mediacl services
-
కోట్లు పెట్టి భవనాలు, లక్షలు పోసి పరికరాలు.. కాని ఏం లాభం..!
నారాయణ్‌పేట్: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న’ చందంగా తయారైంది మద్దూరు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) పరిస్థితి. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి భవనం, రూ.లక్షలు వెచ్చించి అధునాతన యంత్రాలు, సౌకర్యాలు కల్పించినా చివరికి వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూన్ 16న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 30 సీహెచ్‌సీని ప్రారంభించారు. అప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ భవనాన్ని వైద్యవిధాన పరిషత్‌కు అప్పగించారు. దీంతో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి కిందకు ఈ సీహెచ్‌సీ వెళ్లింది. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్‌తో పాటు పీహెచ్‌సీలోని స్టాఫ్ నర్స్‌లతో ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉదయం సయమంలో పీహెచ్సీలో పనిచేస్తున్న ఓ డాక్టర్ ఓపీ చూస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం కావాలంటే గతంలో మాదిరిగానే జిల్లా కేంద్రానికి లేదా మహబూబ్‌నగర్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎనిమిది మంది డాక్టర్లకు ఒక్కరే..? సీహెచ్‌సీ అసుపత్రిలో గైనిక్ సేవలు, జనరల్ సర్జన్, చిన్నపిల్లలకు వైద్య నిపుణుడు, మత్తు వైద్యుడు, దంత, అత్యవసర సేవలకు ఇలా మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఒక సూపరింన్డెంట్, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక అయూష్ మెడికల్ అధికారి, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, అఫ్తాలమిక్ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, ఓటి టెక్నీషియన్ 10 మంది నర్సులు, ఇతర సిబ్బందితో పాటు మరో 20 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. పీహెచ్సీలో, జిల్లా అసుపత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్‌లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ సీహెచ్‌సీకి ఎలాంటి పోస్టులు ఇంకా మంజూరు కాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అసుపత్రిలో పనిచేస్తున్న వారిని ఇక్కడి పంపించినట్లు అధికారులు తెలిపారు. అన్నీ ఉన్నా.. రూ.3.67 కోట్లతో సీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ ఆస్పత్రిలో అప్పటి కలెక్టర్ హరిచందన చొరవతో 2022 డిసెంబర్ 27న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(యూఎస్ఏ) సంస్థ సహకారంతో రూ. 10లక్షల వ్యయంతో 10 బెడ్లకడ్లాక్సిజన్ అందించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈసీజీ, స్కానింగ్, తదితర వైద్య పరీక్షల సామగ్రి కూడా అందుబాటులో ఉంది. అన్నీ ఉన్నా డాక్టర్లే లేకపోవడం గమనార్హం. వైద్యం అందింటే నా భార్య బతికేది.. నెలలు నిండిన నా భార్య కాన్పు కోసం మద్దూరు సీహెచ్‌సీకి వచ్చింది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన నర్సులు కాన్పు చేస్తామన్నారు. తీరా డెలవరీ సమయంలో రక్తస్రావాన్ని అరికట్ట లేకపోవడంతో నా భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఒకవేళ డాక్టర్లు అందుబాటులో ఉండి ఉండే నా భార్య, పాప చనిపోయి ఉండేవారు కాదు. – కృష్ణ, తిమ్మారెడ్డిపల్లి, మద్దూరు, మండలం పోస్టులు మంజూరు కాలే.. వైద్యవిధాన పరిషత్ నుంచి మద్దూరు, కోస్గి ఆస్పత్రులకు పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా ఆస్పపత్రి నుంచి ఒక డాక్టర్‌ను డిప్యూటేషన్‌పై ఓపీ చూడడానికి అక్కడికి పంపిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టులు మంజూరు అవ్వొచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. – రంజిత్‌కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, నారాయణపేట అత్యవసర వైద్యం అందక.. గతేడాది ఆగస్టు 5న మండలంలోని తిమ్మారెడ్డిపల్లి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణి(26) పురుటినొప్పులు రావడంతో ఇదే సీహెచ్‌సీ రాగా... వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్‌లు కాన్పు చేసేందుకు యత్నించారు. శిశువు పురిటిలోనే మృతి చెందగా.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసే క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భిణిని హుటాహుటీనా 108లో జిల్లా అసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె సైతం మృతి చెందింది. ఒకవేళా అందుబాటులో వైద్యులు ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మృతురాలి భర్త కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీహెచ్‌సీ.. మద్దూరు, దామరగిద్ద, దౌల్తాబాద్, మండలాల నుంచి దాదాపు 80 గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
ఈసారి భారతరత్న వాళ్లకే ఇవ్వండి: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం ముందు సరికొత్త డిమాండ్‌ను ఉంచారు. కరోనాపై పోరాటంలో ముందు వరసలో నిలిచి ప్రజల ప్రాణాలు కాపాడిన భారతీయ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఈ ఏడాది భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక లేఖ కూడా రాశాడు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందరికీ సమూహంగా భారత రత్న ఇవ్వాలని, అసరమైతే నిబంధనలు మార్పు చేయాలని కోరారు. ఈ ఏడాది భారతరత్నను వైద్యుడికి ఇవ్వాలని దేశం కోరుకుంటోందని అలా అని ఎవరో ఒకరికి ప్రకటించమని తాను కోరడం లేదన్నారు. దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందరినీ కలిపి సముచిత గౌరవం కల్పించాలని కోరారు. ఈ విధంగా ప్రకటించడమే కరోనాతో పోరాడి మృతి చెందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికిచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. చదవండి: ఉచిత విద్యుత్.. రోజంతా కరెంట్ లక్షలాది మంది వైద్య సిబ్బంది నిస్వార్థంగా సేవలందించారని, దేశం మొత్తం వైద్యులను కీర్తిస్తోందని, వారందరినీ భారతరత్నతో గౌరవిస్తే భారతీయులందరూ సంతోషిస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఐఎంఏ లెక్కల ప్రకారం.. కరోనాతో ఇప్పటిదాకా 1,492 మంది వైద్యులు చనిపోగా.. కరోనా వారియర్లుగా వేల సంఖ్యలో మిగతా వైద్య సిబ్బంది మృత్యువాత పడ్డారు. -
ఆమె చావుకు అంత పబ్లిసిటీ వద్దు: హైకోర్టు
ముంబై: ఆత్మహత్యకు పాల్పడిన పుణె యువతి కేసుకు అనవసర పబ్లిసిటీ ఇవ్వొద్దంటూ బాంబే హై కోర్టు శుక్రవారం మీడియాను ఆదేశించింది. యువతి మరణం తర్వాత.. వేరే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని.. దాని గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో మృతురాలి తండ్రి తన కుమార్తె మరణానికి సంబంధించి మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని.. దీని అడ్డుకోవాలని హై కోర్టును ఆశ్రయించాడు. ఎస్ ఎస్ షిండే అధ్వర్యంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి తరఫున సీనియర్ లాయర్ శిరిష్ గుప్తే వాదిస్తూ.. ‘‘పుణెకి చెందిన యువతి గత నెల 8న తన ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియాలు ఆమె మృతి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. వేరే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని.. దాని గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక మృతురాలికి, వేరే వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణలు అంటూ కొన్ని వీడియోలను ప్రచారం చేస్తున్నాయి. తక్షణమే వీటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలి’’ అంటూ కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న బెంచ్.. ‘‘బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మీడియా ట్రయల్స్‌కు సంబంధించి హై కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను మీడియా సంస్థలు పాటించాలి. బాధితురాలి మరణానికి అనవసర ప్రచారం ఇవ్వకూడదు. అంతేకాక ఆమెకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచారం చేయకూడదు’’ అని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. చదవండి: భార్య.. భర్త ఆస్తికాదు: హైకోర్టు భార్య పొగాకు నములుతోంది.. విడాకులు కావాలి -
ఉపాధి, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
‘‘వ్యాపారి లాభార్జనపై ఆధార పడి బతుకుతాడనేది అందరికీ తెలిసిందే. అంటువ్యాధుల సమయంలో శవాలను దహనం, ఖననం చేసే వాడు ఆ సమయంలోనే డబ్బు సంపాదించాలని చూస్తాడు. వ్యాపారి కూడా అంటువ్యాధులతో సహా ఏ సందర్భమైనా ధనార్జనే ధ్యేయంగా జీవించడానికి వెనుకా డడు. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంటుంది. శవాలను పూడ్చే వ్యక్తి అంటువ్యాధులను సృష్టించడు. కానీ, వ్యాపారి అంటువ్యాధులను సృష్టించగలడు’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1945లో ‘కాంగ్రెస్ పార్టీ, గాంధీ అంటరాని వారికి ఏం చేశారు’’అన్న గ్రంథంలో రాసిన వాక్యాలివి. ఈనెల 20వ తేదీన దావోస్‌లో జరిగిన ‘వరల్డ్ ఎక నామిక్ ఫోరం’ సదస్సు విడుదల చేసిన ‘ది ఇన్‌ఈక్వాలిటీ వైరస్’ నివేదిక, కరోనా విలయతాండవం చేసిన సమయంలో సంపన్నులు మరింత సంపన్నులయ్యారనే విష యాన్ని బయటపెట్టి, అంబేడ్కర్ వ్యాఖ్యలను అక్షర సత్యాలను చేసింది. కరోనా లాంటి వైరస్ సృష్టికి, వ్యాప్తికి వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కారణమనే చర్చ కూడా జరుగుతోంది. కరోనాయే కాదు, ఇంకా అనేక ఆరోగ్య, వాతావరణ సమస్యలకు ఈ వర్గాలు కారణం. వ్యాపారస్తుల లాభాపేక్ష వల్ల రసాయనాల వాడకం పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కల్తీ కారణంగా వ్యాధులు రావడం, రోగనిరోధక శక్తి తగ్గడం, రోగాల ఉపశమనానికి మందుల కోసం పరుగులు తీయడం... మళ్లీ ఆ మందులు తయారు చేసేదీ వారే. కరోనాతో యావత్ ప్రపంచం విలవిల్లాడుతోన్న కష్ట కాలంలో భారతదేశంలోని వందమంది కోటీశ్వరులు మరిన్ని కోట్లకు పడగలెత్తారని ఆక్స్‌ఫామ్ సంస్థ తాజా నివే దికలో తేల్చిచెప్పింది. భారతదేశంలోని సంపన్నులు కరోనా సమయంలో తమ సంపదను 35 శాతం పెంచుకున్నారు. 84 శాతం కుటుంబాలు ఉపాధిని, ఆదాయాలను కోల్పో యాయి. ప్రతి గంటకు లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగాలను కోల్పోయారు. దాదాపు 13 కోట్ల మంది కార్మికులు ఉద్యో గాలు కోల్పోయారు. హోటళ్ళు, పర్యాటక రంగం, రిటైల్ దుకాణాలు, వినోద సంబంధితమైన వ్యాపారాలు, చిన్న చిన్న హాస్పిటల్స్, ఫిట్నెస్ సెంటర్లు, చిన్న, మధ్య తరహా ప్రైవేట్ పాఠశాలలు, రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఎక్కు వగా ఉపాధిని కోల్పోయారు. అయితే కొన్ని వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే కార్యకలాపాలు మిగిలాయి. అందులో కార్పొరేట్ సర్వీసులు, లీగల్ సర్వీసులు, పబ్లిక్ సేఫ్టీ, ఐటీ సర్వీసులు ప్రముఖంగా ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళలో మహిళల శాతం అధికంగా ఉన్నది. మెకంజా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వే, పురుషులకన్నా దాదాపు రెండు రెట్లు అధికంగా మహిళలు ఉద్యోగాలు కోల్పోయినట్లు తేల్చింది. చిన్న, మధ్య తరగతి మహిళా వ్యాపారవేత్తల ఆదాయాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఇప్పటి వరకు ఒకకోటీ 6 లక్షల 70 వేల మంది కరోనా దాడికి గురయ్యారు. ఒక లక్షా 53 వేల మంది మరణించారు. ఇవి ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు నిర్దిష్టమైన వివరాలను సేకరించలేదు. చాలా మంది కరోనా వల్ల చనిపోయినప్పటికీ ప్రభుత్వాలు వాటిని ఇతర వ్యాధుల కింద చూపెడుతున్నాయి. ఒక కోటి మందికి పైగా కరోనా బారిన పడినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఎక్కువ మంది ప్రభుత్వ వైద్యం కాకుండా ప్రైవేట్ గానే చికిత్స చేయించుకున్నారు. సరాసరిగా ఒక లక్ష రూపా యలు ఖర్చు పెట్టినా లక్ష కోట్ల రూపాయలు కరోనావల్ల నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో మనం ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నాం. భారత ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటినీ అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి నేర్పిన అనుభవాల నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఏ అంశాలు ప్రాధాన్యంగా ఉండాలి? విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు అంశాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాదాపు 20 కోట్లకు పైగా ఉన్న వలస కార్మికులకు తిరిగి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారనేది ప్రశ్న. దీనికి బడ్జెట్లో ప్రాధాన్యత ఉండాలి. సంపన్నులైన పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య వర్గాలను ఇటు వైపుగా ఆలోచింపజేయాలి. దావోస్‌లో విడుదల చేసిన నివే దికలో ఆక్స్‌ఫామ్ చేసిన ముఖ్యమైన సూచన ఇక్కడ ప్రస్తావించాలి. వేల కోట్ల, లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న కోటీశ్వరులపైన ప్రత్యేకంగా కరోనా పన్నును విధించి, దానితో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాలి. మరొక ముఖ్యమైన అంశం వైద్య, ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు. ముఖ్యంగా వైద్యరంగంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నది. ఇప్పటికీ దేశంలో వైద్యం మీద అవుతున్న ఖర్చులో 75 శాతం ఖర్చుని ప్రజలే భరిస్తున్నారు. 2015–16లో కేంద్ర ప్రభుత్వం 17,90,783 కోట్లు ఖర్చు చేస్తే, అందులో వైద్యరంగానికి వెచ్చించింది 34,131 కోట్లు. ఇది బడ్జెట్ ఖర్చులో 1.91 శాతం మాత్రమే. నూటికి నూరు శాతం మందికీ అత్యవసరమైన, ప్రాణప్రదమైన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాల శ్రద్ధకు ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో. 2020–21 బడ్జెట్లో వైద్యరంగం వాటా 2.22 శాతం మాత్రమే. అదే రక్షణ రంగానికి చూస్తే, 2015–16లో 2 లక్షల 25 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్లో అది 12.61 శాతం. 2020–21 వరకు అయిదేళ్లలో ఒక కోటీ 39 లక్షల 63 వేల 845 కోట్ల రూపాయలను రక్షణ కోసం ఖర్చు చేస్తే, ప్రజల ఆరోగ్యానికి 3 లక్షల 11 వేల 921 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారు. దీనిని బట్టి ప్రభుత్వాల ప్రాధాన్యతేమిటో మనకు అర్థం అవుతుంది. ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే, కరోనా లాంటి సమస్యలు మళ్ళీ ఎదురైతే ఈసారి ప్రజలను రక్షించడం ఎవరి వల్లా కాదు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల కన్నా ప్రజలే ఎక్కువగా ఖర్చును భరించారు. కాబట్టి సంఘాలు, సంస్థలు, వేదికలు, రాజకీయ పార్టీలు బడ్జెట్‌కు ముందే, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి. ఆరోగ్యరంగంతో సహా అన్ని రంగాలకు ప్రాధా న్యతాక్రమంలో కేటాయింపులు ఉండేలా డిమాండ్ చేయాలి. ఇప్పటికైనా పౌరసమాజం మేల్కొనకపోతే, సామాన్యజనం పాలిట కోవిడ్ లాంటి మరిన్ని మహమ్మారులు మృత్యు శకటాలుగా మారతాయన్నది సత్యం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
వచ్చీరాని వైద్యానికి చిన్నారి బలి
సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : ఓ ఆర్ఎంపీ వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం..చంద్రగిరి కొత్తపేటకు చెందిన లోకనాథం, శాంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. లోకనాథం సీనియర్ ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేయడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం లోకనాథం కుమార్తెలు విషిక, రిషిక(9) జ్వరం బారిన పడడంతో స్థానిక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ సుధాకర్ వద్దకు తీసుకెళ్లారు. అతను రాసిచ్చిన ప్రిస్కిప్షన్ మేరకు అతని మందుల షాపులోనే మందులు కొని తీసిచ్చారు. తొలుత విషికకు సుధాకర్ చికిత్స చేశారు. అనంతరం రిషికకు వేర్వేరు నడుం దిగువ భాగంలో ఇంజెక్షన్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రిషిక కాలుకు తీవ్రంగా వాపు రావడంతో మరోసారి సుధాకర్‌ను సంప్రదించారు. ఇదేమీ కాదని వారికి ఆయన చెప్పారు. అంతేకాకుండా అతని సూచన మేరకు రిషిక కాలుకు వేడినీటితో కాపడం పెట్టారు. సోమవారం ఉదయం పాప కాలు పూర్తిగా వాచిపోవడంతో పాటు వాంతులయ్యాయి. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు తాటితోపు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వెద్యులు చెప్పడంతో అక్కడి నుంచి తిరుపతిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. పాపకు పలు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు, చంద్రగిరిలో పాపకు వేసిన ఇంజెక్షన్ వలన కాలుకు ఇన్ఫెక్షన్కు గురైందని, దీనివలన శరీరంలో రక్తం పూర్తిగా గడ్డకట్టడంతో పాటు ప్రాణాపాయ స్థితికి చేరిందని వెల్లడించారు. అనంతరం చికిత్స ప్రారంభించేలోపు పాప కన్నుమూసింది. మృతదేహంతో చంద్రగిరికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి కారణమైన పీఎంపీ సుధాకర్‌ను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రిషికకు అంత్యక్రియలు నిర్వహించారు. అనుమతులు లేకున్నా క్లినిక్స్ నిర్వహణ చంద్రగిరిలో అనుమతులు లేకుండా పీఎంపీలు క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని నిబంధన ఉంది. అయితే కొందరు ఏకంగా మెడికల్ షాపులు సైతం అనుబంధంగా పెట్టి, ఆపరేషన్లు సైతం చేస్తుండటం గమనార్హం! మిడిమిడి జ్ఞానంతో రోగుల జీవితాలో చెలగాటమాడుతున్నారు. సుధాకర్ కూడా ఆపరేషన్లు చేసేవాడని స్థానికుల ద్వారా తెలిసింది. ఇతని సర్టిఫికెట్‌కి వ్యాలిడిటీ లేకపోయినా సంబం«ధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. క్లినిక్‌కు అనుబంధంగా సుధాకర్ ఓ మెడికల్ షాపును సైతం నిర్వహిస్తున్నారు. ఇదలా ఉంచితే, సుధాకర్ రాసిచ్చిన మందుల ప్రిస్కిప్షన్‌ను మండల స్థాయి వైద్యాధికారి దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది.దానిని పరిశీలించిన ఆయన అవి నాసిరకమైన లోకల్ మందులుగా ఉన్నాయని, కంపెనీవి కావని వైద్యాధికారి చెప్పారు. నిద్రావస్థలో వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలో కొన్నిచోట్ల పీఎంపీలు ఎలాంటి అనుమతి లేకుండా చికిత్స, ఆపరేషన్లు చేస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి. దీనిపై డీఎంహెచ్ఓను వివరణ కోరగా అది తమ పరిధిలోకి రాదని, డ్రగ్స్ అధికారులు చూసుకోవాలంటూ ఫోన్ పెట్టేశారు. -
ప్రభుత్వ ఆసుపత్రులకు గ్రేడ్లు!
సాక్షి, గుంటూరు: పనితీరు ప్రాతిపదికగా రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులు, ఏరియా వైద్యశాలలకు నెలనెలా గ్రేడ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2001లో ఇదే మాదిరిగా గ్రేడ్లను నిర్ణయించి వైద్యుల పనితీరును బేరీజు వేశారు. తర్వాత ఈ విధానాన్ని తొలగించారు. మళ్లీ ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఇప్పటికే జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పరిధిలో ఉన్న సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల పనితీరును వివిధ అంశాల వారీగా బేరీజు వేసి జిల్లా స్థాయిలో గ్రేడ్లను నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానం అమలైతే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలాంటి బోధనాస్పత్రులు, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏరియా వైద్యశాలల్లో ప్రతి రోజు ఓపీ సేవలకు వచ్చే రోగుల సంఖ్య, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య, ల్యాబ్, స్కానింగ్, ఎక్స్‌రే వంటి సేవలు ఎంతమంది పొందారు, ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు, వైద్యసేవలు ఎంతమంది పొందారనే దానిపై ప్రతి నెలా నివేదిక పంపాలి. దీంతోపాటు ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగులు పడుతున్న ఇబ్బందులు, వైద్యుల పనితీరు వంటి వాటిపై కూడా నివేదిక ఇవ్వాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి నివేదికలు రాగానే వాటిని పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి గ్రేడ్లు కేటాయిస్తారు. తక్కువ గ్రేడ్లు వచ్చిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని సమాచారం. మంచి గ్రేడ్ సాధించిన ఆస్పత్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వటంతోపాటు ఎక్కువ నిధులు కేటారుుస్తారని తెలుస్తోంది. తీవ్ర ఆందోళనలో ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకూ ఒత్తిడి లేకుండా పనిచేసిన తాము ఇక మీదట ఇబ్బందులు పడక తప్పదని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల విజయవాడ ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి వైద్యులు, సిబ్బంది పనితీరు బాగాలేదని రోగులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు కుక్కకాటుకు గురై ఓ బాలుడు ఆస్పత్రికి వస్తే వ్యాక్సిన్ ఇవ్వకుండా గుంటూరు ఆస్పత్రికి వెళ్లాలని చెప్పిన వైద్యుడిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి ఆస్పత్రులపై పడింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు పేద రోగులు జంకుతున్నారని గ్రహించిన పాలకులు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేటు ఆస్పత్రులు నడుపుతున్న, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల గురించి సమాచారం అందించాలని ప్రభుత్వం ఇంటిలిజెన్స్ అధికారులను ఆదేశించింది. నిఘా వర్గాలు తమపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వ వైద్యులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు విధుల్లో ఉండాలని సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం.