ఒక్క కట్‌తో ఉడ్తా పంజాబ్‌కు హైకోర్టు ఓకే
ఉడ్తా పంజాబ్ సినిమా న్యాయ పోరాటానికి ఫలితం లభించింది. రెండు రోజుల్లో సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలన్న సీబీఎఫ్‌సీ డిమాండును హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు నిర్ణయంతో తమకు పెద్ద ఊరట కలిగిందని, సినిమాను షెడ్యూల్డు సమయానికే విడుదల చేయాలని చూస్తున్నామని చిత్ర దర్శకుడు అభిషేక్ చౌబే తెలిపారు. ఇది కేవలం తమకు మాత్రమే కాక మొత్తం సినీ పరిశ్రమకే మంచి తీర్పు అని సినిమా సహ నిర్మాత మధు మంతెన వర్మ అన్నారు. తాము కేవలం ఒక్క సీన్ మాత్రమే కట్ చేయాల్సి ఉంటుందని, ఈ తీర్పుతో ప్రజాస్వామ్యం నిలబడినట్లయిందని అనురాగ్ కశ్యప్ తరఫు న్యాయవాది అన్నారు.
అంతకుముందు సీబీఎఫ్‌సీ సూచించిన అన్ని కట్‌లను హైకోర్టు పరిశీలించి ఒక్కొక్క దానిపై వ్యాఖ్యానించింది. సీబీఎఫ్‌సీ సూచించిన 8వ కట్ ఏమాత్రం అక్కర్లేదని, కేవలం ఒక వ్యక్తి డ్రగ్స్ ఇంజక్షన్ తీసుకుంటున్న క్లోజప్ షాట్ వల్ల నియమాలను ఉల్లంఘించినట్లు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఏడో కట్ కూడా అక్కర్లేదని, మూడో పాటలో గోకుతున్న సీన్‌ను తీయక్కర్లేదని స్పష్టం చేసింది. పంజాబ్ హరిత విప్లవ భూమి అని, కేవలం ఒక్క వాక్యం వల్ల (జమీన్ బంజర్ తే ఔలాద్ కంజర్) ఆ ఇమేజికి ఎలాంటి భంగం వాటిల్లదని తెలిపింది. ఇక టామీ సింగ్ జనం ఎదురుగా మూత్రవిసర్జన చేస్తున్న సీన్ అవసరం లేదన్న హైకోర్టు.. ఆ సీన్‌ను సినిమాలోంచి తీసేయాలని తెలిపింది.