సాక్షి, ముంబై: మహిళా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇక మీదట ప్రతి రైల్వే స్టేషన్‌లో ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగర రైల్వే స్టేషన్లలో మహిళల భద్రత విషయంలో జీఆర్పీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ముంబై హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించడంలో విఫలమవుతోందని దుయ్యబట్టింది.
దీనిపై జీఆర్పీ సమాధానమిస్తూ తగినంత సిబ్బంది లేకపోవడం వల్లే కొన్నిసార్లు తాము నిందితులను గుర్తించడంలో విఫలమవుతున్నామని సమాధానమిచ్చింది. అలాగే రైల్వే అధికారుల మధ్య సమన్వయం సాధించేందుకు అవసరమైన వాకీటాకీలు కూడా అందుబాటులో లేవని, అందువల్ల వివిధ స్టేషన్ల అధికారుల మధ్య సమన్వయం సాధ్యం కావడంలేదని వివరించింది. నగరంలోని 136 రైల్వేస్టేషన్లు ఉండగా, కేవలం 120 వాకీటాకీలో ఇక్కడ అందుబాటులో ఉన్నాయని సమాధానమిచ్చింది.
ఇదిలా ఉండగా, తమకు ఎదురవుతున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని స్టేషన్లలో భద్రత చర్యలను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతి రైల్వే స్టేషన్‌లో తప్పనిసరిగా ఒక అధికారిని నియమించేలా కొత్త నిబంధనను రూపొందించారు. ప్రతి జీఆర్‌పీ స్టేషన్ పరిధిలో దాదాపు ఐదు రైల్వే స్టేషన్లు ఉంటాయి.
దీంతో ఒక్కో పోలీస్ స్టేషన్‌లో కనీసం ఐదుగురు ఇన్‌స్పెక్టర్ల అవసరం ఉంటుంది. వీరు తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తారు. కొత్త ప్రణాళిక ప్రకారం.. ఈ ఇన్‌స్పెక్టర్లు తమకు కేటాయించిన రైల్వే స్టేషన్లలో జరిగే నేరాలకు జవాబుదారీగా వ్యవహరిస్తారు. తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో నేరాల సంఖ్య పెరిగినా వీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటిని నివారణకు తగిన చర్యలు తీసుకోవడం కూడా వీరి బాధ్యతే.వీటి ద్వారా రోజురోజుకు అధికారుల బాధ్యతల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని జీఆర్పీ కమిషనర్ రవీందర్ సింగాల్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జీఆర్పీలో సిబ్బంది తక్కువగా ఉండడంతో ఆ శాఖ లోకల్ ఆర్మ్స్ (ఎల్ ఏ) సహాయం కూడా తీసుకోనుంది. వీరి సహకారంతో రోజూ అన్ని ముఖ్య రైల్వే స్టేషన్లలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బాంద్రా, లోకమాన్య తిలక్ టెర్మినస్ (కుర్లా), దాదర్, ముంబై సెంట్రల్, ఇతర రైల్వే స్టేషన్లలో రోజువారీ భద్రతను పర్యవేక్షించనున్నారు. ఎల్‌ఏకు చెందిన దాదాపు 40 మంది సిబ్బంది ఈ టర్మినస్‌లకు చేరుకుంటారు. తర్వాత జీఆర్‌పీ సిబ్బందితో అన్ని స్టేషన్ల ఆవరణలో నిర్వహించే కూంబింగ్‌లో పాల్గొంటారని వెస్టర్న్ రైల్వే జీఆర్‌పీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ప్రదీప్ బిజ్వే పేర్కొన్నారు.
‘భద్రత’ బాధ్యత వారిదే..!
Published Thu, Nov 6 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement