![Bombay High Court Says Sushant Singh Rajput Face Tells He Was Sober - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/8/Sushant-Singh-Rajput.jpg.webp?itok=Ex1UzTX7)
ముంబై: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎస్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడు హుందాగా వ్యవహరించేవాడని ముఖం చూస్తేనే తెలిసిపోతుందని, ముఖ్యంగా ఎంఎస్ ధోని సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించాడని పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ సోదరీమణులు ప్రియాంక సింగ్, మీతూ సింగ్ తమపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నేపథ్యంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే అతడికి మందులు ఇచ్చారని, అతడి మృతితో తనకు సంబంధం లేదంటూ సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రియాంక, మీతూపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఈ కేసును సీబీఐ లోతుగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ప్రేమలో పడితే.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు)
ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన సుశాంత్ సోదరీమణులు దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ ఎస్‌ఎస్ షిండే నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘కేసు ఏదైనా కానివ్వండి.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముఖం చూస్తే అతడు అమాయకుడు, హుందాగా వ్యవహరించేవాడు.. అలాగే ఓ మంచి మనిషి అన్న విషయం అర్థమవుతుంది. ఎంఎస్ ధోని సినిమాలో తన నటన చూసి ప్రతి ఒక్కరు అతడిని ఇష్టపడ్డారు’’ అని జస్టిస్ షిండే వ్యాఖ్యానించారు. కాగా గతేడాది జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించిన విషయం విదితమే. అతడి అనుమానాస్పద మృతి పలు మలుపులు తిరిగిన అనంతరం సీబీఐ చేతికి వచ్చింది. ఈ కేసుతో బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి జైలుకు వెళ్లి బెయిలుపై విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment