
ముంబై: ఐదేళ్ల క్రితం చనిపోయిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశ సాలియన్ కేసులో ఊహించని మలుపు తిరిగింది. దిశ సాలియన్ ముంబైలోని ఓ భవనం నుంచి పడిపోవడంతో మరణించారు. పోలీసులు ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా అప్పట్లో కేసు నమోదు చేశారు. తాజాగా శివసేన యూబీటీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఇతరులపై కేసు నమోదు చేయాలని దిశ తండ్రి సతీశ్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెది ప్రమాదవ శాత్తూ జరిగిన మరణం కాదని, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి, హతమార్చారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఆదిత్య ఠాక్రే స్పందించారు. న్యాయ స్థానంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే
దిశ సాలియన్ జూన్8,2020 ముంబైలోని మలాద్ అనే ప్రాంతానికి చెందిన అపార్ట్‌మెంట్ 14వ ఫ్లోర్ నుంచి కిందపడి చనిపోయారు. విచారణ చేపట్టిన పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్‌లో(ఏడీఆర్)ప్రమాదవశాత్తూ మరణించినట్లు కేసు నమోదు చేశారు. సరిగ్గా ఆ ఘటన జరిగిన ఆరురోజుల తర్వాత బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాదాస్పద స్థితిలో మరణించారు.
దిశ సాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు
దిశ సాలియన్, సుశాంత్ సింగ్ రోజుల వ్యవధిలో ఇద్దరూ అనుమానాస్పదంగా మరణించడంపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తూ పడి చనిపోయినట్లు తేల్చారు. పోలీసుల దర్యాప్తుపై దిశ తండ్రి సైతం సంతృప్తిని వ్యక్తం చేశారు. తమ కుమార్తె మరణంలో ఎలాంటి అనుమానం లేదని, కేసు దర్యాప్తుపై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అనూహ్యంగా ఐదేళ్ల తర్వాత దిశ సాలియన్ కేసు ఊహించని మలుపు తిరిగింది. గురువారం దిశ తండ్రి సతీష్ సాలియన్ సంచలన ఆరోపణలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కింద పడితో ఒక్క దెబ్బకూడా తగల్లేదంట
ఆ పిటిషన్‌లో జూన్ 8,2020లో దిశ తన ఇంట్లో పార్టీని ఏర్పాటు చేసిందని,ఆ పార్టీకి శివసేన యూబీటీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, అతని బాడీ గార్డ్‌లు, నటులు సూరజ్ పంచోలి,డినో మోరియాలు పాల్గొన్నారని తెలిపారు. పార్టీలో తన కుమార్తె సామూహిక అత్యాచారానికి గురైందని, బలవంతంగా, క్రూరంగా లైంగిక వేధింపులకు గురైంది’ అని ఆమె తండ్రి పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కిందపడి దిశ చనిపోయిందని చెబుతున్నప్పటికీ ఆమె శరీరంలో ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో రక్తం లేదని అన్నారు.
అటాప్సీ రిపోర్ట్‌పై అనుమానం
కేసులో నిందితుల్ని రక్షించేందుకు రాజకీయ పలుకుబడితో దిశ అటాప్సీ రిపోర్ట్‌ను సైతం మార్చారని తెలిపారు. అందుకు ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలే నిదర్శనమన్నారు. నిందితుల్ని కేసు నుంచి భయటపడేసేందుకు రాజకీయ పలుకుబడితో పోలీస్ శాఖ దిశ ప్రమాదవశాత్తూ మరణించారని బలం చేకూరేలా అటాప్సీ రిపోర్ట్‌ను మార్చారని పిటీషన్‌లో వెల్లడించారు.అంతేకాదు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు నాశనం చేయడం, సీసీటీవీ ఫుటేజీలను మార్చడం, పోస్టుమార్టం రిపోర్ట్‌పై ఎలాంటి అనాలసిస్ చేయకుండా హడావిడిగా దహన సంస్కారాలు చేశారని, పొలిటికల్ లీడర్ల ప్రోద్బలంతో పోలీసులు కేసును నీరు గార్చారని చెప్పారు.
పిటిషన్‌లో సుశాంత్ గురించి ప్రస్తావిస్తూ
దిశ సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో నటుడు సుంశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ప్రస్తావించారు. మరణించిన రోజే సుశాంత్ సింగ్ భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు.కానీ తన కుమార్తె డెడ్ బాడీని 50 గంటలు, అంతకంటే ఎక్కువ సమయం తీసుకుని పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టు మార్టం ఆలస్యం వెనక లైంగిక దాడి సాక్ష్యాల్ని ధ్వంసం చేయడం, ప్రధాన నిందితుడు ఆదిత్యా ఠాక్రేను రక్షించే ప్రయత్నం చేసినట్లు మరిన్ని ఆరోపణలు చేశారు.
సీబీఐకి అప్పగించాలి
కాబట్టి, తన కుమార్తె దిశా మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్వాధీనం చేసుకుని సమగ్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. అందుకు, 2023లో మానవ హక్కుల సంఘం నేత, సుప్రీం కోర్టు,హై కోర్టు లిటిగెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రషీద్ ఖాన్ పఠాన్ దాఖలు చేసిన మునుపటి పిటిషన్‌తో తాను దాఖలు చేసిన ఈ కొత్త పిటిషన్‌ను అనుసంధానించాలని అభ్యర్థించారు. దిశ మరణంపై ముంబై పోలీసు చీఫ్‌కి రషీద్ ఖాన్ పఠాన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో దిశా మరణంలో నిందితులుగా ఉన్న వ్యక్తిలపై హత్యానేరం కింద అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఆ ఫిర్యాదును సైతం పరిగణలోకి తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. 2023లో మహారాష్ట్ర ప్రభుత్వం దిశ మరణంపై ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT)ఏర్పాటు చేసింది. కానీ సిట్ దర్యాప్తు అధికారులు దిశ సాయిలిన్ రిపోర్టు ఇంకా సమర్పించలేదు.
అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
దిశ సాలియన్ తంత్రి సతీష్ సాలియన్ తన కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఐదేళ్ల తర్వాత 228 పేజీల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం దిశ మరణిస్తే.. ఇప్పుడే పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న వివాదం మహారాష్ట్రను కుదిపేస్తున్నది. సమాధిని తొలగించాలంటూ నాగ్‌పూర్‌లో కొందరు చేపట్టిన నిరసన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. ఆ వివాదం నుంచి భయటపడేందుకే దిశసాలియన్ కేసును తెరపైకి తెచ్చారని మాట్లాడారు.
శివసేన ఎమ్మెల్యే ఆదిత్యా ఠాక్రే సైతం స్పందించారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రయత్నిస్తున్నారని, న్యాయస్థానంలో ఈ అంశంపై స్పందిస్తామని అన్నారు. మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సాట్ దిశ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాని అన్నారు. తన కుమార్త మరణాన్ని తట్టుకోలేక దిశ తండ్రి బహిరంగంగా ముందుకు వచ్చి పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment