కూటమి పాలనలో.. కీచక పర్వం
గత 8 నెలల్లో 20 పోక్సో కేసులు నమోదు
రోలుగుంట జేసీ అగ్రహారంలో దివ్యాంగ బాలికపై లైంగిక దాడి
రాంబిల్లిలో మైనర్ బాలికను హత్య చేసిన ప్రేమోన్మాది
యలమంచిలిలో ముగ్గురు మైనర్ బాలికలపై అఘాయిత్యాలు
అనకాపల్లిలో నిద్రిస్తున్న బాలికపై అత్యాచార యత్నం
నర్సీపట్నంలో 9వ తరగతి విద్యార్థినికి యువకుడి వేధింపు
పసి పాపలు.. అభం శుభం తెలీని బాలికలు.. ప్రతిఘటించలేని దివ్యాంగులు.. ఎందరెందరో చిన్నారులను చిదిమేశారు. లైంగిక దాడితో తీరని గాయం చేశారు.. కొందరి ప్రాణాలు కూడా తీశారు.. జిల్లాలో మహిళలపై అత్యాచారాలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా పోక్సో కేసులు( ఎక్కువయ్యాయి. పట్టపగలు నడి రోడ్డుపై నడిచేందుకు కూడా జడవాల్సిన దుస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేటి వరకు జిల్లావ్యాప్తంగా 20 పోక్సో కేసులు నమోద య్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దిశ పోలీస్ స్టేషన్లు(Disha Police Station) మూసేశారు. దిశ యాప్‌కు మంగళం పాడారు. ఆఖరికి లైంగిక దాడుల కేసులను త్వరగా తేల్చడానికి ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా వద్దనుకున్నారు. అందుకే మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులకు సైతం కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆమె సొంత జిల్లాలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే ఇది ఆమెకే సిగ్గుచేటు.
సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళల భద్రతకు కరువైంది. ఒక మహిళా హోంమంత్రి(Anitha Vangalapudi) సొంత జిల్లాలోనే బాలికలకు, మహిళలకు భద్రత లేకపోతే .. రాష్ట్రంలో అతివల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ మహిళా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల యలమంచిలి మండల పరిధిలో రెండు మూడు వారాల వ్యవధిలోనే ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా 20 పోక్సో కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో మహిళా భద్రతకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను, దిశ కాల్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టులను నిర్వహించారు.
ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడాలన్నా.. అఘాయిత్యం చేయాలన్నా భయపడేలా ఉండేది. అంతేకాకుండా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్షలు కూడా పడేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోక్సో కేసులు పెరిగాయి. వీటిలో రోలుగుంట మండలంలో జేసీ అగ్రహారంలో దివ్యాంగ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులోనే ముద్దాయికి శిక్ష పడింది. మిగతా అన్ని కేసులు దర్యాప్తులో ఉన్నాయి. యలమంచిలిలో 8వ తరగతి విద్యారి్థనిపై స్వయాన బావే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనకాపల్లి టౌన్‌లో తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్న ఆ బాలిక నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి యత్నించినరు.
ఇలా ఒకటి కాదు జిల్లాలో 20 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలపై దాడులు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే మృగాలపై కఠిన శిక్షలు విధించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభం శుభం తెలియని పసిపాపలపై లైంగిక వేధింపులకు పాల్పడే మృగాలకు కఠిన శిక్షలు విధిస్తే మరొకరు చేయడానికి భయపడతారంటూ మహిళా సంఘాల నేతలు సూచిస్తున్నారు. వారిపై కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షించాలి. లేదంటే వారు మరింత విజృంభిస్తారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మహిళల భద్రతపై ఫోకస్ పెట్టి దిశ యాప్‌ను, దిశ పోలీస్‌స్టేషన్లను మళ్లీ పునరుద్ధరించాలి.
జిల్లాలో గత ఏడాది జూన్ 4 తరువాత నుంచి నమోదైన పోక్సో కేసుల్లో ప్రధానమైనవి..
జూలై 6: రోలుగుంట మండలం జేసీ అగ్రహారానికి చెందిన 16 ఏళ్ల దివ్యాంగురాలైన బాలికపై అదే ప్రాంతానికి చెందిన మోటార్ మెకానిక్ దాసు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోక్సో కేసు నమోదు చేయగా.. కోర్టు దాసుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
జూలై 7: రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో 14 ఏళ్ల మైనర్ బాలికను సురేష్ అనే యువకుడు ప్రేమోన్మాదం పేరిట అత్యాచారం చేసి హత్య చేశాడు. మరుసటిరోజు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
అక్టోబర్ 15: యలమంచిలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో లైన్‌కొత్తూరులో గల న్యూలైఫ్ హాస్టల్‌లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినిపై హాస్టల్ కేర్‌టేకర్(వార్డెన్) రావాడ శ్రీను వేధింపులకు పాల్పడ్డాడు.
అక్టోబర్ 19: అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో కుమారపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికతో అదే గ్రామానికి చెందిన రెడ్డి అశోక్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
అక్టోబర్ 22: యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8వ తరగతి బాలికపై బావ అత్యాచారానికి పాల్పడ్డాడు.
అక్టోబర్ 25: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లు పరిధిలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఆర్.శివ అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
అక్టోబర్ 29: యలమంచిలి పట్టణం రామ్‌నగర్‌లో ఒక వివాహిత తనకు 18 ఏళ్లు నిండకుండా వివాహం చేశారని ఫిర్యాదు చేయగా భర్తపై పోక్సో కేసు పెట్టారు.
అక్టోబర్ 30: అర్ధరాత్రి అనకాపల్లి గవరపాలెంలో సంతోషిమాత ఆలయ రహదారి సమీపంలో అమ్మమ్మ ఇంటి వద్ద నిద్రిస్తున్న 12 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల యల్లపు శ్రీరామ్మూర్తి అత్యాచారం చేసేందుకు యత్నంచాడు.
జనవరి 28: యలయంచిలిలో 13 ఏళ్ల బాలికను హాకీ కోచ్ రూపేష్ అత్యాచారం చేశాడు. బాలికలకు కోచ్‌గా ఉంటూ హాకీ నేర్పస్తామని లైంగిక దాడికి పాల్పడ్డాడు.
జనవరి 11: ఏటికొప్పాకలో నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది.
భయపడకుండా ఫిర్యాదు చేయాలి..
గంజాయి, మద్యం లాంటి మత్తు పదార్థాలకు బానిసై బాలికలపై లైంగిక వేధింపులకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భయపడకుండా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే వారికి శిక్ష పడుతోంది. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పోలీసులు అవగాహన కల్పించాలి. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడితే వారికి పడే శిక్షలపై ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించా.
– కరణం కృష్ణ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, విశాఖ పోక్సో కోర్టు
విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు
జిల్లాలో ప్రతి పాఠశాల, కళాశాలల్లో సంకల్పం పేరిట విద్యార్థులకు నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే వేసే శిక్షల గురించి వివరిస్తున్నాం. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై కూడా విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. నేరాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు. జిల్లాలో ఈ ఏడాదిలో నమోదైన పోక్సో కేసుల్లో ధర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తాం. మైనర్ బాలికలపై, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీస్ స్టేషన్‌లో లేదా సచివాలయంలో ఉన్న మహిళ కానిస్టేబుల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే నేరుగా 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
– తుహిన్ సిన్హా, జిల్లా ఎస్పీ
ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిపై ప్రభుత్వం స్పందించాలి
Comments
Please login to add a commentAdd a comment