
సాక్షి, బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం విడుదలవకూడదని ఇప్పటికే కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మరోసారి చర్చించి సినిమా విడుదలవ్వాలా లేదా అనే విషయంపై తీర్మానిస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఈ విషయంపై కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి కూడా స్పందించారు. రజనీకాంత్ బహిరంగ క్షమాపణ చెప్పినా ‘కాలా’ చిత్రం కర్నాటకలో విడుదల కానివ్వమని అన్నారు.
ఇకపై రజనీకాంత్, కమల్ హాసన్‌కు సంబంధించిన ఏ చిత్రాలు కర్నాటకలో విడుదల కానివ్వమని ప్రవీణ్ శెట్టి పేర్కొన్నారు. కర్నాటక ఫిలిం చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు సారా గోవింద్ మాట్లాడుతూ.. రజనీ కాంత్, కమల్ హాసన్ చిత్రాలు తప్ప మిగిలిన అన్ని తమిళ చిత్రాలు కర్నాటకలో విడుదలయ్యేందుకు మాకు అభ్యంతరం లేదని తెలిపారు. కావేరి జలాల విషయంలో తమిళులకు మద్దతుగా రజనీకాంత్, కమల్ హాసన్‌లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.