కమల్ హాసన్
చెన్నై : దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు చిత్రవర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రజనీతో రాజకీయంగా, పలు అంశాల్లో విభేదిస్తున్నప్పటికీ సినిమాల పరంగా తాము ఎప్పటికీ ఒక్కతాటిపైనే నిలుస్తామని నిరూపించారు కమల్ హాసన్. కాలా మూవీ విడుదల వివాదం నేపథ్యంలో కమల్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో రజనీకి తన మద్దతు ఉంటుందన్నారు. తన విశ్వరూపం సినిమాను కూడా కర్ణాకటలో నిషేధించిన విషయాన్ని కమల్ గుర్తుచేశారు.
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సమస్యను తీర్చేందుకు కృషి చేయాలన్నారు. రజనీ తాజా చిత్రం కాలాను చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కమల్ పేర్కొన్నారు. రైతుల సమస్యల తరహాలోనే ప్రతి సమస్య, వివాదాన్ని సంబంధిత బోర్డు, శాఖగానీ చర్చించి సమసిపోయేలా చేయాలని సూచించారు.
కాగా, కాలా మూవీ విడుదలకు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి రజనీకాంత్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. థియేటర్ల వద్ద భద్రతా కల్పించాలని కన్నడ భాషలో ఓ సందేశాన్ని కుమారస్వామికి పంపారు. మూవీ విడుదలను అడ్డుకోలేమని హైకోర్టు తీర్పునిచ్చినా.. ప్రస్తుతం వివాదాలు తలెత్తుతాయని కొన్ని రోజులు వేచి చూడాలని కుమారస్వామి సూచిస్తున్నారు. ఓవైపు నాడార్ సంఘం మూవీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాలాలో తమ వర్గానికి చెందిన వ్యక్తిని కించపరిచేలా సీన్లున్నాయని, అందుకు మూవీ విడుదలను అడ్డుకుంటామని నాడార్ వర్గం హెచ్చరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment