
ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రాల రూపకల్పనలో భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త శిఖరాలను అధిరోహించనుంది. ఈ నేపధ్యంలోనే ఆల్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ దర్శకుడు అట్లీ కలయికలో తమ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇద్దరు టాలీవుడ్ అగ్రగామి నటుల మధ్య సరికొత్త వార్ మొదలైందనొచ్చు.
దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా నాదే అనే కిరీటాన్ని అందుకోవడానికి ఈ ఇద్దరు స్టార్స్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ మాత్రమే కాదు నేను కూడా ఉన్నానంటూ బాలీవుడ్ టాప్ స్టార్ కూడా అదే వరుసలో నిలవడంతో.. పోటీ రసకందాయకంగా మారింది.
రూ.2 వేల కోట్ల కలెక్షన్స్ నిన్న.. రూ1,000 కోట్ల పెట్టుబడి నేడు.. అన్నట్టుగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఆయన తీస్తున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎస్‌బి29 బడ్జెట్ రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చునంటున్నారు.
మరోవైపు బాలీవుడ్ అగ్ర కధానాయకుల్లో ఒకరైన రణబీర్ కపూర్‌తో రామాయణం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్ కూడా రూ.900 కోట్లకు దగ్గరగా ఉండొచ్చునని చెబతున్నారు. ఈ రెండు సినిమాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నప్పటికీ... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమ తమ చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్‌లు సాధించిన అల్లు అర్జున్, అట్లీలు సన్ పిక్చర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నట్టు వచ్చిన ప్రకటన పలు ఆశ్చర్యకరమైన అంకెల్ని సినీ అభిమానుల కళ్ల ముందుకు తెచ్చింది.
ప్రస్తుతం ఏఏ22xఏ6 అని పేర్కొంటున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 800 కోట్లు కాగా ఇందులో నిర్మాణ వ్యయంగా రూ. 200 కోట్లు, విఎఫ్‌ఎక్స్ (స్పెషల్ ఎఫెక్ట్స్) కోసం రూ.250 కోట్లు, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ. 175 కోట్లు, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ రూ. 100 కోట్లుగా లెక్కిస్తున్నారు.
ఇదే కాకుండా అల్లు అర్జున్‌కూ సినిమా లాభంలో 15 శాతం ఉంటుందని, అలాగే అట్లీకి కూడా బ్యాకెండ్ డీల్ ఉంటుందని సమాచారం. అవతార్, ఐరన్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన నిపుణులు ఇందులో భాగం పంచుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా ఇండియన్ స్క్రీన్‌పై విజువల్ ట్రీట్‌గా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ చిత్రం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఒక ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లవచ్చునని.. అట్లీ తరచుగా ఆలోచించినట్టే ఆలోచిస్తే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుంది.
ప్రస్తుత బడ్జెట్‌ల ప్రకారం రాజమౌళి, మహేష్ బాబుల సినిమాయే అత్యంత ఖరీదైన చిత్రం కావడం ఖాయంగా తెలుస్తున్నప్పటికీ..మరెన్నో నెలల పాటు.షూటింగ్ సాగే క్రమంలో బడ్జెట్‌లో కూడికలు, తీసివేతలు.. మార్పు చేర్పులు అంతిమంగా ఈ విషయాన్ని ఖరారు చేస్తాయని అనుకోవచ్చు.