‘కాలా’పై కన్నెర్ర! | Editorial On Rajini kaala Controversy] | Sakshi
Sakshi News home page

‘కాలా’పై కన్నెర్ర!

Published Thu, Jun 7 2018 12:43 AM | Last Updated on Thu, Jun 7 2018 12:55 AM

Editorial On Rajini kaala Controversy] - Sakshi

కుల, మత సంస్థలు, ఇతర బృందాలు చలనచిత్రాల జోలికి రాకూడదని న్యాయస్థానాలు పదే పదే హితవు చెబుతున్నాయి. చలనచిత్రాల మంచి చెడ్డలు నిర్ణయించడానికి సెన్సార్‌ బోర్డు ఉన్నదని, దాని నిర్ణయాలను ప్రశ్నించేందుకు ఇతరత్రా వేదికలు కూడా అందుబాటులో ఉన్నా యని గుర్తు చేస్తున్నాయి. అయినా చిత్రం పేరు మార్చాలని, ఫలానా సన్నివేశం తొలగించాలని, పాటల్లో ఫలానా పదాలు తీసేయాలని, లేదంటే చిత్రం విడుదలను అడ్డుకుంటామని బెది రింపులకు దిగే బృందాలు తామరతంపరగా పుట్టుకొస్తూనే ఉన్నాయి.

తాజాగా గురువారం విడుదల కావలసిన రజనీకాంత్‌ చిత్రం ‘కాలా’ అలాంటివారి బారిన పడింది. ఆశ్చర్యమేమంటే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో చిత్రం విడుదలను వాయిదా వేసుకోమని సలహా ఇస్తున్నారు. కర్ణాటకలో ఆ చిత్రం విడుదలను అడ్డుకుం టామని కన్నడ సంఘాలు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నాయి. కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశించినట్టు కావేరీ నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని రజనీ కాంత్‌ డిమాండ్‌ చేయడం ఆ సంఘాలకు నచ్చలేదు. కన్నడ సంఘాలు మాత్రమే కాదు... తమిళనాడులోని కొన్ని ఇతర సంఘాలు కూడా ‘కాలా’కు సమస్యలు సృష్టించా లని చూస్తున్నాయి.

ఆ రాష్ట్రంలోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కర్మాగారాన్ని మూసేయాలని డిమాండ్‌ చేస్తూ సాగిన ఉద్యమంపై ఉక్కుపాదం మోపి పలువురిని కాల్చి చంపిన ఉదంతంపై రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆ సంఘాలకు అభ్యంతరకరం అనిపించాయి. పోలీసులపై కొన్ని అసాంఘిక శక్తులు దౌర్జన్యానికి దిగడం వల్లే వారు కాల్పులు జరపాల్సివచ్చిందన్నది రజనీ వ్యాఖ్యల సారాంశం. తూత్తుకుడి కాల్పుల దృశ్యాలను చూసిన వారెవరూ అలా మాట్లాడరు. పోలీసులు ఉద్యమ కారులను గురిచూసి కాల్చిచంపిన దృశ్యాలు బయటికొచ్చాక కూడా రజనీ అలా మాట్లాడి ఉండా ల్సింది కాదు. అసాంఘిక శక్తులపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ ఆ క్రమంలో పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇష్టానుసారం ప్రవర్తిస్తే అంగీకరించరు. ఈ విషయంలో రజనీకాంత్‌తో విభేదించే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ సాకుతో చిత్రానికి అడ్డంకులు కల్పించడం సరికాదు.

ఆమధ్య హిందీ చిత్రం ‘పద్మావత్‌’పై కూడా ఇలాంటి వివాదాలే ముసురుకున్నాయి. ఆ చిత్రంలో పద్మావతిని కించపరిచేలా చూపుతున్నారని అనుమానించి రాజ్‌పుట్‌ సంఘాలు షూటింగ్‌ మొదలైనప్పటినుంచే దాడులు మొదలుపెట్టాయి. చివరకు చిత్ర హీరోయిన్‌ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తలలు తెచ్చినవారికి రూ. 5 కోట్లు బహుమాన మిస్తామని కూడా ప్రకటించాయి. తీరా విడుదలయ్యాక చూస్తే ఆ చిత్రంలో ఎలాంటి అభ్యం తరకమైన అంశాలూ లేవు. రెండు నెలలక్రితం పంజాబీ చిత్రం ‘గురునానక్‌ దేవ్‌’ను కూడా శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ(ఎస్‌జీపీసీ), అకల్‌ తఖ్త్‌లు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

మూడేళ్లక్రితం ఈ చిత్రం విడుదలైనప్పుడు ఎస్‌జీపీసీ అందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి,  కొన్ని సిక్కు గ్రూపులు ఆందోళనకు దిగడంతో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. అప్పట్లో చిత్ర నిర్మాతలు ఒక్క పంజాబ్‌లో మినహా మిగిలినచోట్ల విడుదల చేశారు. కానీ కొద్దిరోజులకే నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి విడుదల చేద్దామనుకుంటున్న తరుణంలో ఎస్‌జీపీసీ అభ్యంతరపెట్టింది. అసలు చిత్రంలో గురునానక్‌ పాత్రే ఉండరాదని, అలా చూపితే ఆయనకు అపచారం చేసినట్టేనని దాని వాదన.

చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో అదంతా సద్దుమణిగింది. కానీ ఇకపై సిక్కు సంప్ర దాయానికి సంబంధించి తీసే చిత్రాలకు తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరని ఈమధ్య ఎస్‌జీపీసీ ప్రకటించింది. అందుకోసం 21మంది సభ్యులతో సిక్కు సెన్సార్‌ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. సెన్సార్‌బోర్డుకు సిక్కు సంప్రదాయాలపై అవగాహన ఉండదు కనుక తామే అందుకోసం దీన్ని ఏర్పాటు చేశామంటున్నది. యువతపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని చర్చించిన ‘ఉడ్తా పంజాబ్‌’ చిత్రంపైనా 2016లో వివాదం చెలరేగింది. సెన్సార్‌ బోర్డు 89 కత్తిరింపులు ప్రతిపాదించగా చిత్ర నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి చిత్రం విడుదల చేసుకోవాల్సి వచ్చింది. 

మన దేశంలో ఒక్క సినిమాలపై మాత్రమే కాదు... వివిధ కళారూపాల గొంతు నొక్కడానికి ఏదో ఒక రూపంలో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్‌ హుస్సేన్‌ చిత్రించిన పెయింటింగ్‌లపై హిందూత్వ సంస్థలు విరుచుకుపడ్డాయి. అనేకచోట్ల కేసులు నమో దుకావడం, బెదిరింపులు రావడం వగైరాలతో విసిగి ఆయన 2006లో భారత్‌ వదిలి వెళ్లి పోయారు. 2011లో మరణించేనాటికి ఆయన దోహాలో ఉన్నారు. తమిళనాడులో రచయిత పెరు మాళ్‌ మురుగన్‌ రాసిన నవలపై కూడా పెద్ద వివాదం తలెత్తింది.

ఆయనను అనేకవిధాల వేధిం చారు. కుల, మత సంఘాలు ఆయనపై ఎన్నో కేసులు పెట్టాయి. చివరకు మూడేళ్లక్రితం ఆ రచయిత సృజనాత్మకతపై ఆంక్షలు విధించడానికి వీల్లేదని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. రచయితల, కళాకారుల భావ వ్యక్తీకరణను అడ్డుకునేందుకు, వారి భావాలు ప్రజలకు చేరకుండా నిరోధించేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు బృందాలు అనేక విధాల ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై నిర్మించిన డాక్యుమెంటరీ విడుదలను ఆపాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ నిరుడు సుప్రీంకోర్టు విలువైన తీర్పును వెలువరించింది.

చట్ట పరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో భావాలు వ్యక్తం చేయొచ్చునని, అందులో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వాలకుగానీ, ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకుగానీ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో ఉదారంగా స్టేలు మంజూరు చేయొద్దని కింది కోర్టులకు సూచించింది. సుప్రీంకోర్టు పదే పదే ఇంత వివరంగా చెప్పినా సమస్యలు తలెత్తడం, అధికారంలో ఉన్నవారు వంతపాడటం విచారకరం. ఇలాంటి ధోరణులను నివారించకపోతే ప్రజాస్వామ్య భావనే ప్రమాదంలో పడుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement