Abhishek Chaubey
-
ఒక్క కట్‌తో ఉడ్తా పంజాబ్‌కు హైకోర్టు ఓకే
ఉడ్తా పంజాబ్ సినిమా న్యాయ పోరాటానికి ఫలితం లభించింది. రెండు రోజుల్లో సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలన్న సీబీఎఫ్సీ డిమాండును హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు నిర్ణయంతో తమకు పెద్ద ఊరట కలిగిందని, సినిమాను షెడ్యూల్డు సమయానికే విడుదల చేయాలని చూస్తున్నామని చిత్ర దర్శకుడు అభిషేక్ చౌబే తెలిపారు. ఇది కేవలం తమకు మాత్రమే కాక మొత్తం సినీ పరిశ్రమకే మంచి తీర్పు అని సినిమా సహ నిర్మాత మధు మంతెన వర్మ అన్నారు. తాము కేవలం ఒక్క సీన్ మాత్రమే కట్ చేయాల్సి ఉంటుందని, ఈ తీర్పుతో ప్రజాస్వామ్యం నిలబడినట్లయిందని అనురాగ్ కశ్యప్ తరఫు న్యాయవాది అన్నారు. అంతకుముందు సీబీఎఫ్సీ సూచించిన అన్ని కట్లను హైకోర్టు పరిశీలించి ఒక్కొక్క దానిపై వ్యాఖ్యానించింది. సీబీఎఫ్సీ సూచించిన 8వ కట్ ఏమాత్రం అక్కర్లేదని, కేవలం ఒక వ్యక్తి డ్రగ్స్ ఇంజక్షన్ తీసుకుంటున్న క్లోజప్ షాట్ వల్ల నియమాలను ఉల్లంఘించినట్లు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఏడో కట్ కూడా అక్కర్లేదని, మూడో పాటలో గోకుతున్న సీన్‌ను తీయక్కర్లేదని స్పష్టం చేసింది. పంజాబ్ హరిత విప్లవ భూమి అని, కేవలం ఒక్క వాక్యం వల్ల (జమీన్ బంజర్ తే ఔలాద్ కంజర్) ఆ ఇమేజికి ఎలాంటి భంగం వాటిల్లదని తెలిపింది. ఇక టామీ సింగ్ జనం ఎదురుగా మూత్రవిసర్జన చేస్తున్న సీన్ అవసరం లేదన్న హైకోర్టు.. ఆ సీన్‌ను సినిమాలోంచి తీసేయాలని తెలిపింది. -
దర్శకత్వానికే ప్రాధాన్యత
స్వయంగా దర్శకత్వం వహించాలనుకునే సినిమాలను మాత్రమే నిర్మించాలనుకుంటానని, ఇతరులు తీసే వాటికి నిర్మాతగా వ్యవహరించడం ఇష్టముండబోదని విశాల్ భరద్వాజ్ అంటున్నాడు. ఇక నుంచి సినిమాలు తీయడం మానేసి, ఆ శక్తిని దర్శకత్వ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకుంటానని చెప్పాడు. అభిషేక్ చౌబే తనకు సోదరుడు వంటివాడు కాబట్టే దేడ్ ఇష్కియా దర్శకత్వ బాధ్యతను అతడికి అప్పగించానని చెప్పాడు. విశాల్ 2002లో తొలిసారిగా తీసిన బాలల సినిమా మక్డీకి విమర్శల ప్రశంసలు దక్కాయి. తరువాత మక్బూల్, ఓంకార వంటి చిత్రాలు రూపొందించాడు. నో స్మోకింగ్, ఇష్కియా, ఏక్ థి దయాన్ సినిమాలను నిర్మించాడు కానీ వాటికి దర్శకత్వం మాత్రం వహించలేదు. ‘నా సోదరి వంటిదైన మేఘనా గుల్జార్ తీసే సినిమాను కూడా నేనే నిర్మిస్తున్నాను. నా మనసుకు అత్యంత ఇష్టమైన కథ అది’ అని వివరించాడు. భావోద్వేగాలు, నాటకీయత ఎక్కువగా ఉండే సినిమాలను రూపొందిస్తూ సంజయ్ లీలాభన్సాలీ విజయాలు సాధించడంపై స్పందిస్తూ అలాంటి కథలపై అతనికి నమ్మకం ఉంటుంది కాబట్టే వాటిని ఎంచుకుంటాడని చెప్పాడు. ‘నాకు నమ్మకం లేని కథలకు దర్శకత్వం వహించడం గానీ నిర్మించడం గానీ నాకు ఇష్టముండదు. సంజయ్‌కు రౌడీ రాథోడ్ కథ బాగా నచ్చింది కాబట్టే దానిని నిర్మించి దర్శకత్వం వహించాడు’ అని విశాల్ వివరించాడు. దర్శకుడిగా మారడానికి ముందు ఇతడు చాలా సినిమాలకు సంగీతం అందించాడు. మాచిస్, సత్య, చాచీ 420, గాడ్‌మదర్, మక్బూల్, ఓంకార, కమీనే, ఇష్కియా, 7 ఖూన్మాఫ్ వంటి సినిమాలకు విశాల్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. సంజయ్ కూడా తన సినిమాకు సంగీతం అందించాలని ఓసారి కోరినా అప్పట్లో తీరిక లేకపోవడంతో ఒప్పుకోలేకపోయానని విశాల్ భరద్వాజ్ వివరించాడు. -
వాళ్లిద్దరిపై నాకు నమ్మకం ఉంది: మాధురీ దీక్షిత్
'డేఢ్ ఇష్కియా' చిత్ర రూపకర్తలు విశాల్ భరద్వాజ్, అభిషేక్ చౌబేలపై నమ్మకం ఉండటం వల్లే తానా సినిమాలో నటించానని రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదరగొడుతున్న మాధురీ దీక్షిత్ తెలిపింది. 2007లో ఆజా నచ్లే సినిమాతో ఆమె మళ్లీ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2010లో వచ్చిన 'ఇష్కియా' చిత్రం బ్రహ్మాండంగా హిట్ కావడంతో దర్శకుడు చౌబే మరోసారి నిర్మాత విశాల్ భరద్వాజ్‌తో కలిసి 'డేఢ్ ఇష్కియా' సినిమా తీశాడు. ''ఈ స్క్రిప్టు కోసం నేను ఏడు సంవత్సరాలు వేచి ఉండదలచుకోలేదు. అందుకు నా కారణాలు నాకున్నాయి. ఇంతకుముందు నేను ఇక్కడ ఉండలేదు కూడా. నేను విదేశాల్లో ఉండేదాన్ని. ఇక్కడికొచ్చి పనిచేసి వెళ్లిపోయేదాన్ని. అందుకే నేను దేని కోసం వేచి ఉండేదాన్ని కాదు'' అని మాధురి తెలిపింది. కానీ 'డేఢ్ ఇష్కియా' చిత్రం ఆఫర్ వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడికొచ్చి స్క్రిప్టులు చదివి చేయాలని నిర్ణయించుకుని, అందుకే మళ్లీ ఇండియా వచ్చి ఇక్కడే స్థిరపడ్డానని చెప్పారు. విశాల్, అభిషేక్ కలిస్తే మంచి సినిమాలు వస్తాయన్న నమ్మకం తనకుందని, అందులో భాగం కావడం తనకూ ఇష్టమేనని మాధురి చెప్పింది. ఈ సినిమాలో ఇంకా నసీరుద్దీన్ షా, హుమా ఖురేషీ, అర్షద్ వార్సీ ఉన్నారు.