మా సినిమా పాకిస్థాన్లో ప్రదర్శించం
ఉడ్తా పంజాబ్ సినిమాను పాకిస్థాన్లో ప్రదర్శించేది లేదని సినిమా దర్శక నిర్మాతలు తేల్చి చెప్పేశారు. కనీసం 100 కట్లు లేనిదే ఆ సినిమాను అక్కడ ప్రదర్శించకూడదని పాక్ సెన్సార్ బోర్డు చెప్పడంతో వాళ్లీ నిర్ణయం తీసుకున్నారు. సినిమాను పాకిస్థాన్లో విడుదల చేయకపోవడం వల్ల తాము చాలా ఆదాయం కోల్పోతామని, అయినా అసలు అన్ని కట్లతో సినిమా విడుదల చేయడం వ్యర్థమని దర్శకుడు అభిషేక్ చౌబే అన్నాడు.
భారతదేశంలో అయితే సెన్సార్ బోర్డు 89 కట్లు సూచించినా కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నామని, అక్కడ అలాంటి అవకాశం కూడా లేదని.. అందువల్లే అసలు సినిమా విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నామని చెప్పాడు. సినిమా కలెక్షన్లు ప్రస్తుతం బాగానే ఉన్నాయని, కానీ ఇంటర్నెట్లో లీకవ్వకుండా ఉంటే మరింత బాగుండేదని చౌబే అభిప్రాయపడ్డాడు. సినిమాలో కొన్ని పదాల వాడకం పట్ల అభ్యంతరాలు వస్తున్నాయని, కానీ నిజజీవితంలో వాళ్లు అలాగే మాట్లాడుకుంటారని అన్నాడు. డ్రగ్ పెడలింగ్, డ్రగ్స్ వాడకం గురించి తాము సందేశం ఇవ్వాలనుకున్నామని అందుకే నిజ జీవితాలను ప్రతిబింబించక తప్పలేదని చెప్పాడు.