సీఎంగారూ ఈ సినిమా తప్పక చూడండి
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ బాగుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుటుంబ సభ్యులు ఈ 'పవర్ఫుల్ సినిమా'ను తప్పకుండా చూడాలని కేజ్రీవాల్ అన్నారు. ఈ సినిమా చూస్తే పంజాబ్కు బాదల్ ఏం చేశారో తెలుస్తుందని చెప్పారు. డ్రగ్స్ రాకెట్ లో రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ఉడ్తా పంజాబ్లో స్పష్టంగా చూపించారని కేజ్రీవాల్ అన్నారు.
'రాజకీయ నాయకులు డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్టు ఈ సినిమాలో చూపించారు. అంతేగాక ఎన్నికల సమయంలో ఉచితంగా డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారు. పంజాబ్ పరిస్థితి బాధాకరం' అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్లో విచ్చలవిడి డ్రగ్స్ అమ్మకాలు, వాటి బారినపడి నాశనమవుతున్న యువకుల జీవితాలను కథాంశంగా తీసుకుని దర్శకుడు అభిషేక్ చాబే ఉడ్తా పంజాబ్ సినిమాను తెరకెక్కించారు. సెన్సార్ బోర్డు వివాదాలను దాటుకుని ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.