udta Punjab
-
నన్ను వాళ్లతో పోల్చడం కరెక్టు కాదు: కరీనా
‘నన్ను ఇప్పటి యువతరంతో పోల్చడం సరికాదు’ అంటున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్‌తో జంటగా నటిస్తున్న కరీనా తాజా చిత్రం ‘గుడ్ న్యూస్’. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ ‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్ధాలు గడిచిపోయాయి. అయినా అభిమానులు ఇప్పటికీ నన్ను ప్రస్తుత యువతరంతో పోల్చుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది’ అని అన్నారు. అయితే ఎప్పుడూ తనని ఇతరులతో పోల్చుతూ ఉంటారని, అది సంతోషకరమైన విషయమే అయినప్పటికీ ఎందుకు అలా పోల్చుతారు... ఇది సరైన పద్దతి కాదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఇరవై ఏళ్ల నుంచి నేను నటనలో ఉన్నాను. నా పనేంటో నేను చేసుకుంటున్నాను. ప్రస్తుతం నా సినీ జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నాను.’ అంటూ కరీనా చెప్పుకొచ్చారు. అయితే కరీనా కపూర్ 2000 సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టారు. తన తొలి చిత్రంతోనే బాలీవుడ్ బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్ సరసన నటించారు. ఇక రెండవ చారిత్రాత్మక చిత్రం ‘అశోకా’ విజయవంతం కావడంతో కరీనాకు మంచి బ్రేక్ వచ్చింది. అలాగే మూడవ సినిమాతోనే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌లతో కలిసి నటించే చాన్స్ కొట్టేశారు. బ్లాక్ బ్లాస్టర్ హిట్ ‘కభీ ఖుషీ కభీ గమ్’లో హృతిక్‌కు జోడిగా నటించారు. ఆ తరువాత ‘చమేలీ’, ‘జబ్ వే మేట్’, ‘దేవ్’, ‘3 ఇడియట్స్’, ‘బజరంగీ భయిజాన్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కరీనా స్టార్ హీరోయిన్ అయ్యారు. ఇక అప్పటి నుంచి కరీనా గ్లామరస్ పాత్రలతో పాటు ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ యువతరం హీరోయిన్స్‌కు గట్టి పోటీనిస్తూ వస్తున్నారు కరీనా. -
‘కాలా’పై కన్నెర్ర!
కుల, మత సంస్థలు, ఇతర బృందాలు చలనచిత్రాల జోలికి రాకూడదని న్యాయస్థానాలు పదే పదే హితవు చెబుతున్నాయి. చలనచిత్రాల మంచి చెడ్డలు నిర్ణయించడానికి సెన్సార్ బోర్డు ఉన్నదని, దాని నిర్ణయాలను ప్రశ్నించేందుకు ఇతరత్రా వేదికలు కూడా అందుబాటులో ఉన్నా యని గుర్తు చేస్తున్నాయి. అయినా చిత్రం పేరు మార్చాలని, ఫలానా సన్నివేశం తొలగించాలని, పాటల్లో ఫలానా పదాలు తీసేయాలని, లేదంటే చిత్రం విడుదలను అడ్డుకుంటామని బెది రింపులకు దిగే బృందాలు తామరతంపరగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా గురువారం విడుదల కావలసిన రజనీకాంత్ చిత్రం ‘కాలా’ అలాంటివారి బారిన పడింది. ఆశ్చర్యమేమంటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో చిత్రం విడుదలను వాయిదా వేసుకోమని సలహా ఇస్తున్నారు. కర్ణాటకలో ఆ చిత్రం విడుదలను అడ్డుకుం టామని కన్నడ సంఘాలు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నాయి. కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశించినట్టు కావేరీ నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని రజనీ కాంత్ డిమాండ్ చేయడం ఆ సంఘాలకు నచ్చలేదు. కన్నడ సంఘాలు మాత్రమే కాదు... తమిళనాడులోని కొన్ని ఇతర సంఘాలు కూడా ‘కాలా’కు సమస్యలు సృష్టించా లని చూస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసేయాలని డిమాండ్ చేస్తూ సాగిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపి పలువురిని కాల్చి చంపిన ఉదంతంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆ సంఘాలకు అభ్యంతరకరం అనిపించాయి. పోలీసులపై కొన్ని అసాంఘిక శక్తులు దౌర్జన్యానికి దిగడం వల్లే వారు కాల్పులు జరపాల్సివచ్చిందన్నది రజనీ వ్యాఖ్యల సారాంశం. తూత్తుకుడి కాల్పుల దృశ్యాలను చూసిన వారెవరూ అలా మాట్లాడరు. పోలీసులు ఉద్యమ కారులను గురిచూసి కాల్చిచంపిన దృశ్యాలు బయటికొచ్చాక కూడా రజనీ అలా మాట్లాడి ఉండా ల్సింది కాదు. అసాంఘిక శక్తులపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ ఆ క్రమంలో పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇష్టానుసారం ప్రవర్తిస్తే అంగీకరించరు. ఈ విషయంలో రజనీకాంత్‌తో విభేదించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ సాకుతో చిత్రానికి అడ్డంకులు కల్పించడం సరికాదు. ఆమధ్య హిందీ చిత్రం ‘పద్మావత్’పై కూడా ఇలాంటి వివాదాలే ముసురుకున్నాయి. ఆ చిత్రంలో పద్మావతిని కించపరిచేలా చూపుతున్నారని అనుమానించి రాజ్పుట్ సంఘాలు షూటింగ్ మొదలైనప్పటినుంచే దాడులు మొదలుపెట్టాయి. చివరకు చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తలలు తెచ్చినవారికి రూ. 5 కోట్లు బహుమాన మిస్తామని కూడా ప్రకటించాయి. తీరా విడుదలయ్యాక చూస్తే ఆ చిత్రంలో ఎలాంటి అభ్యం తరకమైన అంశాలూ లేవు. రెండు నెలలక్రితం పంజాబీ చిత్రం ‘గురునానక్ దేవ్’ను కూడా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ), అకల్ తఖ్త్లు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. మూడేళ్లక్రితం ఈ చిత్రం విడుదలైనప్పుడు ఎస్జీపీసీ అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, కొన్ని సిక్కు గ్రూపులు ఆందోళనకు దిగడంతో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. అప్పట్లో చిత్ర నిర్మాతలు ఒక్క పంజాబ్‌లో మినహా మిగిలినచోట్ల విడుదల చేశారు. కానీ కొద్దిరోజులకే నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి విడుదల చేద్దామనుకుంటున్న తరుణంలో ఎస్జీపీసీ అభ్యంతరపెట్టింది. అసలు చిత్రంలో గురునానక్ పాత్రే ఉండరాదని, అలా చూపితే ఆయనకు అపచారం చేసినట్టేనని దాని వాదన. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో అదంతా సద్దుమణిగింది. కానీ ఇకపై సిక్కు సంప్ర దాయానికి సంబంధించి తీసే చిత్రాలకు తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరని ఈమధ్య ఎస్జీపీసీ ప్రకటించింది. అందుకోసం 21మంది సభ్యులతో సిక్కు సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. సెన్సార్‌బోర్డుకు సిక్కు సంప్రదాయాలపై అవగాహన ఉండదు కనుక తామే అందుకోసం దీన్ని ఏర్పాటు చేశామంటున్నది. యువతపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని చర్చించిన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంపైనా 2016లో వివాదం చెలరేగింది. సెన్సార్ బోర్డు 89 కత్తిరింపులు ప్రతిపాదించగా చిత్ర నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి చిత్రం విడుదల చేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలో ఒక్క సినిమాలపై మాత్రమే కాదు... వివిధ కళారూపాల గొంతు నొక్కడానికి ఏదో ఒక రూపంలో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన పెయింటింగ్‌లపై హిందూత్వ సంస్థలు విరుచుకుపడ్డాయి. అనేకచోట్ల కేసులు నమో దుకావడం, బెదిరింపులు రావడం వగైరాలతో విసిగి ఆయన 2006లో భారత్ వదిలి వెళ్లి పోయారు. 2011లో మరణించేనాటికి ఆయన దోహాలో ఉన్నారు. తమిళనాడులో రచయిత పెరు మాళ్ మురుగన్ రాసిన నవలపై కూడా పెద్ద వివాదం తలెత్తింది. ఆయనను అనేకవిధాల వేధిం చారు. కుల, మత సంఘాలు ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. చివరకు మూడేళ్లక్రితం ఆ రచయిత సృజనాత్మకతపై ఆంక్షలు విధించడానికి వీల్లేదని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. రచయితల, కళాకారుల భావ వ్యక్తీకరణను అడ్డుకునేందుకు, వారి భావాలు ప్రజలకు చేరకుండా నిరోధించేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు బృందాలు అనేక విధాల ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై నిర్మించిన డాక్యుమెంటరీ విడుదలను ఆపాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ నిరుడు సుప్రీంకోర్టు విలువైన తీర్పును వెలువరించింది. చట్ట పరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో భావాలు వ్యక్తం చేయొచ్చునని, అందులో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వాలకుగానీ, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకుగానీ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో ఉదారంగా స్టేలు మంజూరు చేయొద్దని కింది కోర్టులకు సూచించింది. సుప్రీంకోర్టు పదే పదే ఇంత వివరంగా చెప్పినా సమస్యలు తలెత్తడం, అధికారంలో ఉన్నవారు వంతపాడటం విచారకరం. ఇలాంటి ధోరణులను నివారించకపోతే ప్రజాస్వామ్య భావనే ప్రమాదంలో పడుతుంది. -
హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో డ్రగ్స్‌ను అడ్డుకుంటామని చెప్పడానికి పంజాబ్‌ను ఉదాహరణగా తీసుకున్నారు. కర్ణాటకను 'ఉడ్తా పంజాబ్'లా మారనిచ్చేది లేదిన కామెంట్ చేశారు. డ్రగ్స్ అంశాన్ని కర్ణాటక శాసనమండలిలో బీజేపీ సభ్యులు ప్రస్తావించినప్పుడు ఆయనిలా స్పందించారు. రాష్ట్రంలో డ్రగ్స్ భూతాన్ని తరిమేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, ప్రధానంగా బెంగళూరు, మంగళూరు నగరాల్లో ఇది చేపడుతున్నామని అన్నారు. బెంగళూరును పంజాబ్ మార్గంలో నడవనిచ్చేది లేదన్నారు. ఇక్కడ ఉడ్తా పంజాబ్ ఉండబోదని పరమేశ్వర వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డ్రగ్స్ భూతం విస్తరిస్తున్నా ప్రభుత్వం మాత్రం దానిపై అస్సలు స్పందించడం లేదన్న అంశాన్ని బీజేపీ ఎమ్మెల్సీ లోహర్ సింగ్ మండలిలో ప్రస్తావించారు. అయితే తాము ఇప్పటికే దీన్ని సీరియస్‌గా తీసుకున్నామని, డ్రగ్ పెడ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సూచించామని హోం మంత్రి పరమేశ్వర చెప్పారు. కాలేజీల సమీపంలో ఉండే చిన్న దుకాణాలను డ్రగ్స్ అమ్మకాలకు అడ్డాలుగా చేసుకుంటున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. గత రెండున్నర నెలల్లో డ్రగ్స్ సంబంధిత కేసుల్లో 65 మంది భారతీయులు, 23 మంది విదేశీయులను అరెస్టు చేశామని అన్నారు. -
షాహిట్ కపూర్
కొందరు కుర్రాళ్లు ఏ కారణం లేకుండా కూడా చెడిపోతారు. కొందరు కుర్రాళ్లు కారణాలు ఉండి చెడిపోతారు. కొందరు కుర్రాళ్లు మాత్రం చెడిపోవడానికి అన్ని కారణాలు ఉన్నా గట్టిగా, మొండిగా, తొణక్కుండా, బెణక్కుండా కుటుంబం కోసం, లక్ష్యం కోసం నిలబడతారు. షాహిద్‌కపూర్ నటించిన ‘ఉడ్తా పంజాబ్’ పెద్ద సంచలనం రేపింది. డ్రగ్స్ మత్తులో దొర్లే పంజాబ్ రాష్ట్ర పరిస్థితులను చెప్పే ఈ సినిమాలో షాహిద్ కపూర్ డ్రగ్స్‌కు బానిసైన ఒక రాప్ సింగర్‌గా నటించాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ షాహిద్‌ను కరడుగట్టిన డ్రగ్స్ బానిస అనే నిర్థారణకు వస్తారు. కాని వాస్తవం ఏమిటంటే షాహిద్ జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తాకి ఎరగడు. నిజం ఏమిటంటే అతడు మద్యం కూడా తాగి ఎరగడు. ఇంకా నిజం ఏమిటంటే అతడు పక్కా శాకాహారి. మాంసం కూడా ముట్టడు. దేశంలో పెద్ద హీరోగా చాలా మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండి సాయంత్రమైతే పార్టీలు, పబ్‌లు ఉండే బాలీవుడ్ వాతావరణంలో ఉన్నా షాహిద్ ఇలాగే తన కేరెక్టర్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఇది మామూలు సంగతి కాదు. పెద్ద విజయం. షాహిద్‌కు మూడేళ్ల వయసప్పుడు అతడి తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి పంకజ్ కపూర్, తల్లి నీలిమా అజీమ్. పంకజ్ కపూర్ ప్యారలల్ సినిమాల నటుడు. కమర్షియల్ సినిమాలలో వచ్చే పాత్రలు, డబ్బులు అతడికి రావు. ఇక నీలిమా అజీమ్ కథక్ డాన్సర్, మోడల్. కొన్ని సినిమాలలో నటించింది. వీళ్లిద్దరి కాపురం షాహిద్ పుట్టాక ఒడిదుడుకులకు లోనైంది. విడాకుల తర్వాత నీలిమ.. షాహిద్‌ను తీసుకుని ఢిల్లీకి వెళ్లిపోయింది. పదేళ్ల వయసు వచ్చే వరకూ షాహిద్ ఢిల్లీలోనే పెరిగాడు. దేవుడు ఒక తోడును తెంపేస్తే రెండు ఆసరాలను ఇస్తాడు. చిన్నారి షాహిద్‌కు ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్యలే గొప్ప నేస్తాలు. వారిద్దరూ అప్పట్లో రష్యా నుంచి వెలువడే ‘స్పుత్నిక్’ పత్రిక కోసం పని చేసేవారు. షాహిద్‌కు తాతయ్య రోజూ కథలు చెప్పేవాడు. విడిపోయిన తండ్రి పట్ల ద్వేషం కలగకుండా మంచి మాటలు మాట్లాడేవాడు. కాని షాహిద్‌కు మాత్రం తనతో ఉన్న తల్లి అంటేనే ఎంతో ఇష్టం ఉండేది. తల్లి ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది –‘అప్పుడు షాహిద్‌కు ఐదేళ్లు కూడా లేవు. నేను ఢిల్లీలో చాలా ఆలోచనలతో సతమతమయ్యేదాన్ని. ఒకరోజు రాత్రి నేను బాగా ఏడుస్తున్నాను. షాహిద్ నన్ను గమనించాడు. ఏమనుకున్నాడో ఏమో అంత చిన్న వయసులో నన్ను దగ్గరకు తీసుకుని ‘ఏడవకమ్మా. నేనున్నానుగా అన్నాడు. అది నేను మర్చిపోలేను’ అంటుందామె. నిజంగానే షాహిద్ ఎప్పుడూ కుటుంబానికి నేనున్నాను అన్నట్టుగానే ఉన్నాడు. బాధ్యత తప్పిపోవడం అతడికి తెలియదు. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చే గర్ల్ ఫ్రెండ్ అని బాలీవుడ్ సామెత. కరీనా కపూర్ అతడి జీవితంలో అలా నడిచి వచ్చింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ముద్దు ముచ్చట్లు చెప్పుకున్నారు. లండన్ టాబ్లాయిడ్ ఒకటి వీళ్ల బహిరంగ ముద్దును ఫొటోలుగా వేస్తే పెద్ద సంచలనం అయ్యింది. వీళ్లద్దరూ కలిసి నటించిన ‘జబ్ వియ్ మెట్’ కమర్షియల్‌గా ఘన విజయం సాధించడమే కాదు ఇద్దరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. షాహిద్‌కు పదేళ్ల వయసు వచ్చేసరికి తల్లి నీలిమ సినీ అవకాశాల కోసం ముంబై చేరుకుంది. రాజేష్ ఖత్తార్ అనే నటుణ్ణి పెళ్లి చేసుకుంది. షాహిద్ తల్లి నిర్ణయాన్ని అంగీకరించి ఆమెతో ఉండిపోయాడు. మరోవైపు తండ్రి పంకజ్‌కపూర్ కూడా నటి సుప్రియా పాఠక్‌ను పెళ్లి చేసుకున్నాడు. తండ్రి నిర్ణయాన్ని కూడా షాహిద్ అంగీకరించాల్సి వచ్చింది. కొన్నాళ్లు ఇక్కడ... మారుతండ్రి. కొన్నాళ్లు అక్కడ... మారు తల్లి. ఎదుగుతున్న వయసు. తల్లిదండ్రులు బిజీగా ఉంటే, సమాజ వైఖరికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ కుర్రాడైనా చెడిపోవాలి. కాని షాహిద్ చెడిపోలేదు. పతనం అయ్యే బలహీనుణ్ణి కాను నేను అని బలం తెచ్చుకున్నాడు. దృష్టి ఏకాగ్రత కోసం అతడు చేసిన పని ఏమిటో తెలుసా? డాన్స్ నేర్చుకోవడం. షాహిద్ రక్తంలోనే డాన్స్ ఉంది. కొరియోగ్రాఫర్ అయి ఉంటే షాహిద్ చాలా గొప్ప కొరియోగ్రాఫర్ అయి ఉండేవాడు. ఆ రోజుల్లో వచ్చిన ‘తాళ్’, ‘దిల్ తో పాగల్ హై’ సినిమాల్లో షాహిద్ గ్రూప్ డాన్సర్లలో ఒకడిగా నటించాడు. పెప్సీ యాడ్‌లో కూడా షారుక్ ఖాన్‌తో మెరిశాడు. చదువు మీద ఎలాగూ దృష్టి లేదు. అలాగని సినిమాల్లో హీరో అవుదామంటే ఎదిగే వయసు. బక్క పలుచగా నూనూగు మీసాలతో ఉన్న షాహిద్‌ను చూసిన ఏ నిర్మాత అయినా ‘ఇప్పుడు కాదు కొన్నాళ్లు ఆగు’ అంటున్నారు. ఆ రోజుల్లో షాహిద్‌కు తినడానికి తిండి లేదు. ఉండటానికి సరైన రూమ్ కూడా లేదు. ఫ్రస్ట్రేషన్. మందు తాగొచ్చు. బీరు తాగొచ్చు. కాని షాహిద్ కేవలం టీ మాత్రమే తాగాడు. చాలామంది ఏమనుకుంటారంటే నటీనటులు తల్లిదండ్రులుగా ఉన్న పిల్లలకు అవకాశాలు ఈజీగా వస్తాయి అని. నటీనటుల కొడుకు అయినా సరే బాలీవుడ్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆడిషన్స్‌లో సెలెక్ట్ కావాల్సి ఉంటుంది. షాహిద్ తనుకు తెలిసిన అన్ని ప్రొడక్షన్ హౌస్‌లకూ వెళ్లేవాడు. ఆడిషన్స్ ఇచ్చేవాడు. కాని అందరూ రిజక్టే చేశారు. రిజక్ట్ చేసేకొద్దీ షాహిద్ పట్టుదల పెంచుకున్నాడు. సులభంగా వచ్చేది ఏదీ ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. కష్టపడి సాధిద్దాం.. అందాక వేచి చూద్దాం అని షాహిద్ అనుకున్నాడు. ‘తేజాబ్’ తీసిన ఎన్.చంద్ర ఆ సమయంలోనే ‘సై్టల్’ అనే సెక్స్ కామెడీ తీస్తూ షాహిద్‌కు హీరో వేషం ఇచ్చాడు. అంత పెద్ద డైరెక్టర్. కాని తీస్తున్నది బూతు సినిమా. ఇంకోడు వేరొకడు అయితే ఎగిరి గంతేసేవాడు. షాహిద్ మాత్రం బయటి వ్యక్తిత్వం మాత్రమే కాదు తెర మీద వ్యక్తిత్వం కూడా బాగుండాలి అని ఆగాడు. ఏ అవకాశమూ లేని యువకుడు అలా సంయమనం పాటించడం మామూలు విషయం కాదు. చాలా అరుదు. బాలీవుడ్లో ‘టిప్స్’ చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థ అధిపతి రమేశ్ తౌరానీ దృష్టి షాహిద్ మీద పడింది. ఈ కుర్రాడు పనికొస్తాడు అని ‘ఇష్క్ విష్క్’ అనే సినిమా తీశాడు. 2003లో రిలీజైంది. స్లీపర్ హిట్. షాహిద్ లోకానికి తెలిశాడు. అయితే ఆ వెంట వెంటనే అతడికి హిట్స్ పడలేదు. ఫిదా (2004), దిల్ మాంగే మోర్ (2004), శిఖర్ (2005) సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. షాహిద్ స్థితప్రజ్ఞుడు. నాలుగు పోతే ఐదోది హిట్ అవుతుంది అనుకున్నాడు. దాని కోసం ఒక ఆపద్బాంధవుడికై ఎదురు చూశాడు. తుదకు అతడు వచ్చాడు. పేరు– సూరజ్ భరజాత్యా. సల్మాన్‌ఖాన్‌ను ‘మైనే ప్యార్ కియా’తో జీవితానికి సరిపడ స్టార్డమ్ ఇచ్చిన దర్శకుడు సూరజ్ భరజాత్యా షాహిద్‌తో సినిమా తీయబోతున్నానని ప్రకటించేసరికి ఇండస్ట్రీలో ఒకటే కుతూహలం. ఎందుకంటే సూరజ్ అంతకు ముందు తీసిన ‘హమ్ సాత్ సాత్ హై’, ‘మే ప్రేమ్ కీ దీవానీ హూ’... సో సోగా వెళ్లాయి. షాహిద్ చూస్తే ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి ఇద్దరు విఫల బాటసారులు ఒక సఫల సినిమాను ఎలా తీస్తారా అని కుతూహలం. కాని సూరజ్ తనకు బాగా తెలిసిన సాంస్కృతిక పరంపరను, వివాహాన్ని సబ్జెక్ట్‌గా తీసుకుని ‘వివాహ్’ సినిమా తీసి విడుదల చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్. షాహిద్ కపూర్ తన జీవితంలో చూసిన మొదటి పెద్ద హిట్– ‘వివాహ్’. కాని మాటలనే లోకం మాటలు అంటూనే ఉంటుంది. నలుగురిలో కలవడానికి ఇష్టపడని షాహిద్‌ను పొగరుబోతనీ అహంభావి అని అంటూ ఉంటుంది. కాని జీవితంలో తాను చూసిన కష్టనష్టాల వల్లే తాను రిజర్వ్‌గా మారానని, నలుగురినీ కలవడానికి ఇష్టపడననీ షాహిద్ అంటూ ఉంటాడు. కరీనాతో ప్రేమ కథ ముగిసింది. షాహిద్‌ను వీలైన ప్రతి హీరోయిన్‌తోనూ బాలీవుడ్ ముడిపెట్టింది. ప్రియాంకా చోప్రా, విద్యాబాలన్ కూడా షాహిద్ గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు. చివరకు స్వయంవర ఘట్టం ముగిసింది. షాహిద్ తాను ఆధ్యాత్మికంగా ఫాలో అయ్యే ఒక గ్రూప్‌లో కాలేజీ స్టూడెంట్‌గా పరిచయమైన మీరా రాజ్పుట్ అనే అమ్మాయిని వయసు రీత్యా 12 ఏళ్ల ఎడం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకో పాప. పేరు మీషా. షాహిద్ నటించిన ‘రంగూన్’ సినిమా ఇవాళ రిలీజైంది. దీనికి ముందు అతడికి ‘హైదర్’, ‘ఉడ్తా పంజాబ్’ల వల్ల మంచి విజయం లభించింది. ‘రంగూన్’ విజయం సాధిస్తే మరిన్ని మంచి సినిమాల్లో షాహిద్ మనకు కనిపించే అవకాశం ఉంది. హిట్ హీరో అంటే స్క్రీన్ మీద విజయం సాధించేవాడు మాత్రమే కాదు. నిజ జీవిత బాధ్యతల్లో కూడా విజయం సాధించేవాడని అర్థం. ఆ విధంగా అతడు నిజంగానే– షాహిట్ కపూర్. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సెన్సార్ బోర్డు అధికారాలకు కత్తెర!
ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాలకు కారణం అవుతున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అధికారాలకు కత్తెర వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత సంవత్సరం పహ్లజ్ నిహలానీ దాని చైర్మన్‌గా అధికారం చేపట్టినప్పటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. దాంతో సినిమాలను సెన్సార్ చేసే విషయంలో ఈ సంస్థకు ముకుతాడు వేయాలని కేంద్ర సర్కారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త సినిమాటోగ్రఫీ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ భావిస్తోంది. దీన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అది గనక చట్టరూపం దాలిస్తే.. సీబీఎఫ్‌సీకి ఇక కేవలం సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వడం తప్ప సెన్సార్ చేసే అవకాశం ఉండదు. ఉడ్తా పంజాబ్ సినిమాకు ఏకంగా 90 కట్లు చెప్పడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు కోర్టుకు వెళ్లడం, చివరకు సుప్రీంకోర్టు కేవలం ఒకే ఒక్క కట్‌తో సినిమా విడుదలకు అంగీకరించడం లాంటి పరిణామాలతో సీబీఎఫ్సీ పరువు గంగలో కలిసిపోయింది. దాంతో ఇక దాని అధికారాలకు కత్తెర వేయక తప్పదని కేంద్రం నిర్ణయించింది. సినిమాలను వాటి కంటెంట్ ఆధారంగా వివిధ విభాగాలుగా చేయడం తప్ప సీన్లు, డైలాగులు కట్ చేయాలని చెప్పే అధికారం సీబీఎఫ్‌సీకి ఉండకూడదని భావిస్తోంది. సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే సీబీఎఫ్సీ.. స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తోంది. -
సుల్తాన్ కూడా లీక్ అయ్యిందా..!
బాలీవుడ్ ఇండస్ట్రీకి పైరసీ కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో లీకైపోతున్నాయి. ఆఖరికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా సుల్తాన్‌కు కూడా ఈ కష్టాలు తప్పలేదు. ఇటీవల బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఉడ్తా పంజాబ్ రిలీజ్‌కు ముందే నెట్లో దర్శనమిచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోకముందే, వివేక్ ఒబరాయ్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్రేట్ గ్రాండ్ మస్తీ కూడా రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో వచ్చేసింది. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ సినిమా కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో మాదిరిగా అన్ని టోరెంట్ సైట్లలో అందుబాటులో లేకున్నా కొన్ని వెబ్ సైట్స్ నుంచి ఇప్పటికే సుల్తాన్ సినిమాను డౌన్ లోడ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ముంబై సైబర్ క్రైం ఎక్స్పర్ట్స్ ధృవీకరించారు. ఇప్పటికే నష్ట నివారణా చర్యలు చేపట్టిన చిత్ర యూనిట్ పలు వెబ్ సైట్స్ బ్లాక్ చేయిస్తున్నప్పటికీ.. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు. -
'నా సినిమా ఇంత హిట్ అవుతుందనుకోలే'
ముంబై : సినిమాలో ఉన్న డ్రామా కంటే.. సినిమా విడుదలకు ముందే బోలెడంత డ్రామాకు తెర తీసిన చిత్రం 'ఉడ్తా పంజాబ్'. పంజాబ్‌ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ సమస్యను ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ సినిమా అనూహ్య కలెక్షన్లతో దూసుకుపోతుంది. చిత్ర ఘన విజయం పట్ల హీరో షాహిద్ కపూర్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న షాహిద్ మాట్లాడుతూ.. 'నా కెరీర్లోనే అత్యధిక ప్రారంభ వసూళ్లను సాధించిన సినిమా ఇది. ప్రజలంతా సినిమాను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాణిజ్యపరమైన సినిమాలు, వాణిజ్యపరమైన సినిమాలు కానివి అంటూ ఉండవని.. కేవలం మంచి కథనమా కాదా అనేదే ఉంటుందని ఉడ్తా పంజాబ్ మరోసారి నిరూపించింది' అని అన్నారు. (చదవండి: పరాటా కంటే వేగంగా.. మెక్సీకో కన్నా క్రూరంగా..) ఇప్పటికే రూ.48.5 కోట్ల కలెక్షన్లు సాధించిన ఉడ్తా పంజాబ్.. రూ.50 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. కాగా త్వరలో తండ్రి కాబోతున్న షాహిద్.. సైఫ్ అలీ ఖాన్ తో కలిసి 'రంగూన్' అనే మల్టీ స్టారర్లో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. -
మా సినిమా పాకిస్థాన్‌లో ప్రదర్శించం
ఉడ్తా పంజాబ్ సినిమాను పాకిస్థాన్‌లో ప్రదర్శించేది లేదని సినిమా దర్శక నిర్మాతలు తేల్చి చెప్పేశారు. కనీసం 100 కట్లు లేనిదే ఆ సినిమాను అక్కడ ప్రదర్శించకూడదని పాక్ సెన్సార్ బోర్డు చెప్పడంతో వాళ్లీ నిర్ణయం తీసుకున్నారు. సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేయకపోవడం వల్ల తాము చాలా ఆదాయం కోల్పోతామని, అయినా అసలు అన్ని కట్లతో సినిమా విడుదల చేయడం వ్యర్థమని దర్శకుడు అభిషేక్ చౌబే అన్నాడు. భారతదేశంలో అయితే సెన్సార్ బోర్డు 89 కట్లు సూచించినా కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నామని, అక్కడ అలాంటి అవకాశం కూడా లేదని.. అందువల్లే అసలు సినిమా విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నామని చెప్పాడు. సినిమా కలెక్షన్లు ప్రస్తుతం బాగానే ఉన్నాయని, కానీ ఇంటర్నెట్లో లీకవ్వకుండా ఉంటే మరింత బాగుండేదని చౌబే అభిప్రాయపడ్డాడు. సినిమాలో కొన్ని పదాల వాడకం పట్ల అభ్యంతరాలు వస్తున్నాయని, కానీ నిజజీవితంలో వాళ్లు అలాగే మాట్లాడుకుంటారని అన్నాడు. డ్రగ్ పెడలింగ్, డ్రగ్స్ వాడకం గురించి తాము సందేశం ఇవ్వాలనుకున్నామని అందుకే నిజ జీవితాలను ప్రతిబింబించక తప్పలేదని చెప్పాడు. -
'సరైన దర్శకుల చేతిలో పడితే...'
న్యూఢిల్లీ: నటనలో ఆకాశమే తనకు హద్దు అని బాలీవుడ్ సంచలనం అలియా భట్ పేర్కొంది. తాను దర్శకుల నటిని అని చెప్పింది. 'ఉడ్తా పంజాబ్' సినిమాలో అలియా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సరైన దర్శకుల చేతిలో పడితే తెరపై సత్తా చూపుతానని 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' స్టార్ పేర్కొంది. 'ప్రతి కేరెక్టర్ నాకు విభిన్నమైందే. నేను దర్శకుల నటిని. దర్శకులు నన్ను సరిగా నడిపిస్తే నటనలో ఆకాశమే నాకు హద్ద'ని అలియా చెప్పింది. ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ కుమార్తె అయిన 23 ఏళ్ల అలియా 'ఉడ్తా పంజాబ్' డీగ్లామర్ రోల్ చేసి మెప్పించింది. ఈ పాత్ర కోసం చాలా కసరత్తు చేశానని వెల్లడించింది. మాండలికం, బాడీ లాంగ్వేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపింది. 'హైవే' సినిమాకు పెద్దగా కష్టపడలేదని, దర్శకుడు చెప్పినట్టే చేశానని చెప్పింది. భావోద్వేగాలతో కూడిన పాత్రల్లో రాణించడానికి ప్రయత్నిస్తున్నానని అంది. బద్రీనాథ్ కీ దుల్హానియా, శుద్ధి, గౌరి షిండే సినిమాల్లో అలియా నటిస్తోంది. -
ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం
ముంబై : సినిమాలో ఉన్న డ్రామా కంటే.. సినిమా విడుదలకు ముందే బోలెడంత డ్రామాకు తెర తీసిన బాలీవుడ్ మూవీ 'ఉడ్తా పంజాబ్' కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఐదు రోజుల్లో రూ.42 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. విడుదలకు ముందు దర్శక,నిర్మాతలకు కష్టాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా.. ప్రస్తుతం వారి మీద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరో వీకెండ్ వస్తుండటంతో కలెక్షన్లు మరింత పెరగడం ఖాయం. ముందే సినిమా ఆన్లైన్లో లీక్ అయినప్పటికీ ఆ ప్రభావం సినిమా కలెక్షన్ల మీద పడలేదు. కలెక్షన్లకు పోటీగా ప్రశంసలను కూడా సొంతం చేసుకుంటోంది 'ఉడ్తా పంజాబ్'. ఈ ఏడాది అత్యంత వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన ఈ సినిమాలో పంజాబ్‌ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ సమస్యను ఇతివృత్తంగా తీసుకున్నారు. షాహిద్ కపూర్, ఆలియా భట్ల నటనకు విమర్శకుల ప్రశంసలందుతున్నాయి. -
‘ఉడ్తా పంజాబ్’కు తప్పని కష్టాలు
లాహోర్: భారత్‌లో సెన్సారు బోర్డుతో విభేదాల అనంతరం కోర్టు జోక్యంతో విడుదలైన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రానికి పాకిస్థాన్‌లోనూ సెన్సార్ కట్లు తప్పడం లేదు. భారత సెన్సారు బోర్డు 89 కట్లు ప్రతిపాదిస్తే, పాకిస్థాన్ బోర్డు ఏకంగా 100 చోట్ల సినిమాలో కత్తెర పడాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ సినిమాలో పాకిస్థాన్‌కు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న అన్ని సీన్లు, డైలాగ్‌లను తొలగించడం, నిశ్శబ్దం లేదా బీప్ శబ్దాలతో నింపడం చేయాలని డిస్ట్రిబ్యూటర్‌కు పాక్ సెన్సార్‌బోర్డు ఆదేశాలిచ్చింది. అభ్యంతరకర విషయాల తొలగింపు తర్వాత మరోసారి బోర్డు సినిమాను పరిశీలించి విడుదలకు అనుమతినిస్తుంది. పాక్‌లో ఈ వారాంతంలో చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
'ఉడ్తా పంజాబ్'కు రికార్డు కలెక్షన్లు
ఈ ఏడాది అత్యంత వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన 'ఉడ్తా పంజాబ్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అభిషేక్ చుబే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి వీకెండ్ లో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ.33.80 కోట్లను రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన ఐదో చిత్రంగా 'ఉడ్తా పంజాబ్' రికార్డు సృష్టించింది. షాహిద్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉడ్తా పంజాబ్' గడిచిన ఆదివారం కూడా ధాటిగా కలెక్షన్లు రాబట్టిందని, ఢిల్లీ, పంజాబ్ లలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నదని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ సినిమా తొలిరోజు (శుక్రవారం) రూ. 10.05కోట్లు, రెండోరోజు (శనివారం) రూ. 11.25 కోట్లు, మూడో రోజు (ఆదివారం) రూ. 12.50 కోట్లు.. మొత్తంగా రూ. 33.80 కోట్లను తన ఖాతాలో వేసుకున్నదని ఆయన ట్వీట్ చేశారు. పంజాబ్ లో విశృంఖలంగా విజృంభిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఎక్కుపెట్టిన అస్త్రంగా 'ఉడ్తా పంజాబ్' తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
రెండు రోజుల్లో 21.30 కోట్ల రూపాయలు
ముంబై: సెన్సార్ బోర్డుతో వివాదాల అనంతరం విడుదలైన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాకు తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. ఈ నెల 17న విడుదలైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో మొత్తం 21.30 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలి రోజు 10.5 కోట్లు రాగా, రెండో రోజు 11.25 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సినిమాకు ఎక్కువగా పంజాబ్, ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. అభిషేక్ చాబే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కరీనా కపూర్, షాహిద్ కపూర్, అలియా భట్ తదితరులు నటించారు. -
ఆలియాభట్ రాయని డైరీ
చుట్టూ అంతా స్వీట్‌గా ఉండే మనుషులే ఉంటే లైఫ్ చేదుగా ఉంటుంది. స్వీట్ స్మైల్స్, స్వీట్ వర్డ్స్.. ఓ మై హెవెన్స్! చేదైనా నయమేనేమో. స్వీట్ బాక్స్ లాంటి లైఫ్ బోరింగ్‌గా ఉంటుంది. బోర్‌డమ్‌ని నేను ఛస్తే భరించలేను. చచ్చిపోనైనా పోతాను కానీ, బోర్ కొట్టి చావలేను. షేమ్ ఆన్ అజ్! ఇంత ఎగుడు దిగుడుల లైఫ్ ఉన్నది బోర్ కొట్టి చావడానికా? ఆఫ్టర్ లైఫ్.. సమాధిలోని సుఖనిద్ర బోర్ కొట్టినా అంతే, గభాల్న నేను పైకి వచ్చేయాలనే చూస్తా.. సిమెంటు, సున్నం కలిసిన ఆ శిథిలాల్లోంచి.. చిన్న మొక్కగానైనా! ఎవరో ఒకరు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటేనే నాకు నిద్రపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ నాకు కాజూ మిల్క్ ఇస్తుంది. కానీ కాజూ మిల్క్ ఒక్క దాని వల్లనే నాకు బాగా నిద్ర పట్టేస్తే అది కూడా నాకు బోర్ కొట్టేస్తుంది. నిర్లక్ష్యంగా చూస్తుండే నా కళ్లు, నొక్కి పట్టి ఉంచిన నా కింది పెదవి, బిగించిన నా మూతి.. ఏవీ వృథా కాకూడదు. నాతో పాటు వాటికీ ఒక లైవ్లీ లైఫ్ ఉండాలి. ఇండివిడ్యువల్‌గా, ఇండిపెండెంటుగా.. సొంత ఫ్లాట్‌లో ఉన్నట్లు. స్వీట్‌ని ఎక్కువ కానివ్వని స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉంటేనే ఎవరైనా ఆరోగ్యంగా బతుకుతున్నట్టు. లేదా బతికి ఉన్నట్టు. లైఫ్‌లో ఉప్పైనా, కారమైనా.. అప్పుడప్పుడు తక్కువౌతుండాలి లేదా ఎక్కువౌతుండాలి. అన్నీ సమపాళ్లలో ప్లేట్లోకి వచ్చి పడిపోతుంటే రోజూ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఏ ఆశతో వెళ్లాలి? ఇదొక దిగులు నా జీవితానికి. ఈ పర్ఫెక్షనిస్టులను చూస్తే నాకు చెమటలు పట్టేస్తాయి. రాత్రికి నిద్ర కూడా పట్టదు. హాయిగా ఎందుకు ఉండరు వీళ్లు! తమకి నచ్చినట్టు. ప్రపంచం అంతా నీతో సవ్యంగా ఉంటోందీ అంటే.. నువ్వు నీతో సవ్యంగా లేనట్లు. నిన్ను అందరూ ఇష్టపడుతుంటే నీ అంత బోరింగ్ పర్సనాలిటీ ఇంకొకరు లేనట్లు. అవసరమా? నిన్ను నువ్వు చంపేసుకుని, నీలోంచి నువ్వు కాని వాళ్లను పుట్టించుకోవడం.. మనిషి ఎదురుపడ్డ ప్రతిసారీ! ‘ఉడ్తా పంజాబ్’లో నేను బిహారీ అమ్మాయిని. అక్కడ కావాలి పర్ఫెక్షన్. స్క్రీన్ మీదకి. నేను బాత్రూమ్లో ఉన్నప్పుడో, ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఉన్నప్పుడో పర్ఫెక్షన్ ఎందుకు? ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు కరణ్ సార్. పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పాను. దేశమంతా నవ్వింది. నేనెందుకు ఫీల్ అవ్వాలి? అదేం స్క్రిప్టు కాదు కదా, పర్ఫెక్టుగా చెప్పడానికి. ‘‘నీ వయసులో నాకింత ఫిలాసఫీ లేదు’’ అంటున్నారు డాడీ. ‘‘ఇది నీ వయసుకు ఉండాల్సిన ఫిలాసఫీ కాదు’’ అనాలి నిజానికైతే ఆయన! ‘‘హ్యాపీ ఫాదర్స్ డే డాడీ’’ అన్నాను. ‘లవ్యూ’ చెప్పారు డాడీ.. నన్ను హగ్ చేసుకుని. డాడీ నాకు మంచి ఫ్రెండ్. కానీ నన్ను నొప్పించలేని ఫ్రెండ్. నొప్పించే వాళ్లు లేకపోతే లైఫ్ ఏమంత గొప్పగా ఉండదు. ఇంట్లో అయినా, బయట అయినా. - మాధవ్ శింగరాజు -
మత్తు వదిలించే సినిమా!
భారత - పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం... చిమ్మచీకటిలో, పొలాల మధ్య నుంచి ముగ్గురు వ్యక్తులు ఒక ద్విచక్రవాహనంపై వస్తారు. వాళ్ళలో ఒకడు తన చేతిలో ఒక చిన్న ప్యాకెట్ లాంటి దాన్ని బలంగా, షాట్‌పుట్ విసిరినట్లు సరిహద్దు ఆవల ఉన్న ఇండియా భూభాగంలోకి విసురుతాడు. ఆ పొట్లంలో ఉన్నది 3 కిలోల ‘సరుకు’... మార్కెట్లో అక్షరాలా కోటి రూపాయల పైగా విలువున్న ‘మాల్’... కొన్ని లక్షల మందిని నిత్యం మత్తులో ముంచెత్తే మాదకద్రవ్యం. ఉద్దేశించిన డ్రగ్స్ వ్యాపారులకు కాకుండా, భారత భూభాగం లోని పొలానికి ఆ రాత్రి వేళ వచ్చిన ఒక అమ్మాయి చేతికి ఆ ‘సరుకు’ చిక్కు తుంది. గాలిలోకి విసిరిన ఆ సరుకు ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేస్తుంది... అచ్చంగా ఈ డ్రగ్స్ మత్తుతో గాలిలో తేలుతున్న పంజాబ్ యువతరం లాగే! ఇది ‘ఉడ్తా పంజాబ్’ ఓపెనింగ్ సీన్. వెల్కమ్ టు ‘ఉడ్తా పంజాబ్’... దేశంలోని అందరి కళ్ళూ తెరిపించేలా ఓపెన్‌గా సాగిన సినీ ప్రయత్నం. సెన్సార్ మొదలు రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో సినిమా అంతా లీకైపోవడం దాకా - రకరకాల వివాదాలతో, విడుదలకు ముందే ఇటీవల దేశం మొత్తం దృష్టినీ ఆకర్షించిన సినిమా. పంజాబ్, ఆ రాష్ట్ర సరిహద్దుల్లోని యువతీ యువకుల్లో కనీసం నూటికి 50 మంది ఏదో ఒక రకమైన మాదక ద్రవ్యా లకూ, మద్యానికీ బానిసలని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ సమకాలీన అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, డ్రగ్స్‌కు రాజధానిగా మారుతున్న పంజాబ్‌లోని వాస్తవ పరిస్థితులకూ, తప్పుదోవ పడుతున్న అక్కడి యువతరానికీ నిలువుటద్దం. డ్రగ్స్‌కు బానిసైన టామీసింగ్ అలియాస్ గబ్రూ అనే పాప్ గాయకుడు (షాహిద్ కపూర్)... పొలంలో దొరికిన ఆ పొట్లంలోని ‘మాల్’ను అమ్ముకొని జీవితాన్ని కొద్దిగానైనా సుఖవంతం చేసుకోవాలనుకొని అనుకోకుండా ఈ ఊబిలో కూరుకుపోయిన ఒక దిగువ మధ్యతరగతి అమ్మాయి (అలియా భట్)... కేవలం 50 రూపాయలకే దుకాణంలో ఇంజక్షన్ రూపంలో దొరికే డ్రగ్స్‌కు స్నేహితులతో కలసి బానిసైన ఒక కాలేజీ టీనేజ్ కుర్రాడు... ‘మా వాడు మంచోడే! చుట్టుపక్కల ఉన్నవాళ్ళే’ అన్న భ్రమలో బతికి, చివరకు ఆ చిన్నారి తమ్ముణ్ణి కాపాడుకోవడానికి తపించే ఒక చిన్నస్థాయి పోలీసు అధికారి (దిల్జీత్ దోసంఝ్), పంజాబ్‌లోని ఈ డ్రగ్స్ బానిసల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయడమే కాక, సమాజంలో మార్పు తేవాలని తపించే ఒక లేడీ డాక్టర్ (కరీనా కపూర్)... పంజాబ్ అయిదు నదులకు ఆలవాలమైతే, ‘ఉడ్తా పంజాబ్’ సినిమా ఈ అయిదుగురి జీవితాల్లోని సంఘర్షణల సమాహారం. ఈ అయిదుగురి జీవితాలూ ఒకదానికొకటి ముడిపడి, ఎలా పయనించాయన్నది 148 నిమిషాల పైచిలుకు సినిమా. సెన్సార్ బారి నుంచి ఒకే ఒక్క కట్‌తో బయటపడి, మొదలవడానికి ముందు తెర నిండా వివరంగా పే...ద్ద ‘గమనిక’తో జనం ముందుకొచ్చిన ఈ సినిమా ప్రారంభమైన పది నిమిషాల కల్లా తనతో పాటు తెర మీది జీవితంలోకి లాక్కెళుతుంది. పంజాబీ సమాజంలో నిత్యం మాటల్లో వినిపించే తిట్లతో సహా ఎన్నో పదునైన డైలాగ్స్, నిజజీవిత పాత్రలు అందుకు దోహదం చేస్తాయి. సెకండాఫ్ కొంత సినిమాటిక్‌గా అనిపించినా, ఇప్పటికే డ్రగ్స్ సేద్యంతో ‘రెండో హరిత విప్లవా’నికి ఆలవాలమైన పంజాబ్ మరో మెక్సికో లాగా మారకూడదనే బలమైన సందే శాన్ని హత్తుకొ నేలా చెప్పా లంటే ఆ మాత్రం స్వేచ్ఛ తప్పదని సర్దు కుంటాం. మాటలు, పాటల్లో పంజాబీ పదా లెక్కువ కలగలసిన ఈ సినిమా సబ్‌టైటిల్స్ సాక్షిగా ఆలోచనల్లోకి నెడు తుంది. షాహిద్, అలియా ఆ పాత్రల్లో చూపిన ఆవేదన, కరీనా లాంటి సీజన్డ్ ఆర్టిస్ట్‌లతో పాటు దిల్జీత్ లాంటి అపరిచిత ముఖాలెన్నో చేసిన అభినయం ప్లస్ పాయింట్. నేపథ్య సంగీతం, మరీ ముఖ్యంగా హాకీ కర్రతో అలియా భట్, దుండగుల్ని కొట్టే సీన్ లాంటి చోట్ల వినిపించే సంగీతం, తాత్త్వికమైన ‘ఏక్ కుడీ’ అనే ఆఖరి పాట బాగున్నాయి. సమాజంలోని రాజకీయాల్ని కూడా ప్రస్తావించే ఇంత పచ్చి వాస్తవిక చిత్రణను తెరపై చూస్తున్నప్పుడు, ఆ జీవిత వేదనకు అప్రయత్నంగా అనేకసార్లు అయ్యయ్యో అంటాం. కన్నీళ్ళు కారుస్తాం. ఒక కళారూపానికి అంతకన్నా ప్రయోజనం ఏముంటుంది! అయితే, మరో తొమ్మిది నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నవేళ సహజంగానే ఇలాంటి యత్నాలు అధికార పీఠంపై ఉన్నవాళ్ళకు రుచించవు. అందుకే ఈ సినిమాపై అధికార పక్షం చేతి కింది సెన్సార్ బోర్డ్ అభ్యంతరాల మొదలు సెన్సార్ నుంచే ఆన్లైన్ లీకేజ్ దాకా అన్నీ జరిగాయన్నది పగవాడికే కాదు, పసివాడికైనా అర్థమైపోతుంది. కానీ, సినిమాతో పాటు ఈ అనుకోని పబ్లిసిటీ కూడా డ్రగ్స్‌పై చైతన్యం తేవాలన్న ఆశయాన్ని కొంత నెరవేర్చింది. సెన్సార్ వాళ్ళ అధికార మత్తు... హరిత విప్లవానికి ఆలవాలమనీ, సుభిక్షమనీ పంజాబ్ పట్ల ఉన్న అందరికీ ఉన్న భ్రమల మత్తు... కమర్షియల్ సినిమాలకు అలవాటు పడి, వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉండడానికి ఇష్ట పడుతున్న ప్రేక్షకుల మత్తు... అన్నీ వదిలించే ప్రయత్నంగా ‘ఉడ్తా పంజాబ్’ గుర్తుండిపోతుంది. సెమీ డాక్యుమెంటరీ శైలిలో తెరపై ఒక నవల చూస్తున్న అనుభూతిని మిగిల్చిపోతుంది. ఒక్క ముక్కలో - వాస్తవాన్ని తట్టుకొనే గుండె ధైర్యం, హృదయాన్ని మెలిపెట్టే జీవచ్ఛవాల్ని చూసే మనసు తడి ఉన్నవాళ్ళ కోసం ఈ సినిమా. ఇది అక్షరాలా ‘ఉడ్తా’ ఇండియన్ ఫిల్మ్! చిత్రం: ‘ఉడ్తా పంజాబ్’, తారాగణం: షాహిద్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, దిల్జీత్ దోసంఝ్, స్క్రీన్‌ప్లే: అభిషేక్ చౌబే, సుదీప్‌శర్మ, మాటలు: సుదీప్‌శర్మ కెమేరా: రాజీవ్ రవి, నిర్మాతలు: శోభాకపూర్, ఏక్తాకపూర్, అనురాగ్ కశ్యప్, దర్శకత్వం: అభిషేక్ చౌబే, రిలీజ్: జూన్ 17 -
సీఎంగారూ ఈ సినిమా తప్పక చూడండి
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ బాగుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుటుంబ సభ్యులు ఈ 'పవర్ఫుల్ సినిమా'ను తప్పకుండా చూడాలని కేజ్రీవాల్ అన్నారు. ఈ సినిమా చూస్తే పంజాబ్‌కు బాదల్ ఏం చేశారో తెలుస్తుందని చెప్పారు. డ్రగ్స్ రాకెట్ లో రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ఉడ్తా పంజాబ్‌లో స్పష్టంగా చూపించారని కేజ్రీవాల్ అన్నారు. 'రాజకీయ నాయకులు డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్టు ఈ సినిమాలో చూపించారు. అంతేగాక ఎన్నికల సమయంలో ఉచితంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. పంజాబ్ పరిస్థితి బాధాకరం' అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో విచ్చలవిడి డ్రగ్స్ అమ్మకాలు, వాటి బారినపడి నాశనమవుతున్న యువకుల జీవితాలను కథాంశంగా తీసుకుని దర్శకుడు అభిషేక్ చాబే ఉడ్తా పంజాబ్ సినిమాను తెరకెక్కించారు. సెన్సార్ బోర్డు వివాదాలను దాటుకుని ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. -
తొలిరోజు కలెక్షన్లు.. రూ. 10 కోట్ల పైనే
సెన్సార్ అభ్యంతరాలను కోర్టులో ఎదిరించి, బోలెడు వివాదాల నడుమ విడుదలైన ఉడ్తా పంజాబ్ సినిమా బంపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మొదటి రోజే ఈ సినిమాకు రూ. 10.05 కోట్లు వచ్చినట్లు సినిమా వర్గాలు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపాయి. సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ కావడం, కొన్నిచోట్ల ఏకంగా కేబుల్ టీవీలో కూడా ప్రసారం చేయడం.. ఇలాంటి సవాలక్ష అడ్డంకులు ఎదురైనా, మంచి కలెక్షన్లు సాధించి, సినిమాలో దమ్ముందని నిరూపించింది. పంజాబ్‌లో పెరిగిపోతున్న డ్రగ్ కల్చర్ మీద ఈ సినిమా తీశారు. దీనిలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఏకంగా 89 కట్లు పెట్టాలని సీబీఎఫ్సీ సూచించింది. అయితే, సినిమా దర్శక నిర్మాతలు దీనిపై బాంబే హైకోర్టుకు వెళ్లడంతో కేవలం ఒకే ఒక్క కట్‌తో సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హీరోయిన్ ఆలియాభట్ నటనకు ఈ సినిమాలు నూరుశాతం మార్కులు పడ్డాయి. -
హీరోయిన్ నటన మూవీకి హైలైట్..
ముంబై: తీవ్ర విమర్శలు, వివాదాల నడుమ విడుదలైన చిత్రం 'ఉడ్తా పంజాబ్'. నలుగురు వ్యక్తుల జీవితాలను కథాంశంగా చూపిస్తూ, పంజాబ్ లో డ్రగ్స్ మాఫియా ఏ స్థాయిలో ఉందన్న విషయాలను దర్శకుడు అభిషేక్ చౌబే తెరకెక్కించారు. వలస కూలీ పాత్రలో ఆలియా భట్ నటన సినిమాకు హైలైట్ గా చెప్పవచ్చు. ఆలియా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంటుందని ఉడ్తా పంజాబ్ లో పంజాబీ రాక్ స్టార్ టామీ సింగ్ పాత్రలో కనిపించిన షాహిద్ కపూర్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మూవీతో మీరు జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నారా అన్న మీడియా ప్రశ్నకు బదులుగా.. గతేడాది హైదర్ విషయంలో ఇలాగే అనుకున్నాను. ఎన్నో అంచనాలు పెట్టుకున్నా అవార్డు రాలేదు. దీంతో ఈసారి అలాంటి ఆలోచనలు లేవని షాహిద్ చెప్పాడు. ఒకప్పుడు హాకీ ప్లేయర్ అయిన ఆలియా భట్ (పింకీ) అనుకోని పరిస్థితుల్లో పంజాబ్‌కు కూలీగా వలస వెళ్తుంది. మాదకద్రవ్యాల వలలో పడిపోయి ఎన్నో కష్టాలు పడుతుంది. తొలిసారి డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించిన ఆలియా, ఈసారి అందంతో కాకుండా అభినయంతో మ్యాజిక్ చేసింది. ఆలియాకు అవార్డు రావడం ఖాయమని షాహిద్ మరోసారి పేర్కొన్నాడు. ఇందులో చాలా క్లిష్టమైన పాత్రలో కనిపించానని, ఇలాంటి పాత్ర తనకు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆలియా అంటోంది. -
రిలీజ్ రోజే కేబుల్ టీవీలో..!
బాలీవుడ్ కాంట్రవర్సీయల్ మూవీ ఉడ్తా పంజాబ్‌కు కష్టాలు తీరేలా లేవు. ముందు సెన్సార్ సమస్య తరువాత కోర్టు వివాదం.. ఇలా ఒక్కో సమస్య నుంచి బయటపడిన ఈ సినిమాకు ఇప్పుడు పైరసీతో భారీ దెబ్బ తగిలింది. సినిమా రిలీజ్‌కు ముందే ఆన్లైన్లో పూర్తి సినిమా పెట్టేయడంతో నిర్మాతలు తల పట్టుకున్నారు. పైరసీపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా, ఆన్లైన్లో సినిమా సర్క్యులేట్ అవ్వటాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. తాజాగా పుదుచ్చెరిలో జరిగిన సంఘటన సినీ వర్గాలకు షాక్ ఇచ్చింది. పుదుచ్చెరిలో లోకల్‌గా నడుస్తున్న కేబుల్ ఛానల్ శక్తి టివిలో ఉడ్తా పంజాబ్ పైరసీ వర్షన్‌ను ప్రసారం చేశారు. పూర్తి సినిమా టెలికాస్ట్ అవ్వటంతో ఆ ప్రాంతంలో సినిమా కలెక్షన్లకు భారీ దెబ్బపడింది. ఈ విషయాన్ని ఫోటోతో సహా తమిళ హీరో సూర్య తన ట్విట్టర్లో పోస్ట్ చేయటంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా పైరసీ అయిన దగ్గరనుంచి చిత్ర నిర్మాతలతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఎంతగా ప్రచారం చేస్తున్నా, పైరసీని మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికైన పైరసీ చేసిన వారిని శిక్షించడానికి కఠిన చట్టాలను ఏర్పాటు చేయాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నారు. Fight against Piracy!!Spread awareness that it's a crime!! Yet to release film #killpiracysavecinema #itsnowornever pic.twitter.com/igs2phGX03 — Suriya Sivakumar (@Suriya_offl) 16 June 2016 -
ప్లీజ్.. ఈ సినిమాను ఆన్లైన్లో చూడకండి
ముంబై: బాలీవుడ్ తాజా చిత్రం ఉడ్తా పంజాబ్‌కు అద్భుతంగా ఉందని నటి కత్రినా కైఫ్ ప్రశంసించింది. గురువారం రాత్రి కత్రినా ఈ సినిమా స్పెషల్ షో చూసింది. కాగా ఈ సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ కావడం బాధాకరమని చెప్పింది. అభిమానులు ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని, ఆన్లైన్లో చూడవద్దంటూ కత్రినా కోరింది. ఉడ్తా పంజాబ్‌లో షాహిద్ కపూర్, అలియా భట్ అద్భుతంగా నటించారని కత్రిన కితాబిచ్చింది. ఈ సినిమా చాలా బాగుందని, దర్శకుడు ఎంచుకున్న కథకు న్యాయం చేశాడని చెప్పింది. ఈ సినిమాలో షాహిద్ రాక్ స్టార్‌గా నటించగా, అలియా బిహార్ నుంచి వలసవచ్చి హాకీ క్రీడాకారిణిగా ఎదగాలన్న యువతిగా నటించింది. ఈ సినిమా విడుదల విషయంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 89 కట్లు వేయగా, చిత్ర బృందం హైకోర్టును ఆశ్రయించింది. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఒకే కట్‌తో ఈ సినిమా విడుదలైంది. -
పరాటా కంటే వేగంగా.. మెక్సీకో కన్నా క్రూరంగా
టైటిల్: ఉడ్తా పంజాబ్ జానర్: క్రైమ్ థ్రిల్లర్ డైరెక్టర్: అభిషేక్ చౌబే ప్రొడ్యూసర్: శోభా కపూర్, ఏక్తా కపూర్, అనురాగ్ కాశ్యప్ డైలాగ్స్: సందీప్ శర్మ స్క్రీన్ ప్లే: సందీప్ శర్మ, అభిషేక్ చౌబే నటీనటులు: షాహిద్ కపూర్, ఆలియా భట్, కరీనా కపూర్, దల్జీత్ దోసాంగ్ తదితరులు సంగీతం: అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్: బెనెడిక్ట్ టేలర్, నరేన్ చంద్రవర్కార్ సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి నిడివి: 2గంటల 19 నిమిషాలు విడుదల: జూన్ 17, 2016 ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలనుకున్న గ్రీకు వీరుడి నుంచి అరబ్బులు, టర్క్‌లు, ఇరానియన్లు, ఆఫ్ఘన్లు, మొఘలుల వరకు భారత్ లోకి ప్రవేశించాలంటే మొదట పంజాబ్ ను దాటి రావాలి. కానీ అదే అసలుసిసలు సమస్య. ఇండియాకు సంబంధించి మొదటి యుద్ధభూమిగా పేరుగాంచిన పంజాబ్.. పోరాట పటిమకు మరో పేరు. అందుకే యుద్ధరంగంలో ఆరితేరిన, మృత్యువుకు వెరవకుండా పోరాడిన లక్షలాది పంజాబీ వీరుల గాథలు చరిత్ర పొడవునా వినిపిస్తాయి.. వినిపిస్తున్నాయి. ఐదు(పంచ) నదులు ప్రవహిస్తూ పైకి సస్యశామలంగా కనిపించే పంజాబ్ నేడు ఎదుర్కొంటోన్న భీకర సమస్యకు తెర రూపమే 'ఉడ్తా పంజాబ్' సినిమా. కథ ఏంటి? పంజ్ అంటే ఐదు. ఆబ్ అంటే నీరు. ఐదు నీటి ప్రవాహాల(నదుల) సమాహారమే పంజాబ్. ఇక ఉడ్తా పంజాబ్.. నాలుగు కథల సమాహారం. పంజాబీ రాక్ స్టార్ టామీ సింగ్ (షాహిద్ కపూర్), బిహారీ వలస కూలీ కుమారి పింకీ (ఆలియా భట్), పోలీస్ అధికారి సర్తాజ్ (దిల్జిత్), వైద్యురాలు ప్రీత్ (కరీనా కపూర్) ల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల దృశ్యరూపం. ఒకరికొకరు ఏమాత్రం సంబంధంలేని ఈ నలుగురూ మాదకద్రవ్యాలతో సంబంధం ఉన్నవారే. యూత్ ఐకాన్ గా పేరుతెచ్చుకున్న టామీ.. డ్రగ్స్ తీసుకుంటే తప్ప పాటలు పాడలేడు. ఒకప్పుడు హాకీ ప్లేయర్ అయిన పింకీ, అనుకోని పరిస్థితుల్లో పంజాబ్ కు కూలీగా వలసవెళ్లి మాదకద్రవ్యాల వలలో పడిపోతుంది. పొలీస్ అయి ఉండీ కించిత్ సంకోచం లేకుండా డ్రగ్స్ మాఫియా నుంచి లంచాలు తీసుకునే సర్తాజ్.. చివరికి ఆ డ్రగ్స్ వల్లే తన సోదరుణ్ణి కోల్పోతాడు. డ్రగ్స్ బారినపడి సర్వం కోల్పోయి రిహ్యాబిలిటేషన్ సెంటర్ లో చేరిన వారికి సపర్యలు చేస్తూ, మాదకద్రవ్యాల సరఫరాపై తనదైన శైలిలో పోరాడుతుంది డాక్టర్ ప్రీత్. వీరి జీవితాల్లోని ప్రతి అంకం డ్రగ్స్ తో ముడిపడి ఉన్నదే. డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న టామీ సింగ్, పింకీలు ఆ చిక్కుముడులను తెంచుకుని ఉడ్తా పంఛీ(స్వేచ్ఛగా ఎగిరే పక్షి)లుగా మారతారా? లంచగొండి సర్తాజ్ నిజాయితీ పరుడిగా మారతాడా? మహమ్మారి బారిన పడినవారిని కాపాడే క్రమంలో డాక్టర్ ప్రీత్ విజయం సాధిస్తుందా? అనే ప్రశ్నలకు తెరపైనే సమాధానాలు కనిపిస్తాయి. ఎలా తీశారు? 'ఉడ్తా పంజాబ్' రెగ్యులర్ మూవీ కాదనే విషయాన్ని గుర్తుకు తెచ్చేలా సినిమా మొత్తాన్ని డాక్యుమెంటరీలా తీశాడు దర్శకుడు అభిషేక్ చౌబే. అయితే ఎంచుకున్న విషయం సమకాలీన సమస్య కావడంతో సీన్లన్నీ రియలిస్టిక్ గా, వాస్తవ ప్రతిబింబాలుగా కనిపిస్తాయి. నిజానికి ఉడ్తా పంజాబ్ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. సుదీప్ శర్మతో కలిసి రాసుకున్న స్క్రిప్టును అచ్చుగుద్దినట్లు తెరకెక్కించడంతో అభిషేక్ చుబే విజయం సాధించాడు. వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయనడానికి ఈ సినిమాపై చెలరేగిన వివాదాలే నిదర్శనం. నటీనటులు అందరిలోకి ఆలియా భట్ అద్భుతంగా అమరింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పింకీ పాత్రలో ఆమె నటనను మెచ్చుకోనివారుండరు. రాక్ స్టార్ గా, డ్రగ్స్ బానిసగా షాహిద్ సైతం అదరగొట్టినా ఎక్కువ మార్కులు పడేది ఆలియాకే. దల్జిత్, కరీనాలు పాత్రల్లో జీవించారు. డైలాగ్స్ అన్నీ పంజాబీలో ఉండటం వల్ల వాటిని అర్థం చేసుకోవడం కష్టమే అయినా సబ్ టైటిల్స్ ఆ కష్టాన్ని తేలికచేశాయి. కొసమెరుపు: పాకిస్థాన్ నుంచో, ఆ పక్కనున్న అఫ్ఘానిస్థాన్ నుంచో, మరో ప్రాంతం నుంచో పంజాబ్ కు మాదకద్రవ్యాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అక్కడి దాబాలో పరాటాల కంటే వేగంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. అవి.. పంజాబ్ ను మెక్సికో కన్నా క్రూరమైన ప్రాంతంగా మర్చుతున్నాయి. ఇది కాదనలేని నిజం. ఆ వాస్తవ దృశ్యమే 'ఉడ్తా పంజాబ్'. -
‘ఉడ్తా పంజాబ్’కు ఓకే
‘స్టే’కు సుప్రీంకోర్టు, పంజాబ్ - హరియాణా హైకోర్టు తిరస్కృతి చండీగఢ్: సెన్సార్షిప్ వివాదంలో చిక్కుకున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు అన్ని అడ్డంకులూ తొలిగాయి. ఈ సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు, పంజాబ్-హరియాణా హైకోర్టులు నిరాకరించాయి. దీంతో డ్రగ్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా.. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. దీని విడుదలపై స్టే విధించాలని హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమనిస్పష్టం చేసింది.దీనిపై పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ ఉందని పేర్కొంది. హైకోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. అలాగే ఈ చిత్రం విడుదలకు వ్యతిరేకంగా మరో పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలైంది. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ సినిమా ఆన్లైన్లో లీక్ కావడంపై సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ మండిపడ్డారు. పైరసీ కాపీ వివిధ టోరెంట్ వెబ్సైట్లలో దర్శనమిచ్చింది. ఇందులో ‘ఫర్ సెన్సార్’ అని ఉండటంతో లీక్‌లో సెన్సార్ బోర్డుకు ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ఆన్లైన్ లీక్‌కు సంబంధించి వచ్చిన వార్తలను సీబీఎఫ్సీ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ తోసిపుచ్చారు. -
అన్నీ ఓకే.. ఇక రేపే విడుదల
అన్ని రకాల అడ్డంకులను తొలగించుకున్న ఉడ్తా పంజాబ్ సినిమా శుక్రవారం నాడు విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా, అందుకు నిరాకరించిన న్యాయస్థానం.. పంజాబ్ హర్యానా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. అక్కడ కూడా సినిమా విడుదలకు న్యాయమూర్తులు ఓకే చెప్పడంతో... ఇక థియేటర్లను తాకేందుకు సిద్ధమైంది. అయితే.. విడుదలకు ముందే టోరెంట్లలో ఈ సినిమా లీక్ అయిపోవడంతో కాస్త నిరాశ అనిపించినా, అసలైన సినిమా మజాను ఆస్వాదించేవాళ్లు మాత్రం థియేటర్లకు వస్తారని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ సినిమా పంజాబ్‌లో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ నేపథ్యంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 2వేల స్క్రీన్లలో ఇది విడుదల అవుతోంది. సినమాకు ప్రీ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయంటున్నారు. నిజానికి సెన్సార్ వివాదం వల్లే సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసిందని, శుక్ర - శని వారాల షోలకు సగం టికెట్లు అయిపోయాయని సినిపోలిస్ ఇండియా డైరెక్టర్ దేవాంగ్ సంపత్ తెలిపారు. ఓపెనింగ్ రోజునే సినిమాకు కనీసం రూ. 15-20 కోట్ల వరకు రావొచ్చని సినిమా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ తడానీ చెప్పారు. -
వాక్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇద్దాం: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ వాక్ స్వాతంత్ర్యంపై మాట్లాడాడు. ఉడ్తా పంజాబ్ సినిమా విడుదలకు ముందే టోరెంట్ సైట్లలో లీక్ కావడంపై పరోక్షంగా మండిపడ్డాడు. ఆ సినిమాను కేవలం థియేటర్లలోనే చూడాలని పిలుపునిచ్చాడు. పైరేట్లు, పైరసీ విజయం సాధించకుండా మనమంతా చూడాలని చెప్పాడు. ఉడ్తా పంజాబ్ సినిమాకు సీబీఎఫ్సీ భారీమొత్తంలో కట్లు పెట్టగా, బాంబే హైకోర్టు దానికి చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, విడుదలకు ముందుగానే ఆ సినిమా టోరెంట్ సైట్లలో లీకైపోయింది. సెన్సార్ కోసం ఇచ్చిన సినిమా ప్రింటే ఆన్లైన్లో లీకైందని అంటున్నారు. దానిమీద 'ఫర్ సెన్సార్' అనే స్టాంపు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమిర్ స్పందించాడు. Let's support free speech. Let's watch Udta Punjab only in theatres. Don't let pirates and piracy win. Love. a. — Aamir Khan (@aamir_khan) 16 June 2016 -
సుప్రీంకు చేరిన ఉడ్తా పంజాబ్ వివాదం
న్యూఢిల్లీ: అనేక మలుపుల మధ్య 'ఉడ్తా పంజాబ్' వివాదం చిట్టచివరకు సుప్రీంకోర్టుకు చేరింది. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ పంజాబ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశ ఉంది. ఉడ్తా పంజాబ్ సినిమాలో ఒక్క సీన్ మాత్రమే కట్ చేసి, విడుదలకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న డ్రగ్ కల్చర్ మీద తీసిన ఉడ్తా పంజాబ్ విడుదలకు ముందే లీక్ అయింది. సినిమా మొత్తం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు సెన్సార్ సభ్యులే ఈ సినిమాను లీక్ చేసినట్లు చిత్ర నిర్మాత ఆరోపిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్ని అడ్డంకులు తొలగిపోతే ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. -
'ఉడ్తా పంజాబ్' లీక్.. లీకు వీరులు సెన్సార్ బోర్డేనా?
ముంబై పోయి పోయి సెన్సార్ బోర్డుతో పెట్టుకుంటే మాటలా మరి... వాళ్లు ఏమైనా చేయగలరు. చివరకు విడుదల కాక ముందే సినిమాను టోరెంట్లలో లీక్ కూడా చేయగలరు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. చివరకు కోర్టు ద్వారా విడుదలకు గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్న 'ఉడ్తా పంజాబ్' చిత్ర యూనిట్ ఇప్పుడు తల పట్టుకుంటోంది. ఏయే టోరెంట్లలో తమ సినిమా లింకులు ఉన్నాయో వెతుక్కుని మరీ డిలీట్ చేయిస్తోంది. విషయం ఏమిటంటే... పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న డ్రగ్ కల్చర్ మీద తీసిన సంచలనాత్మక చిత్రం 'ఉడ్తా పంజాబ్' విడుదలకు ముందే టోరెంట్లలో లీకైంది. అయితే.. లీకు చేసింది సాక్షాత్తు సీబీఎఫ్‌సీకి సంబంధించిన వాళ్లేనని అంటున్నారు. ఎందుకంటే, లీకైన సినిమా ప్రింటు చూసినప్పుడు దాని మీద 'ఫర్ సెన్సార్' అని ముద్ర కనిపించడంతో పాటు.. దానికి సంబంధించిన డేట్ స్టాంప్ కూడా ఉందట. అంటే, తాము సెన్సార్ చేయడానికి ఇచ్చిన ప్రింటును యథాతథంగా లీక్ చేసేశారని ఆరోపిస్తున్నారు. దాదాపు రెండు గంటల 20 నిమిషాల నిడివి కలిగిన మూవీ లీకైంది. దీనిపై మూవీ యూనిట్‌ను ప్రశ్నించగా వారు అధికారికంగా స్పందించలేదు. సినిమాను సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు 90కి పైగా కట్లు సూచించింది. అయితే, ఈ విషయంపై కోర్టుకెళ్లిన యూనిట్ ఒక కట్ తో 'ఏ' సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. -
ఉడ్తా పంజాబ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: ఉడ్తా పంజాబ్ చిత్రంపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమాలో కేవలం ఒక్క సీన్‌ను మాత్రమే కట్ చేసి, విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ స్వచ్ఛంద సంస్థ ఇవాళ ఉన్నత ధర్మాసనం తలుపు తట్టింది. ఉడ్తా పంజాబ్‌లో డ్రగ్స్ వాడకం అధికంగా ఉందని చూపడంతో పాటు, పంజాబ్‌లో పేదరికాన్ని ఎత్తి చూపుతున్నట్లు ఉందని తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తక్షణమే విచారణ జరపాలని స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అయితే పిటిషన్‌పై పూర్తి వివరాలతో రావాలని కోర్టు సూచించింది. కాగా ఉడ్తా పంజాబ్ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ప్రతిపాదించిన 89 కత్తిరింపులు చెల్లవని హైకోర్టు తీర్పునివ్వడంతోపాటు 48 గంటల్లోగా దానికి సర్టిఫికెట్ అందించాలని సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు అనేక అడ్డంకులను దాటుకంటూ ఉడ్తా పంజాబ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకు రానుంది. కాగా ఉడ్తా పంజాబ్ సినిమాకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రోమోలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ..చిత్ర దర్శక, నిర్మాతలను ఆదేశించింది. -
కర్రపెత్తనం ‘సెన్సార్’
ఎట్టకేలకు ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం సెన్సార్ శృంఖలాలను తెంచుకుంది. ఆ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ప్రతిపాదించిన 89 కత్తిరింపులు చెల్లవని బొంబాయి హైకోర్టు తీర్పునివ్వడంతోపాటు 48 గంటల్లోగా దానికి సర్టిఫికెట్ అందించాలని ఇచ్చిన ఆదేశాలు సంస్థ నిర్వాహకులకు చెంపపెట్టు. దేన్నయినా నిషేధించాలన్నా, దేనికైనా అభ్యంతరం చెప్పాలన్నా, పెత్తనం చలా యించి అందరినీ హడలెత్తించాలన్నా చాలామందికి సరదా. పేరు వేరైనా, నిర్వర్తిం చాల్సిన బాధ్యతలు భిన్నమైనా జనం నోళ్లలో ‘సెన్సార్ బోర్డు’గా స్థిరపడిపోయింది గనుక సినిమాలను ఎడాపెడా కత్తిరించుకుంటూ పోదామని సీబీఎఫ్సీ సభ్యులు అనుకుంటున్నారు. ఎవరైనా ఎదురుతిరిగినప్పుడూ, పోరాడినప్పుడూ... న్యాయ స్థానాల్లో ప్రశ్నించినప్పుడూ తప్ప ఇది అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది. నిజానికిది పుట్టుకతో వచ్చిన బుద్ధి. ఈ దేశంలో 1920లో సినిమాటోగ్రాఫ్ చట్టం అమలుకావడం ప్రారంభమయ్యాక అప్పటి ప్రధాన నగరాలైన మద్రాస్, బొంబాయి, కలకత్తా, లాహోర్, రంగూన్‌లలో సెన్సార్ బోర్డులు ఏర్పాటయ్యాయి. వాటికి మొదట్లో పోలీస్ చీఫ్‌లే నేతృత్వం వహించారు. స్వాతంత్య్రానంతరం సెన్సార్ బోర్డు పేరూ మారింది. దాని రూపురేఖలూ మారాయి. కానీ దాని ‘పోలీస్ మనస్తత్వం’ మాత్రం అలాగే ఉండిపోయింది. తమ ముందుకొచ్చిన ప్రతి చిత్రాన్ని అనుమానించడం, దానివల్ల సమాజానికెదో కీడు జరుగుతుందని శంకించడం... తమ కత్తెర్లకు పని చెప్పడం సెన్సార్ బోర్డు సభ్యులకు అలవాటైపోయింది. ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు గంగలో కలుస్తున్నాయని, కళాత్మక విలువలకు తీరని అన్యాయం జరుగుతున్నదని వారు గుర్తించలేకపోతు న్నారు. మీరు చేస్తున్న పనికీ, మీకు అప్పగించిన బాధ్యతలకూ పొంతన ఉండటం లేదని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు చీవాట్లు పెట్టాయి. కానీ మారిందేమీ లేదు. పాలకులు కూడా ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుంటున్నారు. సీబీఎఫ్సీలో సాగుతున్న అరాచకాన్ని కొనసాగనిస్తున్నారు. దాని నిర్వహణ తీరు బాగులేదను కుంటే జోక్యం చేసుకుని సరిచేయడం ప్రభుత్వాలకు పెద్ద కష్టం కాదు. కానీ ఆ పని చేయడానికి అవి సిద్ధపడటం లేదు. తమ సన్నిహితులతో సీబీఎఫ్‌సీని నింపడం అలవాటైపోయింది. అలా నియామకమయ్యేవారిలో అప్పుడప్పుడు నిష్ణాతులైన వారు కూడా ఉంటున్నారన్నది నిజమే అయినా సీబీఎఫ్సీకంటూ శాశ్వతమైన, ఉన్నతమైన విధానాలను రూపొందించడంలో ఎవరూ శ్రద్ధపెట్టలేదు. ఈ విష యంలో షర్మిలా టాగోర్ లాంటివారు కొన్ని చర్యలు తీసుకున్నారు. పహ్లాజ్ కూడా సినిమా రంగంలో అనుభవశాలే. కానీ నిరుడు జనవరిలో సీబీఎఫ్సీ చీఫ్ అయ్యాక ఆయన వరసబెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అంద రినీ దిగ్భ్రాంతిపరుస్తున్నాయి. నిషేధ పదాల జాబితా ఒకటి విడుదల చేసి, వాటిని ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రాల్లో కూడా అనుమతించేది లేదని ప్రకటించినప్పుడు...‘ఏ’ సర్టిఫికెట్ చిత్రాలను చానెళ్లలో ప్రసారం చేయాలంటే మరిన్ని కోతలకు సిద్ధపడి వాటికి ‘యూ’ లేదా ‘యూఏ’ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని హుకుం జారీ చేసినప్పుడు పెద్ద కలకలం చెలరేగింది. ఆ అంశాల్లో సెన్సార్‌బోర్డు సభ్యుల మధ్య వాగ్యుద్ధమే నడిచింది. కానీ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అనురాగ్ కశ్యప్ మనకున్న కొద్దిమంది సృజనాత్మక దర్శకుల్లో ఒకరు. ధన్‌బాద్ బొగ్గు గని మాఫియా కార్యకలాపాలు ఇతివృత్తంగా వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, 1993నాటి ముంబై పేలుళ్ల నేపథ్యంతో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’వంటి చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ‘ఉడ్తా పంజాబ్’ కూడా మాదకద్రవ్యాల సమస్యపై నిర్మించిన చిత్రం. పంజాబ్ యువతపైనా, సమాజంపైనా మాదకద్రవ్యాలు కలిగిస్తున్న దుష్పరిణామాలను అది చర్చించింది. ఆ సినిమాపై నిహలానీ తన పరిధులు దాటారు. రాజకీయ నేతలా ఆలోచించారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఎన్నికల్లో పాలకపక్షం విజయావకాశాలను ఈ చిత్రం ప్రభావితం చేస్తుందని అనుకున్నారు. అందుకే చిత్రం పేరులోగానీ, సంభాషణల్లోగానీ పంజాబ్ పేరు రావడానికే వీల్లేదని శాసించారు. ఇలాంటి సమస్య ఈ పుణ్యభూమిలో లేదని ఆయన భావన కాబోలు! ఫలితంగా చిత్రానికి మొత్తం 89 కోతలుపడ్డాయి. నిహలానీ లాంటివారుంటే ‘మదర్ ఇండియా’, ‘చాందినీ చౌక్’, ‘బొంబాయి’వంటి చిత్రాలు వెలుగు చూసేవే కాదన్నమాట. మన దేశంలోని సినిమాలు ఇటీవల ఊహాలోక విహారాన్ని తగ్గించు కున్నాయని... సామాజిక సమస్యలపై దృష్టిసారిస్తున్నాయని చాలామంది భావిస్తు న్నారు. ఇదొక మంచి పరిణామమని అనుకుంటున్నారు. కానీ పహ్లాజ్ తీరు వేరేగా ఉంది. వాస్తవం నుంచి సినిమా ఎంతగా పారిపోతే అంత ఉత్తమమని ఆయన విశ్వసిస్తున్నారు. పాత్రోచిత సంభాషణలు, ఉద్వేగాలు కనబడకూడదని... ఏ రాష్ట్రం పేరూ, ప్రాంతం పేరూ వినబడకూడదని శాసిస్తున్నారు. సినిమాలన్నీ ‘పంచ తంత్రం’తరహాలో ఉండాలన్నది ఆయన ఉద్దేశమేమో! ఇలాంటి ధోరణులను కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోరాదు. ఇప్పటికే సీబీఎఫ్సీ ప్రక్షాళన కోసం శ్యాంబెనెగల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఆ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికపై తదుపరి చర్యలు ప్రారంభించాలి. ‘ఉడ్తా పంజాబ్’ కేసులో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా సీబీఎఫ్‌సీని చక్కదిద్దాలి. స్వతంత్రంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో అది పనిచేసేలా అవసరమైన మార్పులు చేయాలి. బొంబాయి హైకోర్టు చెప్పినట్టు అది అమ్మమ్మ మాదిరిగా ప్రవర్తించడం విరమించుకుంటే... సినిమా తీసేవారిని ఆకతాయిలుగా భావించడం మానుకుంటే సృజనాత్మకత బతికిబట్ట కడుతుంది. ప్రపంచ దేశాల్లో మన పరువు నిలబడుతుంది. సెన్సార్షిప్, సమాజానికి తన పైన తనకు నమ్మకం లేకపోవడాన్ని వ్యక్తం చేస్తుంది. - పోటర్ స్టీవర్ట్ అమెరికన్ కమెడియన్ -
'ఎవరి ఓటమి, గెలుపు కాదు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై బాంబే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీ తెలిపారు. కోర్టు తీర్పుకు కట్టుబడతానని, న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. ఒక్క కట్ తో రెండు రోజుల్లో 'ఉడ్తా పంజాబ్' సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇది ఎవరి ఓటమి, గెలుపు కాదని వ్యాఖ్యానించారు. సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా తన పని తాను చేశానని అన్నారు. సెన్సార్ బోర్డు నిర్ణయాలపై కోర్టును ఆశ్రయించే హక్కు ప్రతి నిర్మాతకు ఉందని తెలిపారు. తమకు పెద్ద ఎత్తున మద్దతు రావడం పట్ల 'ఉడ్తా పంజాబ్' సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ, ప్రజలు, మీడియా నుంచి ఊహించని మద్దతు లభించిందని అన్నారు. -
ఒక్క కట్‌తో ఉడ్తా పంజాబ్‌కు హైకోర్టు ఓకే
ఉడ్తా పంజాబ్ సినిమా న్యాయ పోరాటానికి ఫలితం లభించింది. రెండు రోజుల్లో సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలన్న సీబీఎఫ్సీ డిమాండును హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు నిర్ణయంతో తమకు పెద్ద ఊరట కలిగిందని, సినిమాను షెడ్యూల్డు సమయానికే విడుదల చేయాలని చూస్తున్నామని చిత్ర దర్శకుడు అభిషేక్ చౌబే తెలిపారు. ఇది కేవలం తమకు మాత్రమే కాక మొత్తం సినీ పరిశ్రమకే మంచి తీర్పు అని సినిమా సహ నిర్మాత మధు మంతెన వర్మ అన్నారు. తాము కేవలం ఒక్క సీన్ మాత్రమే కట్ చేయాల్సి ఉంటుందని, ఈ తీర్పుతో ప్రజాస్వామ్యం నిలబడినట్లయిందని అనురాగ్ కశ్యప్ తరఫు న్యాయవాది అన్నారు. అంతకుముందు సీబీఎఫ్సీ సూచించిన అన్ని కట్లను హైకోర్టు పరిశీలించి ఒక్కొక్క దానిపై వ్యాఖ్యానించింది. సీబీఎఫ్సీ సూచించిన 8వ కట్ ఏమాత్రం అక్కర్లేదని, కేవలం ఒక వ్యక్తి డ్రగ్స్ ఇంజక్షన్ తీసుకుంటున్న క్లోజప్ షాట్ వల్ల నియమాలను ఉల్లంఘించినట్లు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఏడో కట్ కూడా అక్కర్లేదని, మూడో పాటలో గోకుతున్న సీన్‌ను తీయక్కర్లేదని స్పష్టం చేసింది. పంజాబ్ హరిత విప్లవ భూమి అని, కేవలం ఒక్క వాక్యం వల్ల (జమీన్ బంజర్ తే ఔలాద్ కంజర్) ఆ ఇమేజికి ఎలాంటి భంగం వాటిల్లదని తెలిపింది. ఇక టామీ సింగ్ జనం ఎదురుగా మూత్రవిసర్జన చేస్తున్న సీన్ అవసరం లేదన్న హైకోర్టు.. ఆ సీన్‌ను సినిమాలోంచి తీసేయాలని తెలిపింది. -
పంజాబ్‌పై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్య
జలంధర్: పంజాబ్‌లో అత్యంత తేలికైనది డ్రగ్స్ వ్యాపారమేనని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఒక్క నెలలోనే రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తానని ఆయన చెప్పారు. పంజాబ్ లో పెరిగి పోయిన మత్తపదార్థాల వినియోగం, శాంతిభద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాహుల్ నాయకత్వంలో జలంధర్‌లో సోమవారం అతిపెద్ధ ధర్నాకార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని, పంజాబ్ లోని శిరోమణి అకాళీదళ్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఎప్పుడు చూసిన ప్రధాని నరేంద్రమోదీ వ్యాపారాల గురించే మాట్లాడుతారని, అవి కూడా తేలికైన వ్యాపారాల గురించేనని, పంజాబ్ లో అత్యంత తేలికైన వ్యాపారం డ్రగ్స్ అమ్మకాలేనని అన్నారు. 'పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్‌ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే దానికి డ్రగ్స్ మాఫియా నుంచి లబ్ధి చేకూరుతుంది. మేం ఆ సమస్యను పరిష్కరించగలం. అది కూడా ఒక్క నెలలోనే. అందుకోసం మాకు అధికారాన్ని అప్పగించండి. పోలీసులు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాలి. ఆ పని కాంగ్రెస్ చేయగలదు. మోదీగారు ఎప్పుడు వ్యాపారం చేయడంలో సులువైన మార్గాలే చెబుతుంటారు. పంజాబ్ లో తేలికైన బిజెనెస్ డ్రగ్స్' అని రాహుల్ అన్నారు. ఉడ్తా పంజాబ్ చిత్రానికి పెద్ద మొత్తంలో కట్ లు విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ ఆరుగురు ఎలా డిసైడ్ చేస్తారు?
‘‘ఒక తండ్రి, తల్లి... వాళ్లకన్నా ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. ఆ ఇంటి పెద్ద తమ కుటుంబ సభ్యులు ఎలాంటి సినిమాలు చూడాలో? ఏవి చూడకూడదో నిర్ణయిస్తారు. ఆరుగురు వ్యక్తులు ఉన్న ఓ బోర్డ్ కన్నా నిర్ణయం తీసుకోవడంలో కుటుంబ సభ్యులే మిన్న’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. హిందీ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’కి సెన్సార్ బోర్డ్ 89 కట్స్ చెప్పడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. భాషా భేదం లేకుండా ‘ఉడ్తా పంజాబ్’కు మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభా ఎలాంటి సినిమాలు చూడాలో.. ఎలాంటివి చూడకూడదో ఆరుగురు వ్యక్తులు ఎలా నిర్ణయిస్తారు? నా మద్దతు ఎప్పుడూ ఫిలిం మేకర్స్ పక్షానే ఉంటుంది’’ అని రాజమౌళి పేర్కొన్నారు. -
మరో ‘డ్రగ్స్’ సినిమాకు సీబీఎఫ్సీ ఓకే
ముంబై: పంజాబ్ లో మాదకద్రవ్యాల వ్యసనంపై రూపొం దించిన ఉడ్తా పంజాబ్ సినిమాకు 89 కట్స్ చెప్పిన సీబీ ఎఫ్‌సీ, ఇదే అంశంపై తీసిన మరో సిని మాకు మాత్రం అనుమతి ఇచ్చింది. బల్జీత్ సింగ్ రూపొందించిన ఢీ పంజాబ్ ఢీకి ‘క్లీన్ యూ’ ధ్రువపత్రం మంజూరు చేసింది. పంజాబ్‌లో భ్రూణహత్యలు, మాదకద్రవ్యాల వల్ల కలుగుతున్న అనర్థాలపై ఈ సినిమా చర్చిస్తుంది. కాగా, సీబీఎఫ్సీ ఉడ్తా పంజాబ్ సినిమాకు ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఉద్దేశపూర్వకంగానే సీబీఎఫ్సీ అధిపతి పహ్లాజ్ నిహ్లానీ తమ సినిమాను అడ్డుకుంటున్నారంటూ ఉడ్తా పంజాబ్ నిర్మాతలు బాంబే హైకోర్టును ఆదేశించడం తెలిసిందే. దీని పై స్పందించిన కోర్టు సీబీఎఫ్‌సీకి చీవా ట్లు పెట్టింది. ఈ వివాదంపై రేపు (సోమవారం) తీర్పు వెలువడనుంది. -
'బ్రా'లో వల్గర్ ఏముంది: కంగనా
న్యూఢిల్లీ: ఉడ్తా పంజాబ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో చెలరేగిన వివాదంపై నటి కంగనా రనౌత్ స్పందించింది. దేశం ఏం చూడాలో కొద్దిమంది వ్యక్తులు నిర్ణయించలేరని తెలిపింది. మూడుసార్లు జాతీయస్థాయిలో ఉత్తమనటిగా అవార్డు అందుకున్న కంగనా ఉడ్తా పంజాబ్ చిత్ర టీమ్‌కు మద్దతుగా నిలిచింది. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్లు ఏకంగా దాదాపు 90 కట్లు చెప్పడాన్ని విమర్శించింది. 'నేను డైరెక్టర్‌ను కాదు, దర్శక విభాగం గురించి ఎక్కువగా అవగాహన కూడా లేదు. కానీ వృత్తిలో భాగంగా వారిని చాలా దగ్గర నుంచి చూస్తుంటాను. ప్రస్తుత పరిణామాలు వారికి చాలా విసుగు తెప్పించేవిలా ఉన్నాయి' అని కంగనా అన్నారు. క్వీన్ చిత్ర విడుదల సమయంలో డైరెక్ట్ వికాస్ బహల్ తన వద్దకు వచ్చి ఓ సన్నివేశంలోని 'బ్రా'ను బ్లర్ చేస్తున్నట్టుగా చెప్పాడని కంగనా తెలిపింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఆ సన్నివేశంలో ధరించకుండానే ఉన్న 'బ్రా'ను వల్గర్‌గా ఉందని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్లర్ చేయాల్సి వచ్చిందట. ధరించకుండానే ఉన్న మామూలు 'బ్రా'వల్ల సొసైటీకి ఎలాంటి హాని జరగదని.. మహిళల 'బ్రా'లో వల్గర్ ఏముంటుందని సెన్సార్ బోర్డు పై కంగనా మండిపడింది. -
సెన్సారింగ్ మీ పని కాదు
సర్టిఫికేషనే మీ బాధ్యత - సీబీఎఫ్సీపై బాంబే హైకోర్టు మండిపాటు - ఏం చూడాలో ప్రజలను నిర్ణయించుకోనివ్వండి ముంబై: ఉడ్తా పంజాబ్ చిత్రంలో దృశ్యాలను కత్తిరించాలని కేంద్ర ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్సీ) సూచించటంపై ముంబై హైకోర్టు మండిపడింది. చిత్రానికి సర్టిఫికేషన్ ఇవ్వటమే బోర్డు పని అని.. అది వది లేసి సెన్సారింగ్ చేయటం మీ పని కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రం నిజంగానే అభ్యంతరకరంగా, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఉందనుకుంటే.. ఎందుకు దీనిపై నిషేధం విధించలేదో తెలపాలని ఆదేశించింది. ఇదే సమయంలో చిత్ర నిర్మాతలు కూడా బోర్డు సూచించిన అనవసరమైన దృశ్యాలను తొలగించాలని సూచించింది. ప్రజలు ఏం చూడాలనుకుంటున్నారో వారి నే నిర్ణయించుకోనివ్వాలంది. రెండ్రోజులు జరిగిన విచారణను ముగించిన జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, జస్టిస్ శాలిని జోషిల డివిజన్ బెంచ్ సోమవారం తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా సీబీఎఫ్సీ బోర్డుపై కోర్టు మండిపడింది. ‘సర్టిఫికేషన్ ఇవ్వటంలో అతిగా ప్రవర్తిం చొద్దు దీనివల్ల సినిమాల్లోని సృజనాత్మకత చచ్చిపోతుంది. చిత్రంలో పంజాబ్, పంజాబ్‌లోని నగరాల పేర్లను తొలగించాలన్న రివైజింగ్ కమిటీ నివేదిక ప్రకారం ముందుకెళ్తే.. సినిమా అర్థమే మారిపోతుంది. ఓ వ్యక్తి, ఓ ప్రాంతం గురించి నిర్మాతలు విమర్శించాలనుకుంటే దాన్నలాగే చూపించండి. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఉందనిపిస్తే నిషేధించండి’ అని సూచించింది. అనవసర రాద్ధాంతం వల్ల చిత్రానికి అవసరానికి మించిన పబ్లిసిటీ పెంచుతున్నారని తెలిపింది. ‘చిత్ర నిర్మాతలు కూడా అనవసర దృశ్యాలు, అసభ్యపదజాలాన్ని చూపిస్తేనే జనాలకు నచ్చుతుందనుకోవద్దు. నేటి తరం చాలా పరిణతితో ఆలోచిస్తోంది. మంచి కథాంశం లేక ఎన్నో చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోర్లాపడుతున్న విషయాన్ని మరిచిపోవద్దు’ అని సూచించింది. ‘అడల్ట్ విత్ కాషన్’ ఉండాలి: శ్యాంబెనగల్ ముంబై: సినిమాల్లో కేటగిరీల్లో ‘అడల్ట్ విత్ కాషన్’ అనే కేటగిరీ ఉండాల్సిన అవసరం ఉందని సెన్సార్ బోర్డు పనితీరుపై ఏర్పాటైన కమిటీ సారథి దర్శకుడుశ్యామ్ బెనగల్ అభిప్రాయపడ్డారు. పెద్దలకు చెందిన విషయాల తీవ్రత ఎక్కువగా ఉన్న చిత్రాలకు ‘అడల్ట్ విత్ కాషన్’ లేదా ఏ/సీ పేరుతో సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించామన్నారు. అలాగే యూనివర్సల్(యూ)లో ‘యూ/ఏ 12 ప్లస్’, ‘యూ/ఏ 15 ప్లస్’.. ఇలా రెండు కేటగిరీలు ఉండాలని చెప్పామన్నారు. -
మీ పని సెన్సార్ చేయడం కాదు: హైకోర్టు
ఉడ్తా పంజాబ్ సినిమా వివాదంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)పై బాంబే హైకోర్టు తీవ్రంగా మండిపడింది. బోర్డు పని సినిమాలను సర్టిఫై చేయడమే తప్ప సెన్సార్ చేయడం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ సినిమాలో డ్రగ్స్ గురించి మరీ ఎక్కువగా చూపించారనుకుంటే సినిమా మొత్తాన్ని ఎందుకు నిషేధించడం లేదని ప్రశ్నించింది. టీవీ గానీ, సినిమా గానీ.. ఏదైనా ఒక రాష్ట్రాన్ని అవమానించేలా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని, ఆ స్వేచ్ఛను ప్రజలకు ఇవ్వాలని బోర్డుకు సూచించింది. ఉడ్తా పంజాబ్ సినిమాకు 90కి పైగా కట్లు పెట్టడంతోపాటు సినిమా పేరు కూడా మార్చాలని సీబీఎఫ్సీ చెప్పడంతో చిత్ర దర్శక నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే సినిమాలో వాడిన కొన్ని పదాలు, సీన్లు చాలా అసభ్యంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని సీబీఎఫ్సీ వాదించింది. సినిమాలో ఒక కుక్క పేరు జాకీచాన్ అని పెట్టారని.. అది అభ్యంతరకరమని చెప్పింది. ఈ కేసులో వాదనలు ముగిశాయి. తుది తీర్పును ఈనెల 13వ తేదీన వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది. సీబీఎఫ్సీ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ కావలనే తన సినిమాను సర్టిఫై చేయడం లేదని నిర్మాత అనురాగ్ కశ్యప్ ఆరోపించారు. షాహిద్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, దిల్జీత్ దోసంజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో.. ప్రధానంగా పంజాబ్‌లో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ గురించి చర్చించారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 17న విడుదల కావాల్సి ఉంది. -
'ఉడ్తా పంజాబ్‌లో ఆ మాటలకు షాక్ అయ్యా..'
పంజాబ్: ఉడ్తా పంజాబ్ చిత్రంపై తొలిసారి ప్రభుత్వం తరుపున స్పందించారు. ఈ చిత్రంలో కొన్ని మాటలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని పంజాబ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. కొన్ని కులాలను, వ్యవస్థలను తప్పుబట్టేలా ఎన్నో మాటలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా కంజర్, బంజర్ లాంటి పదాలు విని తాను షాక్ అయ్యానని చెప్పారు. ఈ చిత్రానికి అనుమతిని ఇచ్చి ప్రశాంతంగా ఉన్న పంజాబ్ వాతావరణాన్ని ఎలా చెడగొట్టమని అంటారని ప్రశ్నించారు. కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా చాలా సినిమాలు వస్తుంటాయని, అలాంటి చిత్రాల్లో ఇదొకటి అని, దీనిని అనుమతిస్తే పంజాబ్‌లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ స్థానంలో ఉన్న, రాజకీయాల్లో ఉన్నా, ఒక అధికారిగా ఉన్నా లేక మరింకేదైన స్థాయిలో ఉన్నా సరే.. ఒక ఏవగింపు కలిగించేలా, ఒకరిని కించపరిచేలా రూపొందించిన ఒక అంశాన్ని ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న పంజాబ్ సమాజంలోకి ఎలా వదలమని పెట్టమంటారు అని ప్రశ్నించారు. ఈ చిత్రంపై తమకు ఏవిధమైన రాజకీయ కక్ష సాధింపు లేదని అన్నారు. -
ఆ సినిమాకు రాజమౌళి మద్దతు
ఉడ్తా పంజాబ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో చెలరేగిన వివాదంపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించాడు. దేశం ఏం చూడాలో కొద్దిమంది వ్యక్తులు నిర్ణయించలేరని అన్నాడు. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో ఒక్కసారిగా జాతి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి.. ఉడ్తా పంజాబ్ చిత్ర టీమ్‌కు మద్దతుగా నిలిచాడు. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్లు ఏకంగా దాదాపు 90 కట్లు చెప్పడాన్ని విమర్శించాడు. తానుకూడా ఒక దర్శకుడిని కాబట్టి.. దర్శకులకే తన మద్దతు ఉంటుందని చెప్పాడు. ఆరేడుగురు లేదా పదిమంది కూర్చుని మొత్తం జాతికి ఏది మంచో ఏది చెడో ఎలా చెబుతారో ఆలోచించాలని.. ఇది చాలా సింపుల్ లాజిక్ అని రాజమౌళి అన్నాడు. తనకు, తన కుటుంబానికి ఏది మంచో కాదో తాను నిర్ణయించుకోవాలని.. అలాగే తన పిల్లలు ఏం చూడాలో చూడకూడదో నిర్ణయించుకోవచ్చని అంతే తప్ప ఊరందరి విషయం తానొక్కడినే ఎలా నిర్ణయిస్తానని అన్నాడు. 'ఇండియన్ ఆఫ్ ద ఇయర్: ఎంటర్టైన్మెంట్ 2015' అవార్డును అందుకోడానికి రాజమౌళి ఢిల్లీ వచ్చాడు. -
'ముంబైలో నివసించడం మానేశారా?'
'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదం బాలీవుడ్, సెన్సార్ బోర్డు మధ్య చిచ్చు రాజేసింది. సెన్సార్ బోర్డు సినిమాలో మొత్తం 89 సీన్లను కట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు బాలీవుడ్ బాసటగా నిలిచింది. అలానే ఇటు టాలీవుడ్ లో కూడా పలువురు సినీ ప్రముఖులు సెన్సార్ బోర్డు తీరుపై మండి పడుతున్నారు. సినిమా పేరు మార్చాలన్న అంశంపై రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. 'నేను పంజాబీనే. మనం సినిమాని సినిమాలా చూడాలి. సినిమా విడుదల తర్వాత కూడా పంజాబీలు పంజాబ్ లోనే ఉంటారు, రాష్ట్రాన్ని ఇంతకు ముందులానే ప్రేమిస్తారు. ముంబై టెర్రరిజమ్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతమాత్రాన ప్రజలు ముంబైలో నివసించడం మానేశారా' అంటూ ప్రశ్నించారు. నిజంగా సినిమాల్లో అలాంటివేమైనా చూపిస్తే.. అవి ప్రజలకు అవగాహనను కల్పిస్తాయన్నారు. వివాదంపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. సినిమాలు భావ వ్యక్తీకరణ మాధ్యమాలు. మన హక్కును కాపాడుకునేందుకు గొంతు ఎత్తాల్సిందేనన్నారు. సెన్సార్ కు ముందు, తర్వాత అంటూ ఓ హాస్యాస్పదమైన ఫొటోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీరితోపాటు రాఘవేంద్రరావు కోడలు, రచయిత కణిక, హీరో సిద్ధార్థ్, డైరెక్టర్ దేవా కట్ట తదితరులు సోషల్ మీడియా ద్వారా 'ఉడ్తా పంజాబ్' చిత్ర యూనిట్ కు మద్దతుగా నిలిచారు. వాస్తవానికి సినిమా ఈ నెల 17న విడుదల కావాల్సి ఉంది. సినిమాలో ముఖ్యమైన సీన్లను కట్ చేసి సెన్సార్ బోర్డు నియంతలా వ్యవహరిస్తోందని సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందించారు. మొత్తానికి బాలీవుడ్ లో ఈ వివాదం మరింత జటిలంగా మారుతుంది. -
కట్ చేస్తే ... ‘గుండె కోత’ అంటున్న సినీ పరిశ్రమ
హృదయం... అన్నీ కావాలంటుంది! మైండ్... ‘అదెలా కుదురుతుంది’ అంటుంది! ‘సహజంగా ఉంటే చాలు... సహస్రకోటి భావాలకు వ్యక్తీకరణ ఉంటుంది’ అని హృదయం అనుకుంటే... ‘సహజంగా ఉండడానికి మనమేమన్నా పశువులమా, మృగాలమా? సహజం నాట్ ఎలౌడ్ ఇన్ సమాజం’ అని మైండ్ అంటుంది. మనిషికున్న అమూల్యమైన హక్కు - ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛ’. అలాంటి స్వేచ్ఛను వికసింపజేయాలన్నది... హృదయం ఆశ! భావప్రకటనకు కూడా హద్దులు ఉండాలన్నది మైండ్ మాట! హృదయంతో తీస్తున్న సినిమాలను... మైండ్‌తో కోస్తున్న సెన్సార్‌బోర్డ్ వైఖరికి హిందీ సినిమా ‘ఉడ్తా పంజాబ్’ వివాదం తాజా ఉదాహరణ. ‘‘ఇది నాకూ, అక్కడ (సెన్సార్ బోర్డ్‌లో) అధికారంలో కూర్చొని, కొద్దిమంది గొప్పవాళ్ళ చేతిలోని రాజ్యంలా వ్యవహరిస్తున్న ఒక నిరంకుశుడికీ మధ్య జరుగు తున్న పోరు. ఇదంతా చూస్తుంటే, నేను ఏ ఉత్తర కొరియాలోనో ఉన్నట్లుంది.’’- ‘ఉడ్తా పంజాబ్’ చిత్ర సహ నిర్మాత, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక సృజనశీలి కడుపు చించుకొని వచ్చిన ఆవేశం ఇది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పడుతున్న సంకెళ్ళపై సమాజంలోని అనేక మంది సినీ కళాకా రుల ఆక్రందనకు అద్దం ఇది. అవును. సమాజానికి దర్పణం పట్టాల్సిన సినిమాలో, సృజనాత్మక భావ వ్యక్తీకరణకు వేదిక అయిన సినిమాలో... మన చుట్టూ కళ్ళెదురుగా జరుగుతున్నది చూపిస్తే తప్పు అంటే ఆవేదన, ఆవేశం కాక ఏమొస్తాయి? ఇవాళ భారతీయ సినీ ప్రపంచమంతా హిందీ సినిమా ‘ఉడ్తా పంజాబ్’ (కొత్త హుషారుతో ఎగసిపడుతున్న పంజాబ్ అని స్థూలంగా అర్థం) గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటోంది అందుకే! ఈ నెల 17న రిలీజ్ కావాల్సిన ఈ హిందీ సినిమా పంజాబ్‌లో పెచ్చ రిల్లిన డ్రగ్స ఉపద్రవంపై తీసిన సమకాలీన సినిమా. అయితే, అలా తీయ డమే ఇప్పుడు ఇబ్బందిగా తయారైంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెన్సార్ బోర్డ దర్శక, నిర్మాతలకు చుక్కలు చూపడం మొదలుపెట్టింది. దాంతో, దేశంలో ఫిల్మ్ సర్టిఫికేషన్ సైతం రాజకీయ ఒత్తిళ్ళకు అతీతం కాదని మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి, 2015లో పగ్గాలు చేపట్టిన ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలానీ సారథ్యంలోని సెన్సార్‌బోర్‌డపై విమర్శలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఆధునిక జీవితంలో సర్వసాధారణమై పోయిన కొన్ని తిట్లని సైతం సినిమాలో అనుమతించేది లేదంటూ బోర్డ గత ఏడాది ఒక జాబితానే సిద్ధం చేసింది. ఫలానా సినిమా ఏ వయస్సువాళ్ళు చూడచ్చో నిర్దేశిస్తూ, సర్టిఫికెట్ జారీ చేయడమే బాధ్యతగా ఉండాల్సిన సెన్సార్ బోర్డ ‘నైతిక పోలీసింగ్’ చేయసాగింది. సెన్సార్‌వ్యవస్థపై బాగా విమర్శలు రావడంతో కొన్ని నెలల క్రితం దర్శకుడు శ్యావ్‌ుబెనెగల్ సారథ్యంలో ఒక సిఫార్సుల సంఘాన్ని కేంద్రం వేసింది. సినిమాల్ని కట్ చేసి పారేయడం కాక, 12 ఏళ్ళు పైబడిన వాళ్ళకీ, పెద్దలకీ మాత్రమే అంటూ రకరకాల వర్గీకరణ చేయాల్సిందిగా ఆ సంఘం సిఫార్సులూ చేసింది. భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామన్న ప్రభుత్వం ఆ సిఫార్సుల్ని పట్టించుకొన్న పాపాన లేదు. ఇవాళ ‘ఉడ్తా పంజాబ్’పై కత్తెర వేటు దానికి తాజా ఉదాహరణ. సామాజిక ఉపద్రవమైన డ్రగ్స గురించి సినిమాల్లో ప్రస్తావిస్తే తప్పే మిటని అనురాగ్ వాదన. ఆయన మాటల్లో చెప్పాలంటే, ‘‘ఉడ్తా పంజాబ్ ఒక నిజాయతీ సినీ ప్రయత్నం. ఈ సిన్మాను వ్యతిరేకి స్తున్న పార్టీలు, వ్యక్తులు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లే లెక్క!’’ వాస్తవ పరిస్థితులపై అందరి దృష్టీ పడేలా చేసి, జనాన్ని జాగృతం చేసే ప్రయత్నాలకు కత్తెర అడ్డం పెడితే తప్పెవరిది? తీసినవాళ్ళదా? కట్ చేసిన వాళ్ళదా? మీ పిల్లలు డ్రగ్స్ బారినపడ్డారా? ఇవాళ హైదరాబాద్, చెన్నై సహా దేశంలోని అనేక నగరాల్లో, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మత్తుపదార్థాల వినియోగం విచ్చలవిడిగా జరుగుతు న్నట్లు ఆరోపణలున్నాయి. యుక్తవయస్సులోని వారు తెలిసీ తెలియక ఈ ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. అలా ఇరుక్కున్నవారి లక్షణాలు ఎలా ఉంటాయంటే... కళ్ళు ఎర్రబారి ఉంటాయి. కనుపాప సాధారణం కన్నా మరీ చిన్నది, లేదా పెద్దది అయిపోతుంది ముక్కుతో పీల్చే కొకైన్ లాంటి డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు వెంట తరచూ రక్తం కారుతుంటుంది తిండి, నిద్ర అలవాట్లు మారిపోతాయి. అకస్మాత్తుగా బరువు పెరగడమో, తగ్గడమో జరుగుతుంది శ్వాసలోనూ, ఒంటి నుంచి, దుస్తుల నుంచి అసాధారణ వాసనలు వస్తాయి కాళ్ళూ చేతులు వణకడం, మాట నత్తిగా రావడం, మనిషిలో కుదురు లేకపోవడం కనిపిస్తాయి క్లాసులు తరచూ ఎగ్గొడుతుంటారు. ఆటపాటలు, హాబీల మీద ఆసక్తి పోతుంది వినే సంగీతం, వేసుకొనే దుస్తులు, గదిలోని పోస్టర్లపై డ్రగ్స్, మద్యం అలవాట్లను ప్రతిబింబిస్తుంటాయి చటుక్కున మూడ్స్ మారిపోతుంటాయి. తరచూ తగాదాలకు దిగుతుంటారు. ఎవరితోనూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడరు. గది తలుపులు ఎప్పుడూ బిడాయించుకొని, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. సెన్సార్‌తో సమస్యేంటి? ఏం తీసేయమంటోంది? పంజాబ్‌లో కేవలం మరో 9 నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని డ్రగ్స్ ఉపద్రవంపై అభిషేక్ చౌబే దర్శకత్వంలో రూపొందిన ‘ఉడ్తా పంజాబ్’ అధికారపక్షానికి ఇబ్బందికరమైంది. సినిమా గనక అలాగే రిలీజైతే తమకు కష్టమని అధికార ‘శిరోమణి అకాలీదళ్’ (కేంద్రంలో గద్దెపై ఉన్న నేషనల్ డెమోక్రాటిక్ ఎలయన్స్‌లో భాగస్వామ్యపక్షం) సహజంగానే భావించింది. మొదట 40... ఇప్పుడు 89 కట్స్! నిజానికి, మొదట ఈ సినిమాను సెన్సార్‌కు పంపినప్పుడు ‘కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ సంస్థ’ (సి.బి.ఎఫ్.సి. జనం భాషలో ‘సెన్సార్ బోర్డ్’) 40 కట్స్ చేయా లంది. సినిమాలోని భాష, డ్రగ్స్ వినియోగ దృశ్యాలపై ఈ కట్స్ ఇచ్చింది. నిర్మాతలు దీనిపై అప్పీలు చేసుకున్నారు. కట్స్ లేకుండా, ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తారని ఆశించారు. కానీ, సినిమా చూసిన ‘రివైజింగ్ కమిటీ’ (ఆర్.సి) ఏకంగా సినిమా పేరులో ఉన్న ‘పంజాబ్’ అనే పదాన్నే తొలగించమంది. మొత్తం 89 కట్స్ చేయాలంది. పంజాబ్ రాష్ట్రం పేరు, రాజకీయాలు, ఎన్నికల ప్రస్తావన ఎక్కడ వచ్చినా తొలగించాలంది. ‘వాస్తవికతను చూపించడం’ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహలానీకి నచ్చినట్లు లేదు. దాంతో, అసలు ఈ సినిమా కథ అంతా ఏ రాష్ట్రంలోనూ జరిగినట్లు కాకుండా, ఎక్కడో కల్పిత ప్రాంతంలో జరిగినట్లు చూపమని బోర్డ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బోర్డ్ వర్గాలు ఆ వార్తల్ని ఖండిస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేదంటూ, ‘‘మేము కేవలం సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపాం. కావాలంటే, నిర్మాతలు ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ (ఎఫ్.సి.ఎ.టి)ని ఆశ్రయించవచ్చు’’ అంటున్నాయి. సినీ వివాదాలు... నిషేధాలు... మూకీల కాలం నుంచి మన భారతీయ సినిమాకు సెన్సార్ కష్టాలు కొత్తేమీ కాదు. మతం, రాజకీయాలు, సెక్స్ లాంటి అంశాల కారణంగా సినిమాల్లో భావప్రకటన స్వేచ్ఛకు చాలా సార్లు సంకెళ్ళు పడ్డాయి. తెలుగునాట పెద్ద ఎన్టీఆర్ ‘బొబ్బిలి పులి’, ‘శ్రీమద్వి రాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, కృష్ణ ‘అంతం కాదిది ఆరంభం’ సహా పలు చిత్రాలు సెన్సార్ చిక్కులు ఎదుర్కొన్నాయి. విప్లవ చిత్రాల మాదాల రంగారావు ‘విప్లవ శంఖం’, ‘ప్రజాశక్తి’, ‘ఎర్రమట్టి’ లాంటి చిత్రాల రిలీజ్ కోసం సెన్సార్‌బోర్డ్‌తో, ప్రభుత్వంతో పోరాటాలు, నిరాహార దీక్షలు చేయాల్సొచ్చింది. గత 4 దశాబ్దాల్లో వచ్చిన వివాదాల్లో కొన్ని... 1972 ‘సిద్ధార్థ’: పంపిణీ నుంచి నిషేధించిన తొలి చిత్రం. నటి సిమీ గరేవాల్ నగ్న సన్నివేశం కారణం. చివరకు 1996లో టీవీలో రిలీజ్ చేశారు. 1975 ‘ఆంధీ’: ఇందిరా గాంధీతో పోలికలున్నాయంటూ ‘ఎమర్జెన్సీ’ సమయంలో నిషేధించారు. తర్వాత గద్దె నెక్కిన జనతాపార్టీ ప్రభుత్వం రిలీజ్‌కు అనుమతించింది. 1978 ‘కిస్సా కుర్సీ కా’: ‘ఎమర్జెన్సీ’లో సంజయ్ గాంధీ అనుసరించిన విధానాలపై రాజకీయ వ్యంగ్య చిత్రం. సినిమా మాస్టర్ ప్రింట్‌నూ, కాపీలనూ సెన్సార్ బోర్డు నుంచి తీసుకెళ్ళి, కాల్చేశారు. తర్వాత కొంతకాలానికి సినిమా రిలీజైంది. 1994 ‘బ్యాండిట్ క్వీన్’: ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా లేదంటూ మాజీ బందిపోటు రాణి ఫూలన్‌దేవి వాదన. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక నిషేధం. 1996 ‘ఫైర్’: హిందూ కుటుంబంలోని ఆడవారి మధ్య స్వలింగ సంపర్కం గురించి చూపారు. దర్శకురాలు దీపా మెహతాను చంపుతామంటూ బెదిరింపులొచ్చాయి. దాంతో, సెన్సార్ బోర్డ్ తలొగ్గింది. తర్వాత కట్స్ ఏమీ లేకుండానే రిలీజ్. 1996 ‘కామసూత్ర... ఎ టేల్ ఆఫ్ లవ్’: మీరా నాయర్ తీసిన సినిమా. దృశ్యాలు మరీ ‘బాహాటంగా’ ఉన్నా యని వాదన. అన్నీ బాగా తగ్గించేసిన వెర్షన్ రిలీజ్. 2003 ‘పాంచ్’ : 1976 -77 ప్రాంతంలో జరిగిన జోషీ - అభ్యంకర్ వరుస హత్యలపై అనురాగ్ కశ్యప్ తీసిన సినిమా. సెన్సార్‌బోర్డ్ చాలా కట్స్‌తో అనుమతించింది. 2004 ‘బ్లాక్ ఫ్రైడే’: 1993 నాటి బొంబాయి పేలుళ్ళపై తీసిన సినిమా. ప్రభావం చూపుతుందంటూ, తీర్పు వచ్చేదాకా రిలీజ్ ఆపేశారు. ఆనక 2007లో రిలీజ్. 2005 ‘పర్జానియా’: గుజరాత్ అల్లర్లపై సినిమా. నేషనల్అవార్డ్ వచ్చింది. గుజరాత్లో నిషేధించారు. 2005 ‘వాటర్’: వారణాసిలోని వితంతువుల అవస్థపై దీపా మెహతా తీసిన సినిమా. ఛాందసవాదుల విధ్వంసంతో శ్రీలంకలో సిన్మా తీశారు. 2007లో ఇండియాలో రీరిలీజ్. 2013 ‘మద్రాస్ కేఫ్’: రాజీవ్ గాంధీ హత్య, శ్రీలంక అంతర్యుద్ధంలో భారత జోక్యం చుట్టూ తిరిగే సినిమా. తమిళనాట ప్రదర్శించనివ్వలేదు. 2015 ‘ఎం.ఎస్.జి - ది మెసెంజర్ ఆఫ్ గాడ్’: పంజాబ్‌లోని ‘దేరా సచ్చా సౌదా’ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను దేవుడిగా అభివర్ణిస్తూ, ప్రచారం చేసిన సినిమా. పలు సిక్కు వర్గాలు సినిమాను నిషేధించాలని ఆందోళన చేశాయి. 2015 జనవరిలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. తరువాత కొంతకాలానికి కట్స్‌తో ఇచ్చింది. ‘‘ఈ ‘ఉడ్తా పంజాబ్’ సినిమాను నిషేధించే బదులు పంజాబ్ ప్రభుత్వం ‘ఉడ్తా’ (ఎగసిపడుతున్న) డ్రగ్స్‌ను నిషేధించాలి. అది చేతకాకపోతే, వాళ్ళు తమను తాము నిషేధించుకోవాలి!’’ - రామ్‌గోపాల్ వర్మ, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత ‘‘ఈ దేశంలో అత్యంత విలువైన ఆస్తి అయిన భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమేస్తూ, దేశ పురోగతి గురించి ఎంత డబ్బా కొట్టుకొన్నా అది అర్థం లేని పని.’’- మహేశ్‌భట్, ప్రముఖ సినీ దర్శక - నిర్మాత ‘‘నా ఈ పోరాటానికి దూరంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్, ఆప్, ఇతర రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా. ఇది కేవలం నా హక్కులకూ, సెన్సార్‌షిప్‌కూ మధ్య జరుగుతున్న పోరాటం. ... మిగిలినవాళ్ళు వారు పోరాటాలు వారు చేసుకోండి. నా పోరాటానికి ఎలాంటి రాజకీయ రంగులూ పులమద్దు.’’ - అనురాగ్ కశ్యప్, ‘ఉడ్తా పంజాబ్’ సహ-నిర్మాత, ప్రముఖ దర్శక - రచయిత ‘‘సెన్సార్ బోర్డ్ పనిలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ జోక్యం చేసుకోదు. నా మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేదు. సినిమా పూర్తిగా చూస్తే కానీ, మేము ‘పంజాబ్’ అనే పదం ఎందుకు తొలగించ మన్నామో మీకు అర్థం కాదు. ...అనురాగ్ కశ్యప్‌కు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఆయన ‘ఉత్తర కొరియా’ అనీ, మరొకటనీ ఏమైనా అనగలుగుతున్నారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) నుంచి ఆయన డబ్బులు తీసుకున్నట్లు నేను విన్నాను. కేవలం పబ్లిసిటీ కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు.’’ - పహ్లాజ్ నిహలానీ, కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ - ప్రముఖ నిర్మాత -
'సెన్సార్ వివాదంతో సంబంధం లేదు'
న్యూఢిల్లీ: 'ఉడ్తా పంజాబ్' సినిమా సెన్సార్ వివాదంతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా సెన్సార్ బోర్డు వ్యవహరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. 'ఉడ్తా పంజాబ్' సినిమా విడుదల కాకుండా బీజేపీ అడ్డుకుంటుందన్న ఆప్ ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. వివాదాలతోనే ఆప్ మనుగడ సాగిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. 'ఉడ్తా పంజాబ్' సినిమాలో చూపించినట్టుగా పంజాబ్ లో మాదకద్రవ్యాల సమస్యలేదని అన్నారు. సినిమాలో కొన్ని సీన్లు కట్ చేయమని సెన్సార్ బోర్డు చెప్పిందని, నియమనిబంధనలకు అనుగుణంగానే అది వ్యవహరించిందని తెలిపారు. సెన్సార్ బోర్డు మార్గదర్శకాలు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది ఉందన్నారు. -
'క్రియేటివిటీని చంపొద్దు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. సృజనాత్మకతను చంపడానికి ప్రయత్నిచడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. తన తాజా చిత్రం 'టీఈ3ఎన్' సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఉడ్తా పంజాబ్' వివాదంపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు. 'ఈ వివాదం గురించి పూర్తిగా నాకు తెలియదు. దీని గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను. క్రియేటివిటీని చంపడానికి ప్రయత్నం చేయొద్దని నేను చెప్పదల్చుకున్నాను. సృజనాత్మకతను చంపితే ఆత్మను నాశనం చేసినట్టే. నిబంధనలు, నియంత్రణల గురించి నాకు తెలుసు. వీటిని అమలు చేయడానికి ప్రభుత్వం ఉంది. కళాకారుడిగా, క్రియేటివ్ పర్సన్ గా సృజనాత్మకతను చంపొద్దని కోరుకుంటున్నా'ని అమితాబ్ పేర్కొన్నారు. సినిమా విడుదల దగ్గరపడే వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్లే నిర్మాతలు ఇబ్బంది పడాల్సివస్తోందని అభిప్రాయపడ్డారు. -
'అనవసర కామెంట్స్ చేయను'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదంపై స్పందించేందుకు నిర్మాత ఏక్తా కపూర్ నిరాకరించింది. ఈ వివాదంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని తెలిపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 89 కట్స్ చెప్పడంతో దుమారం రేగింది. సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ బహిరంగంగా సెన్సార్ బోర్డుపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అనురాగ్- ఏక్తా కపూర్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించేందుకు ఏక్తా నిరాకరించింది. 'మా అభిప్రాయాలను అధికార ప్రతినిధి ద్వారానే వెల్లడించాలని నేను, కశ్యప్ నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ వివాదంపై నేను మాట్లాడను. ఈ సమస్యకు సామరస్య పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. నేను అనవసరంగా ఎటువంటి కామెంట్స్ చేయన'ని స్పష్టం చేసింది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన తన తాజా చిత్రం 'ఎ స్కాండల్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొంది. -
'ఫిలిమ్ ఇండస్ట్రీని అవమానించారు'
ముంబై: 'ఉడ్తా పంజాబ్' సినిమాకు బాలీవుడ్ నటులు, దర్శకులు బాసటగా నిలిచారు. మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అనురాగ్ కశ్యప్ పై అసత్య ఆరోపణలు చేసిన సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లజ్ నిహలానీ క్షమాపణలు చెప్పాలని దర్శకులు డిమాండ్ చేశారు. ఆయనను పదవి నుంచి తప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అశోక్ పండిట్ నేతృత్వంలో నటులు, దర్శకులు మీడియాతో మాట్లాడారు. మన దేశం సౌదీ అరేబియాలా మారరాదని దర్శకుడు మహేశ్ భట్ అన్నారు. సమాజంలో జరిగిన వాటినే సినిమాలు మలుస్తున్నామని, ఊహించి లేదా సృషించి సినిమాలు తీయడం లేదని మరో దర్శకుడు రాహుల్ దొలాకియా తెలిపారు. ఈ సినిమాలోని సందేశం అందరికీ చేరేలా సహకరించాలని హీరో షాహిద్ కపూర్ విజ్ఞప్తి చేశాడు. సాధారణంగా సినిమా వర్గాలు సైలెంట్ గా మద్దతు తెల్పుతుంటాయని, మొదటిసారిగా ఒక సినిమాకు బహిరంగంగా సపోర్టు చేస్తున్నారని నటుడు, దర్శకుడు సతీశ్ కౌషిక్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి అనురాగ్ కశ్యప్ లంచం తీసుకున్నారని ఆరోపణలు చేసి సినిమా పరిశ్రమను నిహలానీ అవమానించారని అశోక్ పండిట్ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు పదవికి నిహలానీ తగరని ముఖేశ్ భట్ ధ్వజమెత్తారు. -
ఉడ్తా పంజాబ్‌కు బాలీవుడ్ మద్దతు
సెన్సార్ బోర్డ్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ థ్రిల్లర్ ఉడ్తా పంజాబ్‌కు బాలీవుడ్ సినీ ప్రముఖుల మద్దతు లభిస్తోంది. సినిమాల విషయంలో సెన్సార్ బోర్డ్ తీరు ఇప్పటికే చాలా సార్లు వివాదాస్పదం కాగా తాజాగా ఉడ్తా పంజాబ్ విషయంలో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఒక సినిమాకు ఏకంగా 89 కట్స్ చెప్పటంపై చిత్రయూనిట్ న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారు. ఉడ్తా పంజాబ్ యూనిట్‌కు మద్దతు తెలుపుతూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు ట్వీట్ చేశారు. ఉడ్తాపంజాబ్ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలనే ప్రస్థావించింది. సెన్సార్ మూలంగా నిజాలు మరుగున పడతాయన్నారు కరణ్ జోహార్. నిజాలు చెపితే రాష్ట్ర పరువుపోతుందా.?, ఉడ్తాపంజాబ్ పట్ల సెన్సార్ తీరు నాకు కోపం తెప్పిస్తోంది అంటూ హన్సాల్ మెహతా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లతో పాటు మహేష్ భట్, నిఖిల్ అద్వానీ, సోహా అలీఖాన్, నిరంజన్ అయ్యంగార్ లాంటి బాలీవుడ్ ప్రముఖుల గొంతు కలిపారు. తమ సినిమాకు మద్దతుగా ఇంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కలిసి రావటంపై హర్షం వ్యక్తం చేసిన షాహిద్ కపూర్, అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. షాహిద్ కపూర్, అలియా భట్, కరినా కపూర్ లు లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఉడ్తాపంజాబ్ సినిమాకు అభిషేక్ చౌబే దర్శకుడు. పంజాబ్ లోని డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న రిలీజ్ కావాల్సి ఉంది. #UdtaPunjab speaks of the reality of our times....censoring reality amounts to delusion.....the fraternity has to stand by what's right!! — Karan Johar (@karanjohar) 6 June 2016 What is this I'm hearing about #UdtaPunjab? Makes me very, very angry. — Hansal Mehta (@mehtahansal) 6 June 2016 Delusion or collusion? Why is the establishment so scared of films that mirror reality? #UdtaPunjabCensored — Hansal Mehta (@mehtahansal) 6 June 2016 The Censors says I am the one who says the last sentence on UDTA PUNJAB .The nation can say what it wants our verdict is going to stick. — Mahesh Bhatt (@MaheshNBhatt) 7 June 2016 I guess the next step will be to submit scripts for censorship. #UdtaPunjabCensored — Nikkhil Advani (@nikkhiladvani) 7 June 2016 Anyone who says that drugs are not a problem in punjab is either unaware,complicit or has malafide intention #UdtaPunjab @_phoenix_fire_ -
కావాలనే మాజీ లవర్‌తో ఫొటో దిగలేదు!
'ఉడ్తా పంజాబ్' సినిమాతో మళ్లీ వెండితెర మీద కనిపించబోతున్నారు షాహిద్ కపూర్, కరీనా కపూర్. చాలాకాలం కిందటే విడిపోయిన ఈ మాజీ ప్రేమజంట.. గతంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరులు ఎంత కోరినా.. కలిసి ఫొటో దిగేందుకు ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఏమిటంటే.. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వెల్లడించాడు. కావాలనే తామిద్దరం కలిసి ఫొటో దిగలేదని, ఒకవేళ ఫొటో దిగితే అప్పట్లో మీడియా మొత్తం దీనిపైనే మాట్లాడేదని, అందుకే మేం కలిసి ఫొటో దిగకూడదని తాను భావించానని షాహిద్ చెప్పాడు. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత షాహిద్, కరీనా.. అభిషేక్ చుబే తెరకెక్కించిన 'ఉడ్తా పంజాబ్'లో నటించారు. నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదట. అంతేకాకుండా మీ ఇద్దరు భవిష్యత్తులో కలిసి నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు వీరు సమాధానం దాటేశారు. సహ నటులు ఆలియా భట్, డైరెక్టర్ అభిషేక్ చుబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో షాహిద్, కరీన చాలా ఇబ్బందిగా కనిపించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందిస్తూ 'మేం ఇబ్బందిగా ఫీలైనట్టు మీరు ఎలా నిర్ణయిస్తారు? మేం అలా కనిపించామా? అలా ఎలా రాస్తారు?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
సెట్లో ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు: ఆలియా
సాధారణంగా ఎవరైనా హీరోయిన్ సినిమాలో నటిస్తోందంటే.. షూటింగ్ చూసేందుకు, ఆమెను దగ్గరగా చూసేందుకు వందలాది మంది అభిమానులు అక్కడకు చేరుకుంటారు. అలాంటిది సినిమా సెట్లలో అయితే ఇక హీరోయిన్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. కానీ, 'ఉడ్తా పంజాబ్' సినిమాలో ఆలియాభట్ నటిస్తుంటే.. అసలు ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదట, కనీసం దగ్గరకు కూడా రాలేదట. ఈ విషయాన్ని ఆలియానే స్వయంగా వెల్లడించింది. ఈ సినిమాలో ఆమె బిహార్ నుంచి వచ్చిన వలసకూలీ పాత్ర పోషిస్తోంది. అది బాగా డీగ్లామరైజ్డ్ పాత్ర కావడంతో.. షూటింగు మొదలవగానే తాను వచ్చినా కూడా ఎవరూ తనను గుర్తుపట్టలేదని, దర్శకుడు అభిషేక్ చౌబేతో తాను మాట్లాడుతుంటే అప్పుడు మాటను బట్టి గమనించి అంతా నాలుగు అడుగులు వెనక్కి వెళ్లారని చెప్పింది. ఈ విషయాలను ఆమె ఆ సినిమాలోని 'ఇక్ కుడీ' పాట ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించింది. అమిత్ త్రివేదీ ట్యూన్లు అందించిన ఈ పాట స్లోగా సాగే పంజాబీ గీతం. ఇది ప్రేక్షకుల హృదయాలను నేరుగా తాకుతుంది. హాకీ ప్లేయర్ కావాలని ఆశపడే ఆలియాభట్.. తన టాలెంట్ చూపించడానికి చాలా కష్టపడుతుండటాన్ని ఈ పాటలో చూపిస్తారు. ఈ సినిమాలో ఇంకా షాహిద్ కపూర్, దిల్జీత్ దోసంజ్, కరీనా కపూర్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, ఫాంటమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది. -
యాక్షన్, రియాక్షన్.. సోషల్ మీడియా ఓవరాక్షన్!
'చర్యకు సరిసమానమైన ప్రతి చర్య ఉంటుంది. అదే సోషల్ మీడియాలో అయితే.. అది మితిమీరి అతిగా ఉంటుంది'.. బుధవారం ఉదయం ట్విట్టర్లో ఆలియా భట్ చేసిన ట్వీట్ ఇది. తన విమర్శలకు గట్టి సమాధానం చెప్పేందుకు చేసిందో లేక సహజంగానే తనకు నచ్చడం వల్ల ఈ కామెంట్ ను షేర్ చేసిందో తెలియదు కానీ.. ఈ ట్వీట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తాజా సినిమా 'ఉడ్తా పంజాబ్'లో తన పాత్రపై వస్తున్న విమర్శలకు సమాధానం ఈ ట్వీట్ కావొచ్చునని వినిపిస్తోంది. అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉడ్తా పంజాబ్' సినిమాలో బిహారీ వలస మహిళ పాత్రలో ఆలియ కనిపిస్తున్నది. పంజాబ్‌లో తాండవిస్తున్న డ్రగ్స్ మహామ్మారి ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై సంగతి తెలిసిందే. ట్రైలర్లో ఆలియా కనిపించిన తీరుపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తుండగా.. ఆలియా పాత్రను తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ బహిరంగ లేఖ హల్చల్ చేస్తోంది. మొదట ఓ వెబ్సైట్లో ఈ లేఖ కనిపించింది. ఈ లేఖ రాసిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తనకు తాను 'బిహారీ అమ్మాయి'గా చెప్పుకుంటూ ఆలియా పాత్రపై చండ్ర నిప్పులు కురిపించింది. బిహారీలు అనగానే దుర్భర దారిద్ర్యంలో ఉంటారని, పేదరికానికి, నేరాలకు ప్రతిబింబంగా బిహార్ ఉంటుందనే పాతచింతకాయ ఆలోచనల్నే ఈ చిత్రంలో ఆలియా పాత్ర ప్రతిబింబిస్తున్నదని ఆమె ధ్వజమెత్తింది. ఈ లేఖకు కౌంటర్‌గానే ఆలియా ఈ ట్వీట్ చేసిందా? అనే అభిప్రాయం బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు సినీ జనాలు మాత్రం 'ఉడ్తా పంజాబ్'లో ఆలియ నటన సూపర్ అంటూ ట్విట్టర్లో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆలియా భట్, షాహిద్ కపూర్, కరీనా కపూర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. Hmmmmmmm :) pic.twitter.com/pWbSOkNGWm — Alia Bhatt (@aliaa08) 20 April 2016 -
మాజీ లవర్స్ మాట దాటేశారు!!
ముంబై: షాహిద్ కపూర్, కరీనా కపూర్.. చాలాకాలం తర్వాత ఈ మాజీ ప్రేమజంట వెండితెరపై ఒకే సినిమాలో కనిపించబోతున్నది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఉడ్తా పంజాబ్' చిత్రంలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు. ఒకప్పుడు బాలీవుడ్లో గాఢమైన ప్రేమపక్షులుగా పేరొందిన షాహిద్, కరీన ఆ తర్వాత వేరయ్యారు. ఎవరి తోడును వారు వెతుక్కున్నారు. ఈ ఇద్దరు కలిసి చివరిసారి నటించిన చిత్రం 'జబ్ వుయ్ మెట్'. ఆ సినిమా సమయంలోనే ఇద్దరికి బ్రేకప్ అయింది. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ మాజీ లవర్స్.. అభిషేక్ చుబే తీసిన 'ఉడ్తా పంజాబ్'లో దర్శనమివ్వబోతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ జంట ఒకే వేదికపై కనిపించింది. నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదు. ఈ విషయమై ప్రశ్నించగా షాహిద్, కరీన మాట దాటేశారు. భవిష్యత్‌లో మీరిద్దరూ కలిసి నటించే అవకాశముందా? అన్న ప్రశ్నకు కూడా డొంక తిరుగుడు సమాధానమిచ్చారు. 'ఉడ్తా పంజాబ్' సినిమాలో మీరిద్దరు కలిసి నటించే దృశ్యం ఒక్కటి కూడా లేనందుకు బాధాపడ్డారా? అని ప్రశ్నించగా 'గతంలో జరిగిన దాని గురించి మీరు బాధపడుతున్నారా? అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న' అని షాహిద్ బదులిచ్చాడు. 'జబ్ వుయ్ మెట్' సినిమా డీవీడీలు ఉన్నాయిగా? ఇంక కలిసి నటించడమెందుకు? అన్న తరహాలో కరీన బదులిచ్చింది. అంటే 'జబ్ వుయ్ మెట్' సినిమా తరహాలో మీరిద్దరు కలిసి నటించే అవకాశం భవిష్యత్తులో లేదన్నమాట? అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఆ విషయం ఇంతియాజ్ అలీ (ఆ చిత్ర డైరెక్టర్) చెప్తారు' అంటూ కరీన జవాబు దాటేసింది. 'జబ్ వుయ్ మెట్'కు సీక్వెల్ వచ్చేది ఉంటే ఎప్పుడో వచ్చేదని, ఇప్పుడు ఇంతియాజ్ ఆ సినిమా నుంచి ఎంతో ముందుకెళ్లిపోయారని షాహిద్ వివరణ ఇచ్చాడు. ఇక కలిసి ఫొటోలకు పోజు ఇవ్వొచ్చుగా అని విలేకరులు కోరినా.. ఈ జంట అందుకు సుమఖత వ్యక్తం చేయలేదు. సహ నటులు అలియా భట్, దిల్జిత్ దుసాంజ్లను తమమధ్యకు పిలిపించుకొని ఫొటొలు దిగారు కానీ, పక్కపక్కన ఉండి ఫొటోలు దిగేందుకు నిరాకరించారు. -
పెద్ద రిస్క్ చేశా!
ఏ పాత్రనైనా ఆలియా భట్ అలవోకగా చేసేస్తుందని హిందీ రంగంలో పేరు. ఆమె నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘2 స్టేట్స్’, ‘హైవే’ చిత్రాలు చూసినవాళ్లెవరయినా ఈ మాటలతో ఏకీభవిస్తారు. అలాంటి ఆలియా ‘‘నా జీవితంలో నేను పెద్ద రిస్క్ తీసుకున్నా. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా ఇలాంటి రిస్క్ తీసుకోనేమో’’ అంటున్నారు. ఈ బాలీవుడ్ బ్యూటీ చెబుతున్నది ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం గురించి. ఇందులో చాలా క్లిష్టమైన పాత్ర చేస్తున్నానని ఆలియా పేర్కొన్నారు. హాకీ ప్లేయర్ పాత్రను పోషిస్తున్నారామె. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకూ ఈ ఆట ప్రాక్టీస్ చేస్తున్నారట. అంతకుముందెప్పుడూ హాకీ ఆటను పెద్దగా చూసేదాన్ని కాదనీ, ఇప్పుడు చూడటం మాత్రమే కాదు... ఆడక తప్పడంలేదనీ ఆలియా అన్నారు. ఇప్పటివరకూ చేసిన అరడజను చిత్రాల్లో శారీరకంగా ఎక్కువ కష్టపెడుతున్న పాత్ర ఇదేననీ ఆమె తెలిపారు. -
హాకీ ప్లేయర్‌గా అలియా భట్...!
ఆమె వయసు 22 ఏళ్లు... కెరీర్ వయసు కేవలం రెండున్నరేళ్లు. కానీ బాలీవుడ్లో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘2 స్టేట్స్’ చిత్రాలలో పక్కింటి అమ్మాయిలా కుర్రకారు మనసు దోచుకున్న అలియా భట్ తన తాజా చిత్రం ‘ఉడ్తా పంజాబ్’లో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. కరీనా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్‌కు జంటగా అలియా కనిపించనున్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అలియా ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు హాకీ ప్రాక్టీస్ చేస్తున్నారట. -
పది రోజుల్లో పంజాబీ..!
పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కరీనా కపూర్‌కి చాలా సులువైన విషయం. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. ఓ ఉదాహరణ ‘తషాన్’. ఆ చిత్రంలో స్టయిలిష్‌గా కనిపించడం కోసం జీరో సైజ్‌కి మారిపోయారు కరీనా. ఇప్పుడు ‘ఉడ్తా పంజాబీ’ చిత్రం కోసం పంజాబీ అమ్మాయిలా శారీరక భాషను మార్చుకుంటున్నారు. అలాగే, పంజాబీ భాష కూడా నేర్చుకుంటున్నారు. ముందుగా 30 రోజుల్లో పంజాబీ భాష నేర్చేసుకోవచ్చనే పుస్తకం మీద ఆమె ఆధారపడాలనుకున్నారట. కానీ, దానికి బదులు ఓ మంచి టీచర్ని నియమించుకుంటే బాగుంటుందని అనుకున్నారు. దాంతో ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రజత్ సింగ్ అనే ప్రొఫెసర్ దగ్గర పంజాబీ పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ పాఠాలు ఆరంభించకముందు తన స్నేహితులతో ‘చూస్తూ ఉండండి.. పది రోజుల్లో పంజాబీ భాష నేర్చేసుకుంటా’ అని సవాల్ కూడా విసిరారట. కరీనా అన్నంత పని చేస్తుందనీ, తనకంత ప్రతిభ ఉందని ఆ స్నేహితులు అంటున్నారు. ఆ సంగతలా ఉంచితే.. తన మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ సరసన కరీనా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ జంట తెరపై కనిపించి దాదాపు ఏడెనిమిదేళ్లవుతుంది. సో.. ఈ చిత్రానికి భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.