మాజీ లవర్స్‌ మాట దాటేశారు!! | Shahid, Kareena skip questions on working together again | Sakshi
Sakshi News home page

మాజీ లవర్స్‌ మాట దాటేశారు!!

Published Mon, Apr 18 2016 3:18 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మాజీ లవర్స్‌ మాట దాటేశారు!! - Sakshi

మాజీ లవర్స్‌ మాట దాటేశారు!!

ముంబై: షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌.. చాలాకాలం తర్వాత ఈ మాజీ ప్రేమజంట వెండితెరపై ఒకే సినిమాలో కనిపించబోతున్నది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఉడ్తా పంజాబ్‌' చిత్రంలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు.

ఒకప్పుడు బాలీవుడ్‌లో గాఢమైన ప్రేమపక్షులుగా పేరొందిన షాహిద్‌, కరీన ఆ తర్వాత వేరయ్యారు. ఎవరి తోడును వారు వెతుక్కున్నారు. ఈ ఇద్దరు కలిసి చివరిసారి నటించిన చిత్రం 'జబ్‌ వుయ్‌ మెట్‌'. ఆ సినిమా సమయంలోనే ఇద్దరికి బ్రేకప్‌ అయింది. ఎన్నో ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఇప్పుడు ఈ మాజీ లవర్స్‌.. అభిషేక్ చుబే తీసిన 'ఉడ్తా పంజాబ్‌'లో దర్శనమివ్వబోతున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్ సందర్భంగా ఈ జంట ఒకే వేదికపై కనిపించింది. నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్‌ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదు. ఈ విషయమై ప్రశ్నించగా షాహిద్‌, కరీన మాట దాటేశారు. భవిష్యత్‌లో మీరిద్దరూ కలిసి నటించే అవకాశముందా? అన్న ప్రశ్నకు కూడా డొంక తిరుగుడు సమాధానమిచ్చారు.

'ఉడ్తా పంజాబ్‌' సినిమాలో మీరిద్దరు కలిసి నటించే దృశ్యం ఒక్కటి కూడా లేనందుకు బాధాపడ్డారా? అని ప్రశ్నించగా 'గతంలో జరిగిన దాని గురించి మీరు బాధపడుతున్నారా? అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న' అని షాహిద్ బదులిచ్చాడు. 'జబ్ వుయ్‌ మెట్‌' సినిమా డీవీడీలు ఉన్నాయిగా? ఇంక కలిసి నటించడమెందుకు? అన్న తరహాలో కరీన బదులిచ్చింది. అంటే 'జబ్‌ వుయ్‌ మెట్‌' సినిమా తరహాలో మీరిద్దరు కలిసి నటించే అవకాశం భవిష్యత్తులో లేదన్నమాట? అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఆ విషయం ఇంతియాజ్ అలీ (ఆ చిత్ర డైరెక్టర్‌) చెప్తారు' అంటూ కరీన జవాబు దాటేసింది. 'జబ్ వుయ్ మెట్'కు సీక్వెల్ వచ్చేది ఉంటే ఎప్పుడో వచ్చేదని, ఇప్పుడు ఇంతియాజ్ ఆ సినిమా నుంచి ఎంతో ముందుకెళ్లిపోయారని షాహిద్ వివరణ ఇచ్చాడు.

ఇక కలిసి ఫొటోలకు పోజు ఇవ్వొచ్చుగా అని విలేకరులు కోరినా.. ఈ జంట అందుకు సుమఖత వ్యక్తం చేయలేదు. సహ నటులు అలియా భట్‌, దిల్జిత్‌ దుసాంజ్‌లను తమమధ్యకు పిలిపించుకొని ఫొటొలు దిగారు కానీ, పక్కపక్కన ఉండి ఫొటోలు దిగేందుకు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement