న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ కేసు విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు స్టేటస్ ఏమిటి? అని ప్రశ్నించారు ఎంపీ. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఆదిత్య ఠాక్రే 44 సార్లు ఫోన్ చేసినట్లు గతంలో తేలిందని గుర్తు చేశారు.
లోక్‌సభలో షిండే వర్గం ఎంపీ రాహుల్ షెవాలే మాట్లాడుతూ..‘ఏయూ నుంచి రియా చక్రవర్తికి 44 సార్లు ఫోన్ వెళ్లింది. ఏయూ అంటే ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే అని బిహార్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రస్తుత స్టేటస్ ఏంటి?’అని ప్రశ్నించారు.
తిప్పికొట్టిన ఆదిత్య ఠాక్రే..
లోక్‌సభ వేదికగా తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు ఆదిత్య ఠాక్రే. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఊహించలేమని విమర్శలు గుప్పించారు. ‘నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పగలను. సొంత పార్టీకి, ఇంట్లో విధేయుడిగా ఉండని వారి నుంచి ఇంతకు మించి ఆశించలేం. ఇది కేవలం సీఎం ఏక్‌నాథ్ షిండే భూకుంభకోణం, రాష్ట్ర ప్రముఖులను అవమానించిన అంశాలను పక్కదారిపట్టించేందుకే చేస్తున్నారు. అలాంటి నిరాధారమైన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని స్పష్టం చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఏయూ అనే వ్యక్తికి మధ్య పలుమార్లు ఫోన్ కాల్స్ నడిచినట్లు 2020లోనే ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 44 కాల్స్ వెళ్లినట్లు పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణంపై ఆదిత్య ఠాక్రే మౌనంగా ఉండిపోవడంతో ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బిహార్ ప్రభుత్వం ఆరోపించింది. యాదృచ్చికంగా ఆ సమయంలో ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ ఖాతా @AUThackeray అని ఉండటం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
ఇదీ చదవండి: సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment