ప్రభుత్వ ఆసుపత్రులకు గ్రేడ్‌లు! | Government hospitals grade! | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆసుపత్రులకు గ్రేడ్‌లు!

Published Fri, Dec 26 2014 2:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

Government hospitals grade!

సాక్షి, గుంటూరు: పనితీరు ప్రాతిపదికగా రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులు, ఏరియా వైద్యశాలలకు నెలనెలా గ్రేడ్‌లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2001లో ఇదే మాదిరిగా గ్రేడ్‌లను నిర్ణయించి వైద్యుల పనితీరును బేరీజు వేశారు. తర్వాత ఈ విధానాన్ని తొలగించారు. మళ్లీ ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఇప్పటికే జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పరిధిలో ఉన్న సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల పనితీరును వివిధ అంశాల వారీగా బేరీజు వేసి జిల్లా స్థాయిలో గ్రేడ్‌లను నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే.
 
  ఈ విధానం అమలైతే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలాంటి బోధనాస్పత్రులు, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏరియా వైద్యశాలల్లో ప్రతి రోజు ఓపీ సేవలకు వచ్చే రోగుల సంఖ్య, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య, ల్యాబ్, స్కానింగ్, ఎక్స్‌రే వంటి సేవలు ఎంతమంది పొందారు, ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌లు, వైద్యసేవలు ఎంతమంది పొందారనే దానిపై ప్రతి నెలా నివేదిక పంపాలి. దీంతోపాటు ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగులు పడుతున్న ఇబ్బందులు, వైద్యుల పనితీరు వంటి వాటిపై కూడా నివేదిక ఇవ్వాలి.
 
 రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి నివేదికలు రాగానే వాటిని పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి గ్రేడ్‌లు కేటాయిస్తారు. తక్కువ గ్రేడ్‌లు వచ్చిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని సమాచారం. మంచి గ్రేడ్ సాధించిన ఆస్పత్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వటంతోపాటు ఎక్కువ నిధులు కేటారుుస్తారని తెలుస్తోంది.
 
 తీవ్ర ఆందోళనలో ప్రభుత్వ వైద్యులు
 ప్రభుత్వ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకూ ఒత్తిడి లేకుండా పనిచేసిన తాము ఇక మీదట ఇబ్బందులు పడక తప్పదని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల విజయవాడ ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి వైద్యులు, సిబ్బంది పనితీరు బాగాలేదని రోగులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు కుక్కకాటుకు గురై ఓ బాలుడు ఆస్పత్రికి వస్తే వ్యాక్సిన్ ఇవ్వకుండా గుంటూరు ఆస్పత్రికి వెళ్లాలని చెప్పిన వైద్యుడిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి ఆస్పత్రులపై పడింది.
 
  వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు పేద రోగులు జంకుతున్నారని గ్రహించిన పాలకులు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  ప్రైవేటు ఆస్పత్రులు నడుపుతున్న, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల గురించి సమాచారం అందించాలని ప్రభుత్వం ఇంటిలిజెన్స్ అధికారులను ఆదేశించింది. నిఘా వర్గాలు తమపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వ వైద్యులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు విధుల్లో ఉండాలని సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement