ఒక్క కట్ చాలు..
‘ఉడ్తా పంజాబ్’కు 48 గంటల్లో సర్టిఫికెట్ ఇవ్వండి
- సెన్సార్ బోర్డును ఆదేశించిన బాంబే హైకోర్టు
- కాలానికి తగినట్టు మారాలని సీబీఎఫ్‌సీకి సూచన
ముంబై: సెన్సార్ వివాదంలో చిక్కుకున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగాయి. సెన్సార్ బోర్డు సూచించిన 13 కత్తిరింపులతోకాక ఒకే కత్తిరింపుతో బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది. 48 గంటల్లో ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వాలని బోర్డును ఆదేశించింది. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం ఇతివృత్తం ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు తొలుత 89 కట్స్ చెప్పింది. రివ్యూ కమిటీ పరిశీలన తర్వాత 13కు కుదించింది.
అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) ఆదేశాలను సవాలు చేస్తూ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు చెందిన పాంటామ్ ఫిల్మ్స్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను సోమవారం విచారించిన కోర్టు ఒక్క కట్‌తో చిత్రం విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 6న రివ్యూ కమిటీ సూచించిన సినిమాలోని మూత్ర విసర్జన సన్నివేశం తొలగింపు, డిస్‌క్లయిమర్‌లో మార్పులకు మాత్రం కోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ బోర్డు అమ్మమ్మ మాదిరిగా వ్యవహరించొద్దని, కాలానుగుణంగా బోర్డూ మారాలని, కళలకు సంబంధించిన అంశాల్లో సీబీఎఫ్‌సీ ఓవర్ సెన్సిటివ్‌గా వ్యవహరించడం తగదని, సృ జనాత్మకతకు కోత విధించడం తగదని పేర్కొంది.
సృజనాత్మక వ్యక్తులను అకస్మాత్తుగా ఆపడం తగదని, ఇది వారిని నిరుత్సాహానికి గురిచేస్తుందని, ఇది సృజనాత్మకతను చంపేస్తుందని పేర్కొంది. సెన్సార్ బోర్డు అధికారాలపైనా న్యాయస్థానం ప్రశ్నలు కురిపించింది. సినిమాటోగ్రఫీ చట్టంలో సెన్సార్ అనే పదమే లేదంది. ఒక వేళ ఒక చిత్రంలో ఏమైనా కట్స్ చెప్పాలంటే అవి రాజ్యాంగబద్ధంగా, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలంది. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా కోర్టు ఆదేశాలపై స్టే విధించాలన్న సెన్సార్ బోర్డు అభ్యర్థనను కూడా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ చిత్రం స్క్రిప్ట్‌ను తాము చదివామని, ఇందులో పంజాబ్‌ను చెడుగా చిత్రీకరించేందుకు, భారత సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీసే అంశాలేవీ లేవని గుర్తించామని పేర్కొంది. అయితే ఈ చిత్రం, ఇందులోని పాత్రలు, ఫిల్మ్ మేకర్స్.. డగ్స్ వినియోగాన్ని, దుర్భాషలను ఏవిధంగానూ ప్రోత్సహించ డం లేదని డిస్‌క్లయిమర్‌లో మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.