kaala movie
-
కాలా నష్టం కాలా!
‘కాలా’ సినిమా కలెక్షన్స్‌కి సంబంధించిన పుకార్లకు చిత్రబృందం ఫుల్స్టాప్ పెట్టింది. ‘కాలా’ చిత్రం వల్ల తమకు నష్టాలు రాలేదని సదరు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. ఈశ్వరీ రావు, హ్యూమా ఖురేషి కథానాయికలుగా నటించారు. వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై రజనీకాంత్ అల్లుడు, దర్శక–నిర్మాత, నటుడు ధనుష్ నిర్మించిన ఈ సినిమా జూన్ 7న తమిళం, హిందీ, తెలుగు భాషల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అవ్వడంవల్ల నిర్మాణ సంస్థకు ఆశించిన ఫలితాలు రాలేదని తమిళ మీడియాలో ఆర్టికల్స్ వచ్చాయట. ఈ విషయంపై యూనిట్ స్పందించింది. ‘‘కాలా’ సినిమాకు సరైన కలెక్షన్స్ రాలేదని మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు అవాస్తవం. మాకు ‘కాలా’ సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. మా బ్యానర్లో సినిమా చేసిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు, అలాగే సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు «థ్యాంక్స్’’ అని వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. -
రజనీకాంత్ ‘కాలా’లో ‘కుల’కలం
వెనుకబడిన కులాలైన వన్నియార్లు, తేవర్లు, గౌండర్లు తమిళనాడులో కొత్త అగ్రకులాలుగా అవతరించారు. తమ కూతుళ్లు, కొడుకులు దళితులను పెళ్లాడితే వారు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో దళితుడిని చంపి జైలుకెళ్లడం ఈ కులాలవారికి గొప్ప గౌరవంగా కనిపిస్తోంది. మరి సమాజంలో ఇలాంటి సెంటిమెంటును కాలా సినిమా మార్చగలుగుతుందా? ఇప్పుడు రజనీకాంత్ ఈ చిత్రంలో వేసిన దళితుడి పాత్ర కారణంగా తమిళ సమాజంలో పరివర్తన వస్తుందా? జవాబు చెప్పడం చాలా కష్టం. కానీ, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల బాధలు, కష్టాలను విస్మరించలేమనే బలమైన ఆలోచన సినిమా వంటి సృజనాత్మక కళల్లో తప్పక మొదలవుతుంది. భారత సినిమా చరిత్రలో సాధారణమైనదేగాక చెప్పు కోదగినది కిందటి వారం. జూన్ 7న రజనీకాంత్ నటించిన కాలా విడుదలైంది. 1980ల నేపథ్యంతో నిర్మించిన ఈ సినిమాలో మురికి వాడలో నివసించే సామాన్యుడు ప్రజానాయకుడవు తాడు. అంతే కాదు, పేదల ఇళ్లను కూల్చడానికి ప్రయత్నించిన బలవంతుడైన ఓ రాజకీయ నేతను ప్రతిఘటిస్తాడు. ఇది మామూలు విషయం. ఈ కథలో కొత్తేమీ లేదు. అయితే, రజనీకాంత్ స్థాయి సూపర్‌స్టార్‌తో దర్శకుడు పా రంజిత్ ఓ దళితుడి వేషం వేయించడం, తమిళ వాణిజ్య సినిమాలో దళి తులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషమే. కుల వివక్షను సినిమాల్లో చూపించడం సామాన్య విషయం కాదు. మరాఠీలో సూపర్‌హిట్ అయిన చిత్రం ‘సైరాట్’ హిందీ రీమేక్ ‘ధడక్’ ట్రెయిలర్ విడుదలైంది. అగ్ర వర్ణ యువతి ప్రేమలో పడిన ఓ దళిత కుర్రాడి కథే సైరాట్. బాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ఈ కథను హిందీలో నిర్మించింది. అయితే, కుల ప్రస్తావన లేకుండా, పేద యువకుడు ధనికుడి కూతురును ప్రేమించినట్టుగా ఈ హిందీ సినిమాలో చెప్పారు. నేటి మల్టీప్లెక్స్ హిందీ సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగానే నిర్మాతలు కథలు రూపొందించి, సినిమాలు తీస్తారనడానికి ఇదో ఉదా హరణ. దళిత సంస్కృతి, వారి పాటలు, నృత్యాలు, వారి పండుగలు వంటి విషయాలను ప్రధాన స్రవంతి తమిళ సినిమా పట్టించుకోదనేది రంజిత్ అభిప్రాయం. అందుకే ఆయన తన చిత్రాల్లో ఈ అంశాలన్నిటినీ చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన దర్శకత్వం వహించిన కబాలి, కాలా ప్రత్యేకత సంతరించుకున్నాయి. కాలా కథ సాధారణమైనదేగాని పెద్దగా పట్టించుకోని కింది కులాల జీవనాన్ని చక్కగా చూపించడం, అందుకు రజనీకాంత్ నటన దోహదం చేయడం వల్ల ఇది విశిష్ట చిత్రంగా ఆకట్టుకుంటోంది. భారతీయ సిని మాల్లో దళితులకు ప్రాధాన్యం ఉండదు. సహాయ పాత్రలకే వారు పరిమితమౌతారు. ఆస్కార్ అవా ర్డుకు ప్రతి పాదించిన ఆమిర్‌ఖాన్ చిత్రం లగాన్‌లో దళితుడైన కచ్రా పాత్రను పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఆమిర్ పాత్రను గొప్పగా చూపించ డానికి అంటరాని వాడైన కచ్రాను వాడుకున్నారు. అంతేగాని, స్వాతంత్య్రానికి ముందు దేశంలో దళి తుల స్థితిపై ఎలాంటి వ్యాఖ్య ఇందులో కనిపించదు. కాలాలో శక్తిమంతుడైన బ్రాహ్మణుడిపై పోరాటాన్ని అంబేడ్కర్, బుద్ధుడి అభిమాని అయిన రంజిత్ 70 ఎంఎంలో గొప్పగా చిత్రించారు. అందుకే కాలాను ఓ మైలురాయి సినిమాగా పిలుస్తాను. హరిదేవ్ అభ యంకర్ అనే దుష్ట బ్రాహ్మణ పాత్ర పోషించిన నానా పటేకర్ రజనీకాంత్ పేరు కాలాను ఎగతాళి చేస్తూ, ఇదో పేరేనా అని ప్రశ్నిస్తాడు. కాలా నివసించే ముంబై మురికివాడ ధారావీని ‘అభివృద్ధి’ చేయడా నికి ప్రయత్నించిన సంస్థకు ‘మనూ రియాలిటీ’ అని పేరు పెట్టడంలో పరమార్థం ప్రేక్షకునికి అర్థంకాక పోదు. ఈ మురికివాడలో అపరిశుభ్రతపై పటేకర్ వ్యంగ్యాస్త్రాలు విసురుతాడు. తన వాడలోని మురికి పరిస్థితులను చూపి గర్వపడతాడు రజనీ. కింది కులాలంటే జుగుప్స ప్రదర్శించే వారిని ప్రతిబింబిం చేలా నానా పటేకర్ పాత్రను రంజిత్ రూపొందిం చారు. నేరుగా కులం పేరు ప్రస్తావించకుండా శుభత్ర, పేర్లు, దుస్తుల గురించి మాట్లాడుతూ కింది కులాలపై పైవారి మనస్సుల్లో అసహ్యం ఎంతగా ఉంటుందో కాలా చక్కగా చూపిస్తుంది. రంజిత్ చిత్రాల్లో కులానిదే కీలక పాత్ర రంజిత్ సినిమాలన్నింటిలోనూ కులానిదే ప్రధాన పాత్ర. కాలాలో కులాన్ని ముఖ్య భూమికలో చూపి స్తారు. క్లైమాక్స్‌లో నీలి రంగు దళితుల విజయానికి, గౌతమ బుద్ధ విహారలో కూడా ఈ రంగు దళితుల తిరుగుబాటుకు చిహ్నాలుగా కనిపిస్తాయి. ముంబైని అతలాకుతలం చేయడానికి ధారావీ సమ్మెకు దిగు తుంది. బలంగా పాతుకుపోయిన పాలకవర్గాలను కూలదోయడానికి బడుగువర్గాలకున్న శక్తికి ఇది తార్కాణంగా నిలబడుతుంది. కాలాలో ‘క్యా రే సెటింగా!’ అనే రజనీకాంత్ పంచ్ డైలాగ్‌ను ప్రేక్ష కుల ఈలలు, చప్పట్ల కోసం రాసిన మాటలుగా భావించకూడదు. దళితులకు వ్యతిరేకంగా అగ్రకు లాలు చేతులు కలపడాన్ని ఈ డైలాగ్ ప్రస్తావిస్తోంది. దళితులపై దాడి జరిగినప్పుడు రజనీకాంత్ ఒంటరి కాదు. కుల శత్రువులపై పోరుకు ఆయన వర్గీయులం దరూ ఆయన పక్కనే ఉంటారు. ఈ సినిమాలో మంచిచెడులను సంప్రదాయబద్ధంగాగాక భిన్నంగా చూపిస్తారు. విలన్ హరిదాదా తెల్ల దుస్తులే వేసు కుంటాడు. అతని ఇంటి హాల్లో రాముడి విగ్రహం ప్రముఖంగా కనిపిస్తుంది. సోఫా సెట్లు కూడా తెల్లని రంగులో కనిపిస్తాయి. అతను రామాయణంపై ఒట్టేసి మరీ మాట్లాడతాడు. అందుకు విరుద్ధంగా కాలా నల్లని బట్టలే ధరిస్తాడు. దుమ్మూధూళి అంటే అతనికి ఇష్టమేగాని చిరాకు లేదు. కాలాను రావణ్ అని విలన్ హరి పిలుస్తాడు. కాని, పెరియార్ ఈవీ రామసామి నాయకర్ ప్రకారం రావణుడు నలుపే గాని చెడ్డవాడు కాదు. కాలా తనను యమునిగా పిలుచుకుంటాడు. తనను రామునిగా భావించే హరి దాదాను యముని రూపాన్ని ప్రతిబింబించే కరికా లన్ తుదముట్టిస్తాడు. హరిదేవ్ తన కత్తి తుప్పు పట్టకుండా ఉండడానికి నూనె రాస్తూ దాన్ని పూజి స్తాడు. ఎప్పుడైనా కత్తిని ఇతరులను చంపడానికి వాడడమే అతని లక్ష్యం. అయితే, అందుకు విరు ద్ధంగా భీమ్రావు అంబేడ్కర్ పుస్తకాలను కాలా చదు వుతాడు. దళితుల ఇళ్లు కూల్చివేయాలనుకున్న హరి దేవ్ వారి విలువైన స్థలాలపై కన్నేసి వారికి మెరుగైన జీవితం కల్పిస్తానని వాగ్దానం చేస్తాడు. మా భూమిపై మాకే హక్కు కాలాలో దళిత పాత్రలు కష్టాలు, కన్నీళ్లకు ప్రతిబిం బాలు కావు. తమ నేలపై తమదే హక్కని వారు వాదిస్తారు. కాలా వారి జీవితాలు, ఆత్మగౌరవానికి చిహ్నం. ఈ మురికివాడలో వినిపించే సంగీతం భిన్నంగా ఉంటుంది. భీమ్ వాడ, మసీదు, నికా, గొడ్డు మాంసం దుకాణం, పెరియార్ చౌక్–ఇవన్నీ ధారావీ లో కనిపించే దృశ్యాల పేర్లు. లెనిన్, భీమ్జీ అనే పేర్లున్న పాత్రలు తమది భిన్న ప్రపంచమనీ, మిగతా భారతావని తమను గుర్తించాలనేలా ధ్వని స్తాయి. నేటి ఆధునిక భారతంలో నిర్మించే సిని మాల్లో చక్కటి అబ్బాయిలు, అందమైన బొమ్మలను తలపించే ఆడపిల్లలే కనిపిస్తారు. వీటిలో ఎన్నికల విశ్లేషణలో ఒక్క కులాన్నే ప్రధానాంశంగా చర్చించ డానికి అవకాశం లేదు. గతంలో ధారావీ మురికివాడ నేపథ్యంతో సినిమాలు వచ్చాయిగాని కులం గురించి ఇంత విస్తృతంగా అర్థమయ్యేలా చిత్రీకరించడం ఇదే మొదటిసారి. తెల్లగా ఉంటారనే కారణంగా ఉత్తరాది కథానాయికలను తమిళ సినిమా సహా దక్షిణాది సిని మారంగం దిగుమతి చేసుకోవడం ఎప్పటినుంచో సాగుతున్న వ్యవహారమే. కాలాలో ఇందుకు భిన్నంగా–రజనీ భార్యగా నటించిన ఈశ్వరీరావు, సామాజిక కార్యకర్తగా కని పించిన అంజలీ పాటిల్ ఇద్దరూ నల్లగానే ఉంటారు. జరీనా అనే భర్తలేని ముస్లిం తల్లి పాత్ర పోషించిన హుమా ఖురేషీ ఓ ముఖ్య సామాజిక సందేశం ఇచ్చేలా కాలాలో దర్శనమిస్తుంది. కుల వివక్షతో హత్యలు జరుగుతున్న కారణంగా తమిళనాడులో కాలా ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. 2016 మార్చిలో పశ్చిమ తమిళనాడులోని ఉడుముల పేటలో శంకర్ అనే దళిత యువకుడిని కత్తులతో పొడిచి చంపడం తీవ్ర సంచలనం సృష్టించింది. అతని భార్య కౌశల్య తండ్రి కిరాయి హంతకులతో శంకర్‌ను హత్య చేయిస్తాడు. శంకర్‌తో పోల్చితే పెద్ద కులానికి చెందిన కౌశల్య తల్లిదండ్రులు తమ మాట వినకుండా కూతురు దళితుడిని పెళ్లాడడం సహించ లేక ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హత్యకేసులో దోషులుగా తేలిన ఆమె తండ్రి, ఆయన అనుచరు లకు 2017 డిసెంబర్లో తిరుపూర్ కోర్టు శిక్షలు విధిం చింది. 2014–2016 మధ్య కాలంలో తమిళనాట పరువు హత్యల పేరుతో 83 కేసులు నమోద య్యాయి. వెనుకబడిన కులాలైన వన్నియార్లు, తేవర్లు, గౌండర్లు రాష్ట్రంలో కొత్త అగ్రకులాలుగా అవతరించారు. తమ కూతుళ్లు, కొడుకులు దళితు లను పెళ్లాడితే వారు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి కులాంతర వివాహాలను తమ కుటుంబా నికి అవమానంగా వారు భావిస్తారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో దళితుడిని చంపి జైలుకెళ్లడం ఈ కులా లవారికి గొప్ప గౌరవంగా కనిపిస్తోంది. మరి సమా జంలో ఇలాంటి సెంటిమెంటును కాలా సినిమా మార్చగలుగుతుందా? ఇప్పుడు రజనీకాంత్ ఈ చిత్రంలో వేసిన దళితుడి పాత్ర కారణంగా తమిళ సమాజంలో పరివర్తన వస్తుందా? జవాబు చెప్పడం చాలా కష్టం. కాని, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల బాధలు, కష్టాలను విస్మరించలేమనే బల మైన ఆలోచన సినిమా వంటి సృజనాత్మక కళల్లో తప్పక మొదలవుతుంది. తమిళ సినీ ప్రేక్షక ప్రపం చంలో పెద్ద సంఖ్యలో ఉన్న సామాజికవర్గాల కథలు సినిమాలకు ఇతివృత్తాలుగా మారడానికి కాలా దోహ దం చేస్తుంది. దళితుల జీవితాలను సహానుభూతితో అర్థం చేసుకుని వారి బతుకులను కథలు కథలుగా సినిమాల్లో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందే చెప్పినట్టు మరాఠీ సూపర్ హిట్ సినిమా సైరాట్‌ను హిందీలో ‘ధఢక్’ పేరుతో నిర్మించడం ద్వారా దళితుల జీవితాలను విస్తృతంగా సినిమా తెర లకు ఎక్కించే అవకాశం వచ్చింది. అయితే, అగ్రశేణి దర్శకుడు కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ హిందీ సినిమా ట్రెయిలర్ చూస్తే అలాంటి ఆశలు అడియా శలేననే భావన కలుగుతుంది. ఈ సినిమా నిర్మాతలు కేవలం శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కపూర్ల కొత్త ముఖాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కని పిస్తోంది. కుల వివక్ష వంటి బుర్రతో ఆలోచించే కథాంశాలు, భిన్న సామాజిక వాస్తవాలతో కూడిన కథనాలు ‘ఉన్నత స్థాయి’ హిందీ ప్రేక్ష కుల మెదళ్లకు ఎక్కకపోవడం నిజంగా దురదృష్టం. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
రజనీ ‘కాలా’... దుమ్మురేపుతున్న వసూళ్లు!
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా సినిమా ‘కాలా’... అంతగా గ్రాండ్ ఓపెనింగ్స్‌ను రాబట్టలేకపోయింది. రజనీ సినిమాలంటే సహజంగానే బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. కలెక్షన్ల సునామీ పోటెత్తుతుంది. అయితే, తొలిరోజు కాలా సినిమాకు చాలావరకు థియేటర్లు హౌస్‌ఫుల్ కాలేదని, అన్బుక్డ్ సీట్లు చాలా మిగిలిపోయాయని వార్తలు వచ్చాయి. రెండోరోజు నుంచి ఈ సినిమా వసూళ్లు మెల్లిగా ఊపందుకున్నాయని సినీ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రెండ్రోరోజుల్లో ఒక్క చెన్నైలోనే కాలా సినిమా మూడు కోట్లు వసూలు చేసింది. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్లో మిలియన్ మార్క్ (రూ. 6.83 కోట్లు)ను అందుకుంది. మొత్తానికి టాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. కాలా సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్లో వెల్లడించారు. చెన్నైలో ఈ సినిమా తొలి వీకెండ్లో రూ. 4.9 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో కాలా సినిమా సంచలన వసూళ్లు రాబడుతోంది. పద్మావతి సినిమా తర్వాత అత్యధిక విదేశీ వసూళ్లు రాబట్టిన సినిమాగా కాలా నిలిచింది. శాటిలైట్, మ్యూజిక్ తదితర హక్కుల ద్వారా విడుదలకు ముందే రూ. 230 కోట్ల బిజినెస్ చేసిన కాలా.. విడుదల తర్వాత కూడా వసూళ్లతో ఆకట్టుకుంటోందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా సినిమా రజనీ ద్రవిడ డాన్‌గా, మురికివాడల్లో నివసించే తన ప్రజల హక్కుల కాపాడే వ్యక్తిగా అద్భుతమైన నటన కనబర్చారు. #BREAKING: In 3 Days, #Kaala has crossed ₹ 100 Cr Gross at the WW Box Office.. pic.twitter.com/N9NS1no2Mg — Ramesh Bala (@rameshlaus) June 10, 2018 -
సౌదీలో విడుదలయ్యే
సాక్షి, న్యూఢిల్లీ : పా రంజింత్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా మూవీ మిశ్రమ స్పందనతో విడుదలైనా వసూళ్లలో కొన్ని ప్రాంతాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ మూవీ రికార్డులు నెలకొల్పేలా ఉంది. సౌదీ అరేబియాలో విడుదల కానున్న తొలి సినిమాగా కాలా నమోదవనుంది. సౌదీలో విడుదలైన తొలి భారతీయ మూవీ బ్లాక్ పాంథర్ అయినా 35 ఏళ్లుగా సౌదీ అరేబియాలో సినిమాలపై నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిషేధం ఎత్తివేయడంతో సౌదీలో విడుదల కానున్న తొలి భారతీయ సినిమా కాలా కావడం గమనార్హం. ముంబయిలోని మురికివాడ ధారవిని ఆక్రమించాలన్న గ్యాంగ్‌స్టర్‌తో పోరాడి ప్రజల హక్కులను హీరో కాపాడే కథాంశమే కాలా. ఈ మూవీలో ఈశ్వరిరావు, హ్యూమా ఖురేషీ, నానా పటేకర్లు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. -
‘కాలా’ అరుదైన ఘనత
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కాలా. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. రజనీ కెరీర్లోనే అత్యల్ప వసూళ్లు నమోదు చేసిన చిత్రంగా కాలా రికార్డ్ సృష్టించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో రిలీజ్ అయిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది కాలా. దాదాపు 35 ఏళ్ల తరువాత కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా సినిమాల ప్రదర్శనపై నిషేదాన్ని ఎత్తివేసింది. సౌదీ అరేబియాలో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండటంతో కాలాకు కలెక్షన్లు బాగానే ఉంటాయని భావిస్తున్నారు చిత్రయూనిట్. కబాలి ఫేం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానా పటేకర్, ఈశ్వరీరావు, హూమా ఖురేసీ, సముద్రఖనిలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
కర్ణాటకలో ‘కాలా’కు సెగలు
సాక్షి, బెంగళూరు: అందరూ ఊహించిన విధం గానే నటుడు రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాకు కర్ణాటకలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కావేరి జలాల వివాదంపై రజనీ తమిళనాడుకు అనుకూలంగా ప్రకటన చేసినందున ఆయన సినిమాను అడ్డుకుని తీరతామని కన్నడ సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో సినిమా విడుదల కష్టసాధ్యమైంది. కొన్ని థియేటర్లు, మల్టిప్లెక్స్ ల వద్ద భారీ పోలీసు భద్రతతో కాలాను ప్రదర్శించారు. కన్నడ రక్షణవేదిక కార్యకర్తలు, కన్నడ చళువలి వాటాల్ సంఘం నేత వాటాల్ నాగరాజ్ ఆధ్వర్యంలో బెంగళూరులో ఆందో ళనలు నిర్వహించారు. దాదాపు 200 మంది నిరసనకారులు మల్టీఫ్లెక్స్‌ల వద్ద సినిమాను అడ్డుకున్నారు. బెంగళూరు యశ్వంతపూర్‌లో ఉన్న ఓరియన్ మాల్, లిడో మాల్, మల్లేశ్వరంలో ఉన్న మంత్రి మాల్ వద్ద ఆందోళనకారులు దూసుకురాగా, పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అనేకచోట్ల నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అయినా పలు చోట్ల సినిమాను ఆందోళనకా రులు అడ్డుకోవడంతో నిర్వాహకులు మధ్య లోనే ఆపేసి ప్రేక్షకులకు టికెట్ డబ్బులను తిరిగి ఇచ్చేశారు. రూ. 2.5 కోట్లు నష్టం.. కర్ణాటకలో రజనీకాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయన సినిమా అంటే అభి మానులు విరగబడతారు. కాలాను అడ్డుకోవ డంతో తొలిరోజు దాదాపుగా రూ. 2.5 కోట్లు నష్టం వాటిల్లింది. వారానికి రూ.12 నుంచి15 కోట్ల వ్యాపారాన్ని కాలా చిత్రం నష్టపోబోతుం దని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. -
ముచ్చట తీర్చుకున్న ఆనంద్ మహీంద్ర
సాక్షి, చెన్నై: మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర తన ముచ్చట కాస్తా తీర్చుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కాలా' సినిమాలో మహీంద్ర థార్ వాహనాన్ని సొంతం చేసుకున్నారు. కాలా వాహనాన్ని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతామని గతంలోనే ప్రకటించిన ఆయన ఇపుడు ఈ కోరికను నెరవేర్చుకున్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్విటర్లో ట్వీట్ చేశారు. అనుకున్నట్టుగానే మహీంద్ర థార్ వాహనం చెన్నైలోని మహీంద్ర రీసెర్చ్ వ్యాలీలో సురక్షితంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాలా సినిమాలోని పోస్టర్ షాట్లోవాడిన కారును మ్యూజియంలో పెట్టుకోవడానికి నిర్మాత ధనుష్ అంగీకరించారని తెలిపారు. అంతేకాదు దీనితోపాటు ఒక ఆసక్తికరమైన వీడియోను కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో మహీంద్ర ఉద్యోగులు కాలా అవతార్‌లో సందడి చేశారు. గతంలో కాలా పోస్టర్ చూసిన ఆనంద్ మహీంద్రా ఆ కారుపై మనసు పడ్డారు. ఆ వాహనాన్ని తన కంపెనీ మ్యూజియంలో పెట్టుకుంటామని, సూపర్‌స్టార్ రజనీలాంటి ఓ లెజెండ్ కారుని ఓ సింహాసనంలా వాడుకున్నారు.. దీంతో ఆ కారుకూడా లెజెండ్ అయిపోతుందని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనికి రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ సానుకూలంగా స్పందించిన సంగతి విదితమే. కాగా రజనీకాంత్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న 'కాలా' సినిమా అనేక వివాదాల నడుమ గురువారం థియేటర్లను పలకరించింది. ఇందులో తలైవా గ్యాంగ్‌లీడర్‌గా నటించగా, ఈశ్వరీ రావు , హ్యూమా ఖురేషి, నానా పటేకర్ ఇతర ప్రముఖ పాత్రలు పోషించారు. ధనుష్ నిర్మాణ సారధ్యం వహించగా, పా రంజిత్ దర్శకుడు. సంతోష్ నారాయణన్ బాణీలు అందించారు. అయితే కాలా సినిమాకు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. Remember I wanted the Thar used for the poster shot of #Kaala for our museum?Well @dhanushkraja obliged & it’s safe at #MahindraResearchValley in Chennai.I asked our folks to strike a Thalaivar pose & look what fun they had!(Bala,the guy in the lungi is now known as ‘KaalaBala’) pic.twitter.com/r3HzFv7DEJ — anand mahindra (@anandmahindra) June 7, 2018 -
‘కాలా’ మూవీ రివ్యూ
టైటిల్ : కాలా జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : రజనీకాంత్, నానా పటేకర్, హూమా ఖురేషి, ఈశ్వరీ రావు సంగీతం : సంతోష్ నారాయణన్ దర్శకత్వం : పా.రంజిత్ నిర్మాత : ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ క్రేజ్ ఉంటుంది. అయితే రోబో తరువాత రజనీ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో కలెక్షన్లు వచ్చినా సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. అయినా రజనీ మాత్రం మరోసారి పా.రంజిత్ కే అవకాశం ఇచ్చారు. ముంబై మురికి వాడల నేపథ్యంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా కాలా. రజనీ ఏజ్‌కు ఇమేజ్ తగ్గ కథతో తెరకెక్కిన కాలా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? రజనీ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా..? కబాలితో నిరాశపరిచిన పా.రంజిత్.. కాలాతో మెప్పించాడా..? కథ ; కరికాలా అలియాస్ కాలా (రజనీకాంత్) ముంబైలోని మురికివాడ ధారావీకి పెద్ద దిక్కు. అక్కడే పుట్టి పెరిగిన కాలా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంటాడు. అయితే ముంబైలో అత్యంత విలువైన ఈ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు రాజకీయనాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. (సాక్షి రివ్యూస్) ముఖ్యంగా అధికార పార్టీ నాయకుడు హరిదేవ్ అభయంకర్ అలియాస్ హరిదాదా (నానా పటేకర్) ఎలాగైన ధారావీని నుంచి ప్రజలను వెల్లగొట్టి అక్కడ అపార్ట్మెంట్లు నిర్మించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కాలా హరిదాదా పనులకు అడ్డుతగులుతాడు. అలా హరిదాదా, కాలాల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది..? ఈ పోరాటంలో కాలా ఏం కోల్పోయాడు..? చివరకు ధారావీ ఏమైంది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రజనీకాంత్ తనదైన స్టైల్స్, మేనరిజమ్స్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. నటన పరంగా సూపర్బ్ అనిపించిన రజనీ యాక్షన్ సీన్స్ లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. విలన్ గా నానా పటేకర్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో సూపర్బ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. రజనీ ఇమేజ్ను ఢీ కొట్టే పొలిటీషియన్ పాత్రలో నానా పటేకర్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. రజనీ భార్యగా ఈశ్వరీ రావు నవ్వించే ప్రయత్నం చేసింది. (సాక్షి రివ్యూస్)రజనీ, ఈశ్వరీ రావ్ల మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. కీలక పాత్రలో నటించిన హూమా ఖురేషీ హుందాగా కనిపించింది. ఇతర పాత్రల్లో అంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కావటం కాస్త కష్టమే. విశ్లేషణ ; కబాలి సినిమా తరువాత రజనీ ఇచ్చిన సెకండ్ చాన్స్‌ను దర్శకుడు పా.రంజిత్ వినియోగించుకోలేకపోయాడు. రజనీ నుంచే అభిమానులు ఆశించే మాస్, కమర్షియల్ అంశాలేవీ లేకుండా సినిమాను రూపొందించిన రంజిత్ పూర్తిగా నిరాశపరిచాడు. రజనీ ఎంట్రీ విషయంలో కూడా పెద్దగా హడావిడి లేకుండా సాదాసీదాగా కాలా పాత్రను పరిచయం చేశాడు. తొలి భాగం అంతా అసలు కథ ప్రారంభించకుండా ఫ్యామిలీ సీన్స్‌తో లాగించేశాడు. కథలో రజనీ హీరోయిజాన్ని మరింతగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా దర్శకుడు ఆ దిశగా ప్రయత్నం చేసినట్టుగా కనిపించలేదు. (సాక్షి రివ్యూస్)ఇంటర్వెల్ సీన్‌తో హైప్‌క్రియేట్ చేసినా ద్వితీయార్థంలో అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయాడు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కూడా అక్కడక్కడా మెప్పించినా.. చాలా సందర్భాల్లో విసిగించాడు. మూడ్‌తో సంబంధం లేకుండా రాప్ బీట్లతో ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టాడు. మురళీ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ధారావి మురికి వాడలను నేచురల్ గా చూపించాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : రజనీకాంత్ ఇంటర్వెల్ సీన్ మైనస్ పాయింట్స్ : స్లో నేరేషన్ ఎడిటింగ్ సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
కాలా రిలీజ్ చేస్తే.. విధ్వంసమే!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ సినిమా విడుదలకు కష్టాలు తప్పడం లేదు. గురువారం ఉదయం 4 గంటల నుంచే కాలా ప్రదర్శన ప్రారంభం అవ్వాల్సి ఉండగా.. కన్నడ సంఘాలు సినిమాను అడ్డుకుంటున్నాయి. రాజధాని బెంగళూరు నగరంలో కన్నడిగులు గ్రూపులుగా ఏర్పడి కాలా విడుదలయ్యే థియేటర్ల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాలా ప్రదర్శిస్తే సహించేది లేదని, తాము విధ్వంసం సృష్టిస్తే ఆస్తినష్టం కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని థియేటర్ల యాజమాన్యాలను బెదిరించడంతో రజనీ మూవీని కష్టాలు వెంటాడుతున్నాయి. థియేటర్లకు వచ్చిన రజనీ అభిమానులు సినిమా చూస్తామా లేదా అని నిరాశ చెందుతున్నారు. కొన్ని థియేటర్లు కొన్ని షోలు వాయిదా వేసినట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం ఆయా థియేటర్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది, కానీ సినిమా విడుదలకు సహకరిస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. కాగా, తాను ఏ తప్పూ చేయలేదని, సినిమా చూడాలనుకునే వారిని దయచేసి అడ్డుకోవద్దని.. మీ సహకారం నాకెంతో అవసరమని చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని నివాసం వద్ద మీడియా సమావేశంలో రజనీకాంత్ కన్నడలో అర్థించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విడుదలవుతున్న కాలా మూవీపై కేవలం కర్ణాటకలో వివక్ష చూపెట్టవద్దని రజనీ కోరారు. -
కాలా కష్టాలు
-
రజనీకాంత్‌కు కమల్ మద్దతు!
చెన్నై : దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు చిత్రవర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రజనీతో రాజకీయంగా, పలు అంశాల్లో విభేదిస్తున్నప్పటికీ సినిమాల పరంగా తాము ఎప్పటికీ ఒక్కతాటిపైనే నిలుస్తామని నిరూపించారు కమల్ హాసన్. కాలా మూవీ విడుదల వివాదం నేపథ్యంలో కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో రజనీకి తన మద్దతు ఉంటుందన్నారు. తన విశ్వరూపం సినిమాను కూడా కర్ణాకటలో నిషేధించిన విషయాన్ని కమల్ గుర్తుచేశారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సమస్యను తీర్చేందుకు కృషి చేయాలన్నారు. రజనీ తాజా చిత్రం కాలాను చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కమల్ పేర్కొన్నారు. రైతుల సమస్యల తరహాలోనే ప్రతి సమస్య, వివాదాన్ని సంబంధిత బోర్డు, శాఖగానీ చర్చించి సమసిపోయేలా చేయాలని సూచించారు. కాగా, కాలా మూవీ విడుదలకు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి రజనీకాంత్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. థియేటర్ల వద్ద భద్రతా కల్పించాలని కన్నడ భాషలో ఓ సందేశాన్ని కుమారస్వామికి పంపారు. మూవీ విడుదలను అడ్డుకోలేమని హైకోర్టు తీర్పునిచ్చినా.. ప్రస్తుతం వివాదాలు తలెత్తుతాయని కొన్ని రోజులు వేచి చూడాలని కుమారస్వామి సూచిస్తున్నారు. ఓవైపు నాడార్ సంఘం మూవీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాలాలో తమ వర్గానికి చెందిన వ్యక్తిని కించపరిచేలా సీన్లున్నాయని, అందుకు మూవీ విడుదలను అడ్డుకుంటామని నాడార్ వర్గం హెచ్చరిస్తోంది. -
కర్ణాటక సీఎంకు ‘కాలా’ రిక్వెస్ట్
సాక్షి, చెన్నై/బెంగళూరు: సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కాలా చిత్ర విడుదల విషయంలో సహకరించాలంటూ బుధవారం ఉదయం కన్నడ భాషలో రజనీ ఓ సందేశాన్ని సీఎం కుమారస్వామికి పంపారు. థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని కోరుతూ ఆయన సందేశంలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాలా రిలీజ్‌ను అడ్డుకోలేమని మంగళవారం క్లియరెన్స్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు.. సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత విషయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కుమారస్వామి ‘ కోర్టు తీర్పును గౌరవిస్తాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా విడుదల చేయటం మంచిది కాదని నిర్మాతకు, పంపిణీ దారులకు సూచిస్తున్నా. ఒక పౌరునిగా, కన్నడిగుడిగా చెబుతున్నా..ఇలాంటి పరిస్థితుల్లో ‘కాలా’తో అనవసరపు వివాదాలు తలెత్తుతాయి. పరిస్థితులు చల్లబడ్డాక విడుదల చేసుకుంటే మంచిది’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ విజ్ఞప్తి చేయటం విశేషం. నాడార్ నారాజ్... మరోపక్క నాడార్ సంఘం కూడా కాలా చిత్రంపై ఆగ్రహంతో ఊగిపోతోంది. కాలా చిత్రంలో తమ వర్గానికి చెందిన వ్యక్తిని కించపరిచేలా చూపించారని ఆరోపిస్తూ చిత్ర విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. కావేరీ జలాల వివాదంపై స్పందించిన రజనీ చేసిన వ్యాఖ్యలు కన్నడ గుడిల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. కాలా చిత్రాన్ని అడ్డుకుని తీరతామంటూ పలు సంఘాలు ఇది వరకే ప్రకటించాయి కూడా. అంతకు ముందు రాజకీయ ఒత్తిళ్లతో కాలా విడుదలపై కేఎఫ్సీసీ నిషేధం విధించగా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంది. కేఎఫ్సీసీతో చర్చించి చిత్రాన్ని విడుదల అయ్యేలా చూడాలంటూ ఎస్ఐఎఫ్సీసీకి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సూచించింది. హైకోర్టు తీర్పు తర్వాత కూడా పరిస్థితులు మారకపోవటంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే చిత్రం సజావుగా విడుదలయ్యే అవకాశం ఉంది. -
‘కాలా’ విడుదలకు చర్యలు తీసుకోండి
బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాను కర్ణాటకలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్ఐఎఫ్సీసీ)ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)తో చర్చించాలని సూచించింది. కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక అమలు చేయాలని రజనీకాంతలో గతంలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లతో కర్ణాటకలో ఈ నెల 7న కాలా విడుదలపై కేఎఫ్సీసీ నిషేధం విధించింది. సినీ పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని సినిమా విడుదల చేసేలా కేఎఫ్సీసీతో చర్చించాలని ఎస్ఐఎఫ్సీసీకి సూచించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సాక్షి మహ్రా తెలిపారు. కర్ణాటకలోని రజనీకాంత్ అభిమానుల సంఘం కూడా కేఎఫ్‌సీసీకి లేఖ రాసింది. వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరింది. కాలాతో సంబంధమేంటి?: ప్రకాశ్‌రాజ్ యశ్వంతపుర: రజనీకాంత్ ‘కాలా’ సినిమాకు, కావేరి జలాల వివాదానికి సంబంధమేంటి? అని నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. ‘కావేరి పర్యవేక్షక మండలిని ఏర్పాటు చేయాలంటూ రజనీకాంత్ తమిళనాడుకు మద్దతు పలికారు. అయితే కాలా సినిమాకు, కావేరి వివాదానికి సంబంధం ఏమిటి? ఆ సినిమాను మాత్రమే కన్నడ సంఘలు ఎందుకు లక్ష్యం చేసుకున్నాయి. గతంలో బీజేపీ నాయకులు కూడా ‘పద్మావత్’ సినిమా విడుదల సమయంలో ఇలాగే వివాదం చేశారు. సినిమాను విడుదల చేయనివ్వండి, సినిమా చూడాలో వద్దో అభిమానులే నిర్ణయిస్తారు’ అని ట్విటర్లో పోస్ట్‌చేశారు. చర్చలతోనే ‘కావేరి’ పరిష్కారం కుమార స్వామి, కమల్ హాసన్ ఆకాంక్ష సాక్షి, బెంగళూరు: కావేరి జలాల వివాదాన్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కర్ణాటక సీఎం కుమార స్వామి అభిలషించారు. ప్రముఖ నటుడు, మక్కల నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్.. కుమారస్వామిని కలిశారు. గంటకుపైగా చర్చించారు. కమల్‌తో కావేరి వివాదం, యాజమాన్య బోర్డు అంశాలపై చర్చించినట్లు కుమారస్వామి మీడియాతో చెప్పారు. ఇరు రాష్ట్రాలు ఏకతాటిపై నడుస్తూ చర్చలు జరిపితే సమస్య పరిష్కారమవుతుందని కమల్ సూచించారు. కావేరిపై కోర్టుకెళ్లడం చివరి మెట్టుగా కావాలని పిలుపునిచ్చారు. కాలా చిత్ర ప్రదర్శనపై అడగ్గా, సినిమాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. -
రజనీ వ్యాఖ్యలు బాధించాయి.. కానీ, ‘కాలా’ను..!
సాక్షి, బెంగళూరు : ‘కాలా’ చిత్రం విషయంలో కన్నడ సంఘాలు అనుసరిస్తున్న వైఖరిని నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. కర్ణాటకలో ‘కాలా’ చిత్ర విడుదలపై నిషేధం విధించాలన్న కన్నడ సంఘాల డిమాండ్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ నదిజలాల అంశం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎంతో భావోద్వేగమైనదని, ఈ విషయంలో ఆచరణాత్మక పరిష్కారం కనుగొనాలి కానీ, భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదని ఆయన పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో రజనీకాంత్ మాట్లాడిన మాటలు తనను కూడా బాధించాయని, ఐనా ‘కాలా’ సినిమాను నిషేధించడం సరికాదని, ఈ విషయంలో సామాన్యుడు సొంతంగా నిర్ణయం తీసుకోగలడని, అతనికి ఉన్న ఆ అవకాశాన్ని దూరం చేయడం సరికాదని అన్నారు. -
నా తండ్రి తప్పుడు మనిషి కాదు
సాక్షి, ముంబై/చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రానికి కష్టాలు కొనసాగుతున్నాయి. కావేరీ జలాలపై రజనీ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో ఈ చిత్రం రిలీజ్ కాకుండా అడ్డుకుని తీరతామని కొన్ని సంఘాలు హెచ్చరించాయి. మరోవైపు కాలా కథ తన తండ్రిదేనంటున్న ముంబైకి చెందిన జర్నలిస్ట్ జవహర్ నాడర్, పరువు నష్టం దావా వేస్తానని కాలా నిర్మాతలను హెచ్చరించారు. కాలా సేట్ కథ... ట్యూటికోరిన్(తూత్తుకుడి)కి చెందిన ఎస్. థిరవియమ్ నాడర్ బెల్లం వ్యాపారి. 1957లో ముంబైలోని ధారావికి వలస వచ్చారు. అతనిని స్థానికులు ‘గుడ్వాలా సేట్’, ‘కాలా సేట్’ అని పిలిచేవారు. అయితే ఇప్పుడు కాలా చిత్రంలో రజనీ పోషిస్తున్న పాత్ర తన తండ్రిదేనని జవహర్ వాదిస్తున్నారు. ‘నా తండ్రి కథ అన్న విషయాన్ని దాచిపెట్టి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పైగా మంచి మనిషిగా పేరున్న నా తండ్రిని తప్పుడు కోణంలో చూపించారు. ఆయన గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను. 36 గంటల్లో రజనీకాంత్ సహా చిత్ర యూనిట్ మొత్తం లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే రూ. 101 కోట్లకు దావా వేస్తా’ అని ఆయన లేఖలో హెచ్చరించారు. గతంలో కూడా ఆయన ఈ తరహా ఆరోపణలు చేయటం తెలిసిందే. కాలా టీమ్ స్పందన... ఇదిలా ఉంటే జవహర్ ఆరోపణలను కాలా చిత్ర యూనిట్ తోసిపుచ్చింది. ‘కాలా’ కథకు, థిరవియమ్ నాడార్కు అస్సలు సంబంధం లేదని తేల్చి చెప్పింది. నోటీసులు అందాక స్పందిస్తామని పేర్కొంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలా’ను నటుడు ధనుష్ నిర్మించగా, రజనీకాంత్, ఈశ్వరి, నానాపటేకర్, సముద్రఖని, హూమా ఖురేషీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 7న కాలా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
కాలాకు కలిసిరాని కాలం
యశవంతపుర: ఈ నెల 7న విడుదల కానున్న రజనీకాంత్ నటించిన కాలా చిత్రం విడుదలకు కర్ణాటకలో కాలం కాలసిరావటంలేదు. రోజుకో çకన్నడ సంఘం నాయకులు రజనీకాంత్‌కు వ్యతిరేకతగా తమ అక్రోశంను వెల్లగక్కటంతో కాలా చుట్టూ సమస్యలు పెరుగుతున్నాయి. కర్ణాటక–తమిళనాడుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న కావేరి నీటి పంపకాలపై కేంద్రం న్యాయ మండలిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తమిళనాడుకు మద్దతుగాను కర్ణాటకకు వ్యతిరేకంగాను సూపర్‌స్టార్ రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గత కొద్దికాలంగా వివాదం ఉంది. దీంతో కాలా సినిమాను రాష్ట్రంలో విడుదలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కన్నడ రక్షణ వేదిక ప్రవీణ్‌శెట్టి మద్దతుదారులు శనివారం కర్ణాటక చలనచిత్ర వాణజ్య మండలి ఎదుట ఆందోళన చేశారు. రజనీకాంత్ నటించిన సినిమాను విడుదల చేయటానికి అవకాశం కల్పించరాదని చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందుకు విజ్ణప్తి చేసింది. ఒక వేళ రాష్ట్రంలో కాలాను విడుదల చేస్తే రజనీకాంత్ కష్టాలను ఎదరు చూడాల్సి ఉంటుందని కరవే అధ్యక్షుడు ప్రవీణ్‌శెట్టి హెచ్చరించారు. కావేరి విషయంలో రజనీకాంత్‌తో పాటు కమలహాసన్ నటించిన సినిమాలను కూడ విడుదలను అడ్డుకుంటామని సంఘం నాయకులు హెచ్చరించారు. కావేరి నది విషయంలో రజనీకాంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వాటాల్ పార్టీ అధ్యక్షుడు వాటాల్ నాగరాజు తెలిపారు. కలాను రాష్ట్రంలో విడుదల చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రజనీకాంత్–కమలహాసన్ వ్యాఖ్యలను ఖండిస్తూనే సినిమా విడుదల అడ్డుకోవాలని రాష్ట్రంలోని అనేక కన్నడ సంఘలు తమపై ఒత్తిడి పెరిగిందని కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు తెలిపారు. సినిమాను ప్రదర్శించకుండ థియేటర్ల యజమాన్యం నిర్ణయించిందన్నారు. అందోళనకారులు రజనీ,కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవీణ్శెట్టిని అరెస్టు చేశారు. -
రజనీ క్షమాపణ చెప్పినా విడుదలకానివ్వం..
సాక్షి, బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం విడుదలవకూడదని ఇప్పటికే కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మరోసారి చర్చించి సినిమా విడుదలవ్వాలా లేదా అనే విషయంపై తీర్మానిస్తామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఈ విషయంపై కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి కూడా స్పందించారు. రజనీకాంత్ బహిరంగ క్షమాపణ చెప్పినా ‘కాలా’ చిత్రం కర్నాటకలో విడుదల కానివ్వమని అన్నారు. ఇకపై రజనీకాంత్, కమల్ హాసన్‌కు సంబంధించిన ఏ చిత్రాలు కర్నాటకలో విడుదల కానివ్వమని ప్రవీణ్ శెట్టి పేర్కొన్నారు. కర్నాటక ఫిలిం చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు సారా గోవింద్ మాట్లాడుతూ.. రజనీ కాంత్, కమల్ హాసన్ చిత్రాలు తప్ప మిగిలిన అన్ని తమిళ చిత్రాలు కర్నాటకలో విడుదలయ్యేందుకు మాకు అభ్యంతరం లేదని తెలిపారు. కావేరి జలాల విషయంలో తమిళులకు మద్దతుగా రజనీకాంత్, కమల్ హాసన్‌లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
కర్ణాటకలో ‘ కాలా’ కష్టాలు
బెంగళూరు: కర్ణాటకలో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు చేదు వార్త. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తలైవా తాజా చిత్రం ‘ కాలా’ కర్ణాటకలో విడుదలయ్యే అవకాశం కనిపించడంలేదు. కావేరీ జల వివాదంపై రజనీకాంత్ చేసిన వాఖ్యలపట్ల కర్ణాటక వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ‘ కాలా’ చిత్రాన్ని ప్రదర్శించరాదని నిర్ణయించుకుంది. కావేరీ జలాలపై రజనీ వాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని దీంతో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటున్నామని ఫిల్మ్‌ఛాంబర్ తెలిపింది. తమిళనాడుకు కావేరీ జలాలను తక్షణమే విడుదల చేయాలని రజనీకాంత్ గతంలో కోరిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన రజనీకాంత్ తమిళనాడులో నటుడై ఇక్కడే పేరు, ప్రఖ్యాతులు పొందారు. అయితే ప్రస్తుతం కావేరి మేనేజ్మెంట్ సమస్య తమిళనాడు, కార్ణాటక మధ్య ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ తమిళనాడుకు కావేరి వ్యవహారంలో మద్ధతుగా మాట్లాడాల్సిన నిర్భంధానికి గురయ్యారు. ఆయన అదే చేశారు కూడా. కావేరి మేనేజ్మెంట్ బోర్టు ఏర్పాటు చేయాలంటూ కోలీవుడ్ నిర్వహించిన దీక్షలోనూ రజనీకాంత్ పాల్గొన్నారు. దీంతో కన్నడిగులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొన్ని కర్ణాటక సంఘాలు అయితే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం కాలా. ఈశ్వరిరావు, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ, నానాపటేకర్, సముద్రకని వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి కబాలీ చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. ముంబాయిలోని ధారవి నేపథ్యంలో జరిగే ఒక దాదా కథగా తెరకెక్కిన చిత్రం అని, ఇందులో రాజకీయ పరమైన అంశాలు చాలానే చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై రజనీకాంత్ గత చిత్రాలన్నింటికంటే అధికంగా అంచనాలు, ఆసక్తి పెంచుకున్నారు. కారణం చిత్రంలో రాజకీయ సెటైరికల్ సంభాషణలు ఒక అంశం కాగా.. ఇది రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించిన తరువాత విడుదల కానున్న చిత్రం కావడం మరో అంశం. ఇక నటుడు సత్యరాజ్ ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఒక పాత్రలో నటించిన బాహుబలి చిత్ర విడుదలనే కన్నడిగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి సత్యరాజ్ క్షమాపణ చెప్పక తప్పలేదు. అలాంటిది కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్ విషయంతో కన్నడిగులు ఉదారత చూపించలేదు. మరి ఈ సూపర్‌స్టార్ కూడా సారీ చెబుతారా? కాలా ఎలాంటి సమస్య లేకుండా కర్ణాటకలో విడుదలవుతుందా? అన్న ఆసక్తి చిత్ర వర్గాల్లో నెలకొంది. -
రజనీకాంత్ ‘కాలా’ ట్రైలర్
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా ట్రైలర్ వచ్చేసింది. వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నటుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కబాలి డైరెక్టర్ పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ముంబై నేపథ్యంలో మరోసారి డాన్‌గా తలైవా అలరించబోతున్నాడు. ట్రైలర్ విషయానికొస్తే... బస్తీ, దానిని రక్షించే దాదా కాలాగా రజనీ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నెగటివ్ రోల్లో బాలీవుడ్ నటుడు నానాపటేకర్ నటించారు. ఎవరైనా నన్ను ఎదిరించాలనుకుంటే మరణమే... అంటే పటేకర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ‘ఒక్కచోటూ వదల్లేదు. తన వెనుక పిచ్చోడిలా తిరిగా.. నేనంటే అంత ఇష్టమా?. చెప్పలేనంత... ఐ లవ్ యూ’... అంటూ ముదురు రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు. రజనీకి జోడీగా ఈశ్వరి, హూమా ఖురేషీలు నటించారు. ‘ఈ తనవే మనకున్న ఏకైక ఆయుధం. ఇది ఈ లోకానికి చాటుదాం.. కదలండి ఉద్యమిద్దాం.’ ‘నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం’ అంటూ రజనీ డైలాగులు ఓకే అనిపించాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సూపర్ స్టార్ గత చిత్రాల స్థాయిలో హడావుడి కనిపించకపోవటం గమనించదగ్గ విషయం. జూన్ 7న కాలా అన్ని భాషల్లో విడుదల కానుంది. -
హైదరాబాద్‌లో ‘కాలా’ ఈవెంట్
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. సూపర్‌స్టార్ సినిమా అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అయితే రజనీ గత సినిమా కబాలి దెబ్బ కాలాపై పడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కబాలి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే.. సూపర్‌స్టార్ సినిమాకు ఉండాల్సిన హడావిడి ‘కాలా’కు లేదని అభిమానులు ఫీలవుతున్నారు. కాలా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించినా పాటలు అభిమానులను అలరించేలా లేవన్న టాక్ వినిపిస్తోంది. రజనీకి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమిళ ఇండస్ట్రీ తరువాత రజనీకి టాలీవుడ్ అతి పెద్ద మార్కెట్. కానీ ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో రజనీ సినిమా సందడి కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు అభిమానులకు కాస్త ఊరట కలిగించే వార్తను ప్రకటించింది చిత్రయూనిట్. మే 29న కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభవుతుందని తెలిపారు. నానా పటేకర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కబాలి ఫేం పా. రంజిత్ దర్శకత్వం వహించారు. తలైవాకు జోడిగా హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు. ‘కాలా’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
కర్ణాటకలో కాలా కష్టాలు?
తమిళసినిమా: రజనీకాంత్, కమలహాసన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు విడుదల సమయంలో ఏదో రకమైన సమస్యలను ఎదుర్కోవడం పరిపాటిగా మారుతోంది. కమలహాసన్ తాజా చిత్రం విశ్వరూపం– 2 సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇక రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలా’కు కర్ణాటకలో సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని అంటున్నారు సినీ వర్గాలు. నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం కాలా. ఈశ్వరిరావు, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ, నానాపటేకర్, సముద్రకని వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి కబాలీ చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. కాగా ఇది ముంబాయిలోని ధారవి నేపథ్యంలో జరిగే ఒక దాదా కథగా తెరకెక్కిన చిత్రం అని, ఇందులో రాజకీయ పరమైన అంశాలు చాలానే చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేయడానికి నిర్మాత ధనుష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంపై రజనీకాంత్ గత చిత్రాలన్నింటికంటే అధికంగా అంచనాలు, ఆసక్తి పెంచుకున్నారు. కారణం చిత్రంలో రాజకీయ సెటైరికల్ సంభాషణలు ఒక అంశం కాగా.. ఇది రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించిన తరువాత విడుదల కానున్న చిత్రం కావడం మరో అంశం. కర్ణాటకలో వ్యతిరేకత.. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. కాలా చిత్రానికి కర్ణాటకలో కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అవి కావేరి రూపంలో ఎదురవ్వనున్నాయి. కర్ణాటకకు చెందిన రజనీకాంత్ తమిళనాడులో నటుడై ఇక్కడే పేరు, ప్రఖ్యాతులు పొందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కావేరి మేనేజ్మెంట్ సమస్య తమిళనాడు, కార్ణాటక మధ్య ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో త్వరలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్న రజనీకాంత్ తమిళనాడుకు కావేరి వ్యవహారంలో మద్ధతుగా మాట్లాడాల్సిన నిర్భంధానికి గురయ్యారు. ఆయన అదే చేశారు కూడా. సమీపకాలంలో కావేరి మేనేజ్మెంట్ బోర్టు ఏర్పాటు చేయాలంటూ కోలీవుడ్ నిర్వహించిన దీక్షలోనూ రజనీకాంత్ పాల్గొన్నారు. దీంతో కన్నడిగులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొన్ని కర్ణాటక సంఘాలు అయితే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రజనీకాంత్ నటించిన కాలా చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ చిత్రాన్ని కర్ణాటకలో విడుదలను అడ్డుకుంటామంటున్నారు. నటుడు సత్యరాజ్ ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఒక పాత్రలో నటించిన బాహుబలి చిత్ర విడుదలనే కన్నడిగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి సత్యరాజ్ క్షమాపణ చెప్పక తప్పలేదు. అలాంటిది కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్ విషయంతో కన్నడిగులు ఉదారతను చూపిస్తారని ఊహించలేం. మరి ఈ సూపర్‌స్టార్ కూడా సారీ చెబుతారా? కాలా ఎలాంటి సమస్య లేకుండా కర్ణాటకలో విడుదలవుతుందా? అన్న ఆసక్తి చిత్ర వర్గాల్లో నెలకొంది. -
కాలా రిలీజ్‌కు ముందే పార్టీ ప్రకటన
-
యమ గ్రేటే... మన ‘కాలా’ సేటు
రజనీకాంత్... ఈ పేరే ఒక సంచలనం. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడే కాదు, దేశ విదేశాల్లోనూ తలైవాకు తిరుగులేని అభిమానగణం ఉంది. ఈ సూపర్‌స్టార్‌కు మాములు ప్రేక్షకులే కాదు... సెలబ్రెటీలు కూడా అభిమానులే. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రజనీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. కోలీవుడ్ ప్రేక్షకులు ఆయనను తమిళ దైవంగా ఆరాధిస్తారు. అలాంటి సూపర్‌స్టార్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూనే ఉంటారు. రజనీ సినిమాకు సంబంధించి ఏ చిన్నవిషయమైనా వీరికి పండగే. కొద్ది క్షణాల క్రితమే రజనీకాంత్ తాజా చిత్రం ‘కాలా’ మొదటి పాటను విడుదల చేశారు. యమ గ్రేటే.. యమ గ్రేటే...అంటూ సాగే ఈ పాట రజనీ కోసమే పుట్టిందేమో అన్నట్లు ఉంది. ఈ ఒక్క పాటలోనే సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూపించేశారు. రజనీ కాలాగా ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నారో ఈ పాటను వింటే తెలుస్తోంది. ధారావి ప్రాంతంలో కాలాకు ఉండే పలుకుబడి ఏంటో అర్థమవుతోంది. ఈ పాటను హరిహరసుదన్, సంతోష్ నారాయణ్ ఆలపించగా...సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ చూడ్డానికి కూడా బాగుంది. ఇక ఈ పాటతో కాలా విడుదలయ్యే వరకు అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. కాలా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘కాలా’ మొదటి పాట విడుదల
-
కాలా రిలీజ్‌కు ముందే పార్టీ ప్రకటన
సాక్షి, చెన్నై : వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన రజనీకాంత్ తిరిగి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీని ప్రకటిస్తారన్న వార్త ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. గత నెల 23న రజనీ అమెరికా వెళ్లారు. మరో వారం రోజుల్లో తిరిగి చెన్నై చేరుకోనున్నారు. వచ్చిన వెంటనే కాలా సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలో పాల్గొంటారు రజనీ. సినిమా రిలీజ్‌కు మరి కొంత సమయం ఉండటంతో ఈలోగా రాజకీయ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నారట తలైవా. ఈ నెల 25న జిల్లా అధ్యక్షులతో పాటు వివిధ వర్గాలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో దాదాపు 8500 మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాలా జూన్ 7 రిలీజ్‌కానుండగా ఈ లోగా పార్టీని ప్రకటించాలని భావిస్తున్నారు తలైవా. త్వరలోనే రజనీ రాజకీయ కార్యాచరణకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
‘కాలా’ ఫస్ట్ సింగిల్ రేపే
సినిమా విజయాలతో సంబంధం లేని తిరుగులేని స్టార్డమ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సొంతం. రజనీ సినిమా వస్తోందంటే చాలు అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. రజనీపై ఉండే అభిమానం... సినిమా సక్సెస్‌పై ఆధారపడదు. సూపర్‌స్టార్‌కు ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వరుసగా సినిమాలు నిరాశపరుస్తున్న అభిమానులు మాత్రం తలైవా సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూనే ఉన్నారు. కబాలి ఫేం పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన రజనీ తాజా చిత్రం ‘కాలా’.. ఈపాటికే సినిమా విడుదలై సంచనాలు సృష్టించాల్సింది. కానీ తమిళ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సినిమా ఆలస్యమైంది. లేటుగా వచ్చినా లేటేస్ట్‌గా వస్తా అనే డైలాగ్ ఎలాగూ రజనీకి ఉంది. కాలా సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటును పలికాయని తెలుస్తోంది. తలైవాకు ఉన్న క్రేజ్‌కు ఎంతైనా పెట్టొచ్చు అంటున్నారు అభిమానులు. ప్రముఖ హీరో, రజనీ అల్లుడైన ధనుష్ ఈ చిత్ర నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని ధనుష్ ట్వీటర్ ద్వారా తెలియపరిచారు. మే 9న ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నట్లు, రేపు (మే 1) సాయంత్రం ఏడు గంటలకు ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు నటించారు. ఈ సినిమాకు కబాలి ఫేం సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. A surprise to Superstar fans. #kaala 1st single #semmaweightu will be released tom evening at 7 pm. #rajinism #thalaivar @Music_Santhosh @beemji @vinod_offl @humasqureshi pic.twitter.com/mLDt1oCfm2 — Dhanush (@dhanushkraja) 30 April 2018 Wunderbar films presents, Superstar’s #kaalaa audio will release on #may9th ... get ready to celebrate thalaivars swag with Santosh narayanan’s stylish music. pic.twitter.com/FbrRwFmtng — Dhanush (@dhanushkraja) 28 April 2018 -
‘కాలా’ శాటిలైట్ రైట్స్‌కు భారీ ప్రైజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రజనీ అల్లుడు కోలీవుడ్ హీరో ధనుష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తమిళనాట సినీరంగం సమ్మె కారణంగా కాలా సినిమాను జూన్ 7కు వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం లేకపోయినా.. కాలా సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ సంస్థ 75 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ విలన్ గా నటిస్తుండటంతో ఉత్తరాదిలో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. రజనీ సరసన హ్యూమా ఖురేషీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. -
కాలా రిలీజ్ వాయిదా?
హాటైన సమ్మర్లో దీటైన ‘కాలా’ రౌడీయిజాన్నీ థియేటర్స్‌లో కూల్‌గా ఏంజాయ్ చేద్దామనుకున్న అభిమానుల ఆశలకు బ్రేక్ పడింది. ‘కాలా’ చిత్రం విడుదల వాయిదా పడిందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ రంజిత్.పా దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాలా’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో ధనుష్ నిర్మించారు. హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్ కథానాయికలు. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బంద్ కారణంగా ‘కాలా’ చిత్రం రిలీజ్ వాయిదా వేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రంజాన్‌కు రిలీజ్ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ‘కాలా’ రంజాన్‌కు థియేటర్స్‌లోకి వస్తే సల్మాన్‌ఖాన్‌తో బాక్సాఫీస్ వద్ద ఢీ తప్పదు. రెమో డిసౌజా దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘రేస్ 3’ చిత్రాన్ని కూడా రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి.. ‘కాలా’ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడో? వెయిట్ అండ్ సీ. -
‘కాలా’ సెన్సార్ పూర్తయ్యిందా..?
రజనీకాంత్ ఈ పేరే ఒక సంచలనం. నడిచినా, నవ్వినా, అది ఒక ట్రెండే. రజనీ చిత్రం వస్తుంది అంటే ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాల్సిందే. కబాలి విడుదల సందర్భంగా చాలా ప్రైవేట్ సంస్థలు సెలవు దినంగా ప్రకటించాయి కూడా. కానీ కబాలి ఆశించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయినా ఆ సినిమా డైరెక్టర్ పనితనం నచ్చి అదే డైరెక్టర్‌కు మళ్లీ అవకాశం ఇచ్చాడు రజనీ. ప్రస్తుతం కాలా చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే తమిళనాడులో జరుగుతున్న సినీ పరిశ్రమ నిరవధిక సమ్మెల కారణంగా ఈ చిత్రం విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. కాలా సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయనీ, సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందని వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సెన్సార్ సభ్యులు దాదాపు 10 మార్పులు సూచించారని కొన్ని సన్నివేశాలను తీసేశారని సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. -
ఆ ఇద్దరి చిత్రాల పరిస్థితేంటి!
సాక్షి,సినిమా: సూపర్‌స్టార్, కమలహాసన్ చిత్రాలు ఎన్నడూ లేనంతగా అయోమయం పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. చిత్ర పరిశ్రమ సమ్మెకు ఇప్పట్లో పరిష్కారం లభించేటట్టులేదు. ఇటు నిర్మాతల మండలి, అటు థియేటర్ల సంఘం ఎవరికి వారు తమ పక్కనే న్యాయం ఉందంటూ పంతాలకు పోయి సమస్యను జఠిలంగా మారుస్తున్నారు. నిర్మాతల మండలి తమ డిమాండ్లు నెరవేరాల్సిందే నంటుంటే, వాటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని థియేటర్ల యాజమాన్యం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ నటించిన కాలా చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ సమ్మె ప్రకటనకు ముందే ప్రకటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కాలా చిత్రం సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొన్నా, ఎట్టకేలకు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ /ఏ సర్టిఫికెట్‌ను అందించింది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు కమలహాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన విశ్వరూపం–2 చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. చాలా కాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రానికి కమల్ సెన్సార్ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేశారు. ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వరూపం–2 చిత్రాన్ని కమలహాసన్ ఇదే నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మిగతా చిత్రాల విషయం ఎలా ఉన్నా, రజనీకాంత్, కమలహాసన్ చిత్రాల ప్రభావం చిత్ర పరిశ్రమపైనా, ప్రేక్షకులపైనా ఎక్కువగానే ఉంటుంది. అయితే చిత్రపరిశ్రమ సమ్మె కొనసాగుతుండడంతో కాలా, విశ్వరూపం–2 చిత్రాల విడుదల అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె కారణంగా సినీ కార్మికులకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా చూడాల్సిందిగా రజనీకాంత్ ఇటీవల తనను కలిసిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు హితవు పలికారు. అదే విధంగా కమల్‌ను కలిసిన విశాల్ సమ్మెకు కారణాలను వివరించారు. దీంతో సమ్మెను రజనీకాంత్, కమలహాసన్ తప్పు పట్టకపోయినా ఈ పిరిస్థితులు వారి చిత్రాలకు ఇబ్బంది కలించేవిగా ఉన్నాయన్నది వాస్తవం. -
రజనీ మూవీ రిలీజ్ మళ్లీ డౌటే!
సాక్షి, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా మూవీ విడుదల మరింత ఆలస్యం కానుంది. పా. రంజిత్ దర్శకత్వంలో విజయం సాధించిన ‘కబాలి’ సినిమాకు సీక్వెల్‌గా ’కాలా’ రూపొందింది. రజనీ నటించిన 2.0 (రోబో-2) కంటే ముందుగానే ఏప్రిల్ 27న కాలా విడుదలవుతుందని ఆ మూవీ యూనిట్ ఇటీవల వెల్లడించింది. కానీ కొన్ని కారణాల వల్ల మాఫియా డాన్ కరికాలన్‌గా రజనీని చూడాలంటే అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందని కోలీవుడ్ టాక్. తమిళ సినిమా నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) తమ సమస్యల పరిష్కారం కోసం త్వరో దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కాలా విడుదల ఆలస్యం కానుంది. కావాలంటే నెల ముందుగానే విడుదల చేసుకోవాలని టీఎఫ్‌పీసీ సూచించడంతో అందుకు సాధ్యం కాదని కాలా మూవీ యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మే నెలలో కాలా విడుదల కానుందని తెలుస్తోంది. కాగా మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా, రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. -
‘కాలా’ శునకానికి కోట్లలో బేరం
సాక్షి, పెరంబూరు: సినీ నటుడు రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో ఉన్న ఓ శునకానికి కోట్లలో బేరాలు రావడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అది ఒక సాధారణ కుక్క అట. అయితే సిమోన్ అనే శునకాల శిక్షకుడు ఈ కుక్కకు చక్కగా ట్రైనింగ్ ఇచ్చి కాలా చిత్రంలో నటింపజేశారట. దీనికి మణి అని నామకరణం కూడా చేశాడట. సినిమాల్లో జంతు జీవాలను ఉపయోగించుకున్న తర్వాత యజమానుల వెంట వెళ్లిపోతుంటాయి. అయితే శునకరాజు మణిపై రజనీ పడటంతో దానికి కోట్ల రూపాయల్లో బేరం పలుకుతోంది. మలేషియాకు చెందిన రజనీకాంత్ అభిమానులు ఇప్పటికే రూ.2 కోట్లు ఆఫర్ చేశారట. అయితే మణి అనే ఆ శునకాన్ని దాని శిక్షకుడు సిమోన్ విక్రయించడానికి నిరాకరించారని సమాచారం. -
‘కాలా’ మూవీ స్టిల్స్
-
‘కాలా’ టీజర్ వచ్చేసింది
-
శుభాకాంక్షల వరదలో అనిరుద్
తమిళసినిమా: యువ సంగీత దర్శకుడు అనిరుద్ శుభాకాంక్షల వరదలో మునిగి తేలుతున్నారు. కారణం ఏమిటి? అసలేం జరిగింది? అనిరుద్ కొత్తగా ఏం చేస్తున్నారు? లాంటి ప్రశ్నలు తలెత్తడం సహజమే. 3 చిత్రంలోని వై దిస్ కొలై వెరి డీ పాటలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్న అనిరుద్‌కు లైఫ్ ఇచ్చిన నటుడు ధనుష్ పక్కన పెట్టారనే ప్రచారం ఒక పక్క జరుగుతుంటే ఈ యువ సంగీత దర్శకుడికి అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు కదా, భారీ చిత్రాల అవకాశాలు వరిస్తుండడం విశేషం. ఇటీవల అజిత్ చిత్రాలకు వరుసగా పని చేసిన అనిరుద్‌ను తాజాగా సూపర్‌స్టార్ చిత్రానికి బాణీలు కట్టే అవకాశం వరించింది. నిజమే కాలా, 2.ఓ చిత్రాలు నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న తరుణంలో కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటిం చడానికి పచ్చజెండా ఊపేసిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించను న్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతదర్శకుడిగా ఎంపికయ్యారు. దీంతో ఈ యువ సంగీత దర్శకుడికి పరిశ్రమ వర్గాల నుంచి శుభాకాంక్షల పరంపర మొదలైంది. యువనటుడు శివకార్తికేయన్, నిర్మాత ఆర్డీ.రాజా, నటుడు ఆర్య, వివేక్, సినీ ప్రముఖులు అనిరుద్‌కు సూపర్‌స్టార్ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం రావడంతో శుభాకాంక్షలు అందిస్తున్నారు. -
‘కాలా’ తమిళ్ టీజర్
-
కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు!
సాక్షి, సినిమా : ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’ టీజర్ వచ్చేసింది. తలైవా మరోసారి మాఫియా డాన్ పాత్రలో అదరగొట్టారు. ‘కాలా అంటే నలుపు.. చావుకే దేవుడు’, ‘వీరయ్య బిడ్డని రా.. ఒక్కడినే ఉన్నా.. దిల్ ఉంటే గుంపుగా రండి’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ధనుష్ వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మాణంలో పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. తమిళ టీజర్ ను ముందుగా రిలీజ్ చేసిన చిత్రయూనిట్ 10 గంటలకు తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. రజనీ డాన్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో నానా పటేకర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. నానా నటిస్తున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతమందించారు. టీజర్ గురువారమే రిలీజ్ కావాల్సి ఉండగా కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మరణం నేపథ్యంలో ఆయన గౌరవార్థం టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ధనుష్ ట్విటర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. -
రజనీ ఫ్యాన్స్‌కు ధనుష్ క్షమాపణలు
సాక్షి, చెన్నై : సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు హీరో ధనుష్ క్షమాపణలు చెప్పాడు. కాల చిత్ర టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. తొలుత మార్చి 1న టీజర్‌ను విడుదల చేస్తామని కాలా నిర్మాత అయిన ధనుష్ అధికారికంగా ప్రకటించాడు. అయితే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తుది శ్వాస విడిచిన నేపథ్యంలో ఆయన గౌరవార్థం టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా మరో ట్వీట్ చేశాడు. మార్చి 2న ఉదయం 11గంటలకు కాలా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ధనుష్.. టీజర్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాలా ఏప్రిల్ 27న విడుదల కానుంది. డాన్ పాత్రలో రజనీ కనిపించబోతున్నాడు. Due to the demise of respected Jagadguru Poojyashri Jayaendra Saraswati Shankaracharya, as a mark of respect Kaala teaser will be released on 2nd March. Apologies to all the fans who were eagerly waiting for the teaser. — Dhanush (@dhanushkraja) 28 February 2018 #kaala teaser Tom at 11 am !! Stay tuned. #superstar #thalaiva #makewayfortheking 👑 — Dhanush (@dhanushkraja) 28 February 2018 -
రజనీ సినిమా టీజర్‌కు డేట్ ఫిక్స్
రజనీకాంత్ హీరోగా కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కాలా’. 2.ఓ రిలీజ్ వాయిదా పడటంతో ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను హీరో ధనుష్ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించబోతోంది. మార్చి 1న కాలా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా హుమా ఖురేషీ హీరోయిన్గా నటిస్తోంది. సంతోష్ నారయణ్ సంగీతమందిస్తున్నారు. -
‘రజనీ బతిమాలితేనే ఒప్పుకున్నా’
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించటంపై స్పందించిన నానా పటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తమిళ సినిమా చేసే ఉద్దేశం ఎప్పుడూ లేదన్న నానా పటేకర్, రజనీ కోరినందువల్లే కాలా సినిమాలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. -
మహేష్, బన్నీలకు షాక్
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాలా. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను రజనీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు. రజనీ నటించిన మరో సినిమా 2.ఓ ఆలస్యం కావటంతో కాలాను ముందుగానే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 2.ఓ రిలీజ్ చేయాలని భావించిన ఏప్రిల్ చివరి వారంలో కాలాను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. కాలా సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ లు తమ సినిమాలను అదే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భరత్ అనే నేను, వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలను ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా రజనీ సినిమాను అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటన రావటంతో మహేష్, బన్నీ చిత్రాల నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. రజనీకాంత్ సినిమా అంటే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ భారీగా రిలీజ్ అవుతోంది. ఇలా ఒకేసారి ముగ్గురు టాప్ హీరోలు బరిలో దిగితే థియేటర్ల సమస్య కూడా తలెత్తుంది. మరి ఈ రజనీ ఎంట్రీతో మహేష్, బన్నీ లలో ఎవరైనా వెనక్కి తగ్గుతారేమో చూడాలి. -
‘సినిమాలో ఆ సన్నివేశాలు చాలా స్పెషల్’
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయంటోంది నటి హుమా ఖురేషీ. మోడలింగ్ రంగం నుంచి బుల్లి తెరకు ఆపై వెండితెరకు పరిచయం అయిన ఈ ఢిల్లీ బ్యూటీ 2012లో ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన హుమాఖురేషీ పలు హిందీ, ఆంగ్ల పత్రికల ముఖ చిత్రాలకు గ్లామరస్‌గా ఫొటోలు దిగి మరింత పాపులర్ అయింది. గత ఐదేళ్లలోనే 20 చిత్రాల వరకూ నటించేసిన హుమా.. ఇప్పటికే దక్షిణాదిలో కూడా రౌండ్ కొట్టేస్తోంది. గత ఏడాది మలయాళంలో మమ్ముట్టితో జత కట్టిన ఈ భామ తాజాగా మన సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కాలాలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సంగతి తలిసిందే. కబాలి చిత్రం తరువాత రజనీకాంత్ మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న కాలా చిత్రంలో సముద్రకని, అంజిలి పాటిల్, శాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న కాలా చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ సందర్భంగా కాలా చిత్రంలో నటించడం గురించి హ్యూమఖరేషీ పేర్కొంటూ రజనీకాంత్ అంతటి సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అంది. అసలు ఆయనతో నటించే అవకాశం రావడమే ఘనంగా భావిస్తున్నానీ, కాలా చిత్రంలో తాను రజనీకాంత్‌తో నటించే సన్నివేశాలు చాలా స్పెషల్‌గా ఉంటాయనీ చెప్పింది. రజనీకాంత్ నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయనీ, ఈ చిత్రంలో నటించడం ద్వారా తానూ చాలా పాఠాలు నేర్చుకుంటున్నాననీ హుమా ఖురేషీ చెప్పుకొచ్చింది. -
ఆ సినిమా స్టోరీ నాదే
పోలీస్ కమిషనర్‌కు అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు టీనగర్: రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం కథ నాదేనంటూ అసిస్టెంట్ డైరెక్టర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం కాలా. ఈ చిత్రం షూటింగ్ ఆదివారం ముంబైలో ప్రారంభమైంది. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి కథానాయకిగా నటిస్తున్నారు. సముద్రఖని, ఈశ్వరీరావ్, హిందీ నటుడు నానా పటేకర్ సహా పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ధనుష్ తండ్రి కస్తూరి రాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కె. రాజశేఖరన్ అనే వ్యక్తి చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. తాను సౌత్ ఇండియన్ ఫిలించాంబర్‌లో కరికాలన్ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేశానని, దీన్ని రజనీకాంత్‌తో చిత్రంగా రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఇలాఉండగా వండర్‌బార్ ఫిలింస్ ఆధ్వర్యంలో దర్శకుడు పా.రంజత్ ద్వారా కాలా ‘కరికాలన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుసుకుని దిగ్భాంతి చెందానన్నారు. ఈ చిత్ర కథ నాదేనని, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అభిమాన సంఘం సభ్యుడి తొలగింపు ఫొటోల చిత్రీకరణ సమయంలో రజనీకాంత్ ముందు నినాదాలు చేసిన అభిమానుల సంఘం నిర్వాహకుడిని రజనీకాంత్ తొలగించారు. దీనిగురించి తొలగింపునకు గురైన సైదై రవి మాట్లాడుతూ రజనీకాంత్ చుట్టూ ఉన్న వ్యక్తులు పొరపాట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.