హీరోయిన్ నటన మూవీకి హైలైట్..
ముంబై: తీవ్ర విమర్శలు, వివాదాల నడుమ విడుదలైన చిత్రం 'ఉడ్తా పంజాబ్'. నలుగురు వ్యక్తుల జీవితాలను కథాంశంగా చూపిస్తూ, పంజాబ్ లో డ్రగ్స్ మాఫియా ఏ స్థాయిలో ఉందన్న విషయాలను దర్శకుడు అభిషేక్ చౌబే తెరకెక్కించారు. వలస కూలీ పాత్రలో ఆలియా భట్ నటన సినిమాకు హైలైట్ గా చెప్పవచ్చు. ఆలియా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంటుందని ఉడ్తా పంజాబ్ లో పంజాబీ రాక్ స్టార్ టామీ సింగ్ పాత్రలో కనిపించిన షాహిద్ కపూర్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మూవీతో మీరు జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నారా అన్న మీడియా ప్రశ్నకు బదులుగా.. గతేడాది హైదర్ విషయంలో ఇలాగే అనుకున్నాను. ఎన్నో అంచనాలు పెట్టుకున్నా అవార్డు రాలేదు. దీంతో ఈసారి అలాంటి ఆలోచనలు లేవని షాహిద్ చెప్పాడు.
ఒకప్పుడు హాకీ ప్లేయర్ అయిన ఆలియా భట్ (పింకీ) అనుకోని పరిస్థితుల్లో పంజాబ్‌కు కూలీగా వలస వెళ్తుంది. మాదకద్రవ్యాల వలలో పడిపోయి ఎన్నో కష్టాలు పడుతుంది. తొలిసారి డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించిన ఆలియా, ఈసారి అందంతో కాకుండా అభినయంతో మ్యాజిక్ చేసింది. ఆలియాకు అవార్డు రావడం ఖాయమని షాహిద్ మరోసారి పేర్కొన్నాడు. ఇందులో చాలా క్లిష్టమైన పాత్రలో కనిపించానని, ఇలాంటి పాత్ర తనకు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆలియా అంటోంది.