లక్షల కోట్లను పెట్టుబడిగా పెడతామని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే 2019–20 సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ. 1,30,485 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. పీఎమ్ కిసాన్ పథకంలో మిగిలిన మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల చెల్లింపుకోసం కేటాయించిన రూ. 75,000 కోట్లను కూడా దీంట్లో భాగంగా చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వ్యవసాయరంగంలో నిజ ఆదాయాలను పెంచడం, రైతులు కోల్పోయిన గౌరవాన్ని పునరుద్ధరించడం వంటివాటికోసం వ్యవసాయంలో మౌలిక సంస్కరణలు కావాలని ప్రతిపాదించడానికి కూడా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు ఇచ్చగించని తరుణంలో పంజాబ్, హరియాణా హైకోర్టు ఇటీవలే సంచలనాత్మక తీర్పును వెలువరించింది.
భారతీయ రైతులను ఆర్థిక దుస్థితి నుంచి కాపాడాలంటే వ్యవసాయ ఉత్పత్తి ధరకు మూడురెట్లు అధికంగా కనీస మద్దతు ధరను ప్రకటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కనీస మద్దతు ధరను 1965లో ప్రకటించినప్పటికీ, చేదువాస్తవం ఏమిటంటే, తీవ్ర దారిద్య్రం నుంచి రైతులను బయటపడేలా వారి ఆదాయాలను ఈ పథకం కల్పించలేకపోయింది. కనీసం రైతులను ప్రోత్సహించలేకపోయింది. రైతులు పండించిన పంటలకు న్యాయమైన ధర పొందేలా న్యాయపరమైన హక్కులను కల్పిస్తూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’. తగిన చట్టం రూపకల్పన ద్వారా కనీస మద్దతు ధరకు న్యాయ ప్రతిపత్తిని అందచేయాలని ఆదేశిస్తూ జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ హెచ్‌ఎస్ సిద్ధుతోకూడిన డివిజన్ బెంచ్ తీర్పుచెప్పింది. తమ తీర్పులోభాగంగా న్యాయమూర్తులు.. వ్యవసాయరంగంలో దళారులను తొలగించడం, గిడ్డంగులను నెలకొల్పడం, వాతావరణ ప్రాతిపదికన పంటల బీమా పథకాలు, ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించడం, రుణ కల్పన, రైతుల ఆత్మహత్యల నివారణ వంటి పలు సంస్కరణ చర్యలను సాగించాలని ఈ తీర్పులో పేర్కొన్నారు.
గతంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిటీ కూడా కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తి కల్పించాలని పిలుపునిచ్చింది. సుదూరప్రాంతాలకు చెందిన రైతులు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను చేరలేకపోతున్నారని, దీంతో తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకంటే ఎంతో తక్కువ ధరకే స్థానిక మార్కెట్లకు అమ్మేయాల్సి వస్తోందని ఈ కమిటీ ప్రత్యేకించి పేర్కొంది. కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తిని కల్పించడం వల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా రైతులకు కనీస ధరకు హామీ పడుతుంది. తద్వారా వారి ఆదాయాలు మెరుగుపడతాయి, రుణభారం తగ్గుతుంది, వ్యవసాయ దుస్థితి తగ్గుముఖం పడుతుందికూడా.
వీటికి అదనంగా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుకు మూడు రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను పెంచడం వల్ల ఇదొక్కటే వ్యవసాయరంగం పనితీరు గణనీయంగా పెరగడానికి వీలవుతుంది. నా ఉద్దేశంలో రెండు రకాల ధరల విధానం ఉండాలి. అవేమిటంటే కనీస మద్దతు ధరతో ధాన్యసేకరణ జరపటం, రైతుకు చెల్లించవలసిన వాస్తవ ధరను ఆచరణలో అమలు చేయడం. ఇప్పుడు రైతులందరికీ జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ధరల విధానాల మధ్యలో తలెత్తే వ్యత్యాసాన్ని రైతు బ్యాంకు ఖాతాకే నేరుగా బదలాయించవచ్చు.
వ్యవసాయరంగంలో వృద్ధి గణాంకాలు తమ్ముతాము నిరోధిం చుకునే పరిస్థితులనుంచి బయటపడాల్సిన సమయం వచ్చింది. మానవ వనరులపై మదుపు చేయడానికి ఇది చక్కటి తరుణం. వ్యవసాయ రాబడులను పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యవసాయ టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు రైతులుపెట్టే డబ్బు కూడా పెరుగుతుంది. ఇలా గ్రామీణ డిమాండును అధిక మదుపుల ద్వారా కేటాయించిన రోజు, పారిశ్రామికాభివృద్ధి కూడా వేగం పుంజు కుంటుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో సరకులకు మరింత డిమాండును సృష్టించడం వ్యవసాయరంగం వల్లే సాధ్యపడుతుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థనే సంక్షోభం నుంచి బయటపడేస్తు్తంది. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ సాగవలసిన మార్గం ఇదేమరి.
వ్యాసకర్త : దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్ : hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment