కర్రపెత్తనం ‘సెన్సార్’ | Sensor board domination over movies | Sakshi
Sakshi News home page

కర్రపెత్తనం ‘సెన్సార్’

Published Wed, Jun 15 2016 12:24 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Sensor board domination over movies

ఎట్టకేలకు ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం సెన్సార్ శృంఖలాలను తెంచుకుంది. ఆ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) ప్రతిపాదించిన 89 కత్తిరింపులు చెల్లవని బొంబాయి హైకోర్టు తీర్పునివ్వడంతోపాటు 48 గంటల్లోగా దానికి సర్టిఫికెట్ అందించాలని ఇచ్చిన ఆదేశాలు సంస్థ నిర్వాహకులకు చెంపపెట్టు. దేన్నయినా నిషేధించాలన్నా, దేనికైనా అభ్యంతరం చెప్పాలన్నా, పెత్తనం చలా యించి అందరినీ హడలెత్తించాలన్నా చాలామందికి సరదా. పేరు వేరైనా, నిర్వర్తిం చాల్సిన బాధ్యతలు భిన్నమైనా జనం నోళ్లలో ‘సెన్సార్ బోర్డు’గా స్థిరపడిపోయింది గనుక సినిమాలను ఎడాపెడా కత్తిరించుకుంటూ పోదామని సీబీఎఫ్‌సీ సభ్యులు అనుకుంటున్నారు. ఎవరైనా ఎదురుతిరిగినప్పుడూ, పోరాడినప్పుడూ... న్యాయ స్థానాల్లో ప్రశ్నించినప్పుడూ తప్ప ఇది అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది. నిజానికిది పుట్టుకతో వచ్చిన బుద్ధి.

ఈ దేశంలో 1920లో సినిమాటోగ్రాఫ్ చట్టం అమలుకావడం ప్రారంభమయ్యాక అప్పటి ప్రధాన నగరాలైన మద్రాస్, బొంబాయి, కలకత్తా, లాహోర్, రంగూన్‌లలో సెన్సార్ బోర్డులు ఏర్పాటయ్యాయి. వాటికి మొదట్లో పోలీస్ చీఫ్‌లే నేతృత్వం వహించారు. స్వాతంత్య్రానంతరం సెన్సార్ బోర్డు పేరూ మారింది. దాని రూపురేఖలూ మారాయి. కానీ దాని ‘పోలీస్ మనస్తత్వం’ మాత్రం అలాగే ఉండిపోయింది. తమ ముందుకొచ్చిన ప్రతి చిత్రాన్ని అనుమానించడం, దానివల్ల సమాజానికెదో కీడు జరుగుతుందని శంకించడం... తమ కత్తెర్లకు పని చెప్పడం సెన్సార్ బోర్డు సభ్యులకు అలవాటైపోయింది. ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు గంగలో కలుస్తున్నాయని, కళాత్మక విలువలకు తీరని అన్యాయం జరుగుతున్నదని వారు గుర్తించలేకపోతు న్నారు. మీరు చేస్తున్న పనికీ, మీకు అప్పగించిన బాధ్యతలకూ పొంతన ఉండటం లేదని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు చీవాట్లు పెట్టాయి. కానీ మారిందేమీ లేదు. పాలకులు కూడా ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుంటున్నారు.

సీబీఎఫ్‌సీలో సాగుతున్న అరాచకాన్ని కొనసాగనిస్తున్నారు. దాని నిర్వహణ తీరు బాగులేదను కుంటే జోక్యం చేసుకుని సరిచేయడం ప్రభుత్వాలకు పెద్ద కష్టం కాదు. కానీ ఆ పని చేయడానికి అవి సిద్ధపడటం లేదు. తమ సన్నిహితులతో సీబీఎఫ్‌సీని నింపడం అలవాటైపోయింది. అలా నియామకమయ్యేవారిలో అప్పుడప్పుడు నిష్ణాతులైన వారు కూడా ఉంటున్నారన్నది నిజమే అయినా సీబీఎఫ్‌సీకంటూ శాశ్వతమైన, ఉన్నతమైన విధానాలను రూపొందించడంలో ఎవరూ శ్రద్ధపెట్టలేదు. ఈ విష యంలో షర్మిలా టాగోర్ లాంటివారు కొన్ని చర్యలు తీసుకున్నారు. పహ్లాజ్ కూడా సినిమా రంగంలో అనుభవశాలే. కానీ నిరుడు జనవరిలో సీబీఎఫ్‌సీ చీఫ్ అయ్యాక ఆయన వరసబెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అంద రినీ దిగ్భ్రాంతిపరుస్తున్నాయి. నిషేధ పదాల జాబితా ఒకటి విడుదల చేసి, వాటిని ‘ఏ’ సర్టిఫికెట్ చిత్రాల్లో కూడా అనుమతించేది లేదని ప్రకటించినప్పుడు...‘ఏ’ సర్టిఫికెట్ చిత్రాలను చానెళ్లలో ప్రసారం చేయాలంటే మరిన్ని కోతలకు సిద్ధపడి వాటికి ‘యూ’ లేదా ‘యూఏ’ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని హుకుం జారీ చేసినప్పుడు పెద్ద కలకలం చెలరేగింది. ఆ అంశాల్లో సెన్సార్‌బోర్డు సభ్యుల మధ్య వాగ్యుద్ధమే నడిచింది. కానీ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు.

 అనురాగ్ కశ్యప్ మనకున్న కొద్దిమంది సృజనాత్మక దర్శకుల్లో ఒకరు. ధన్‌బాద్ బొగ్గు గని మాఫియా కార్యకలాపాలు ఇతివృత్తంగా వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, 1993నాటి ముంబై పేలుళ్ల నేపథ్యంతో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’వంటి చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న ‘ఉడ్తా పంజాబ్’ కూడా  మాదకద్రవ్యాల సమస్యపై నిర్మించిన చిత్రం. పంజాబ్ యువతపైనా, సమాజంపైనా మాదకద్రవ్యాలు కలిగిస్తున్న దుష్పరిణామాలను అది చర్చించింది. ఆ సినిమాపై నిహలానీ తన పరిధులు దాటారు. రాజకీయ నేతలా ఆలోచించారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఎన్నికల్లో పాలకపక్షం విజయావకాశాలను ఈ చిత్రం ప్రభావితం చేస్తుందని అనుకున్నారు. అందుకే చిత్రం పేరులోగానీ, సంభాషణల్లోగానీ పంజాబ్ పేరు రావడానికే వీల్లేదని శాసించారు. ఇలాంటి సమస్య ఈ పుణ్యభూమిలో లేదని ఆయన భావన కాబోలు! ఫలితంగా చిత్రానికి మొత్తం 89 కోతలుపడ్డాయి. నిహలానీ లాంటివారుంటే ‘మదర్ ఇండియా’, ‘చాందినీ చౌక్’, ‘బొంబాయి’వంటి చిత్రాలు వెలుగు చూసేవే కాదన్నమాట.

 మన దేశంలోని సినిమాలు ఇటీవల ఊహాలోక విహారాన్ని తగ్గించు కున్నాయని... సామాజిక సమస్యలపై దృష్టిసారిస్తున్నాయని చాలామంది భావిస్తు న్నారు. ఇదొక మంచి పరిణామమని అనుకుంటున్నారు. కానీ పహ్లాజ్ తీరు వేరేగా ఉంది. వాస్తవం నుంచి సినిమా ఎంతగా పారిపోతే అంత ఉత్తమమని ఆయన విశ్వసిస్తున్నారు. పాత్రోచిత సంభాషణలు, ఉద్వేగాలు కనబడకూడదని... ఏ రాష్ట్రం పేరూ, ప్రాంతం పేరూ వినబడకూడదని శాసిస్తున్నారు. సినిమాలన్నీ ‘పంచ తంత్రం’తరహాలో ఉండాలన్నది ఆయన ఉద్దేశమేమో! ఇలాంటి ధోరణులను కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోరాదు. ఇప్పటికే  సీబీఎఫ్‌సీ ప్రక్షాళన కోసం శ్యాంబెనెగల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకుంది.

ఆ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికపై తదుపరి చర్యలు ప్రారంభించాలి. ‘ఉడ్తా పంజాబ్’ కేసులో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా సీబీఎఫ్‌సీని చక్కదిద్దాలి. స్వతంత్రంగా, నిజాయితీగా, జవాబుదారీతనంతో అది పనిచేసేలా అవసరమైన మార్పులు చేయాలి. బొంబాయి హైకోర్టు చెప్పినట్టు అది అమ్మమ్మ మాదిరిగా ప్రవర్తించడం విరమించుకుంటే... సినిమా తీసేవారిని ఆకతాయిలుగా భావించడం మానుకుంటే సృజనాత్మకత బతికిబట్ట కడుతుంది. ప్రపంచ దేశాల్లో మన పరువు నిలబడుతుంది.

 

సెన్సార్‌షిప్, సమాజానికి తన పైన తనకు నమ్మకం లేకపోవడాన్ని వ్యక్తం చేస్తుంది.

 - పోటర్ స్టీవర్ట్
అమెరికన్ కమెడియన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement