
బాంబే హైకోర్టును ఆశ్రయించిన దిశా సాలియన్ తండ్రి
ఆదిత్య ఠాక్రేపై తీవ్ర ఆరోపణలు, కేసు నమోదుకు వినతి
శివసేన (యూబీటీ) యువ నాయకుడు ఆదిత్య ఠాక్రేకు మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ కోర్టుకెక్కారు. తన కూతురు మరణం కేసులో ఠాక్రేను కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించి, ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరినట్టు పీటీఐ వెల్లడించింది.
అసలేం జరిగింది?
2020, జూన్ 9న దిశా సాలియన్ (Disha Salian) అనుమానాస్పద పరిస్ధితుల్లో చనిపోయింది. ముంబైలోని మలద్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ 14వ ఫ్లోర్ నుంచి పడిపోయి ఆమె ప్రాణాలు కోల్పోయింది. చనిపోవడానికి ముందు ప్రియుడు రోహన్, మరికొంత మందితో కలిసి ఆమె పార్టీలో పాల్గొంది. ఈ నేపథ్యంలో దిశపై లైంగిక దాడి చేసి చంపారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ముంబై పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు మరణించిందని కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి.
‘ఆమె మరణం వెనుక వారి హస్తం’
దిశ మరణించి వారం రోజులు కూడా గడవకముందే, అంటే 2020, జూన్ 14న బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో వీరిద్దరి మరణాలకు ఏదైనా లింకు ఉందేమోనని అప్పట్లో అనుమానాలు రేగాయి. అయితే దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశారని అప్పటి బీజేపీ ఎంపీ నారాయన్ రాణె ఆరోపించడంతో సంచలనం రేగింది. ఆమె మరణం వెనుక రాజకీయ నేతలు, బాలీవుడ్‌కు చెందిన వాళ్ల హస్తం ఉందని ఆరోపించారు. తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని సుశాంత్‌తో దిశ చెప్పిందని.. దీంతో అతడిని వాళ్లు వేధించడం మొదలుపెట్టారని, అందుకే సుశాంత్ ప్రాణాలు తీసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
మరోసారి తెరపైకి ఠాక్రే పేరు
ఇదే అంశాన్ని ఏక్‌నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే 2022, డిసెంబర్‌లో లోక్‌సభలో లేవనెత్తారు. సుశాంత్ మృతి కేసులో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తనపై ఆరోపణల్లో వాస్తవం లేదని అప్పట్లో ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) కొట్టిపారేశారు. ఠాక్రేపై కేసు నమోదు చేసి విచారించాలని దిశ తండ్రి బాంబే హైకోర్టును ఆశ్రయించడంపై తాజాగా మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది.
చదవండి: జట్కా మటన్ అంటే ఏంటి.. ఎక్కడ దొరుకుతోంది?
అత్యాచారం చేసి హత్య చేశారు
దిశను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని, దీని వెనుకున్న కొంత మంది రాజకీయ ప్రముఖులను కాపాడటానికి కుట్రపూరితంగా కేసును తప్పుదోవ పట్టించారని దిశ తండ్రి తాజాగా రోపించారు. ముంబై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేశామని మొదట్లో తాము నమ్మామని, కానీ కేసును కప్పిపుచ్చారని అనుమానాలు కలుతున్నాయన్నారు. "ముంబై పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు, సందర్భోచిత రుజువులు, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తు మరణం కేసుగా తేల్చి హడావిడిగా ముగించారు" అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘తెర వెనుక రాజకీయ కుట్ర’
దాదాపు ఐదేళ్ల తర్వాత దిశా సాలియన్ కేసులో మళ్లీ ఆదిత్య ఠాక్రే పేరును తెరపైకి తేవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) పేర్కొన్నారు. ఠాక్రే కుటుంబాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి నిరంతరాయంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ నాయకుడిపై ఈ విధంగా కుట్రలు చేయడం మహారాష్ట్ర సంస్కృతి కాదన్నారు. ఇలాంటి ఆరోపణలు తమ లాంటి నాయకులపై చాలానే చేశారు కానీ అవేవీ నిరూపితం కాలేదని గుర్తు చేశారు. ఔరంగజేబు వివాదం నుంచి ప్రజల చూపును మళ్లించేందుకు ఐదేళ్ల తర్వాత ఈ కేసును మళ్లీ ఇప్పుడు తెరపైకి తెచ్చారని రౌత్ ఆరోపించారు. శివసేన (యూబీటీ) పార్టీ ప్రతినిధి కిషోరి పెడ్నేకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment