ప్రమాదం జరిగినప్పుడు వాహనాల రాకపోకలు అడ్డుకుంటే ఎలా?
పోలీసులను ప్రశ్నించిన బాంబే హైకోర్టు
దీనివల్ల సామాన్యుల ఇబ్బందులు..
అత్యవసర సేవల వాహనాలకు ట్రాఫిక్ చిక్కులు అని వ్యాఖ్య
రోడ్లను మూసివేస్తే పోలీసు అధికారులపై చర్యలుంటాయని హెచ్చరిక
దాదర్: ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఇరు దిక్కుల మార్గంపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను ఎందుకు అడ్డుకుంటున్నారని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. దీనివల్ల సామాన్య వాహన చోదకులు ఇబ్బందులు పడటమే కాకుండా అంబులెన్స్‌లు, ఫైరింజన్లు, పోలీసు వ్యాన్లు తదితర అత్యవసర సేవలు అందించే వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటాయని పేర్కొంది. అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతే అందుకు బాధ్యులెవరని పోలీసులను నిలదీసింది. మరోసారి ఇలా బారికేడ్లు ఏర్పాటుచేసి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తే ఊరుకునేది లేదని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
చుట్టూ తిరిగి వెళ్లాలి..
సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రమాదం జరిగిన రోడ్డును మూసివేస్తారు. కానీ ఇటీవల కాలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బారికేడ్లు అడ్డంగా పెట్టి ఇరు దిక్కుల రోడ్లను మూసివేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వాహన చోదకులు చాలా చుట్టూ తిరిగి వెళ్తుంటారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు వెంటనే తరలించినప్పటికీ మృతుల పంచనామా పనులు పూర్తయ్యేంత వరకు రోడ్డును మూసి ఉంచుతారు. ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్‌లు కూడా సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేక పోతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికే కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రులు వెంటనే వైద్యం అందక ప్రాణాలు వదులుతారని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన రోడ్డును మూసి వేయాలి కానీ అనేక సందర్భాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి రెండు దిక్కుల వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది.
వందల వాహనాలు వెనక్కి
ఇటీవల పశ్చిమ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక దహిసర్ పోలీసులు రెండు దిక్కులా బారికేడ్లు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. మరో సంఘటనలో 2024, నవంబరు 8వ తేదీన పావస్కర్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఇరు దిక్కులా బారికేడ్లు ఏర్పాటుచేసి వాహనాలను నిలిపివేశారు. ఫలితంగా వందలాది వాహనాలను వెనక్కి పంపించారు. ఫలితంగా అందులో ప్రయా ణిçస్తున్న వేలాది మంది సామాన్యులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కైలాస్ చోగ్లే బాంబే హైకోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బి.పి.కులాభావాల, జస్టిస్ సోమశేఖర్ సుందర్‌సేన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. రోడ్డు ప్రమాదం జరిగిన చోట లేదా పంచనామా, దర్యాప్తు జరుగుతున్న చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, దర్యాప్తు పనులు పూర్తికాగానే వాటిని వెంటనే తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని సూచించింది. లేదంటే చర్యలు తప్పవని న్యాయమూర్తుల ధర్మాసనం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment