నా సినిమా ఫ్లాప్ కాబట్టి.. పారితోషికానికి కోత: నటి
మనస్సులో ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె తాజాగా నటించిన సినిమా 'రంగూన్'. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం చతికిలపడింది. వసూళ్లలో దారుణంగా వెనుకబడిపోయింది. మొదటివారం రూ. 17.47 కోట్లు వసూలు చేసిన రంగూన్.. సోమవారం వచ్చేవారికి అతితక్కువగా 1.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు ఫ్లాప్ ముద్రపడటంతో ఇక తన పారితోషికానికి కోత పెట్టాలని సినీ జనాలు కోరుతారేమోనంటూ తాజాగా కంగన వ్యాఖ్యానించింది.
క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న కంగనకు ఇటీవలికాలంలో ఎదురైన తొలి ఫ్లాప్ ఇదే. వరుస విజయాలతో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కంగన ఈ ఫ్లాప్‌తో కొంత తగ్గక తప్పదన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. రంగూన్ ఫ్లాప్ కావడంతో తన పారితోషికంలో కోత పెట్టాలని జనాలు అడిగే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న 'సిమ్రన్' సినిమాలో దొంగగా నటిస్తున్నారు. మరోవైపు తాను తరచూ బాధితగా చెప్పుకుంటూ సానుభూతి పొందాలని చూస్తున్నానని దర్శకుడు కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించింది. తాను బాధిత కార్డునో, మహిళా కార్డునో వాడుకోవడం లేదని, రాజీపడని ముక్కుసూటితనాన్ని ప్రదర్శిస్తున్నానని స్పష్టం చేసింది.