టెన్త్‌ అర్హతతో 10 మెడికల్‌ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం | These Medical Courses After 10th High Paid Courses | Sakshi
Sakshi News home page

టెన్త్‌ అర్హతతో 10 మెడికల్‌ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం

Published Thu, Jan 2 2025 1:22 PM | Last Updated on Thu, Jan 2 2025 3:12 PM

These Medical Courses After 10th High Paid Courses

టెన్త్‌ చదువుతున్న చాలామందికి వైద్యవిద్యను అభ్యసించాలని ఉంటుంది. అయితే వారి ఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో ఎంబీబీఎస్‌ చేయలేని స్థితిలో ఉంటారు. ఇలాంటివారికి వైద్యరంగంలోకి ప్రవేశించేందుకు పలు మార్గాలు ఉన్నాయి. వీటికి 10వ తరగతి పాసయితే చాలు. ఈ కోర్సులను పూర్తిచేసి, చక్కని ఉపాధితో పాటు అధిక జీతాన్ని కూడా అందుకోవచ్చు. ఆ కోర్సులు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. డీఎంఎల్‌టీ (డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ)
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ల్యాబ్ టెస్టులు, రోగ నిర్ధారణ, రిపోర్టు ప్రిపరేషన్ మొదలైనవి నేర్పిస్తారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. అధిక జీతం కూడా అందుకోవచ్చు.

2. రేడియాలజీ టెక్నాలజీ కోర్సు
ఈ కోర్సులో చేరినవారికి ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ యంత్రాలను ఆపరేట్ చేయడం నేర్పుతారు. 10వ తరగతి తర్వాత రెండు సంవత్సరాల ఈ డిప్లొమా కోర్సు చేయవచ్చు. కోర్సు పూర్తయ్యాక రూ.30,000 నుంచి రూ.50,000 వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు.

3. డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharm)
ఈ  రెండు సంవత్సరాల కోర్సులో ఔషధాలు, వాటి విక్రయాల గురించిన సమాచారాన్ని బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మెడికల్ స్టోర్ ప్రారంభించవచ్చు. లేదా ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పని చేయవచ్చు.

4. ఆప్టోమెట్రీలో డిప్లొమా
ఈ కోర్సులో కంటి సంబంధిత వ్యాధుల చికిత్స, దృష్టిని మెరుగుపరచడానికి అవసరమైన శిక్షణను అందిస్తారు. ప్రారంభ వేతనం రూ. 25,000 నుంచి రూ. 40,000 వరకు ఉంటుంది.

5. ANM/GNM (నర్సింగ్ కోర్సు)
రెండు సంవత్సరాల పాటు ఉండే ఈ కోర్సులో ప్రాథమిక నర్సింగ్ నైపుణ్యాలను బోధిస్తారు. నర్సింగ్ ఫీల్డ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం అందుకోవచ్చు.

6. డెంటల్ హైజీనిస్ట్ కోర్సు
ఈ కోర్సులో దంతాల శుభ్రత, వ్యాధులను గుర్తించడం మొదలైనవి నేర్పిస్తారు. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ప్రారంభ వేతనం రూ. 25,000 నుంచి మొదలవుతుంది

7. డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ (DPT)
ఈ రెండు సంవత్సరాల కోర్సులో శారీరక రుగ్మతలను నయం చేసే పద్ధతులు నేర్పుతారు. ఈ కోర్సు పూర్తి చేశాక క్లినిక్ తెరవడం లేదా ఆసుపత్రిలో పని చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని అందుకోవచ్చు.

8. హోమియోపతి అసిస్టెంట్ కోర్సు
ఈ కోర్సు  రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిలో హోమియోపతి మందులు,  చికిత్సకు సంబంధించిన శిక్షణను అందిస్తారు. దీనిని పూర్తి చేసిన తర్వాత, సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది.

9. సర్జికల్ అసిస్టెంట్ కోర్సు
శస్త్రచికిత్స సమయంలో వైద్యునికి సహాయం చేయడానికి ఈ కోర్సు ద్వారా శిక్షణనిస్తారు. ఈ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది.  ఈ కోర్సుకు అత్యధిక డిమాండ్‌ ఉంది.

10. అంబులెన్స్ అసిస్టెంట్ కోర్సు
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ను నడపడానికి, ప్రథమ చికిత్స అందించడంపై శిక్షణనిస్తారు. ప్రారంభ వేతనం రూ.20,000 నుండి రూ.30,000 వరకు ఉంటుంది.

ఇది కూడా చదవండి: అర్థ, పూర్ణ, మహాకుంభమేళాల్లో తేడాలేమిటి?.. ఈసారి ఎందుకంత ప్రత్యేకం?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement