నిధుల వినియోగంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం
- కేంద్ర నిధులను మళ్లిస్తున్నారంటూ మండిపాటు
- ప్రతి పనిలో జన్మభూమి కమిటీలతో పనేంటి?
- దిశా సమావేశంలో సభ్యుల ధ్వజం
కర్నూలు(హాస్పిటల్): నిరుపేదల అభ్యున్నతి కోసం వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ(దిశా) అధ్యక్షురాలు, ఎంపీ బుట్టా రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016-17లో కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగంపై ఎంపీతోపాటు జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ ఎంపీ బుట్టా రేణుక ప్రశ్నించారు.
అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమాచారం ఇవ్వడంతో పాటు గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద గత ఏడాది రూ.588కోట్లతో 196లక్షల పనిదినాలు లక్ష్యం కాగా రూ.435కోట్లతో 164లక్షల పనిదినాలే కల్పించారని చెప్పిన ఎంపీ.. లక్ష్యసాధనలో లోపాలను డ్వామా పీడీ పుల్లారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదంతో పనేంటని ఎంపీ అధికారులను ప్రశ్నించారు.
స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద మంజూరైన నిధులు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉంచి రెండు నెలల్లోనే రూ.180కోట్ల పనులు మంజూరు చేయడంపై ఆరా తీశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 105రోడ్ల మరమ్మతుల నిర్వహణకు సంబంధించి నివేదికలు అందజేయాలని పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరాయుడిని ఆదేశించారు. రెండు సంవత్సరాల్లో పేదల ఇళ్లకు సంబంధించి వెయ్యి దరఖాస్తులిచ్చారని, అవి ఏఏ దశలో ఉన్నాయని ప్రశ్నించగా పరిశీలించి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపిస్తామని హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్ నివేదించారు.
‘ఉపాధి’ కింద లక్ష్యాన్ని మించి మంజూరు : కలెక్టర్
నీటి సంరక్షణ విషయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాన్ని మించి మంజూరు ఇచ్చామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఉపాధి పనుల వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలకు అందజేయాలని డ్వామా పీడీ పుల్లారెడ్డిని ఆదేశించారు. నగరానికి తాగునీటి విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని వివరణ కోరగా గాజులదిన్నె ప్రాజెక్టులో 0.51టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ప్రస్తుతం ఇస్తున్న విధానంలో నీటిని విడుదల చేస్తే జూన్ చివరి వరకు సరిపోతాయన్నారు. పల్లెల్లో తాగునీటి విషయమై చర్చకు రాగా డీపీఓ సమావేశానికి హాజరుకాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమో జారీకి ఆదేశాలిచ్చారు. తన ఆదర్శ గ్రామాల్లో ఒక్క పని మొదలు కాలేదంటూ జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ను ఎంపీ ప్రశ్నించగా టెండర్ దశలో ఉన్నాయని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెళ్లి చేసుకోవాలన్నా జన్మభూమి కమిటీని అడగాలా?
– బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్
పెళ్లి చేసుకోవాలన్నా తమను అడగాలనే ధోరణిలో జన్మభూమి కమిటీలు వ్యవహరిస్తున్నాయి. ఏ స్కీమ్ వచ్చినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై పెత్తనం చెలాయిస్తున్నారు. వారు చెప్పారని ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లను తీసేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకునేందుకు వారితో పనేంటి? ఎమ్మెల్యేగా ఉన్నా మరుగుదొడ్డి, ఇళ్లు, బోరు మంజూరు చేయించే అధికారం నాకు లేకుండా పోయింది. డీఆర్డీఏ సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఎందుకు నిలబెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం సరిగ్గా అందించాలన్నారు.
కల్లూరు వార్డులపై వివక్ష..
–గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాణ్యం నియోజకవర్గ పరిధిలోని 14 వార్డులపై వివక్ష చూపుతున్నారు. నగరంలో రెండురోజులకోసారి నీరు వస్తే కల్లూరు 14 వార్డుల్లో వారం, పదిరోజులకు కానీ విడుదల చేయడం లేదు. గత కలెక్టర్.. జిల్లాలో నీటి కరువే లేనట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. కరువు పనుల బిల్లులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనుల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. యాపర్లపాడు రోడ్డు ఇప్పటి వరకు ఎందుకు మంజూరు కాలేదు? కర్నూలు నగరానికి మంత్రులు వస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలవకుండా వివక్ష చూపుతున్నారు. పిన్నాపురం, కందికాయ, ఉప్పలపాడు గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చండి.
ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వండి..
–ఐజయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే
ఉపాధి కూలీలకు మూడు నెలలుగా నిలిచిన వేతనాలను వెంటనే ఇవ్వండి. రోజుకు రూ.197 ఇవ్వాల్సి ఉండగా రూ.120 నుంచి రూ.130 మాత్రమే ఇస్తున్నారు. ఎండలు మండుతున్నా సరైన సౌకర్యాలు లేవు. వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారిని పక్కన పెట్టి వారికి అనుకూలమైన వారికి పింఛన్లు వెంటనే మంజూరు చేస్తున్నారు. వంద శాతం వికలత్వం ఉన్నా వికలాంగుల కోటాలో పింఛన్ రావడం లేదు. వయసు ఎక్కువ నమోదు చేయించుకుని పింఛన్లు స్వాహా చేస్తున్న కేసులు అనేకం ఉన్నాయి.