రీల్ లైఫ్‌లో ఒంటి చేత్తో వందమందిని బాదేసిన రజనీకాంత్‌కు రియల్ లైఫ్‌లో అలా సాధ్యం కాదని రాజకీయాల్లోకి వచ్చాకగానీ తెలియ రాలేదు. పార్టీ ఏర్పాటు కాకుండానే చెప్పలేనన్ని చికాకులు చుట్టుముట్టడంతో పార్టీ ప్రధాన కార్యాలయంగా భావిస్తున్నభవనానికి తాళం వేయాల్సిందిగా సోమవారం రాత్రి ఆదేశించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీని ప్రకటించక ముందు రాజకీయతలనొప్పులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే నియమితులైన ఇన్‌చార్జిల మధ్య కలహాలు, ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇదిలా ఉండగా రజనీకాంత్ ఎంజీ రామచంద్రన్ బాటలో పయనిస్తున్నారా? సినీ తెరపై నుంచి రాజకీయ తెరపైకి అడుగుపెట్టిన నాటి పోకడలనే అనుసరిస్తున్నారా? రజనీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, వృద్ధాప్య అస్వస్థత కారణంగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఇంటికే పరిమితం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రెండు కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. తమిళ సినీతెరపై ఎంజీఆర్ పక్కా మాస్. శివాజీ గణేశన్ మహాక్లాస్. వారిద్దరి రాజకీయాలూ అలాగే సాగాయి. ఇక తరువాతి తరంలో రజనీకాంత్ ఫక్తు మాస్. కమల్‌హాసన్ కచ్చితంగా క్లాసే. వారిద్దరిలాగే వీరిద్దరూ రాజకీయాల్లోకి కాలుమోపారు.
రాజకీయాల్లో సైతం కమల్‌హాసన్ క్లాస్‌గా వడివడిగా అడుగులు వేసుకుంటూ పోతుండగా, రజనీకాంత్ మాత్రం ఎంజీఆర్ అడుగుజాడల్లో నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. ఎంజీఆర్ వైద్యకళాశాల ప్రాంగణంలో ఇటీవల ఎంజీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం రజనీకాంత్ తన ప్రసంగంలో ఎంజీఆర్ పాలనను అందిస్తానని ప్రకటించడం గమనార్హం. కరుణానిధితో పొసగని కారణంగా డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఎంజీఆర్ వేరుకుంపటి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అన్నాడీఎంకేను స్థాపించారు. అయితే, రాజకీయ నాయకుడిగా అప్పటికే ప్రజల్లో మంచి పలుకుబడి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు తన అభిమాన సంఘాలపైనే పూర్తిగా ఆధారపడ్డారు. రాజకీయ నేతగా తాను సాధించిన విజయాలను అభిమాన సంఘాల ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్లారు. పరోక్షంగా పార్టీకి అభిమానులే క్రియాశీలకంగా వ్యవహరించారు. అదే కోవలో రజనీకాంత్ సైతం పయనిస్తున్నారు.
ప్రజా సంఘాలుగా అభిమాన సంఘాలు
రజనీ రాజకీయాల్లో రావడం ఖాయమని ప్రకటించి ఏడునెలలు పూర్తయింది. పార్టీ ప్రకటన ఊసేలేదు. ఆయనకు రాష్ట్రం నలుమూలలా 60వేల అభిమాన సంఘాలున్నాయి. ఇప్పటివరకు ఉండిన ‘రజనీకాంత్ అభిమాన సంఘాలు’ ఆయన రాజకీయ ప్రవేశం తరువాత ‘రజనీకాంత్ ప్రజా సంఘాలు’గా మారిపోయాయి. వీరందరికీ సభ్యత్వ నమోదు బాధ్యత అప్పగించారు. కనీసం ఒక కోటి సభ్యత్వం లక్ష్యంగా రజనీ నిర్ణయించారు. దాదాపు అన్ని జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. అభిమానులకు రాజకీయ పార్టీ హోదాను కల్పించకుండా ఎంజీఆర్ వలెనే ప్రజా సంఘాలతోనే పయనించేలా ఏర్పాట్లుచేసుకుంటున్నారు. ప్రజా సంఘాల ద్వారానే క్షేత్రస్థాయిలో బలపడి బూత్ కమిటీలను ఏర్పాటు చేసే దశలో రజనీ రాజకీయాలు ప్రస్తుతం సాగుతున్నాయి. అంతేగాక స్థానిక సమస్యలను సేకరించే బాధ్యత సైతం సంఘాల ప్రతినిధులకు అప్పగించారు. జిల్లాల వారీగా స్థానిక సమస్యలను ఆకలింపు చేసుకునేందుకు ఆయా ప్రాంతాల అభిమానులపై ఆధారపడినట్లు సమాచారం.
రజనీకి రాజకీయ చికాకులు
స్వతహాగా ప్రశాంతను ఆశించే రజనీకాంత్ ఏడాదికొకసారి హిమాలయాలు, రుషికేష్ వంటి ప్రాంతాలకు వెళ్లి ఆహ్లాదాన్ని ఆస్వాదించి వస్తుంటారు. అయితే రాజకీయాల్లోకి అడుగిన తరువాత రజనీకి ప్రశాంత కరువైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఏ అభిమానులపై అన్నిటికీ ఆధారపడుతున్నారో ఆ అభిమానుల నుంచే తలనొప్పులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. రజనీ అభిమాన సంఘాల మధ్య అభిప్రాయబేధాలు, ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పరంపరతో పార్టీ పెట్టకుండానే రజనీ బుర్ర వేడెక్కిపోతోంది. ముఖ్యంగా అభిమాన సంఘాలతో సంబంధం లేని లైకా ప్రొడక్షన్స్ మాజీ నిర్వాహకుడు రాజూ మహాలింగంను రజనీ ప్రజా సంఘాల ప్రధాన కార్యదర్శిగా రజనీకాంత్ నియమించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజా సంఘాల్లో అంతర్గత కలహాలు పెరిగిపోవడంతో రజనీకాంత్ తన సోదరుడైన సత్యనారాయణరావును పిలిపించి ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కార్యాలయం మూసివేతకు ఆదేశం
చెన్నై కోడంబాక్కంలోని రజనీకి సొంతమైన శ్రీరాఘవేంద్ర కల్యాణమండపంలో పార్టీ ప్రధాన కార్యాలయానికి భవనం సిద్ధమైంది. ఆ భవనాన్ని గతంలో రజనీ తన విశ్రాంతికి వాడుకునే వారు. ప్రస్తుతం అది పార్టీ కార్యకలాపాలు జరుగుతుండగా ప్రజా సంఘాల ప్రతినిధులు వరసపెట్టి వచ్చి ఫిర్యాదులను చెప్పడం, ఈ విషయాలన్నీ ఉత్తరాదిన షూటింగ్‌లో ఉన్న రజనీకాంత్ చేరవేయడం రోజూ కొనసాగుతోంది. దీంతో తీవ్రమైన అసహనానికి లోనైన రజనీకాంత్. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.
సమస్యలపై స్పందించాలని..
తూత్తుకూడి విధ్వంసకాండ, కాల్పులపై రజనీ చేసిన విమర్శలు ప్రజలు ప్రతికూల ప్రభావం చూపడం, ఈ కారణం చేతనే కాలా చిత్రం బాక్స్‌ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అందుకే ఈసారి అలాంటి తప్పు పునరావృతం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించాలని రజనీ జాగ్రత్తపడుతుండగా ప్రజా సంఘాల్లోని కలతలు రజనీకి తలనొప్పులు మారడంతో పార్టీ ఆఫీసుకు తాళం వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment