సాక్షి, పెరంబూరు: ఇటీవల సినీ కళాకారులకు రాజకీయ ఆసక్తి మరీ ఎక్కవయ్యిందనే చెప్పాలి. చాలా మంది తాను సైతం రాజకీయలకు సిద్ధం అంటున్నారు. ఇప్పటికే రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగ ప్రవేశం తమిళనాడులో ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినీయర్ నటుడు, దర్శకుడు కే.భాగ్యరాజ్ కూడా రాజకీయాలకు తానూ సిద్ధం అవుతున్నానంటున్నారు. ఆయన తన పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం మధురైలో పలు సేవాకార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నటులు రజనీకాంత్, కమలహాసన్ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే ఎన్నికల్లో ప్రజలు వారిని ఎలా ఆదరిస్తారన్న దాన్ని బట్టి విజయావకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. మక్కల్ తిలగం ఎంజీఆర్ చిత్రాల్లో సమాజానికి అవసరం అయిన అంశాలను, రాజకీయాలను పొందుపరిచేవారన్నారు. సహ కళాకారులకు, ప్రజలకు పలు మంచి చేశారని అన్నారు. మరి రజనీ, కమల్ ప్రజలకు ఏం చేశారనే ప్రశ్న తలెత్తుతోందని, అందుకు వారు బదులు చెప్పాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల రాజుగా పేరు తెచ్చుకున్న పద్మరాజన్ వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఆయన గెలిచిందే లేదని అన్నారు.
నేతల రాజకీయ జీవితాలను ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఎంజీఆర్ కీర్తీని కాపాడడానికి అన్నాడీఎంకే, దినకరన్ వర్గం ఏకమవ్వాలని ఈ సందర్భంగా కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి కలిగిందని, త్వరలో తన ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం గురించి వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఈయన ఇంతకు ముందే ఎంజీఆర్ పేరుతో పార్టీని నెలకొల్పి ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment