మా ఇద్దరిదీ ఒకే బాట.. అదే మాట | kamal haasan says party name, symbol declare next month | Sakshi
Sakshi News home page

సేమ్‌ టు సేమ్‌

Published Fri, Jan 26 2018 4:22 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

kamal haasan says party name, symbol declare next month - Sakshi

సాక్షి, చెన్నై:  పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు.అయితేనే మా ఇద్దరిదీ ఒకే బాట...అదే మాట అంటున్నారు రజనీకాంత్‌ రాజకీయాల గురించి నటుడు కమల్‌హాసన్‌. అవినీతిరహిత ప్రభుత్వంతో ప్రజాసేవ చేయడమే మాఇద్దరి లక్ష్యమని కమల్‌ పేర్కొన్నారు. రాష్ట్రరాజకీయాల్లో సినీతారల సందడి తమిళనాడు ప్రజలకు కొత్తేమీ కాదు. ఆనాటి అన్నాదురై నుంచి నిన్నమొన్నటి జయలలిత వరకు అందరూ సినీజీవులే. ఈ వరసలో నటుడు విజయకాంత్‌ డీఎండీకే పేరుతో 2005లో పార్టీ పెట్టిన తరువాత కోలివుడ్‌ నుంచి ప్రముఖులెవ్వరూ రాజకీయాల్లోకి ప్రవేశించలేదు, పార్టీలు పెట్టలేదు. మరలా 13 ఏళ్ల విరామం తరువాత నటులు కమల్‌హాసన్, రజనీకాంత్‌ రాజకీయ సందడి చేయడం ప్రారంభించారు. ఫిబ్రవరి 21వ తేదీన కమల్‌హాసన్‌ పార్టీని ప్రకటించేందుకు సన్నద్ధమయ్యారు. రజనీకాంత్‌ సైతం రెండుకోట్ల సభ్యత్వనమోదుతో గట్టి పునాదులు వేసుకుని పార్టీని ప్రకటించే పనిలో పడ్డారు. 

రజనీ నోటి నుంచి వెండితెరపై వెలువడిన ‘నా దారి రహదారి’ అనే ప్రసిద్ధ డైలాగ్‌ వలే రాజకీయతెరపై తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆధ్యాత్మిక విలువలతో కూడిన రాజకీయ పార్టీని పెట్టబోతున్న రజనీ ఇప్పటికే ప్రకటించి తన భిన్నమైన ధోరణిని చాటుకున్నారు. ఇదిలా ఉండగా, సినిమా రంగంలో ఒక తరం నాయకులైన కమల్, రజనీ రాజకీయ రంగంలోకి సైతం ఒకేసారి అడుగుపెట్టడం కాకతాళీయమా, ప్రణాళికా బద్ధమా అనేది తెలియడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఎవరు పోటీ, ప్రత్యర్థులు ఎవరు అనే చర్చ జరుగుతుండగా రజనీ పెట్టబోయే ఆధ్యాత్మిక పార్టీతో జతకట్టే ప్రసక్తి లేదని కమల్‌ ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అయితే ఆనాటి వ్యాఖ్యలకు భిన్నంగా గురువారం మరో ప్రకటన చేశారు. 

మా ఇద్దరి లక్ష్యం ఒకటే..
రాజకీయాల్లో రావడం వెనుక రజనీకాంత్‌ది తనది ఒకటే లక్ష్యమని కమల్‌ చెప్పడం విశేషం. చెన్నై విమానాశ్రయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి,లంచగొండితనాన్ని రూపుమాపాలని తాను పార్టీ పెడుతున్నాను. అదే భావనతో రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆధ్యాత్మికతో కూడిన రాజకీయపార్టీతో రజనీకాంత్‌ ప్రజల్లో వస్తున్నా, భిన్నమైన ధోరణిలో తాను రాజకీయ అరంగేట్రం చేస్తున్నా అవినీతి నిర్మూలన అనే లక్ష్యంలో తామిద్దరికీ తేడాలేదని తెలిపారు. వచ్చేనెల 21వ తేదీ నుంచి చేపట్టబోతున్న రాష్ట్రవ్యాప్త పర్యటనకు ‘నాళై నమదే’ అని నామకరణం చేసినట్లు కమల్‌ చెప్పారు. గతంలో ఎంజీ రామచంద్రన్‌ నటించిన చిత్రంపేరును తన పర్యటనకు పెట్టుకోవడంలో ఎలాం టి తప్పులేదని తాను భావిస్తున్నానని అన్నారు.  

వచ్చేనెలలో పార్టీపేరు, చిహ్నాం..
పార్టీపేరు, చిహ్నాన్ని వచ్చేనెలలో ప్రకటిస్తానని చెప్పారు.  లక్ష్యసాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజకీయాల్లో వెనకడుడేసే ప్రసక్తేలేదన్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటన సమయంలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకునే ఆలోచనలో కమల్‌ ఉన్నట్లు సమాచారం. కమల్, రజనీ రాజకీయ ప్రవేశం వల్ల తమిళనాడులో చోటుచేసుకున్న మార్పులపై ఆసక్తి ఎదురుచూస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా   ఢిల్లీలో లో వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement