ఆ సినిమాకు రాజమౌళి మద్దతు
ఉడ్తా పంజాబ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో చెలరేగిన వివాదంపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించాడు. దేశం ఏం చూడాలో కొద్దిమంది వ్యక్తులు నిర్ణయించలేరని అన్నాడు. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో ఒక్కసారిగా జాతి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి.. ఉడ్తా పంజాబ్ చిత్ర టీమ్‌కు మద్దతుగా నిలిచాడు. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్లు ఏకంగా దాదాపు 90 కట్‌లు చెప్పడాన్ని విమర్శించాడు. తానుకూడా ఒక దర్శకుడిని కాబట్టి.. దర్శకులకే తన మద్దతు ఉంటుందని చెప్పాడు.
ఆరేడుగురు లేదా పదిమంది కూర్చుని మొత్తం జాతికి ఏది మంచో ఏది చెడో ఎలా చెబుతారో ఆలోచించాలని.. ఇది చాలా సింపుల్ లాజిక్ అని రాజమౌళి అన్నాడు. తనకు, తన కుటుంబానికి ఏది మంచో కాదో తాను నిర్ణయించుకోవాలని.. అలాగే తన పిల్లలు ఏం చూడాలో చూడకూడదో నిర్ణయించుకోవచ్చని అంతే తప్ప ఊరందరి విషయం తానొక్కడినే ఎలా నిర్ణయిస్తానని అన్నాడు. 'ఇండియన్ ఆఫ్ ద ఇయర్: ఎంటర్‌టైన్‌మెంట్ 2015' అవార్డును అందుకోడానికి రాజమౌళి ఢిల్లీ వచ్చాడు.