‘కాలా’ను విడుదల చేయొద్దు | Kumaraswamy Comments On Kaala Release In Karnataka | Sakshi
Sakshi News home page

‘కాలా’ను విడుదల చేయొద్దు

Published Tue, Jun 5 2018 7:21 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Kumaraswamy Comments On Kaala Release In Karnataka - Sakshi

బెంగళూరు: ‘కాలా’ సినిమాను రాష్ట్రంలో రిలీజ్‌ చేయవద్దని కర్ణాటక సీఎం కుమారస్వామి సినిమా పంపిణీ దారులను కోరారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెప్పారు. హైకోర్టు తీర్పు తర్వాత కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ‘ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా విడుదల చేయటం మంచిది కాదని నిర్మాతకు, పంపిణీ దారులకు సూచిస్తున్నా. ఒక పౌరునిగా, కన్నడిగునిగా చెబుతున్నా..ఇలాంటి పరిస్థితుల్లో ‘కాలా’తో అనవసరపు వివాదాలు తలెత్తుతాయి.

స్వతహాగా నేనూ సినిమా పంపిణీదారుడిని, నిర్మాతనే’అని వ్యాఖ్యానించారు. కావేరి వివాదానికి పరిష్కారం దొరికిన తర్వాత ఆ సినిమాను ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చునన్నారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన సినిమా ‘కాలా’ విడుదల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది.

కావేరి అంశంపై రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘కాలా’ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామంటూ వివిధ కన్నడ సంఘాలు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన ఈ సినిమా రాష్ట్రంలో విడుదల కావాల్సి ఉండగా ఆ చిత్ర పంపిణీ, ప్రదర్శనను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కర్ణాటక ఫిలిం చాం బర్‌ ఆఫ్‌ కామర్స్‌(కేఎంసీసీ) కూడా ఇంతకుముందే ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే రజనీ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు, కాలా నిర్మాత కె.ధనుష్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్‌ జి.నరేందర్‌.. ‘కాలా’ విడుదల సందర్భంగా అవసరమైన బందోబస్తు చేయాలని ఆదేశించారు. అయితే, ఆ సినిమాను తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ థియేటర్ల యజమానులను కోరబోమన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement