‘కలసి ఉంటే కలదు సుఖం.. కలసి పోటీచేస్తే కలదు అధికారం’ అనే తరహాలో కోలీవుడ్‌లో పాటలు పాడుకుంటున్నారు. కమల్‌హాసన్, రజనీకాంత్‌ల వరుసలో హీరోలు విజయ్, విశాల్, శింబు సైతం రాజకీయ కదన రంగంలోకి దూకాలని దృష్టి పెట్టిన నేపథ్యంలో ఎవరికి వారే అయితే ఎన్నికల ఫలితాలు యమునా తీరేలా మారగలదని కోలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. అలా కాకుండా అన్ని వర్గాలు ఆశించినట్టు అంతా ఏకమైతే రజనీకాంత్ ముఖ్యమంత్రిగా, కమల్‌హాసన్ ఉప ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లోకి రావాలంటే సినిమా రంగమే రాజమార్గం. ఆనాటి అన్నాదురై మొదలుకుని కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ఇలా ప్రతి ముఖ్యమంత్రి వెండితెర నుంచి రాజకీయ తెరపై వెలిగినవారే. అందుకే అన్నాడీఎంకే, డీఎంకే.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కోలీవుడ్‌లోని ఒక వర్గం వారి వెన్నంటి ఉంటుంది. అయితే సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించాలనే ఆసక్తి నటీనటుల్లో పెరగడానికి ఎంజీ రామచంద్రన్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సినిమా హీరోగా జేజేలు అందుకుంటున్నపుడే అన్నాదురై శిష్యుడిగా డీఎంకేలో చేరారు. అన్నాదురై మరణం తరువాత కరుణానిధి నేతృత్వంలో డీఎంకేలో ఇమడలేక అన్నాడీఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ రోజుల్లో ఎంజీఆర్‌కు ఉన్న జనాకర్షణ, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ద్రవిడ పార్టీ లేకపోవడం అన్నాడీఎంకేకు కలిసొచ్చింది. ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని నటులు శివాజీగణేశన్ మొదలుకుని అనేకులు రాజకీయాల్లో ప్రవేశించినా కాలం కలిసిరాక రాణించలేక పోయారు. ఎంజీఆర్ మ రణానంతరం జయలలిత బలమైన రాజకీయవేత్తగా ఎదిగి కరుణానిధిని సమర్థవంతంగా ఢీకొన్నారు. నటులు విజయకాంత్‌కు సినీ నేపధ్యం ఉన్నా ఈరెండు రాజ కీయ సింహాల ప్రాభవం మధ్య డీఎండీకే పార్టీ పెట్టి నలిగిపోయారు.చిన్నాచితకా పార్టీలు చితికిపోయాయి.
కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం: సుదీర్ఘ విరామం, జయ మరణం తరువాత కోలీవుడ్‌లో కొత్తగా రాజకీయ ఉత్సాహం మొదలైంది. అమ్మ మరణంతో అన్నాడీఎంకే అనాదగా మారడం, డీఎంకే అధ్యక్షులు కరుణానిధి వృద్ధాప్య అనారోగ్యకారణాలతో రాజకీయాలకు దూరంగా మెలగడంతో కోలీవుడ్‌లో అనేకులకు రాజకీయాలపై గాలి మళ్లింది. సుమారు రెండు దశాబ్దాలుగా రాజకీయ చర్చల్లో ఉన్న రజనీకాంత్ ఎట్టకేలకు ఇటీవల 50 శాతం వరకు రాజకీయ ఆరంగేట్రం చేశారు. జయ మరణించిన తరువాత మాత్రమే రాజకీయాలు మాట్లాడుతున్న కమల్‌హాసన్ సైతం రాజకీయాల్లోకి రావడం ఖాయమై పోయింది. రజనీ తన అభిమానులను కలుసుకుని కార్యాచరణ ప్రణాళికలో ఉండగా, కమల్ ఈనెల 22వ తేదీ నుంచి అభిమాన సంఘం నిర్వాహకులను కలుసుకోవడం ప్రారంభించారు.
వచ్చేనెల 21వ తేదీన పార్టీ ప్రకటన, 24వ తేదీన మదురైలో తొలి బహిరంగ సభకు కమల్ సిద్ధమైపోయారు. ఇక రజనీ పార్టీ ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. దీంతో మొత్తం కోలివుడ్ కమల్, రజనీకాంత్‌ల రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం ప్రారంభించింది. ఈ పరిణామంతో యువ హీరోలు విజయ్, విశాల్, శింబులకు సైతం రాజకీయ గాలిసోకినట్లు సమాచారం. జయ, కరుణల వల్ల ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసే అవకాశం తమకు ఎందుకు దక్కకూడదనే రీతిలో ఆలోచిస్తున్నారు. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు విశాల్ చేసిన ప్రయత్నం విఫలమైనా రాజకీయాల్లో కాలిడినట్లేనని అంటున్నారు. దక్షిణభారత నటీనటుల సంఘం ప్రధా న కార్యదర్శిగా, నిర్మాతల సంఘం అధ్యక్షునిగా విశాల్‌కు ఒక బలమైన కోలీవుడ్ అండ ఉంది. ఇక హీరో విజయ్ కంటే ఆయన తండ్రి, దర్శకులు ఎస్‌ఏ చంద్రశేఖరే రాజకీయాలపై ఉరకలు వేస్తున్నారు. రాష్ట్రంలో మార్పు కోసం తన కుమారుడు రాజకీయాల్లో రావాల్సి న అవసరం ఉందని మూడునెలల క్రితమే ఆయన ప్రకటించారు. ఈ రకంగా విజయ్‌కు ఇంటి నుంచే రాజకీ య ఒత్తిడి ఉంది. కాగా, శింబు తండ్రి, దర్శకులు టీ రా జేందర్ లక్ష్య డీఎంకే (ఎల్‌డీఎంకే) పార్టీ అధ్యక్షుడుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి శింబు రా జకీయ ప్రస్తానానికి
తండ్రే రంగం సిద్దం చేసి ఉన్నాడు.
ఇలాగైతే ఎలా ? :జయ, కరుణానిధిల హయాంలో తమిళ సినిమారంగం రెండువర్గాలుగా ఉండేది. ఆ తరువాత విజయకాంత్ పార్టీ పెట్టినా కోలీవుడ్‌పై పెద్ద ప్రభావం చూపలేదు. అయితే అగ్రతారలైన రజనీ, కమల్ రాజకీయ ప్రవేశం చేస్తున్నందున మరో రెండువర్గాలతో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇది చాలదన్నట్లు విశాల్, విజయ్, శింబు సైతం రాజకీయ ప్రవేశం చేస్తే ఎవరికీ లాభించకపోవచ్చనే అనుమానాలు బయలుదేరాయి. మరికొంత మంది ఎవరికివారుగా రాజకీయాల్లోకి వచ్చేకంటే రజనీ, కమల్‌లను సైతం ఏకతాటిపై నిలిపి ఎన్నికల రణరంగంలోకి దిగితే అధికారం తథ్యమని అంచనా వేస్తున్నారు. కోలీవుడ్‌లోని కొన్ని వర్గాలు ఆశిస్తున్నట్లుగా జరిగితే ముఖ్యమంత్రిగా సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉప ముఖ్యమంత్రిగా లోకనాయకుడు కమల్‌హాసన్ తమిళనాడును కొత్త పథంలో నడిపించగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment