బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాను కర్ణాటకలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్‌ఐఎఫ్‌సీసీ)ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ)తో చర్చించాలని సూచించింది. కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక అమలు చేయాలని రజనీకాంతలో గతంలో అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లతో కర్ణాటకలో ఈ నెల 7న కాలా విడుదలపై కేఎఫ్‌సీసీ నిషేధం విధించింది. సినీ పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని సినిమా విడుదల చేసేలా కేఎఫ్‌సీసీతో చర్చించాలని ఎస్‌ఐఎఫ్‌సీసీకి సూచించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సాక్షి మహ్రా తెలిపారు. కర్ణాటకలోని రజనీకాంత్ అభిమానుల సంఘం కూడా కేఎఫ్‌సీసీకి లేఖ రాసింది. వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరింది.
కాలాతో సంబంధమేంటి?: ప్రకాశ్‌రాజ్
యశ్వంతపుర: రజనీకాంత్ ‘కాలా’ సినిమాకు, కావేరి జలాల వివాదానికి సంబంధమేంటి? అని నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. ‘కావేరి పర్యవేక్షక మండలిని ఏర్పాటు చేయాలంటూ రజనీకాంత్ తమిళనాడుకు మద్దతు పలికారు.
అయితే కాలా సినిమాకు, కావేరి వివాదానికి సంబంధం ఏమిటి? ఆ సినిమాను మాత్రమే కన్నడ సంఘలు ఎందుకు లక్ష్యం చేసుకున్నాయి. గతంలో బీజేపీ నాయకులు కూడా ‘పద్మావత్’ సినిమా విడుదల సమయంలో ఇలాగే వివాదం చేశారు. సినిమాను విడుదల చేయనివ్వండి, సినిమా చూడాలో వద్దో అభిమానులే నిర్ణయిస్తారు’ అని ట్విటర్‌లో పోస్ట్‌చేశారు.
చర్చలతోనే ‘కావేరి’ పరిష్కారం కుమార స్వామి, కమల్ హాసన్ ఆకాంక్ష
సాక్షి, బెంగళూరు: కావేరి జలాల వివాదాన్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కర్ణాటక సీఎం కుమార స్వామి అభిలషించారు. ప్రముఖ నటుడు, మక్కల నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్.. కుమారస్వామిని కలిశారు. గంటకుపైగా చర్చించారు.
కమల్‌తో కావేరి వివాదం, యాజమాన్య బోర్డు అంశాలపై చర్చించినట్లు కుమారస్వామి మీడియాతో చెప్పారు. ఇరు రాష్ట్రాలు ఏకతాటిపై నడుస్తూ చర్చలు జరిపితే సమస్య పరిష్కారమవుతుందని కమల్ సూచించారు. కావేరిపై కోర్టుకెళ్లడం చివరి మెట్టుగా కావాలని పిలుపునిచ్చారు. కాలా చిత్ర ప్రదర్శనపై అడగ్గా, సినిమాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment