రజనీకాంత్
తమిళసినిమా: కాలా చిత్రం కోసం స్టంట్ చేయాల్సిన అవసరం తనకు లేదని ఆ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ పేర్కొన్నారు. రజనీ నటించిన తాజా చిత్రం కాలా పలు విమర్శలు, ఆరోపణలు, వ్యతిరేకతల మధ్య శుక్రవారం తెరపైకి రానుంది. ఇటీవల తూత్తుక్కుడి కాల్పుల వ్యవహారంలో రజనీ వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే రజనీ చర్యలు కాలా ప్రచారం కోసం చేసిన పెద్ద స్టంట్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
భగవంతుడి దయ
భగవంతడి దయ వల్ల తనకు అభిమానులు, ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉందనీ, చిత్రం ఆడటం కోసం తాను స్టంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను సినిమాల్లోకి వచ్చి 43 ఏళ్లు అయ్యిందని, ఇప్పుడు స్టంట్స్, జిమిక్కులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాలా చిత్రానికి తాను ఊహించిన దాని కంటే తక్కువ సమస్యలే ఎదురయ్యాయని అన్నారు. కర్ణాటకలో కాలా విడుదలకు ఎలాంటి సమస్య రాదని భావిస్తున్నానని, చిత్రాన్ని వ్యతిరేకించడానికి ఎలాంటి కారణాలు లేవన్నారు. ఈ విషయం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి తెలుసని పేర్కొన్నారు. అక్కడ తమిళులు మాత్రమే కాకుండా ఇతర భాషలకు చెందిన లక్షలాది మంది కాలా చిత్రాన్ని చూసేందుకు ఆస్తకిగా ఉన్నారని అన్నారు. వారందరినీ నిరాశ పరచకుండా చిత్ర విడుదలకు అన్ని చర్యలు తీసుకుంటారని తగిన రక్షణ కల్పిస్తారని భావిస్తున్నానన్నారు. దేవేగౌడ లాంటి పెద్దాయన ఉన్నారని, ఆయన కాలా చిత్రాన్ని నిషేధించడానికి అంగీకరించరని రజనీకాంత్ పేర్కొన్నారు.
కాలాకు కోర్టు గ్రీన్ సిగ్నల్
కాలా చిత్రం వ్యవహారంలో ఆ చిత్ర నిర్మాత ధనుష్ సోమవారం కర్ణాటక కోర్టును ఆశ్రయించారు. ఆయన పీటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు చిత్ర విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, కర్ణాటక ప్రభుత్వం కాలా చిత్రానికి తగిన భద్రతను కల్పించాలని, థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
మద్రాసు హైకోర్టులో మరో పిటిషన్
కాలా పై చెన్నై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ముంబైలో నివశిస్తున్న తూత్తుక్కుడికి చెందిన త్రివియం నాడార్ అనే వ్యక్తి ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం కాలా అనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో త్రివియం నాడార్ పేరుకు కళంకం ఆపాదించే విధంగా, జాతి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ, కాలా విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ ముఖ్యమంత్రి సెల్ ద్వారా తమిళనాడు నాడార్ సంఘం నిర్వాహకులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది. ఇదిలాఉండగా మరోవైపు నటుడు సత్యరాజ్ రజనీకాంత్ రాజకీయంపై దండెత్తుతున్నారు. రజనీది రాజకీయం కాదని, వ్యాపారం అని ఆయన బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు.
టికెట్ ధరపైనా రచ్చ
కాలా చిత్ర టికెట్ ధరపైనా రచ్చ జరుగుతోంది. సినిమా టికెట్ ధర రూ.165.78 కాగా, కాలా చిత్ర టిక్కెట్లను రూ.207.25 ధరకు విక్రయించేందకు ప్రత్యేక అనుమతినిచ్చారు. అయితే వాస్తవానికి కాలా చిత్ర టికెట్ ధరను రూ.వెయ్యికి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌దాస్ ఇప్పుటికే ఖండించగా, బుధవారం ఆ పార్టీ కార్యధ్యక్షుడు అన్భుమణి రామ్‌దాస్ స్పందిస్తూ కాలా చిత్ర టిక్కెట్ ధరను నియంత్రించడానికి నటుడు రజనీకాంత్ చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కమల్‌కు రజనీ మద్దతు
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరి జలాల సమస్యను ఇరు రాష్ట్రాలు సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని, అందుకు తాను ప్రయత్నిస్తానని ఆ మధ్య నటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమలహాసన్ చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసి కావేరి నదీ జలాల వివాదంపై చర్చించారు. కమలహాసన్ చేస్తున్న ప్రయత్నానికి రజనీకాంత్ మద్దతు పలుకుతున్నట్లు ఒక భేటీలో పేర్కొన్నారు. ఇదే విధంగా కాలా చిత్రం సమస్యలను ఎదురొడ్డి విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని కమల్ వ్యక్తం చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment