న్యూఢిల్లీ: ఉడ్తా పంజాబ్ చిత్రంపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమాలో కేవలం ఒక్క సీన్ను మాత్రమే కట్ చేసి, విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ స్వచ్ఛంద సంస్థ ఇవాళ ఉన్నత ధర్మాసనం తలుపు తట్టింది. ఉడ్తా పంజాబ్లో డ్రగ్స్ వాడకం అధికంగా ఉందని చూపడంతో పాటు, పంజాబ్లో పేదరికాన్ని ఎత్తి చూపుతున్నట్లు ఉందని తన పిటిషన్లో పేర్కొంది.
ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు తక్షణమే విచారణ జరపాలని స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అయితే పిటిషన్పై పూర్తి వివరాలతో రావాలని కోర్టు సూచించింది. కాగా ఉడ్తా పంజాబ్ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) ప్రతిపాదించిన 89 కత్తిరింపులు చెల్లవని హైకోర్టు తీర్పునివ్వడంతోపాటు 48 గంటల్లోగా దానికి సర్టిఫికెట్ అందించాలని సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు అనేక అడ్డంకులను దాటుకంటూ ఉడ్తా పంజాబ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకు రానుంది.
కాగా ఉడ్తా పంజాబ్ సినిమాకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రోమోలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ..చిత్ర దర్శక, నిర్మాతలను ఆదేశించింది.