హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో డ్రగ్స్‌ను అడ్డుకుంటామని చెప్పడానికి పంజాబ్‌ను ఉదాహరణగా తీసుకున్నారు. కర్ణాటకను 'ఉడ్తా పంజాబ్'లా మారనిచ్చేది లేదిన కామెంట్ చేశారు. డ్రగ్స్ అంశాన్ని కర్ణాటక శాసనమండలిలో బీజేపీ సభ్యులు ప్రస్తావించినప్పుడు ఆయనిలా స్పందించారు. రాష్ట్రంలో డ్రగ్స్ భూతాన్ని తరిమేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, ప్రధానంగా బెంగళూరు, మంగళూరు నగరాల్లో ఇది చేపడుతున్నామని అన్నారు. బెంగళూరును పంజాబ్ మార్గంలో నడవనిచ్చేది లేదన్నారు. ఇక్కడ ఉడ్తా పంజాబ్ ఉండబోదని పరమేశ్వర వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ భూతం విస్తరిస్తున్నా ప్రభుత్వం మాత్రం దానిపై అస్సలు స్పందించడం లేదన్న అంశాన్ని బీజేపీ ఎమ్మెల్సీ లోహర్ సింగ్ మండలిలో ప్రస్తావించారు. అయితే తాము ఇప్పటికే దీన్ని సీరియస్‌గా తీసుకున్నామని, డ్రగ్ పెడ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సూచించామని హోం మంత్రి పరమేశ్వర చెప్పారు. కాలేజీల సమీపంలో ఉండే చిన్న దుకాణాలను డ్రగ్స్ అమ్మకాలకు అడ్డాలుగా చేసుకుంటున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. గత రెండున్నర నెలల్లో డ్రగ్స్ సంబంధిత కేసుల్లో 65 మంది భారతీయులు, 23 మంది విదేశీయులను అరెస్టు చేశామని అన్నారు.