
సాక్షి, బెంగళూరు : ‘కాలా’ చిత్రం విషయంలో కన్నడ సంఘాలు అనుసరిస్తున్న వైఖరిని నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. కర్ణాటకలో ‘కాలా’ చిత్ర విడుదలపై నిషేధం విధించాలన్న కన్నడ సంఘాల డిమాండ్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ నదిజలాల అంశం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎంతో భావోద్వేగమైనదని, ఈ విషయంలో ఆచరణాత్మక పరిష్కారం కనుగొనాలి కానీ, భావోద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదని ఆయన పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో రజనీకాంత్ మాట్లాడిన మాటలు తనను కూడా బాధించాయని, ఐనా ‘కాలా’ సినిమాను నిషేధించడం సరికాదని, ఈ విషయంలో సామాన్యుడు సొంతంగా నిర్ణయం తీసుకోగలడని, అతనికి ఉన్న ఆ అవకాశాన్ని దూరం చేయడం సరికాదని అన్నారు.