ఆలియాభట్ రాయని డైరీ
చుట్టూ అంతా స్వీట్‌గా ఉండే మనుషులే ఉంటే లైఫ్ చేదుగా ఉంటుంది. స్వీట్ స్మైల్స్, స్వీట్ వర్డ్స్.. ఓ మై హెవెన్స్! చేదైనా నయమేనేమో.
స్వీట్ బాక్స్ లాంటి లైఫ్ బోరింగ్‌గా ఉంటుంది. బోర్‌డమ్‌ని నేను ఛస్తే భరించలేను. చచ్చిపోనైనా పోతాను కానీ, బోర్ కొట్టి చావలేను. షేమ్ ఆన్ అజ్! ఇంత ఎగుడు దిగుడుల లైఫ్ ఉన్నది బోర్ కొట్టి చావడానికా? ఆఫ్టర్ లైఫ్.. సమాధిలోని సుఖనిద్ర బోర్ కొట్టినా అంతే, గభాల్న నేను పైకి వచ్చేయాలనే చూస్తా.. సిమెంటు, సున్నం కలిసిన ఆ శిథిలాల్లోంచి.. చిన్న మొక్కగానైనా!
ఎవరో ఒకరు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటేనే నాకు నిద్రపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ నాకు కాజూ మిల్క్ ఇస్తుంది. కానీ కాజూ మిల్క్ ఒక్క దాని వల్లనే నాకు బాగా నిద్ర పట్టేస్తే అది కూడా నాకు బోర్ కొట్టేస్తుంది. నిర్లక్ష్యంగా చూస్తుండే నా కళ్లు, నొక్కి పట్టి ఉంచిన నా కింది పెదవి, బిగించిన నా మూతి.. ఏవీ వృథా కాకూడదు. నాతో పాటు వాటికీ ఒక లైవ్లీ లైఫ్ ఉండాలి. ఇండివిడ్యువల్‌గా, ఇండిపెండెంటుగా.. సొంత ఫ్లాట్‌లో ఉన్నట్లు.
స్వీట్‌ని ఎక్కువ కానివ్వని స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటేనే ఎవరైనా ఆరోగ్యంగా బతుకుతున్నట్టు. లేదా బతికి ఉన్నట్టు. లైఫ్‌లో ఉప్పైనా, కారమైనా.. అప్పుడప్పుడు తక్కువౌతుండాలి లేదా ఎక్కువౌతుండాలి. అన్నీ సమపాళ్లలో ప్లేట్‌లోకి వచ్చి పడిపోతుంటే రోజూ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఏ ఆశతో వెళ్లాలి? ఇదొక దిగులు నా జీవితానికి.
ఈ పర్‌ఫెక్షనిస్టులను చూస్తే నాకు చెమటలు పట్టేస్తాయి. రాత్రికి నిద్ర కూడా పట్టదు. హాయిగా ఎందుకు ఉండరు వీళ్లు! తమకి నచ్చినట్టు. ప్రపంచం అంతా నీతో సవ్యంగా ఉంటోందీ అంటే.. నువ్వు నీతో సవ్యంగా లేనట్లు. నిన్ను అందరూ ఇష్టపడుతుంటే నీ అంత బోరింగ్ పర్సనాలిటీ ఇంకొకరు లేనట్లు. అవసరమా? నిన్ను నువ్వు చంపేసుకుని, నీలోంచి నువ్వు కాని వాళ్లను పుట్టించుకోవడం.. మనిషి ఎదురుపడ్డ ప్రతిసారీ!
‘ఉడ్తా పంజాబ్’లో నేను బిహారీ అమ్మాయిని. అక్కడ కావాలి పర్‌ఫెక్షన్. స్క్రీన్ మీదకి. నేను బాత్రూమ్‌లో ఉన్నప్పుడో, ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఉన్నప్పుడో పర్‌ఫెక్షన్ ఎందుకు? ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు కరణ్ సార్. పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పాను. దేశమంతా నవ్వింది. నేనెందుకు ఫీల్ అవ్వాలి? అదేం స్క్రిప్టు కాదు కదా, పర్‌ఫెక్టుగా చెప్పడానికి.
‘‘నీ వయసులో నాకింత ఫిలాసఫీ లేదు’’ అంటున్నారు డాడీ. ‘‘ఇది నీ వయసుకు ఉండాల్సిన ఫిలాసఫీ కాదు’’ అనాలి నిజానికైతే ఆయన! ‘‘హ్యాపీ ఫాదర్స్ డే డాడీ’’ అన్నాను. ‘లవ్యూ’ చెప్పారు డాడీ.. నన్ను హగ్ చేసుకుని. డాడీ నాకు మంచి ఫ్రెండ్. కానీ నన్ను నొప్పించలేని ఫ్రెండ్. నొప్పించే వాళ్లు లేకపోతే లైఫ్ ఏమంత గొప్పగా ఉండదు. ఇంట్లో అయినా, బయట అయినా.
- మాధవ్ శింగరాజు