
సాక్షి, చెన్నై : వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన రజనీకాంత్ తిరిగి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీని ప్రకటిస్తారన్న వార్త ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. గత నెల 23న రజనీ అమెరికా వెళ్లారు. మరో వారం రోజుల్లో తిరిగి చెన్నై చేరుకోనున్నారు. వచ్చిన వెంటనే కాలా సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలో పాల్గొంటారు రజనీ. సినిమా రిలీజ్‌కు మరి కొంత సమయం ఉండటంతో ఈలోగా రాజకీయ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నారట తలైవా.
ఈ నెల 25న జిల్లా అధ్యక్షులతో పాటు వివిధ వర్గాలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో దాదాపు 8500 మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాలా జూన్ 7 రిలీజ్‌కానుండగా ఈ లోగా పార్టీని ప్రకటించాలని భావిస్తున్నారు తలైవా. త్వరలోనే రజనీ రాజకీయ కార్యాచరణకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.