తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా కోసం నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ రంగంలోకి దిగారు. రజనీకాంత్ నటించిన కాలా చిత్రానికి సంబంధించిన కర్ణాటక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాలా చిత్రం 7న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే కావేరి మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు వ్యవహారంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటకలోని కొన్ని సంఘాలు తీవ్రంగా పరిగణించారు. దీంతో కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ప్రజల మనోభావాలకనుకుగుణంగా కర్ణాటక ఫిలిం చాంబర్ కూడా కాలా చిత్ర విడుదలపై నిషేధం విధించింది. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ సమస్యల సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయన కర్ణాటక ఫిలిం చాంబర్ నిర్వాహకులతో కాలా విషయమై చర్చించారు. ఈ సందర్భంగా విశాల్ గురువారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో రజనీకాంత్ నటించిన కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకూడదని, చిత్రంపై నిషేధం విధించాలని కొన్ని కర్ణాటక సంఘాలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై తాము కర్ణాటక ఫిలించాంబర్ నిర్వాహకులతో చర్చలు జరిపాం. బుధవారం సాయత్రం సమావేశం జరిగింది. గురువారం ఒక నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ఫిలించాంబర్ నిర్వాహకులు చెప్పారు. సినిమా, రాజకీయాలు వేర్వేరు. కాలా చిత్రం నిర్మాత నిర్మించగా అందులో రజనీకాంత్ నటించారు. ఇది సినిమా. రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం వేరు. అయితే కర్ణాటక ఫిలించాంబర్ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాలా వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమరస్వామిని తాము కలుస్తాం. కాలా చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ సక్రమంగా విడుదల కావాలన్నదే మా భావన.
కావేరి సమస్య గురించి..
కావేరి సమస్య గురించి రజనీకాంత్, కమలహాసన్, శింబు, నేను కూడా మాట్లాడాం. అది వ్యక్తిగతం. వ్యక్తిగత అభిప్రాయాలు చిత్రానికి బాధింపు కాకూడదు. మీరు రాజకీయాల్లోకి వస్తారా? అంటే ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు. ఏ సంఘాలైనా రాజకీయాలను, సినిమాలను కలపడం తప్పు. మనమంతా భారతీయులం. రాష్ట్రాలన్నవి ఒక సరిహద్దులు అంతే.
వారి పేర్లు చరిత్రలో లిఖించాలి
తుత్తుక్కుడి పోలీసుల కాల్పులకు 13 మంది మరణించారు. అయితే అక్కడ మరణించి లెక్కకు రానివారు ఇంకా ఎందరున్నారో నాకు తెలుసు. అక్కడి స్టెర్‌లైట్ పరిశ్రమను మూసేశారు. అందుకు ప్రాణాలర్పించిన వారి పేర్లు చరిత్రలో లిఖించాలి. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు మోకాళ్లకు కింద భాగంలోనే షూట్ చేయాలన్నది అందరికీ తెలిసినదే. ప్రజలకు సంబంధించి విషయాలు అది జల్లికట్టు సమస్య, నెడువాసలా, స్టెర్‌లైట్ సమస్య ఏదైనా సరే వారి భావోద్రేకాలను గుర్తించి వారి అవసరాలకనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానమంత్రి విదేశీ పర్యటన చేయకుండా స్వదేశంలో సమస్యలను పరిష్కరిస్తే సంతోషం. మేమూ తమిళ సినిమా కోసం పోరాడుతున్నాం. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రధానిని కోరుకుంటున్నాం. స్వదేశీ సమస్యలు పట్టించుకుని పరిష్కరిస్తే మేమూ ఆయనకు ఓటు వేస్తాం. మంచి చేయకుంటే ఎలా ఓటు వేస్తాం.
నిర్మాతల మండలి చేయూత
తూత్తుక్కుడిలో కాల్పులకు బలైన వారి కుటుంబాలకు నిర్మాతల మండలి తరఫున ఆర్థిక సాయం చేయాలని భావిస్తున్నామని తెలిపారు 13 మందిని కోల్పోవడం ఆ కుటుంబాలకు తీరని లోటే అని వారిని మరచిపోకూడదని ఆయన ఆవేదనతో చెప్పారు. భారత ప్రధాని మోదీని ఓటు వేసిన వాడిగా వేడుకుంటున్నానని మన దేశ సమస్యలపై ఆయన దృష్టి సారించండి అని విశాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment