Rangoon
-
నాన్నకు ఆమే సరైన జోడీ
నాన్న కార్తీక్‌కు నటి నగ్మా సరైన జోడీ అని ఆయన కొడుకు, యువ నటుడు గౌతమ్ కార్తీక్ అన్నారు. కడల్ చిత్రం ద్వారా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం పరిచయం చేసిన నటుడు గౌతమ్ కార్తీక్. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. తాజాగా గౌతమ్ కార్తీక్ నటించిన రంగూన్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ఇవన్ తందిరన్ చిత్రంలో నటిస్తున్నారు శ్రద్ధా కథానాయకి. కండేన్ కాదలై చిత్రం ఫేమ్ ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎంకే.రామ్ ప్రసాద్‌తో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రెండురోజుల క్రితం చెన్నైలో జరిగింది. నటుడు గౌతమ్ కార్తీక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సరైన తరుణంలో విలేకరులతో మాట్లాడాలని భావించానన్నారు. అందుకు ఇది సరైన తరుణం అనిపించిందన్నారు. తాను నటించిన రంగూన్ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడటం సంతోషంగా ఉందన్నారు. సిపాయ్, ఇవన్ తందిరన్, హరహర మహాదేవకీ చిత్రాలను పూర్తి చేశానని, ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి నల్ల నాళ్ పార్తు సొల్రేన్ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. నాన్న కార్తీక్ నటించిన చిత్రాల్లో అగ్నినక్షత్రం మంచి కథా చిత్రం అని పేర్కొన్నారు. ఆ చిత్రం రీమేక్‌లో నటించనని అన్నారు. తనకు నటనపై ఆసక్తి కలిగించిన చిత్రం కడల్ అని పేర్కొన్నారు. తనకు ఎప్పుడైతే నిసత్తు కలిగి ఉంటానో అప్పుడు తనను ఉత్సాహపరిచేది అమ్మేనన్నారు. అమ్మంటే తనకు చాలా ఇష్టం అని అన్నారు. ఇకపోతే తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందన్నారు. అయితే 35–40 వయసులోనే పెళ్లి చేసుకోవాలన్నది తన భావన అని పేర్కొన్నారు. తన తండ్రి, తాత చిత్రాలను తప్పకుండా చూస్తున్నానని చెప్పారు. నటుడిగా నాన్న లెజెండ్ అని పేర్కొన్నారు. షూటింగ్ స్పాట్లో ఆయన గురించి చెబుతున్నప్పుడు తనకు అర్థమైందని అన్నారు. కథానాయికల్లో ఆయనకు సరైన జోడీ నగ్మా, రేవతి అని అన్నారు.ఇకపై నటనలో మరింత శ్రద్ధ చూపుతానని గౌతమ్‌కార్తీక్ చెప్పారు. -
బర్త్ డే గిఫ్ట్.. బంగ్లా సొంతం చేసుకున్న హీరోయిన్!
బాలీవుడ్లో విలక్షణ నటిగా, ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె ఇటీవల 30వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తనకు తాను ఒక రాయల్ కానుక ఇచ్చుకుంది. ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలో ఒక విస్తారమైన మూడంతస్తుల భవంతిని ఆమె సొంతం చేసుకుంది. ఈ భవనంలో తన కార్యాలయం ఏర్పరుచుకోవాలని, ఇందులోనే తాను మొదటిసారిగా దర్శకత్వం వహించబోతున్న సినిమాను ప్రారంభించాలని కంగన భావిస్తున్నట్టు సమాచారం. 'ఇది చాలా విశాలమైన మూడంతస్తుల భవనం. తనకు విశాలమైన కార్యాలయం ఉండాలని, అందులోనే తన దర్శకత్వ సినిమాను ప్రారంభించాలని కంగన కలలు కనేది. ఈ ఏడాదే ఆమె తన దర్శకత్వంలో సినిమాను తెరకెక్కించబోతున్నది. త్వరలో నిర్మాతగా కూడా మారబోతున్నది' అని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ 'మిడ్ డే' పత్రిక పేర్కొన్నది. తాజాగా 'రంగూన్' సినిమాతో అలరించిన కంగన త్వరలో హన్సల్ మెహతా 'సిమ్రన్' చిత్రంతో పలుకరించబోతున్నది. ప్రముఖ తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రాణీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న 'మణికర్ణిక' చిత్రంలోనూ ఆమె నటించబోతున్నది. -
నా సినిమా ఫ్లాప్ కాబట్టి.. పారితోషికానికి కోత: నటి
మనస్సులో ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె తాజాగా నటించిన సినిమా 'రంగూన్'. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం చతికిలపడింది. వసూళ్లలో దారుణంగా వెనుకబడిపోయింది. మొదటివారం రూ. 17.47 కోట్లు వసూలు చేసిన రంగూన్.. సోమవారం వచ్చేవారికి అతితక్కువగా 1.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు ఫ్లాప్ ముద్రపడటంతో ఇక తన పారితోషికానికి కోత పెట్టాలని సినీ జనాలు కోరుతారేమోనంటూ తాజాగా కంగన వ్యాఖ్యానించింది. క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న కంగనకు ఇటీవలికాలంలో ఎదురైన తొలి ఫ్లాప్ ఇదే. వరుస విజయాలతో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కంగన ఈ ఫ్లాప్‌తో కొంత తగ్గక తప్పదన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. రంగూన్ ఫ్లాప్ కావడంతో తన పారితోషికంలో కోత పెట్టాలని జనాలు అడిగే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న 'సిమ్రన్' సినిమాలో దొంగగా నటిస్తున్నారు. మరోవైపు తాను తరచూ బాధితగా చెప్పుకుంటూ సానుభూతి పొందాలని చూస్తున్నానని దర్శకుడు కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించింది. తాను బాధిత కార్డునో, మహిళా కార్డునో వాడుకోవడం లేదని, రాజీపడని ముక్కుసూటితనాన్ని ప్రదర్శిస్తున్నానని స్పష్టం చేసింది. -
రివ్యూలు బాగున్నాయి కానీ కలెక్షన్లు రాలేదు
ముంబై: విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్, కంగనా రౌనత్ నటించిన బాలీవుడ్ సినిమా రంగూన్‌కు రివ్యూలు పాజిటివ్‌గా వచ్చినా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమాకు ఆశించిన, ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఈ నెల 24న రంగూన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం దాదాపు 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకూ 30 కోట్ల రూపాయలు కూడా వసూలు కాలేదు. అభిమానులు, నెటిజెన్లు, సినీ విమర్శకులు ఈ సినిమాను ప్రశంసించినా ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోయేసరికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఢీలాపడ్డారు. దీనికితోడు ఈ సినిమా పైరసీ బారిన పడటం కూడా కలెక్షన్లపై ప్రభావం పడిందని భావిస్తున్నారు. సినిమా మొత్తం ఆన్ లైన్ లో వచ్చేయడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది. -
రంగూన్ సెలబ్రిటీ ‘రివ్యూ’
ముంబయి: షూటింగ్ ప్రారంభంనాటి నుంచే అంచనాలు పెంచిన సినిమా రంగూన్. దర్శకుడు విశాల్ భరద్వాజ్ మరో మాస్టర్‌పీస్‌తో రావడం ఖాయం అని కొబ్బరికాయ కొట్టిన రోజే బాలీవుడ్ సినీ వర్గాలు చెప్పాయి. దానికి తగినట్లుగానే చిత్ర ట్రైలర్లు, ప్రచార చిత్రాలు, పాటలు, యాక్షన్ సీన్లు, లవ్ సీన్లు సోహల్ మీడియాను ఒక ఊపుఊపాయి. ముఖ్యంగా చిత్ర నటులు కంగనా రనౌత్, షాహీద్ కపూర్, సైఫ్ అలీఖాన్ జోడీపై లెక్కలేనన్ని కామెంట్లు వచ్చాయి. యుద్ధ నేపథ్యంతోపాటు మంచి లవ్ స్టోరీ కూడా ఇందులో ఉండటంతో సినిమాపై భారీ అంచానలు ఏర్పడ్డాయి. దీనికి తగట్టుగానే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నిరాజనాలందుకుంటోంది. సినిమాపై ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ప్రదర్శించగా సినిమా చూసిన వారంతా ఫుల్ జోష్‌తో కనిపించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ఇది నిజంగా విశాల్ భరద్వాజ్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ పీస్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ట్వీట్లలో ప్రశంసలు కురిపించారు. సైఫ్ నటుడిగా పునర్జన్మ పొందాడని, ఈ చిత్రం విశాల్ భరద్వాజ్ కెరీర్లో మరో మాస్టర్ పీస్ అంటూ పొగిడారు. విశాల్ భరద్వాజ్ సార్ మరో మాస్టర్‌పీస్. మేజికల్ సినిమాటోగ్రఫీ. పవర్‌ప్యాక్డ్ పర్ఫామెన్స్.. కంగనా, సైఫ్ అలీఖాన్‌ల నటన చాలా గొప్పగా ఉంది. ...సునీల్ శెట్టీ ‘బ్లడీ హెల్’(రంగూన్ చిత్రంలోని ఓ పాట)తోనే ఈ రోజు నిద్ర లేచాను. జులియా-నవాబ్ మాలిక్‌లను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాను. షాహిద్ కపూర్‌ను కూడా.. కంగనా ఐలవ్ యూ ...నటి కృతిసనన్ ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరులో ఒక అద్భుత తపన కనిపించింది. పాత్రల చిత్రీకరణలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో ఆ తపన దర్శనమిస్తుంది. విశాల్ భరద్వాజ్ ముద్ర కనిపిస్తుంది. జూలియా పాత్రలో కంగన ఆకట్టుకొన్నది. షాహీద్ అద్భుతంగా నటించాడు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మీ ప్రేమలో పడకుండా ఎవరూ ఉండరు సైఫ్గారు.. ...దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రాన్ని ద్వారా నేను సాహిత్యలోకంలో ప్రయాణించాను. ఆ కాలానికి తీసుకెళ్లడంలో దర్శకుడు విజయం సాధించాడు. రంగూన్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది. ...రణదీప్ హుడా కంగన రనౌత్ నటన, ప్రతిభ మరో స్థాయికి చేరింది. షాహీద్ కపూర్ మరోసారి వెండితెరపై మెరిశాడు. సైఫ్ అలీఖాన్ నటన అమోఘం. విశాల్ భరద్వాజ్ పనితీరు అద్భుతం ... రచయిత ప్రసూన్ జోషి ఈ సినిమా ఈ ఏడాది ఉత్తమ చిత్ర అవార్డుకు ఎంపికైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత అద్భుతంగా ఉంది. సైఫ్ నటన సూపర్ ... సైఫ్ భార్య కరీనా కపూర్ Another masterpiece by #VishalBhardwaj Power packed performances & magical cinematography! Cinema at its best! #SaifAliKhan #KanganaRanaut pic.twitter.com/QZOfgiv5Ku — Suniel Shetty (@SunielVShetty) 23 February 2017 Woke up with "Bloody Hell" in my head!☺️ Specially loved Julia-Nawab Malik together!❤️ @shahidkapoor -
షాహిట్ కపూర్
కొందరు కుర్రాళ్లు ఏ కారణం లేకుండా కూడా చెడిపోతారు. కొందరు కుర్రాళ్లు కారణాలు ఉండి చెడిపోతారు. కొందరు కుర్రాళ్లు మాత్రం చెడిపోవడానికి అన్ని కారణాలు ఉన్నా గట్టిగా, మొండిగా, తొణక్కుండా, బెణక్కుండా కుటుంబం కోసం, లక్ష్యం కోసం నిలబడతారు. షాహిద్‌కపూర్ నటించిన ‘ఉడ్తా పంజాబ్’ పెద్ద సంచలనం రేపింది. డ్రగ్స్ మత్తులో దొర్లే పంజాబ్ రాష్ట్ర పరిస్థితులను చెప్పే ఈ సినిమాలో షాహిద్ కపూర్ డ్రగ్స్‌కు బానిసైన ఒక రాప్ సింగర్‌గా నటించాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ షాహిద్‌ను కరడుగట్టిన డ్రగ్స్ బానిస అనే నిర్థారణకు వస్తారు. కాని వాస్తవం ఏమిటంటే షాహిద్ జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తాకి ఎరగడు. నిజం ఏమిటంటే అతడు మద్యం కూడా తాగి ఎరగడు. ఇంకా నిజం ఏమిటంటే అతడు పక్కా శాకాహారి. మాంసం కూడా ముట్టడు. దేశంలో పెద్ద హీరోగా చాలా మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండి సాయంత్రమైతే పార్టీలు, పబ్‌లు ఉండే బాలీవుడ్ వాతావరణంలో ఉన్నా షాహిద్ ఇలాగే తన కేరెక్టర్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఇది మామూలు సంగతి కాదు. పెద్ద విజయం. షాహిద్‌కు మూడేళ్ల వయసప్పుడు అతడి తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి పంకజ్ కపూర్, తల్లి నీలిమా అజీమ్. పంకజ్ కపూర్ ప్యారలల్ సినిమాల నటుడు. కమర్షియల్ సినిమాలలో వచ్చే పాత్రలు, డబ్బులు అతడికి రావు. ఇక నీలిమా అజీమ్ కథక్ డాన్సర్, మోడల్. కొన్ని సినిమాలలో నటించింది. వీళ్లిద్దరి కాపురం షాహిద్ పుట్టాక ఒడిదుడుకులకు లోనైంది. విడాకుల తర్వాత నీలిమ.. షాహిద్‌ను తీసుకుని ఢిల్లీకి వెళ్లిపోయింది. పదేళ్ల వయసు వచ్చే వరకూ షాహిద్ ఢిల్లీలోనే పెరిగాడు. దేవుడు ఒక తోడును తెంపేస్తే రెండు ఆసరాలను ఇస్తాడు. చిన్నారి షాహిద్‌కు ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్యలే గొప్ప నేస్తాలు. వారిద్దరూ అప్పట్లో రష్యా నుంచి వెలువడే ‘స్పుత్నిక్’ పత్రిక కోసం పని చేసేవారు. షాహిద్‌కు తాతయ్య రోజూ కథలు చెప్పేవాడు. విడిపోయిన తండ్రి పట్ల ద్వేషం కలగకుండా మంచి మాటలు మాట్లాడేవాడు. కాని షాహిద్‌కు మాత్రం తనతో ఉన్న తల్లి అంటేనే ఎంతో ఇష్టం ఉండేది. తల్లి ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది –‘అప్పుడు షాహిద్‌కు ఐదేళ్లు కూడా లేవు. నేను ఢిల్లీలో చాలా ఆలోచనలతో సతమతమయ్యేదాన్ని. ఒకరోజు రాత్రి నేను బాగా ఏడుస్తున్నాను. షాహిద్ నన్ను గమనించాడు. ఏమనుకున్నాడో ఏమో అంత చిన్న వయసులో నన్ను దగ్గరకు తీసుకుని ‘ఏడవకమ్మా. నేనున్నానుగా అన్నాడు. అది నేను మర్చిపోలేను’ అంటుందామె. నిజంగానే షాహిద్ ఎప్పుడూ కుటుంబానికి నేనున్నాను అన్నట్టుగానే ఉన్నాడు. బాధ్యత తప్పిపోవడం అతడికి తెలియదు. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చే గర్ల్ ఫ్రెండ్ అని బాలీవుడ్ సామెత. కరీనా కపూర్ అతడి జీవితంలో అలా నడిచి వచ్చింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ముద్దు ముచ్చట్లు చెప్పుకున్నారు. లండన్ టాబ్లాయిడ్ ఒకటి వీళ్ల బహిరంగ ముద్దును ఫొటోలుగా వేస్తే పెద్ద సంచలనం అయ్యింది. వీళ్లద్దరూ కలిసి నటించిన ‘జబ్ వియ్ మెట్’ కమర్షియల్‌గా ఘన విజయం సాధించడమే కాదు ఇద్దరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. షాహిద్‌కు పదేళ్ల వయసు వచ్చేసరికి తల్లి నీలిమ సినీ అవకాశాల కోసం ముంబై చేరుకుంది. రాజేష్ ఖత్తార్ అనే నటుణ్ణి పెళ్లి చేసుకుంది. షాహిద్ తల్లి నిర్ణయాన్ని అంగీకరించి ఆమెతో ఉండిపోయాడు. మరోవైపు తండ్రి పంకజ్‌కపూర్ కూడా నటి సుప్రియా పాఠక్‌ను పెళ్లి చేసుకున్నాడు. తండ్రి నిర్ణయాన్ని కూడా షాహిద్ అంగీకరించాల్సి వచ్చింది. కొన్నాళ్లు ఇక్కడ... మారుతండ్రి. కొన్నాళ్లు అక్కడ... మారు తల్లి. ఎదుగుతున్న వయసు. తల్లిదండ్రులు బిజీగా ఉంటే, సమాజ వైఖరికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ కుర్రాడైనా చెడిపోవాలి. కాని షాహిద్ చెడిపోలేదు. పతనం అయ్యే బలహీనుణ్ణి కాను నేను అని బలం తెచ్చుకున్నాడు. దృష్టి ఏకాగ్రత కోసం అతడు చేసిన పని ఏమిటో తెలుసా? డాన్స్ నేర్చుకోవడం. షాహిద్ రక్తంలోనే డాన్స్ ఉంది. కొరియోగ్రాఫర్ అయి ఉంటే షాహిద్ చాలా గొప్ప కొరియోగ్రాఫర్ అయి ఉండేవాడు. ఆ రోజుల్లో వచ్చిన ‘తాళ్’, ‘దిల్ తో పాగల్ హై’ సినిమాల్లో షాహిద్ గ్రూప్ డాన్సర్లలో ఒకడిగా నటించాడు. పెప్సీ యాడ్‌లో కూడా షారుక్ ఖాన్‌తో మెరిశాడు. చదువు మీద ఎలాగూ దృష్టి లేదు. అలాగని సినిమాల్లో హీరో అవుదామంటే ఎదిగే వయసు. బక్క పలుచగా నూనూగు మీసాలతో ఉన్న షాహిద్‌ను చూసిన ఏ నిర్మాత అయినా ‘ఇప్పుడు కాదు కొన్నాళ్లు ఆగు’ అంటున్నారు. ఆ రోజుల్లో షాహిద్‌కు తినడానికి తిండి లేదు. ఉండటానికి సరైన రూమ్ కూడా లేదు. ఫ్రస్ట్రేషన్. మందు తాగొచ్చు. బీరు తాగొచ్చు. కాని షాహిద్ కేవలం టీ మాత్రమే తాగాడు. చాలామంది ఏమనుకుంటారంటే నటీనటులు తల్లిదండ్రులుగా ఉన్న పిల్లలకు అవకాశాలు ఈజీగా వస్తాయి అని. నటీనటుల కొడుకు అయినా సరే బాలీవుడ్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆడిషన్స్‌లో సెలెక్ట్ కావాల్సి ఉంటుంది. షాహిద్ తనుకు తెలిసిన అన్ని ప్రొడక్షన్ హౌస్‌లకూ వెళ్లేవాడు. ఆడిషన్స్ ఇచ్చేవాడు. కాని అందరూ రిజక్టే చేశారు. రిజక్ట్ చేసేకొద్దీ షాహిద్ పట్టుదల పెంచుకున్నాడు. సులభంగా వచ్చేది ఏదీ ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. కష్టపడి సాధిద్దాం.. అందాక వేచి చూద్దాం అని షాహిద్ అనుకున్నాడు. ‘తేజాబ్’ తీసిన ఎన్.చంద్ర ఆ సమయంలోనే ‘సై్టల్’ అనే సెక్స్ కామెడీ తీస్తూ షాహిద్‌కు హీరో వేషం ఇచ్చాడు. అంత పెద్ద డైరెక్టర్. కాని తీస్తున్నది బూతు సినిమా. ఇంకోడు వేరొకడు అయితే ఎగిరి గంతేసేవాడు. షాహిద్ మాత్రం బయటి వ్యక్తిత్వం మాత్రమే కాదు తెర మీద వ్యక్తిత్వం కూడా బాగుండాలి అని ఆగాడు. ఏ అవకాశమూ లేని యువకుడు అలా సంయమనం పాటించడం మామూలు విషయం కాదు. చాలా అరుదు. బాలీవుడ్లో ‘టిప్స్’ చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థ అధిపతి రమేశ్ తౌరానీ దృష్టి షాహిద్ మీద పడింది. ఈ కుర్రాడు పనికొస్తాడు అని ‘ఇష్క్ విష్క్’ అనే సినిమా తీశాడు. 2003లో రిలీజైంది. స్లీపర్ హిట్. షాహిద్ లోకానికి తెలిశాడు. అయితే ఆ వెంట వెంటనే అతడికి హిట్స్ పడలేదు. ఫిదా (2004), దిల్ మాంగే మోర్ (2004), శిఖర్ (2005) సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. షాహిద్ స్థితప్రజ్ఞుడు. నాలుగు పోతే ఐదోది హిట్ అవుతుంది అనుకున్నాడు. దాని కోసం ఒక ఆపద్బాంధవుడికై ఎదురు చూశాడు. తుదకు అతడు వచ్చాడు. పేరు– సూరజ్ భరజాత్యా. సల్మాన్‌ఖాన్‌ను ‘మైనే ప్యార్ కియా’తో జీవితానికి సరిపడ స్టార్డమ్ ఇచ్చిన దర్శకుడు సూరజ్ భరజాత్యా షాహిద్‌తో సినిమా తీయబోతున్నానని ప్రకటించేసరికి ఇండస్ట్రీలో ఒకటే కుతూహలం. ఎందుకంటే సూరజ్ అంతకు ముందు తీసిన ‘హమ్ సాత్ సాత్ హై’, ‘మే ప్రేమ్ కీ దీవానీ హూ’... సో సోగా వెళ్లాయి. షాహిద్ చూస్తే ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి ఇద్దరు విఫల బాటసారులు ఒక సఫల సినిమాను ఎలా తీస్తారా అని కుతూహలం. కాని సూరజ్ తనకు బాగా తెలిసిన సాంస్కృతిక పరంపరను, వివాహాన్ని సబ్జెక్ట్‌గా తీసుకుని ‘వివాహ్’ సినిమా తీసి విడుదల చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్. షాహిద్ కపూర్ తన జీవితంలో చూసిన మొదటి పెద్ద హిట్– ‘వివాహ్’. కాని మాటలనే లోకం మాటలు అంటూనే ఉంటుంది. నలుగురిలో కలవడానికి ఇష్టపడని షాహిద్‌ను పొగరుబోతనీ అహంభావి అని అంటూ ఉంటుంది. కాని జీవితంలో తాను చూసిన కష్టనష్టాల వల్లే తాను రిజర్వ్‌గా మారానని, నలుగురినీ కలవడానికి ఇష్టపడననీ షాహిద్ అంటూ ఉంటాడు. కరీనాతో ప్రేమ కథ ముగిసింది. షాహిద్‌ను వీలైన ప్రతి హీరోయిన్‌తోనూ బాలీవుడ్ ముడిపెట్టింది. ప్రియాంకా చోప్రా, విద్యాబాలన్ కూడా షాహిద్ గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు. చివరకు స్వయంవర ఘట్టం ముగిసింది. షాహిద్ తాను ఆధ్యాత్మికంగా ఫాలో అయ్యే ఒక గ్రూప్‌లో కాలేజీ స్టూడెంట్‌గా పరిచయమైన మీరా రాజ్పుట్ అనే అమ్మాయిని వయసు రీత్యా 12 ఏళ్ల ఎడం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకో పాప. పేరు మీషా. షాహిద్ నటించిన ‘రంగూన్’ సినిమా ఇవాళ రిలీజైంది. దీనికి ముందు అతడికి ‘హైదర్’, ‘ఉడ్తా పంజాబ్’ల వల్ల మంచి విజయం లభించింది. ‘రంగూన్’ విజయం సాధిస్తే మరిన్ని మంచి సినిమాల్లో షాహిద్ మనకు కనిపించే అవకాశం ఉంది. హిట్ హీరో అంటే స్క్రీన్ మీద విజయం సాధించేవాడు మాత్రమే కాదు. నిజ జీవిత బాధ్యతల్లో కూడా విజయం సాధించేవాడని అర్థం. ఆ విధంగా అతడు నిజంగానే– షాహిట్ కపూర్. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నాకు ఆ రిలేషన్లు అక్కర్లేదు: నటి
ముంబై: వివాదాలు ఆమెకు కొత్తేమీ కాదు. అలాగని కేవలం వివాదాలతో వార్తల్లో నిలిచే వ్యక్తిత్వం ఆమెది కాదు. నటనలో జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ వివరాలను చూస్తే ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ అని కచ్చితంగా చెప్పవచ్చు. హీరో హృతిక్ రోషన్‌తో కొంతకాలం నెరపిన ప్రేమాయణం బెడిసి కొట్టడంతో పాటు అందరూ ఆమెవైపే వేలెత్తిచూపారు. హృతిక్, కంగనా ఒకరిపై మరొకరు కేసులు వేసి, నోటీసులు పంపుకున్నారు. దీంతో ఆమె కాస్త డిప్రెషన్లోకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అయినా వెనకంజవేసే తత్వం తనది కాదని కంగనా ప్రవర్తిస్తోంది. ఇండస్ట్రీలో ఎవరితోనూ సన్నిహితంగా ఉండవద్దని, బంధాలు ఏర్పరచుకోవద్దని కంగనా చెబుతోంది. ఫ్రెండ్స్, రిలేషన్స్ అంటూ ఎవరినీ సన్నిహితులను చేసుకోవద్దని వాటి వల్ల తాత్కాలిక ఆనందమే మనకు దొరుకుతుందని తర్వాతి తరం నటులు ఈ ఫిలాసఫీ ఫాలో అయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని 'క్వీన్' బ్యూటీ అభిప్రాయపడింది. మనకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి సన్నిహితులేం అక్కర్లేదని, మనసుతో మాట్లాడితే అన్ని సమస్యలకు సొల్యూషన్ ఉంటుందని వేదాంతం చెప్పకొచ్చింది. ప్రస్తుతం ఆమె విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న రంగూన్లో నటిస్తోంది. -
రాళ్లల్లో.. రప్పల్లో..!
‘రాళ్లల్లో.. ఇసుకల్లో రాశాము ఇద్దరు పేర్లు...’ అంటూ బాలకృష్ణ, రజనీ పాడుకున్న డ్యూయెట్ గుర్తుండే ఉంటుంది. ‘రంగూన్’ సినిమా షూటింగ్ సమయంలో కంగనా రనౌత్ డ్యుయెట్ మినహా రాళ్లల్లో, రప్పల్లో చాలా పనులే చేశారు. చేసే పాత్ర నచ్చిందంటే చాలు, ఎలాంటి త్యాగాలకైనా ఈ హాట్ గాళ్ రెడీ అయిపోతారు. అందుకు ‘రంగూన్’ సినిమా ఓ ఉదాహరణ. ఈ సినిమా కోసం అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. రాళ్లూ రప్పలూ తప్ప పూరి గుడిసె కూడా లేని ప్రాంతంలో చిత్రీకరణ జరిపినప్పుడు కంగనా చాలా ఇబ్బంది పడ్డారట. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాం కదా అని ఎక్కడికెళితే అక్కడ ఇంట్లో ఉన్నట్లే అన్ని సౌకర్యాలూ ఉండాలనుకుంటే కుదరదు. సర్దుకుపోవాలి. ‘రంగూన్’ షూటింగ్ అప్పుడు లొకేషన్లో నాకు వ్యానిటీ వ్యాన్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. దాంతో పెద్ద పెద్ద రాళ్లు చూసుకుని, వాటి వెనకాల బట్టలు మార్చుకునేదాన్ని. రాళ్లు కనపడని చోట యూనిట్ సభ్యులందరూ ఒక దడిలా నిలబడేవాళ్లు. నేను కాస్ట్యూమ్స్ వేసుకునేదాన్ని. అంతెందుకండి.. ప్రకృతి అవసరానికి కూడా ఇబ్బంది అయ్యేది. రాళ్లల్లో.. రప్పల్లోనే. తప్పదు. అడ్జస్ట్ కావాల్సిందే. కాదు కూడదు.. నాకు వ్యానిటీ వ్యాన్ కావాల్సిందేనని మొండిగా వాదిస్తే.. నిర్మాత మాత్రం ఏం చేయగలుగుతారు? అలాంటి లొకేషన్లో ఎవరూ ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు. వాస్తవానికి కంగనాకి తలబిరుసుతనం ఎక్కువ అనే పేరుంది. అయితే.. షూటింగ్ విషయంలో మాత్రం ఇబ్బందిపెట్టరనే పేరు కూడా సంపాదించుకున్నారు. -
కంగనా రూ. 11 కోట్లు తీసుకుందా?
లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా వంద కోట్ల వసూళ్లు సాధ్యమే అని నిరూపించిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. తన సినిమాల సక్సెస్‌లతోనే కాదు, ఆ సినిమాల్లో తన అద్భుతమైన నటనతోనూ అందరి దృష్టిని ఆకర్షించిన కంగనా, బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఇమేజ్ సొంతం చేసుకుంది. వరుసగా వందకోట్ల కలెక్షన్ల సినిమాలతో అలరించిన ఆమె, బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. గతంలో వచ్చిన వార్తల ప్రకారం కంగనా, ఒక సినిమాకు దాదాపు రూ.11 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమా సమయంలో కంగనానే బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న భామ అని ఫిక్స్ అయ్యారు అంతా. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సీన్స్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగూన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కంగనా. ఈ సినిమాకు కేవలం 3 కోట్ల రూపాయలే రెమ్యూనరేషన్ తీసుకుందట. మరి ఒక్కసారిగా కంగనా పారితోషికంలో ఇంత తేడా ఎందుకు వచ్చింది, అన్న చర్చ మొదలైంది. అసలు నిజంగానే కంగనా 11 కోట్ల పారితోషికం అందుకుందా..? లేక కావాలనే అలాంటి రూమర్స్ సృష్టించారా..? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది నిజమో తెలియాలంటే మాత్రం కంగన నోరు విప్పాల్సిందే. -
40ల నాటి ప్రేమ కథలో కంగనా
ఇండియన్ సినిమా తెర మీద పీరియాడిక్ సినిమాల హవా కొనసాగుతుంది. హీరోలు మాత్రమే కాదు మంచి కలెక్షన్ స్టామినా ఉన్న హీరోయిన్లు కూడా పీరియాడిక్ డ్రామాల వైపే మొగ్గు చూపుతున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగాన కూడా ఈ జాబితా లో చేరిపోయింది. 1940 లలో జరిగే ఓ రొమాంటిక్ డ్రామాలో నటించనుంది కంగనా. రంగూన్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి కంగనా అయితేనే సరైన న్యాయం చేయగలదని భావిస్తున్నాడట దర్శకుడు విశాల్ భరద్వాజ్. ఈ సినిమా కథ రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితులపై తెరకెక్కనుంది. ఆ సమయంలో ఓ ప్రఖ్యాత నటి, ఆమె గురువు కు మధ్య ఉన్న సంబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సినిమా కథ అంతా ఓ నటి, ఆమె గురువు, అలాగే ఓ సైనికుడి మధ్య జరుగుతుంది. అంటే ఇప్పటికే ప్రకటించిన కంగనా, సైఫ్, షాహిద్ లు ఈ మూడు పాత్రలోనే కనిపించనున్నారు. ప్రస్తుతం 'కట్టి బట్టి' సినిమా ప్రచారం లో బిజీగా ఉన్న క్వీన్ ఆ మూవీ విడుదల తరువాత రంగూన్ చిత్రీకరణకు రెడీ అవుతోంది. ఈ లోగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా రంగూన్ టీం పూర్తి చేయనుంది. -
ఒక్క ట్రైనింగ్‌కి రెండు సినిమాలు
ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతను ఈ మధ్య కంగనా రనౌత్ పదే పదే వాడుతున్నారట. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఆమె గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకుంటున్నారు. ‘రంగూన్’ చిత్రంలోని పాత్ర కోసం తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ మరో సినిమాకి కూడా ఉపయోగపడనుంది. అందుకే, కంగనా ‘ఒక్క ట్రైనింగ్‌కి రెండు సినిమాలు’ అని సరదాగా అంటున్నారు. ఈ విషయాన్ని కంగనా వివరిస్తూ - ‘‘ఈ ఏడాది నా చేతిలో ఉన్నవన్నీ మంచి పాత్రలే. ‘రంగూన్’లో 1940కి చెందిన సినిమా తారగా నటిస్తున్నా. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఓ పరిశోధన నిమిత్తం బ్రిటిష్ బృందంలోకి ఎంటరవుతాను. ఈ పాత్ర చాలా బాగుంటుంది. తదుపరి రాణీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో టైటిల్ రోల్ చేయబోతున్నా. ‘రంగూన్’ కోసం నేర్చుకున్న యుద్ధ విద్యలన్నీ ఈ చిత్రానికి ఉపయోగపడతాయి. ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’... నటిగా సంతృప్తినిచ్చాయి. మళ్లీ ఈ రెండు చిత్రాలూ నాకు ఆత్మసంతృప్తినిచ్చేవి కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
‘రంగూన్’ క్వీన్...
ఇటీవలే ‘హైదర్’తో సంచలనం సృష్టించిన విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ‘రంగూన్’ సినిమా చేయడానికి కంగనా రనౌత్ పచ్చజెండా ఊపారు. ఇందులో షాహిద్‌కపూర్, సైఫ్ అలీఖాన్ ముఖ్యతారలు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో బ్రిటీషు సైన్యానికి, సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి మధ్య జరిగే యుద్ధంలో తమ వారినే భారతీయులు ఎలా మట్టుపెట్టారనే ఓ సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో చెప్పనున్నారు విశాల్. -
రంగూన్‌కు సిద్ధం
ప్రస్తుత యువ నటుల్లో అధిక చిత్రాలు చేతిలో ఉన్న హీరో గౌతమ్ కార్తీక్. విశేషం ఏమిటంటే ఈయన నటించిన తొలి, మలి చిత్రాలు కడల్, ఎన్నమో ఎదో రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. అయినా గౌతమ్ కార్తీక్ పై ఆ ప్రభావం ఇసుమంత కూడా లేకుండా ఆయన్ని వెతుక్కుంటూ అవకాశాలు రావడం గమనార్హం. ప్రస్తుతం గౌతమ్ కార్తీక్ నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రంగూన్ అనే వైవిధ్య భరిత కథా చిత్రంలో గౌతమ్ కార్తీక్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించనున్నారు. ఆయన శిష్యుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టనున్నారు. ఈయన ఎ.ఆర్.మురుగసామి వద్ద 7ఆమ్ అరివు, తుపాకి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. రాజ్‌కుమార్, పెరియసామి చెప్పిన కథకు అంగీకరించినట్లు నటుడు గౌతమ్ కార్తీక్ తెలిపారు. దర్శకుడు మాత్రం ఈ చిత్రం వివరాలు చెప్పడానికి ఇంకా చాలా సమయం ఉందంటూనే ఇదొక కల్పిత కథతో తెరకెక్కించనున్న చిత్రం అని తెలిపారు. 25 ఏళ్ల ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే చిత్రం అన్నారు. ఈ చిత్రానికి గౌతమ్ కార్తీక్‌ను హీరోగా ఎంపిక చెయ్యడానికి ప్రధాన కారణం ఆయన శారీరక భాష ముఖ్యంగా ఆయన వయసు అని తెలిపారు. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో నాయిక ఇతర నటవర్గం ఎంపిక జరుగుతోందని తెలిపారు. చిత్రం షూటింగ్‌ను వచ్చే నెల ప్రారంభించి వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.