షాహిట్‌ కపూర్‌ | shahid kapoor special story on his movie rangoon release | Sakshi
Sakshi News home page

షాహిట్‌ కపూర్‌

Published Thu, Feb 23 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

షాహిట్‌ కపూర్‌

షాహిట్‌ కపూర్‌

కొందరు కుర్రాళ్లు ఏ కారణం లేకుండా కూడా చెడిపోతారు. కొందరు కుర్రాళ్లు కారణాలు ఉండి చెడిపోతారు. కొందరు కుర్రాళ్లు మాత్రం చెడిపోవడానికి అన్ని కారణాలు ఉన్నా గట్టిగా, మొండిగా, తొణక్కుండా, బెణక్కుండా కుటుంబం కోసం, లక్ష్యం కోసం నిలబడతారు.

షాహిద్‌కపూర్‌ నటించిన ‘ఉడ్‌తా పంజాబ్‌’ పెద్ద సంచలనం రేపింది. డ్రగ్స్‌ మత్తులో దొర్లే పంజాబ్‌ రాష్ట్ర పరిస్థితులను చెప్పే ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌ డ్రగ్స్‌కు బానిసైన ఒక రాప్‌ సింగర్‌గా నటించాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ షాహిద్‌ను కరడుగట్టిన డ్రగ్స్‌ బానిస అనే నిర్థారణకు వస్తారు. కాని వాస్తవం ఏమిటంటే షాహిద్‌ జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్‌ తాకి ఎరగడు. నిజం ఏమిటంటే అతడు మద్యం కూడా తాగి ఎరగడు. ఇంకా నిజం ఏమిటంటే అతడు పక్కా శాకాహారి. మాంసం కూడా ముట్టడు.

దేశంలో పెద్ద హీరోగా చాలా మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండి సాయంత్రమైతే పార్టీలు, పబ్‌లు ఉండే బాలీవుడ్‌ వాతావరణంలో ఉన్నా షాహిద్‌ ఇలాగే తన కేరెక్టర్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఇది మామూలు సంగతి కాదు. పెద్ద విజయం.

షాహిద్‌కు మూడేళ్ల వయసప్పుడు అతడి తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి పంకజ్‌ కపూర్, తల్లి నీలిమా అజీమ్‌. పంకజ్‌ కపూర్‌ ప్యారలల్‌ సినిమాల నటుడు. కమర్షియల్‌ సినిమాలలో వచ్చే పాత్రలు, డబ్బులు అతడికి రావు. ఇక నీలిమా అజీమ్‌ కథక్‌ డాన్సర్, మోడల్‌. కొన్ని సినిమాలలో నటించింది. వీళ్లిద్దరి కాపురం షాహిద్‌ పుట్టాక ఒడిదుడుకులకు లోనైంది. విడాకుల తర్వాత నీలిమ.. షాహిద్‌ను తీసుకుని ఢిల్లీకి వెళ్లిపోయింది. పదేళ్ల వయసు వచ్చే వరకూ షాహిద్‌ ఢిల్లీలోనే పెరిగాడు.

దేవుడు ఒక తోడును తెంపేస్తే రెండు ఆసరాలను ఇస్తాడు. చిన్నారి షాహిద్‌కు ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్యలే గొప్ప నేస్తాలు. వారిద్దరూ అప్పట్లో రష్యా నుంచి వెలువడే ‘స్పుత్నిక్‌’ పత్రిక కోసం పని చేసేవారు. షాహిద్‌కు తాతయ్య రోజూ కథలు చెప్పేవాడు. విడిపోయిన తండ్రి పట్ల ద్వేషం కలగకుండా మంచి మాటలు మాట్లాడేవాడు. కాని షాహిద్‌కు మాత్రం తనతో ఉన్న తల్లి అంటేనే ఎంతో ఇష్టం ఉండేది. తల్లి ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది –‘అప్పుడు షాహిద్‌కు ఐదేళ్లు కూడా లేవు. నేను ఢిల్లీలో చాలా ఆలోచనలతో సతమతమయ్యేదాన్ని. ఒకరోజు రాత్రి నేను బాగా ఏడుస్తున్నాను. షాహిద్‌ నన్ను గమనించాడు. ఏమనుకున్నాడో ఏమో అంత చిన్న వయసులో నన్ను దగ్గరకు తీసుకుని ‘ఏడవకమ్మా. నేనున్నానుగా అన్నాడు. అది నేను మర్చిపోలేను’ అంటుందామె. నిజంగానే షాహిద్‌ ఎప్పుడూ కుటుంబానికి నేనున్నాను అన్నట్టుగానే ఉన్నాడు. బాధ్యత తప్పిపోవడం అతడికి తెలియదు.

కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చే గర్ల్‌ ఫ్రెండ్‌ అని బాలీవుడ్‌ సామెత. కరీనా కపూర్‌ అతడి జీవితంలో అలా నడిచి వచ్చింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ముద్దు ముచ్చట్లు చెప్పుకున్నారు. లండన్‌ టాబ్లాయిడ్‌ ఒకటి వీళ్ల బహిరంగ ముద్దును ఫొటోలుగా వేస్తే పెద్ద సంచలనం అయ్యింది. వీళ్లద్దరూ కలిసి నటించిన ‘జబ్‌ వియ్‌ మెట్‌’ కమర్షియల్‌గా ఘన విజయం సాధించడమే కాదు ఇద్దరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది.


షాహిద్‌కు పదేళ్ల వయసు వచ్చేసరికి తల్లి నీలిమ సినీ అవకాశాల కోసం ముంబై చేరుకుంది. రాజేష్‌ ఖత్తార్‌ అనే నటుణ్ణి పెళ్లి చేసుకుంది. షాహిద్‌ తల్లి నిర్ణయాన్ని అంగీకరించి ఆమెతో ఉండిపోయాడు.  మరోవైపు తండ్రి పంకజ్‌కపూర్‌ కూడా నటి సుప్రియా పాఠక్‌ను పెళ్లి చేసుకున్నాడు. తండ్రి నిర్ణయాన్ని కూడా షాహిద్‌ అంగీకరించాల్సి వచ్చింది. కొన్నాళ్లు ఇక్కడ... మారుతండ్రి. కొన్నాళ్లు అక్కడ... మారు తల్లి. ఎదుగుతున్న వయసు. తల్లిదండ్రులు బిజీగా ఉంటే, సమాజ వైఖరికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ కుర్రాడైనా చెడిపోవాలి. కాని షాహిద్‌ చెడిపోలేదు. పతనం అయ్యే బలహీనుణ్ణి కాను నేను అని బలం తెచ్చుకున్నాడు. దృష్టి ఏకాగ్రత కోసం అతడు చేసిన పని ఏమిటో తెలుసా? డాన్స్‌ నేర్చుకోవడం.

షాహిద్‌ రక్తంలోనే డాన్స్‌ ఉంది.  కొరియోగ్రాఫర్‌ అయి ఉంటే షాహిద్‌ చాలా గొప్ప కొరియోగ్రాఫర్‌ అయి ఉండేవాడు. ఆ రోజుల్లో వచ్చిన ‘తాళ్‌’, ‘దిల్‌ తో పాగల్‌ హై’ సినిమాల్లో షాహిద్‌ గ్రూప్‌ డాన్సర్‌లలో ఒకడిగా నటించాడు. పెప్సీ యాడ్‌లో కూడా షారుక్‌ ఖాన్‌తో మెరిశాడు. చదువు మీద ఎలాగూ దృష్టి లేదు. అలాగని సినిమాల్లో హీరో అవుదామంటే ఎదిగే వయసు. బక్క పలుచగా నూనూగు మీసాలతో ఉన్న షాహిద్‌ను చూసిన ఏ నిర్మాత అయినా ‘ఇప్పుడు కాదు కొన్నాళ్లు ఆగు’ అంటున్నారు.

ఆ రోజుల్లో షాహిద్‌కు తినడానికి తిండి లేదు.
ఉండటానికి సరైన రూమ్‌ కూడా లేదు.
ఫ్రస్ట్రేషన్‌. మందు తాగొచ్చు. బీరు తాగొచ్చు.
కాని షాహిద్‌ కేవలం టీ మాత్రమే తాగాడు.


చాలామంది ఏమనుకుంటారంటే నటీనటులు తల్లిదండ్రులుగా ఉన్న పిల్లలకు అవకాశాలు ఈజీగా వస్తాయి అని.  నటీనటుల కొడుకు అయినా సరే బాలీవుడ్‌లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆడిషన్స్‌లో సెలెక్ట్‌ కావాల్సి ఉంటుంది. షాహిద్‌ తనుకు తెలిసిన అన్ని ప్రొడక్షన్‌ హౌస్‌లకూ వెళ్లేవాడు. ఆడిషన్స్‌ ఇచ్చేవాడు. కాని అందరూ రిజక్టే చేశారు. రిజక్ట్‌ చేసేకొద్దీ షాహిద్‌ పట్టుదల పెంచుకున్నాడు. సులభంగా వచ్చేది ఏదీ ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. కష్టపడి సాధిద్దాం.. అందాక వేచి చూద్దాం అని షాహిద్‌ అనుకున్నాడు.
‘తేజాబ్‌’ తీసిన ఎన్‌.చంద్ర ఆ సమయంలోనే ‘సై్టల్‌’ అనే సెక్స్‌ కామెడీ తీస్తూ షాహిద్‌కు హీరో వేషం ఇచ్చాడు. అంత పెద్ద డైరెక్టర్‌. కాని తీస్తున్నది బూతు సినిమా. ఇంకోడు వేరొకడు అయితే ఎగిరి గంతేసేవాడు. షాహిద్‌ మాత్రం బయటి వ్యక్తిత్వం మాత్రమే కాదు తెర మీద వ్యక్తిత్వం కూడా బాగుండాలి అని ఆగాడు. ఏ అవకాశమూ లేని యువకుడు అలా సంయమనం పాటించడం మామూలు విషయం కాదు. చాలా అరుదు.

బాలీవుడ్‌లో ‘టిప్స్‌’ చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థ అధిపతి రమేశ్‌ తౌరానీ దృష్టి షాహిద్‌ మీద పడింది. ఈ కుర్రాడు పనికొస్తాడు అని ‘ఇష్క్‌ విష్క్‌’ అనే సినిమా తీశాడు. 2003లో రిలీజైంది. స్లీపర్‌ హిట్‌. షాహిద్‌ లోకానికి తెలిశాడు. అయితే ఆ వెంట వెంటనే అతడికి హిట్స్‌ పడలేదు. ఫిదా (2004), దిల్‌ మాంగే మోర్‌ (2004), శిఖర్‌ (2005) సినిమాలన్నీ అడ్రస్‌ లేకుండా పోయాయి.
షాహిద్‌ స్థితప్రజ్ఞుడు. నాలుగు పోతే ఐదోది హిట్‌ అవుతుంది అనుకున్నాడు. దాని కోసం ఒక ఆపద్బాంధవుడికై ఎదురు చూశాడు. తుదకు అతడు వచ్చాడు. పేరు– సూరజ్‌ భరజాత్యా.

సల్మాన్‌ఖాన్‌ను ‘మైనే ప్యార్‌ కియా’తో జీవితానికి సరిపడ స్టార్‌డమ్‌ ఇచ్చిన దర్శకుడు సూరజ్‌ భరజాత్యా షాహిద్‌తో సినిమా తీయబోతున్నానని ప్రకటించేసరికి ఇండస్ట్రీలో ఒకటే కుతూహలం. ఎందుకంటే సూరజ్‌ అంతకు ముందు తీసిన ‘హమ్‌ సాత్‌ సాత్‌ హై’, ‘మే ప్రేమ్‌ కీ దీవానీ హూ’... సో సోగా వెళ్లాయి. షాహిద్‌ చూస్తే ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి ఇద్దరు విఫల బాటసారులు ఒక సఫల సినిమాను ఎలా తీస్తారా అని కుతూహలం. కాని సూరజ్‌ తనకు బాగా తెలిసిన సాంస్కృతిక పరంపరను, వివాహాన్ని సబ్జెక్ట్‌గా తీసుకుని ‘వివాహ్‌’ సినిమా తీసి  విడుదల చేశాడు. సినిమా బ్లాక్‌ బస్టర్‌. షాహిద్‌ కపూర్‌ తన జీవితంలో చూసిన మొదటి పెద్ద హిట్‌– ‘వివాహ్‌’.

కాని మాటలనే లోకం మాటలు అంటూనే ఉంటుంది. నలుగురిలో కలవడానికి ఇష్టపడని షాహిద్‌ను పొగరుబోతనీ అహంభావి అని అంటూ ఉంటుంది. కాని జీవితంలో తాను చూసిన కష్టనష్టాల వల్లే తాను రిజర్వ్‌గా మారానని, నలుగురినీ కలవడానికి ఇష్టపడననీ షాహిద్‌ అంటూ ఉంటాడు. కరీనాతో ప్రేమ కథ ముగిసింది. షాహిద్‌ను వీలైన ప్రతి హీరోయిన్‌తోనూ బాలీవుడ్‌ ముడిపెట్టింది. ప్రియాంకా చోప్రా, విద్యాబాలన్‌ కూడా షాహిద్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్నారు. చివరకు స్వయంవర ఘట్టం ముగిసింది. షాహిద్‌ తాను ఆధ్యాత్మికంగా ఫాలో అయ్యే ఒక గ్రూప్‌లో కాలేజీ స్టూడెంట్‌గా పరిచయమైన మీరా రాజ్‌పుట్‌ అనే అమ్మాయిని వయసు రీత్యా 12 ఏళ్ల ఎడం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకో పాప. పేరు మీషా.

షాహిద్‌ నటించిన ‘రంగూన్‌’ సినిమా ఇవాళ రిలీజైంది. దీనికి ముందు అతడికి ‘హైదర్‌’, ‘ఉడ్‌తా పంజాబ్‌’ల వల్ల మంచి విజయం లభించింది. ‘రంగూన్‌’ విజయం సాధిస్తే మరిన్ని మంచి సినిమాల్లో షాహిద్‌ మనకు కనిపించే అవకాశం ఉంది.

హిట్‌ హీరో అంటే స్క్రీన్‌ మీద విజయం సాధించేవాడు మాత్రమే కాదు. నిజ జీవిత బాధ్యతల్లో కూడా విజయం సాధించేవాడని అర్థం. ఆ విధంగా అతడు నిజంగానే– షాహిట్‌ కపూర్‌. – సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement