
బాంబే హై కోర్టు (ఫైల్‌ఫోటో)
ముంబై: ఆత్మహత్యకు పాల్పడిన పుణె యువతి కేసుకు అనవసర పబ్లిసిటీ ఇవ్వొద్దంటూ బాంబే హై కోర్టు శుక్రవారం మీడియాను ఆదేశించింది. యువతి మరణం తర్వాత.. వేరే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని.. దాని గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో మృతురాలి తండ్రి తన కుమార్తె మరణానికి సంబంధించి మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని.. దీని అడ్డుకోవాలని హై కోర్టును ఆశ్రయించాడు.
ఎస్ ఎస్ షిండే అధ్వర్యంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి తరఫున సీనియర్ లాయర్ శిరిష్ గుప్తే వాదిస్తూ.. ‘‘పుణెకి చెందిన యువతి గత నెల 8న తన ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియాలు ఆమె మృతి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. వేరే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని.. దాని గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక మృతురాలికి, వేరే వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణలు అంటూ కొన్ని వీడియోలను ప్రచారం చేస్తున్నాయి. తక్షణమే వీటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలి’’ అంటూ కోర్టును కోరారు.
ఈ వాదనలు విన్న బెంచ్.. ‘‘బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మీడియా ట్రయల్స్‌కు సంబంధించి హై కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను మీడియా సంస్థలు పాటించాలి. బాధితురాలి మరణానికి అనవసర ప్రచారం ఇవ్వకూడదు. అంతేకాక ఆమెకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచారం చేయకూడదు’’ అని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.
చదవండి:
భార్య.. భర్త ఆస్తికాదు: హైకోర్టు
భార్య పొగాకు నములుతోంది.. విడాకులు కావాలి
Comments
Please login to add a commentAdd a comment