జయలలిత మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని రజనీకాంత్, కమల్‌హాసన్ పూడ్చేందుకు పోటీపడుతున్నారు. ఒకేసారి రాజకీయరంగ ప్రవేశం చేశారు. కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించి రోడ్‌షోలు మొదలుపెట్టారు. రజనీకాంత్ ఇంకా పార్టీ ఏర్పాట్ల కసరత్తు చేస్తున్నారు. వెండితెర స్నేహితులైన కమల్, రజనీ రాజకీయాల్లో సైతం అదే తరహాను కొనసాగిస్తారా అనే సందేహం అందరిలో నెలకొంది.ఈ తరుణంలో రజనీ తనది ఆధ్యాత్మిక పార్టీ అని స్పష్టం చేయగా తన పార్టీది లౌకిక సిద్ధాంతమని కమల్ పేర్కొని వేర్వేరు బాటలని తేల్చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకేసారి ఇద్దరం రాజకీయాల్లో రావడం వల్ల రజనీకాంత్ స్నేహానికి రాంరాం చెప్పక తప్పదని ‘మక్కల్ నీది మయ్యం’ అధినేత, నటుడు కమల్‌హాసన్ స్పష్టం చేశారు. అయితే రాజకీయాల కారణంగా రజనీతో స్నేహాన్ని తెంచుకోవడం బాధగా ఉందని అన్నారు.
ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ, రజనీతో తన స్నేహానికి కాజకీయాలు చెక్ పెట్టాయని తెలిపారు. రాజకీయ అడుగుల్లో తమ మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయని కమల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘రాజకీయాల్లో రజనీకాంత్ ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుని ఉన్నారో తెలియదు. రజనీకాంత్ రాజకీయాలతో తన రాజకీయ పయనాన్ని పోల్చిచూడవద్దు. ఇద్దరి రాజకీయాల్లో అనేక తేడాలున్నాయి. అయితే రజనీ రాజకీయ పరిస్థితి గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదు. అయితే ఆయనలో నెలకొన్న పరిస్థితుల్లోకి నేను వెళ్లను. నాకు ఎలాంటి మతాలు లేవు అన్ని మతాలు సమ్మతమే. కాబట్టి రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలపై నాకు నమ్మకం లేదు. సినిమాల్లో ఆయన బాణిలో కాకుండా ప్రత్యేక తరహాలో నటునిగా నా ప్రయాణం సాగింది. సినిమాల్లో ఉండగా మా ఇద్దరి బాణీలు వేరైనా స్నేహం ఉండేవి. ఆయన అంగీకరించిన సినిమాల అవకాశాలను నేను తోసిపుచ్చాను.
అలాగే నేను నటించిన పాత్రలను ఆయన నిరాకరించారు. రాజకీయాల్లో సైతం ఇద్దరికీ అలాంటి అభిప్రాయభేదాలే ఉన్నాయి. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ పొరపాటు నిర్ణయాలు తీసుకోను. అయితే ఒక్కటి మాత్రం నమ్మకంగా చెబుతా.. రాజకీయ విమర్శలు చేసే సమయాల్లో మా ఇద్దరి మధ్య ఏర్పడే ఇంకా బలమైన అభిప్రాయభేదాలను నివారించలేం. చీలికలకు కారణం కావచ్చు. అయితే ఎప్పుడు ఏర్పడుతుందో మాకే తెలియదు. సినిమాల సమయంలో కొనసాగిన స్నేహాన్ని రాజకీయాల్లో ఆశించలేం. రాజకీయాల్లో మా ఇద్దరి మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలను తలచుకుంటే బాధగా ఉంది. అయితే ఒకరినొకరం విమర్శలు చేసుకోకుండా నాగరీకమైన రాజకీయాలు సాగించాలని ఇద్దరం కోరుకుంటున్నాం’’అని కమల్‌హాసన్ స్పష్టం చేశారు.
కమల్ పరామర్శ
తేనీ జిల్లా కురంగని కొండ అడవుల్లో ఈనెల 11వ తేదీన కార్చిచ్చుకు బలైన ఇద్దరు యువతుల కుటుంబాలను కమల్ శనివారం పరామర్శించారు. చెన్నైకి చెందిన అనువిద్య, నిషా ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఓదార్చారు.
హిమలయాలు టు అమెరికా
హిమలయాల్లో ఆ«ధ్యాత్మిక పర్యటనలో ఉన్న రజనీకాంత్ అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళుతున్నారు. గత వారం హిమాలయాలకు చేరుకున్న రజనీ సుమారు 15 రోజులపాటు వివిధ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముగించుకుని చెన్నై చేరుకుంటారని అప్పట్లో సమాచారం. కానీ, సంపూర్ణ ఆరోగ్య వైద్య పరీక్షల కోసం హిమాలయాల నుంచే అమెరికా వెళ్లడానికి రజని నిశ్చయించుకున్నారు. రెండేళ్ల కిత్రం అనారోగ్యానికి గురైన రజనీకాంత్ సింగపూరు వెళ్లి చికిత్స పొంది ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. మార్చి ఆఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో అమెరికా నుంచి చెన్నై చేరుకుని పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment