
'ముంబైలో నివసించడం మానేశారా?'
'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదం బాలీవుడ్, సెన్సార్ బోర్డు మధ్య చిచ్చు రాజేసింది. సెన్సార్ బోర్డు సినిమాలో మొత్తం 89 సీన్లను కట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్కు బాలీవుడ్ బాసటగా నిలిచింది. అలానే ఇటు టాలీవుడ్ లో కూడా పలువురు సినీ ప్రముఖులు సెన్సార్ బోర్డు తీరుపై మండి పడుతున్నారు.
సినిమా పేరు మార్చాలన్న అంశంపై రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. 'నేను పంజాబీనే. మనం సినిమాని సినిమాలా చూడాలి. సినిమా విడుదల తర్వాత కూడా పంజాబీలు పంజాబ్ లోనే ఉంటారు, రాష్ట్రాన్ని ఇంతకు ముందులానే ప్రేమిస్తారు. ముంబై టెర్రరిజమ్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతమాత్రాన ప్రజలు ముంబైలో నివసించడం మానేశారా' అంటూ ప్రశ్నించారు. నిజంగా సినిమాల్లో అలాంటివేమైనా చూపిస్తే.. అవి ప్రజలకు అవగాహనను కల్పిస్తాయన్నారు.
వివాదంపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. సినిమాలు భావ వ్యక్తీకరణ మాధ్యమాలు. మన హక్కును కాపాడుకునేందుకు గొంతు ఎత్తాల్సిందేనన్నారు. సెన్సార్ కు ముందు, తర్వాత అంటూ ఓ హాస్యాస్పదమైన ఫొటోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీరితోపాటు రాఘవేంద్రరావు కోడలు, రచయిత కణిక, హీరో సిద్ధార్థ్, డైరెక్టర్ దేవా కట్ట తదితరులు సోషల్ మీడియా ద్వారా 'ఉడ్తా పంజాబ్' చిత్ర యూనిట్ కు మద్దతుగా నిలిచారు. వాస్తవానికి సినిమా ఈ నెల 17న విడుదల కావాల్సి ఉంది. సినిమాలో ముఖ్యమైన సీన్లను కట్ చేసి సెన్సార్ బోర్డు నియంతలా వ్యవహరిస్తోందని సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందించారు. మొత్తానికి బాలీవుడ్ లో ఈ వివాదం మరింత జటిలంగా మారుతుంది.