సాక్షి, చెన్నై/బెంగళూరు: సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కాలా చిత్ర విడుదల విషయంలో సహకరించాలంటూ బుధవారం ఉదయం కన్నడ భాషలో రజనీ ఓ సందేశాన్ని సీఎం కుమారస్వామికి పంపారు. థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని కోరుతూ ఆయన సందేశంలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కాలా రిలీజ్‌ను అడ్డుకోలేమని మంగళవారం క్లియరెన్స్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు.. సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత విషయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కుమారస్వామి ‘ కోర్టు తీర్పును గౌరవిస్తాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా విడుదల చేయటం మంచిది కాదని నిర్మాతకు, పంపిణీ దారులకు సూచిస్తున్నా. ఒక పౌరునిగా, కన్నడిగుడిగా చెబుతున్నా..ఇలాంటి పరిస్థితుల్లో ‘కాలా’తో అనవసరపు వివాదాలు తలెత్తుతాయి. పరిస్థితులు చల్లబడ్డాక విడుదల చేసుకుంటే మంచిది’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ విజ్ఞప్తి చేయటం విశేషం.
నాడార్ నారాజ్... మరోపక్క నాడార్ సంఘం కూడా కాలా చిత్రంపై ఆగ్రహంతో ఊగిపోతోంది. కాలా చిత్రంలో తమ వర్గానికి చెందిన వ్యక్తిని కించపరిచేలా చూపించారని ఆరోపిస్తూ చిత్ర విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. కావేరీ జలాల వివాదంపై స్పందించిన రజనీ చేసిన వ్యాఖ్యలు కన్నడ గుడిల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. కాలా చిత్రాన్ని అడ్డుకుని తీరతామంటూ పలు సంఘాలు ఇది వరకే ప్రకటించాయి కూడా. అంతకు ముందు రాజకీయ ఒత్తిళ్లతో కాలా విడుదలపై కేఎఫ్‌సీసీ నిషేధం విధించగా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంది. కేఎఫ్‌సీసీతో చర్చించి చిత్రాన్ని విడుదల అయ్యేలా చూడాలంటూ ఎస్‌ఐఎఫ్‌సీసీకి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సూచించింది. హైకోర్టు తీర్పు తర్వాత కూడా పరిస్థితులు మారకపోవటంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే చిత్రం సజావుగా విడుదలయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment