సెన్సారింగ్ మీ పని కాదు
సర్టిఫికేషనే మీ బాధ్యత
- సీబీఎఫ్‌సీపై బాంబే హైకోర్టు మండిపాటు
- ఏం చూడాలో ప్రజలను నిర్ణయించుకోనివ్వండి
ముంబై: ఉడ్తా పంజాబ్ చిత్రంలో దృశ్యాలను కత్తిరించాలని కేంద్ర ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు (సీబీఎఫ్‌సీ) సూచించటంపై ముంబై హైకోర్టు మండిపడింది. చిత్రానికి సర్టిఫికేషన్ ఇవ్వటమే బోర్డు పని అని.. అది వది లేసి సెన్సారింగ్ చేయటం మీ పని కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రం నిజంగానే అభ్యంతరకరంగా, డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఉందనుకుంటే.. ఎందుకు దీనిపై నిషేధం విధించలేదో తెలపాలని ఆదేశించింది. ఇదే సమయంలో చిత్ర నిర్మాతలు కూడా బోర్డు సూచించిన అనవసరమైన దృశ్యాలను తొలగించాలని సూచించింది. ప్రజలు ఏం చూడాలనుకుంటున్నారో వారి నే నిర్ణయించుకోనివ్వాలంది.
రెండ్రోజులు జరిగిన విచారణను ముగించిన జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి, జస్టిస్ శాలిని జోషిల డివిజన్ బెంచ్ సోమవారం తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా సీబీఎఫ్‌సీ బోర్డుపై కోర్టు మండిపడింది. ‘సర్టిఫికేషన్ ఇవ్వటంలో అతిగా ప్రవర్తిం చొద్దు దీనివల్ల సినిమాల్లోని సృజనాత్మకత చచ్చిపోతుంది. చిత్రంలో పంజాబ్, పంజాబ్‌లోని నగరాల పేర్లను తొలగించాలన్న రివైజింగ్ కమిటీ నివేదిక ప్రకారం ముందుకెళ్తే.. సినిమా అర్థమే మారిపోతుంది. ఓ వ్యక్తి, ఓ ప్రాంతం గురించి నిర్మాతలు విమర్శించాలనుకుంటే దాన్నలాగే చూపించండి. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా ఉందనిపిస్తే నిషేధించండి’ అని సూచించింది. అనవసర రాద్ధాంతం వల్ల చిత్రానికి అవసరానికి మించిన పబ్లిసిటీ పెంచుతున్నారని తెలిపింది. ‘చిత్ర నిర్మాతలు కూడా అనవసర దృశ్యాలు, అసభ్యపదజాలాన్ని చూపిస్తేనే జనాలకు నచ్చుతుందనుకోవద్దు. నేటి తరం చాలా పరిణతితో ఆలోచిస్తోంది. మంచి కథాంశం లేక ఎన్నో చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోర్లాపడుతున్న విషయాన్ని మరిచిపోవద్దు’ అని సూచించింది.
‘అడల్ట్ విత్ కాషన్’ ఉండాలి: శ్యాంబెనగల్
ముంబై: సినిమాల్లో కేటగిరీల్లో ‘అడల్ట్ విత్ కాషన్’ అనే కేటగిరీ ఉండాల్సిన అవసరం ఉందని సెన్సార్ బోర్డు పనితీరుపై ఏర్పాటైన కమిటీ సారథి దర్శకుడుశ్యామ్ బెనగల్ అభిప్రాయపడ్డారు. పెద్దలకు చెందిన విషయాల తీవ్రత ఎక్కువగా ఉన్న చిత్రాలకు ‘అడల్ట్ విత్ కాషన్’ లేదా ఏ/సీ పేరుతో సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించామన్నారు. అలాగే యూనివర్సల్(యూ)లో ‘యూ/ఏ 12 ప్లస్’, ‘యూ/ఏ 15 ప్లస్’.. ఇలా రెండు కేటగిరీలు ఉండాలని చెప్పామన్నారు.